Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మూడేండ్లలో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్

– డిజిటల్ తెలంగాణను ఆవిష్కరిస్తాం – ఈ వారంలో మరో మూడు కొత్త మొబైల్ యాప్స్ – ఇండియా గాడ్జెట్ ఎక్స్‌పో లాంచింగ్‌లో మంత్రి కేటీఆర్

KTR addressing in india Gadzet expo

మరో మూడేండ్లలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీ రామారావు చెప్పారు. వాటర్‌గ్రిడ్ పైప్‌లైన్‌తో పాటే ఫైబర్‌ఆప్టిక్ కేబుల్‌ను ఇంటింటికీ వేసి ఇంటర్నెట్ అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ ఇండియా, డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాలను తమ ప్రభుత్వం సైతం పెద్దఎత్తున చేపట్టబోతున్నదన్నారు. డిజిటల్ క్యాంపెయిన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే తరహాలో ఆలోచిస్తుండటం సంతోషకరమన్నారు. హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో సెప్టెంబర్18నుంచి 21వరకు నిర్వహించనున్న ఇండియన్ గాడ్జెట్ ఎక్స్‌పో-2015 సన్నాహక కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో నిర్వహించారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, దేశం నుంచి గూగుల్ వంటి సంస్థలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారని, ఇన్నోవేషన్ వైపు భారత యువత దృష్టి సారించాలని సవాల్ విసిరారని చెప్పారు. తమ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించిందని, ఈ నెలలో టీ హబ్‌ను ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ-గవర్నెన్స్ శకం నుంచి మొబైల్ గవర్నెన్స్ శకానికి మారుతున్న విషయాన్ని తమ వార్షిక రిపోర్టులో చెప్పామని గుర్తుచేశారు. మీ-సేవలో భాగంగా ఈ వారంలో మూడు మొబైల్ యాప్స్ ప్రారంభించబోతున్నామన్నారు.సైబర్ సెక్యూరిటీపై ఒక సంస్థతో ఎంవోయూ కుదుర్చుకోబోతున్నామని వెల్లడించారు.

ప్రతి ప్రభుత్వ విభాగం డిజిటైజేషన్ డిజిటల్ తెలంగాణలో భాగంగా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సంబంధించి అన్ని రకాల సమాచారాన్ని ఆయా విభాగాల వారీగా డిజిటైజేషన్ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించినట్టు కేటీఆర్ చెప్పారు. మీ సేవలో భాగంగా ప్రస్తుతానికి దేవాదాయ, సాంఘిక సంక్షేమ, వ్యవసాయ శాఖలకు సంబంధించి మొబైల్ యాప్స్‌ను ఈనెల 7 లేదా 8 వరకు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. హరితహారానికి ప్రత్యేక యాప్ రూపొందించే ఆలోచన ఉన్నట్టు వెల్లడించారు. అన్ని ప్రభుత్వ విభాగాలను ఐటీకి అనుసంధానం చేసి వీలైనంత ఎక్కువగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తేవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అధునాతన వ్యవసాయ సాగు పద్ధతులు ఎట్లా ఉండబోతున్నాయన్న అంశాలన్నీ ఒక చోటికి తెస్తూ ఫ్యాబ్లెట్‌ను అందుబాటులోకి తేనున్నామన్నారు. ఇక్రిశాట్‌లోని ఇద్దరు శాస్త్రవేత్తలు దీనికి కృషిచేస్తున్నారని చెప్పారు.

ప్రపంచవ్యాప్తంగా లాస్‌వెగాస్‌లో నిర్వహించే కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో, స్పెయిన్‌లోని బార్సిలోనాలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్, జర్మనీలో నిర్వహించే ఐఫా తరహాలో ఆసియా స్థాయిలో నిర్వహిస్తున్న ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్‌పోకు హైదరాబాద్ వేదికగా నిలవనుందని అన్నారు. దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉండే అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరికరాలను ప్రదర్శించేందుకు, నాలుగు రోజులపాటు గాడ్జెట్‌గురూ అవార్డులు ప్రదానం చేసేందుకు, పలు సెమినార్లు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో లక్షకుపైగా ప్రజలు పాల్గొంటారని తెలిపారు.

ప్రపంచం నలుమూలలనుంచి వచ్చే అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఎక్స్‌పోను ఉపయోగించుకుంటామన్నారు. హైదరాబాద్ గురించి బయటికి వెళ్లి ప్రచారం చేయడంకంటే, ఇక్కడికి వచ్చిన ప్రతినిధులకు ఈ నగరాన్ని చూపి పెట్టుబడులు పెట్టే అవకాశాలను వారికి వివరిస్తామని తెలిపారు. ఇండియా గాడ్జెట్స్ ఎక్స్‌పోకు హైదరాబాద్ శాశ్వత వేదిక కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్‌రంజన్, టెక్నాలజీ నిపుణుడు రాజీవ్‌మక్ని, హైదరాబాద్ ఫర్ ఇన్నోవేషన్ కో-ఫౌండర్ జేఏ చౌదరి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.