-టీఆర్ఎస్ సర్కారు వచ్చాకే మనోహరాబాద్-కొత్తపల్లి లైన్‌క్లియర్ -రూ. 16 వేల కోట్లతో కొత్త రహదారుల నిర్మాణం -పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి

మెదక్, కరీంనగర్ జిల్లాలను కలుపుతూ మూడేండ్లలో రైలు కూత వినిపించేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తున్నదని పంచాయతీరాజ్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో రూ.9.60 కోట్లతో నిర్మించిన బైపాస్ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురువారం పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో కరీంనగర్ శివారులోని కొత్తపల్లి, మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మనోహరాబాద్ రైల్వేలైన్ మంజూరు చేయించారని గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైల్వేలైన్ పెండింగ్‌లో ఉండిపోయిందన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైలు మార్గానికి అవసరమైన మేరకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నిధులు కేటాయించేందుకు సిద్ధమని సీఎం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని చెప్పారు. వచ్చే రైల్వేబడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, అందుకోసం ఎంపీ వినోద్‌కుమార్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ రైలుమార్గాన్ని త్వరగా పూర్తిచేసేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రైలుమార్గం పూర్తయితే సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట ప్రాంతవాసుల చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు. తెలంగాణలో అన్నిగ్రామీణ రోడ్లతోపాటు జిల్లా కేంద్రం నుంచి రాజధానికి వచ్చే రహదారులన్నింటినీ నాలుగు లేన్లుగా మార్చేందుకు రూ.16 వేల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మహబూబ్‌నగర్, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వరకు నాలుగులేన్ల రహదారులు నిర్మించనున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఊట్నూరు నుంచి కోరుట్ల, వేములవాడ, సిరిసిల్ల, సూర్యాపేట మీదుగా ప్రకాశం జిల్లా వాడరేవు వరకు జాతీయ రహదారి నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
కరీంనగర్, వరంగల్ జిల్లాలకు మంచినీరు రూ.675 కోట్ల వ్యయంతో చేపట్టిన వాటర్‌గ్రిడ్ ద్వారా మధ్యమానేరు నుంచి వరంగల్, కరీంనగర్ జిల్లాలకు మంచి నీరందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్ల శివారులోని రామప్ప గుట్టపై, అగ్రహారం దేవస్థానం వెనుక గల 25 ఎకరాల స్థలంలో నిర్మించతలపెట్టిన ఫిల్టర్‌బెడ్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. వాటర్‌గ్రిడ్ పథకంలో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని 9 మండలాలకు ఇంటింటికీ మంచినీరు అందించే పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.