-గ్రామజ్యోతి అమలుపై మూడు రోజులుగా సన్నాహక సమావేశాలు

సీఎం కేసీఆర్ ఆదేశంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్రామజ్యోతి పథకాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా వరంగల్ జిల్లా ధర్మసాగరం మండలంలోని సోదేశ్‌పల్లి, మల్లికుదుర్ల, గుండ్లసాగర్ గ్రామాలను దత్తత తీసుకున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రకటించారు. పథకాన్ని పక్కాగా అమలు చేసేందుకు మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ ఆదివారం మీడియాతో చెప్పారు. సోదేశ్‌పల్లి, మల్లికుదుర్ల, గుండ్లసాగర్‌లలో మూడు రోజులుగా సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ పెద్దల సహకారంతో గ్రామసభలు నిర్వహించానని పేర్కొన్నారు. ఈ సమావేశాల్లో సర్పంచులు భట్టు శోభారాణి, గట్టి సాయిలు, గంగులోతు గోమతి, ఎంపీటీసీ సభ్యులు భట్టు స్వాతి, కాల్వ కొమురయ్య పాల్గొన్నారన్నారు. గ్రామాల అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై దిశా నిర్దేశం చేశామన్నారు. రానున్న రెండు నెలల్లో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఏర్పాటు, వంద శాతం పారిశుద్ధ్యం, మంచినీటి సమస్యలపై చర్చించామన్నారు. మూడు రోజులుగా సన్నాహక సమావేశాలతో పాటు శ్రమదానం నిర్వహించి, రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లను తొలగించామన్నారు. ఇప్పటికే మల్లికుదుర్లలో గుడుంబా నిషేధం అమలవుతుండగా, మిగిలిన రెండు గ్రామాల్లోనూ నిషేధాన్ని అమలు చేస్తామని గ్రామస్తులు శపథం చేసినట్లుగా తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థులకు పెన్సిళ్లు, డ్యూయల్ డెస్క్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, మహిళా శక్తి, అంగన్‌వాడీ భవనాలు, ఇతర సౌకర్యాలకు తన నిధులను కేటాయిస్తానన్నారు. మల్లికుదుర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.