Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మోత బరువు మోదీ సర్కారు

-ప్రచారానికే ఉజ్వల గ్యాస్‌ బండల పంపిణీ
-కేంద్రానిది కార్మిక వ్యతిరేక వైఖరి
-రాష్ట్రంలో కార్మికులకు ఉచిత బీమా
-నిర్మాణ కార్మికులకు లక్ష మోటర్‌సైకిళ్లు
-వైద్య ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు
-ఎన్‌సీడీ కిట్ల పంపిణీకి శ్రీకారం
-మూడు పూటలా మందులతో కిట్‌

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికులను పట్టించుకోవడంలేదని వైద్యారోగ్యశాఖ మంత్రి టీ హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు. ప్రతిరోజూ 12 గంటలు పనిచేస్తున్న కార్మికుల గురించి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించలేదని, మరింత కఠినమైన చట్టాలు తెచ్చి వారిని మరింత అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. ఉజ్వల పథకం కింద బీజేపీ సర్కారు అందించే గ్యాస్‌ సిలిండర్లు కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు. పెట్రోల్‌ బంకుల్లో హోర్డింగులు పెట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరావడంలేదని తెలిపారు. మంగళవారం వరంగల్‌, మహబూబాబాద్‌లలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. హన్మకొండ టీటీడీ కల్యాణమండపంలో ఏర్పాటుచేసిన మెగా హెల్త్‌ క్యాంపును ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. గ్యాస్‌బండ పేదలపాలిట గుదిబండగా మారిందని చెప్పారు.

సిలిండర్ల ధరలు పెంచడంతో పేదలు మళ్లీ పొయ్యిల కట్టెలు కొంటున్నరని తెలిపారు. గ్యాస్‌ సిలిండర్‌ సబ్సిడీని రూ.400 నుంచి 40కి తగ్గించారని ఆరోపించారు. నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యులపైనా భారం మోపుతున్నారన్నారు. కార్మికులు, రైతులు, పేదలు.. ఇలా ఏ ఒక్క వర్గాన్నీ బీజేపీ సర్కారు వదిలిపెట్టడం లేదని పేర్కొని చెప్పారు. మరోవైపు కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని వివరించారు. ఆటోలకు లైఫ్‌ట్యాక్స్‌ను మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని గుర్తుచేశారు. కార్మికులకు రూ.ఆరు లక్షల బీమాను అమలుచేస్తున్నామని చెప్పారు. భవన నిర్మాణ కార్మికులకు 50 రోజుల్లో సబ్సిడీపై లక్ష మోటర్‌ సైకిళ్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని వెల్లడించారు.

రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్న ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయభాస్కర్‌ను మంత్రి హరీశ్‌రావు అభినందించారు. కార్మికులకు ఐడీ కార్డులు, బీమా, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మే నెలంతా కార్మికుల కోసం శ్రమజీవిలా కృషిచేస్తున్నారని ప్రశంసించారు. టీఆర్‌ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్‌, బీజేపీ తెలంగాణలో కుట్రలకు తెరలేపాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆ రెండు పార్టీలు ఎన్ని కుతంత్రాలు చేసినా టీఆర్‌ఎస్‌ను, కేసీఆర్‌ను ఏమీ చేయలేవని.. ఎందుకంటే.. టీఆర్‌ఎస్‌ తెలంగాణ ప్రజల గుండెల్లోంచి వచ్చిన పార్టీ అని పేర్కొన్నారు.

హెల్త్‌ సిటీగా వరంగల్‌
ప్రపంచంలోని అన్ని రకాల వైద్యసేవలను అందించే వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా వరంగల్‌ నగరాన్ని ఆరోగ్యనగరంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రూ.1200 కోట్ల ఖర్చుతో వరంగల్‌లో సూపర్‌ స్పెషాలిటీ దవాఖానను నిర్మిస్తున్నామని వివరించారు. అనంతరం వరంగల్‌ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన పనులను పరిశీలించారు. హరీశ్‌రావు వెంట ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, రెడ్యానాయక్‌, పెద్ది సుదర్శన్‌రెడ్డి, నన్నపునేని నరేందర్‌, మహబూబాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ అంగోతు బిందు, రైతు రుణవిమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌ ఉన్నారు.

కాళేశ్వరంతో రెండు పంటలు: సత్యవతి రాథోడ్‌
మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ నియోజకవర్గం చివరి ఊరికి నీళ్లు వస్త్తాయని కలలో కూడా ఊహించలేదని మంత్రి సత్యవతిరాథోడ్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి అక్కడి నుంచి మిడ్‌మానేరుకు, అక్కడి నుంచి ఎస్సారెస్పీ ద్వారా డోర్నకల్‌ నియోజకవర్గం వెన్నారం వరకు నీళ్లు అందించడం ద్వారా ఏడాదికి రెండు పంటలు రైతులు పండించి సంతోష పడుతున్నారన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలను నిలదీయాలి: ఎర్రబెల్లి
తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీలను టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌లో సీనియర్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, మాలోతు కవిత, టీడీపీలో తాను, సత్యవతి రాథోడ్‌ ఉన్నప్పుడు కూడా మహబూబాబాద్‌లో ఇంత అభివృద్ధి జరుగలేదని చెప్పారు. రానున్న రోజుల్లో తండాలుగా ఉన్న గ్రామ పంచాయతీలకు రూ. వెయ్యి కోట్లతో రోడ్లు వేయనున్నట్టు తెలిపారు.

ఎన్‌సీడీ కిట్‌లో ఏముంటాయి?
బీపీ, షుగర్‌ వ్యాధి గ్రస్తులకోసం ఈ కిట్లను ఇస్తున్నారు. ఇందులో నెలకు సరిపడా మందులు ఉంటాయి. అయిపోగానే స్థానిక ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు మళ్లీ కిట్‌లను అందిస్తారు. నిరక్షరాస్యులకు కూడా సులభంగా అర్థమయ్యేలా మూడు భాగాలుగా బ్యాగును తయారు చేశారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి.. మూడు పూటలా వేసుకునే మందులను వాటిలో ఉంచుతారు. రక్తపోటు ఉన్న వారికి.. టెల్మిసార్టన్‌, ఆమ్లోడిపిన్‌ ట్యాబ్లెట్స్‌ ఇస్తారు. బలానికి బీ కాంప్లెక్స్‌ గోలీలు కూడా ఇస్తున్నారు. షుగర్‌ ఉన్నవారికి మెట్‌ఫార్మిన్‌, గ్లిమిప్రిడ్‌ టాబ్లెట్లను ఉదయం, సాయంత్రం వేసుకొనేలా సూచిస్తారు.

ఎన్‌సీడీ కిట్లను ఆవిష్కరించిన హరీశ్‌
మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం పెద్దతండాలో ఎన్‌సీడీ (నాన్‌ కమ్యూనికేబుల్‌ డిసీజెస్‌) కిట్లను మంగళవారం మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్‌సీడీ ద్వారా బీపీ, షుగర్‌ ఉంటే నెలనెలా మందులను ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటికి వచ్చి ఇచ్చి వాటిని ఎలా వాడాలో చెప్తారన్నారు. దేశంలో పెద్ద ఎత్తున స్క్రీనింగ్‌ చేసిన రాష్ట్రం తెలంగాణ అని, ఇప్పటి వరకు 1.80 కోట్ల మందికి స్క్రీనింగ్‌ చేశామని తెలిపారు. అందులో 12,96,887 మందికి రక్తపోటు, 5,94,866 మందికి షుగర్‌ ఉన్నట్టు గుర్తించి, చికిత్స అందజేస్తున్నట్టు చెప్పారు. మే చివరి నాటికి ఎన్‌సీడీ పరీక్షలు రాష్ట్రమంతా పూర్తవుతుందని వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.