-గాయపడినవారికి పూర్తి వైద్యఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది -ప్రకటించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -ప్రమాదఘటనపై తీవ్ర మనస్తాపం -అధికారిక కార్యక్రమాలు రద్దుచేసుకుని ఎప్పటికప్పుడు సమీక్షలు -రాష్ట్రంలోని అన్ని రైల్వే క్రాసింగ్‌ల వద్ద గేట్లు ఏర్పాటు చేయండి -రైల్వే జీఎంకు సీఎం కేసీఆర్ ఆదేశం

మెదక్ జిల్లా మసాయిపేట వద్ద జరిగిన స్కూలుబస్సును రైలు ఢీకొట్టిన ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థుల చికిత్సకయ్యే పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. పాఠశాల బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో మొత్తం 18 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మరో 11 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గురువారం ఉదయం ప్రమాద విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. వెంటనే బాధితులకు సత్వరమే సహాయచర్యలు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రసారమాధ్యమాల్లో వస్తున్న ప్రమాదదృశ్యాలను చూసి సీఎం కేసీఆర్ తీవ్రంగా కలత చెందారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రులు హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకొని ప్రమాదంపై ఎప్పటికప్పుడు అధికారులు, మంత్రులతో సమీక్షించారు. ప్రమాద ఘటన తెలిసినప్పటి నుంచి డీజీపీ అనురాగ్‌శర్మ సీఎం కేసీఆర్‌తో క్యాంప్ ఆఫీస్‌లోనే ఉండి ఎప్పటికప్పుడు సహాయకచర్యలను సమీక్షించారు. పోలీస్ ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని డీజీపీ ఘటనస్థలికి పంపించారు. శాంతి భద్రతల అదనపు డీజీ సత్యనారాయణ్, సీఐడీ అదనపు డీజీ కృష్ణప్రసాద్, హైదరాబాద్ రేంజ్ ఐజీ రాజేంద్రనాథ్‌రెడ్డి, నిజామాబాద్ రేంజ్ డీఐజీ సూర్యనారాయణ, రైల్వే ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు డీజీపీ ఆదేశాలమేరకు హుటాహుటిన ఘటనస్థలికి తరలివెళ్లారు.
మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న విద్యార్థులను, తల్లిదండ్రుల రోదనలను చూసిన సీఎం కేసీఆర్ చలించిపోయారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. విద్యార్థుల వైద్యానికయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆస్పత్రి యాజమాన్యానికి సీఎం స్పష్టం చేశారు. ఎంత ఖరీదైన వైద్యమైనా సరే అందించి పిల్లల ప్రాణాలు కాపాడాలని డాక్టర్లను కోరారు.
ఆస్పత్రి వద్దే ఉండి పిల్లలకు వైద్యసేవలందేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్‌మంత్రి పద్మారావులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్, రైల్వే క్రాసింగ్ వద్ద గేటు లేకపోవడమే ప్రమాదానికి కారణమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని రైల్వేక్రాసింగ్‌ల వద్ద గేట్లు లేని ప్రాంతాల్లో వెంటనే గేట్లు ఏర్పాటు చేయాలని సీఎం రైల్వే అధికారులను ఆదేశించారు. వారం రోజుల్లో రైల్వే గేట్లు ఏర్పాటు చేస్తామని రైల్వే జీఎం ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు తెలిపారు.