Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మూడేండ్లలో యాదాద్రి పవర్

-సమాంతరంగా అన్ని యూనిట్ల నిర్మాణం -బీహెచ్‌ఈఎల్ అధికారులకు సీఎం కేసీఆర్ సూచన -తొలి విడుతగా రూ.417 కోట్ల చెక్కు అందజేత -కొత్తగూడెం 800 మెగావాట్ల యూనిట్ త్వరలో పూర్తి

యాదాద్రి పవర్ ప్లాంటును మూడేండ్లలో పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బీహెచ్‌ఈఎల్ అధికారులకు సూచించారు. నల్లగొండ జిల్లా దామరచర్లలో నిర్మించే 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంటు కోసం తొలివిడుతగా దీని నిర్మాణ సంస్థ బీహెచ్‌ఈఎల్‌కు సీఎం శుక్రవారం రూ.417.16 కోట్ల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన బీహెచ్‌ఈఎల్ అధికారులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో వచ్చే ఏడాదినుంచి విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. వచ్చే మార్చి నుంచి రైతులకు 24 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించాం. ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు జరుగుతున్నాయి. కొత్తగా అనేక పరిశ్రమలు కూడా వస్తున్నాయి. ఇతరత్రా వినియోగం కూడా పెరుగుతున్నది. రాష్ట్రంలో వచ్చే ఏడాదే అదనంగా 3500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండనుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల నిర్మాణాన్ని చేపట్టాం. అన్నింటిలోకెల్లా.. యాదాద్రి ప్లాంటు చాలా ముఖ్యమైనది. 5×800 మెగావాట్ల ప్లాంటులో అన్ని యూనిట్లను సమాంతరంగా ప్రారంభించాలి. భవిష్యత్తు డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మూడేండ్లలో శరవేగంగాపూర్తిచేయాలి అని సీఎం కోరారు.

నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మాణానికి రూ.20,379 కోట్లు వ్యయంకానుంది. అందులో మొదటివిడుత కింద రూ.417.16 కోట్ల చెక్కును బీహెచ్‌ఈఎల్ సీఎండీ అతుల్ సోబ్జికి ముఖ్యమంత్రి అందించారు. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో పారదర్శకతకోసం, జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌కు యాదాద్రి పనులు అప్పగించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టేలా పనులను వేగంగా పూర్తిచేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కోరారు. పవర్‌ప్లాంటు నిర్మాణానికి భూసేకరణ పూర్తి అయ్యిందని, పర్యావరణ అనుమతులతోపాటు అన్ని రకాల అనుమతులు వచ్చాయని సీఎం అన్నారు. కాబట్టి వెనువెంటనే పనులు ప్రారంభించి శరవేగంగా పూర్తిచేయాలని సూచించారు. యాదాద్రి పవర్‌ప్లాంటు ఐదు యూనిట్ల నిర్మాణాన్ని సమాంతరంగా ప్రారంభించాలని కోరారు. ఇదే సమయంలో కొత్తగూడెం, మణుగూరుల్లో నిర్మిస్తున్న విద్యుత్ ప్లాంట్లపైకూడా చర్చ జరిగింది. కొత్తగూడెంలో నిర్మిస్తున్న 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం రెండు, మూడు నెలల్లో పూర్తవుతుందని జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. వచ్చే ఏడాది మణుగూరు ప్లాంటుకూడా పూర్తవుతుందని వివరించారు.

24 గంటల విద్యుత్‌కు అన్ని ఏర్పాట్లు చేయండి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులతో మాట్లాడుతూ.. రైతులకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఎత్తిపోతల పథకాలు, పరిశ్రమలు, మిషన్ భగీరథ, మెట్రో రైలు తదితర కార్యక్రమాల నిర్వహణకోసం ఏర్పడే డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధంచేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, జెన్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, డైరెక్టర్లు సీ రాధాకృష్ణ, ఎం సచ్చిదానం, బీహెచ్‌ఈఎల్ ఈడీ హెడియా, మరో ఈడీ ఏకేఎం ముఖోపాధ్యాయ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా, ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.