Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మూడు దశాబ్దాల కల.. మూడేండ్లలో సాకారం

-కల్వకుర్తికి కృష్ణమ్మ కళ -ప్రత్యేక ప్రాధాన్యాన్నిచ్చింది మేమే -ఎంజీకేఎల్‌ఐ ద్వారా 300 చెరువులను నింపాం -కాంగ్రెస్ టీడీపీలు చుక్క నీరు ఇవ్వలేదు -పాలమూరు ప్రాజెక్టును కోర్టులకెళ్లి అడ్డుకున్నారు -రైతులను తప్పుదోవ పట్టించే యత్నంచేశారు -ఉమ్మడి పాలమూరులో 20లక్షల ఎకరాలు సాగులోకి తెస్తాం -నీటిపారుదలశాఖ మంత్రిటీ హరీశ్‌రావు -ఎలికట్ట సమీపంలో అక్విడక్ట్ వద్ద కృష్ణాజలాల విడుదల

మూడు దశాబ్దాలపాటు సమైక్య పాలనలో సాధ్యంకాని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని (ఎంజీకేఎల్‌ఐ) మూడేండ్ల స్వయంపాలనలో సాకారం చేసుకొని సాగునీటిని అందించుకోగలిగామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కల్వకుర్తి నియోజకవర్గానికి సాగునీరు తెస్తామని హామీ ఇచ్చినట్టే.. నేడు కృష్ణమ్మ నీటితో ఇక్కడి ప్రజల కాళ్లు కడిగామని పేర్కొన్నారు. ఆదివారం నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎలికట్ట సమీపంలో ఉన్న డీ-29 కాల్వ వద్ద కృష్ణాజలాలను మంత్రి ప్రత్యేకపూజలు నిర్వహించి విడుదలచేశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఎంజీకేఎల్‌ఐ పథకాన్ని మూడు దశాబ్దాలకిందట మొదలుపెట్టినా, అప్పుడు రాష్ర్టాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు సాగునీరు అందించలేదని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులను 30సార్లు తాను పర్యవేక్షించానని చెప్పారు. దీన్ని పూర్తిచేసేందుకు రెండేండ్లలో రూ.1200 కోట్లు ఖర్చుచేశామని అన్నారు. దీనిద్వారా ఉమ్మడి పాలమూరులో నిరుడు 4.5లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, ప్రాజెక్టుద్వారా 300 చెరువులను నింపామని తెలిపారు. కల్వకుర్తికి ఇంతకాలంగా జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు.

ప్రత్యేక జీవోద్వారా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఇతర మండలాలకు రూ.178కోట్లు మంజూరుచేశామని, తద్వారా అదనంగా వెల్దండ, ఆమన్‌గల్, మాడ్గుల మండలాల్లోని 35వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని హరీశ్‌రావు వివరించారు. ఇంకా మిగిలిపోయిన భూములకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా సాగునీరు అందిస్తామని ప్రకటించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూసీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు తీసుకొన్న చొరవ కారణంగా కల్వకుర్తి ప్రాంతానికి 30ఏండ్ల్ల తర్వాత సొంతరాష్ట్రంలో న్యాయం జరిగిందన్నారు. మంత్రి లకా్ష్మరెడ్డి మాట్లాడుతూటీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టులద్వారా ప్రజల ముఖాల్లో సంతోషం కనిపిస్తున్నదని చెప్పారు. ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ కరువు పీడిత ప్రాంతంగా పేరున్న కల్వకుర్తికి కృష్ణాజలాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు దక్కుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అంజయ్య యాదవ్, జెడ్పీచైర్మన్ బండారి భాస్కర్ పాల్గొన్నారు.

రాష్ర్టానికి శనిలా విపక్షాలు అంతకుముందు జడ్చర్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన మంత్రి హరీశ్‌రావు.. ప్రతిపక్షాలు రాష్ర్టానికి శనిలా తయారయ్యాయని విమర్శించారు. గతంలో చేసిన ప్రాజెక్టులను ఇప్పుడు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నాయి. అలాంటప్పుడు ఒక్క ఎకరాకు కూడా సరిపడా సాగునీరు ఎందుకు ఇవ్వలేదు? 90శాతం పనులు చేశామంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు.. 90శాతం పనులు కాదు.. 90శాతం నిధులు మింగేశారు. మోటర్లు, పంపులు తెచ్చి గడ్డపై పడేశారు కానీ నీళ్లు వెళ్లేందుకు కనీసం కాల్వకూడా తవ్వలేదు. ప్రతి పనినీ అడ్డుకుంటూ రాష్ర్టానికి శనిలా దాపురించారు అని మండిపడ్డారు. పాలమూరు జిల్లాను వలసల జిల్లాగా చేసిన పాపం గత ప్రభుత్వాలదేనన్నారు. గత ప్రభుత్వాలు కేవలం 40% పనులు చేశాయని, నీళ్లు పారించే అసలు పనులుచేయకుండా అనవసర పనులుచేశారని మంత్రి మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు కంకణం కట్టుకుని.. మంత్రులు, ప్రజాప్రతినిధులమంతా కలిసి కాల్వల వెంట తిరగామని, పనుల వద్ద బస చేశామని గుర్తుచేశారు. కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తిచేసి, 4.50 లక్షల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.

కోర్టు కేసులతో అడ్డంకులు రైతుల ప్రయోజనాలకోసం ప్రభుత్వం భూసేకరణ చట్టం 123జీవోను తీసుకువస్తే దీనిపై కోర్టులో కేసు వేసి ఏడాదిపాటు ప్రాజెక్టు పనులను అడ్డుకున్నారని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రాజెక్టు రీడిజైన్‌తో ఆయకట్టును సస్యశ్యామలం చేస్తున్నామన్నారు. ఆనాడు డీపీఆర్‌లో భూ సేకరణకు కేటాయించింది కేవలం రూ.67లక్షలేనని, కానీ రైతు ప్రభుత్వంగా పేరుకెక్కిన టీఆర్‌ఎస్ కేటాయించింది రూ.370 కోట్లు అని చెప్పారు. విద్యుత్ లైన్ల కోసం నాటి ప్రభుత్వాలు కనీసం రూపాయి కూడా ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం రూ.414కోట్లు జెన్‌కోకు డిపాజిట్ చేసిందని, బడ్జెట్‌లో కల్వకుర్తి ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు కేటాయించిందని తెలిపారు. అంతేకాకుండా నెట్టెంపాడుకు రూ.450 కోట్లు, కోయిల్‌సాగర్‌కు రూ.125 కోట్లు, భీమాకు రూ.320 కోట్లు కేటాయించి పనులు చేశామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం రూ.2100 కోట్లు ప్రాజెక్టులపై వెచ్చించి, మొత్తంగా 6.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని హరీశ్ వివరించారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు ప్రాజెక్టుల కింద 6.50 లక్షల ఎకరాలను సాగులోకి తీసుకువచ్చి పంటల దిగుబడిని పెంచామన్నారు. ఒక్కో పంట నాలుగింతలుగా పెరిగి దిగుబడి వచ్చిందన్నారు. ఎవరు ఎన్నివిధాలుగా అడ్డుకున్నా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చేదాకా విశ్రమించేది లేదని హరీశ్ స్పష్టంచేశారు.

పంటల జిల్లాగా పాలమూరు పాలమూరు జిల్లాను పంటల జిల్లాగా మారుస్తున్నామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ ఏడాది 6.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. వచ్చేఏడాది నాటికి పూర్తిస్థాయిలో ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మంత్రి చెప్పారు.

సీఎం కేసీఆర్‌దే ఈ ఘనత: లక్ష్మారెడ్డి రాష్ట్రంలోని ప్రాజెక్టుల దశదిశలను మూడేండ్లలో మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులుగా ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ రన్నింగ్ ప్రాజెక్టులుగా తెలంగాణ వచ్చాకే మారాయన్నారు.

ఎన్ని కుట్రలు చేసినా ప్రాజెక్టులు నిర్మించి తీరుతాం కల్వకుర్తి ప్రాజెక్టును 20 ఏండ్లపాటు సాగదీసిన ప్రభుత్వాలు.. కనీసం ఒక్క రిజర్వాయర్‌ను కూడా నిర్మించకుండా ప్లాన్ చేశాయని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. రిజర్వాయర్లు లేకుండా ఎత్తిపోతల పథకాలు ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైన్‌తో వేల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకొస్తున్నదని, ప్రాజెక్టులు చిరకాలంగా ఉండేవిధంగా నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. దీనిని జీర్ణించుకోలేక రీ డిజైన్‌తో అంచనాలు పెరుగుతున్నాయంటూ విపక్షనేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలుచేసినా ప్రాజెక్టులను నిర్మించి తీరుతామని మంత్రి పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.