-త్వరలో కేబినెట్‌కు నివేదిక -తక్కువ ధరకు రైతులు ధాన్యం అమ్ముకోవద్దు -మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి -మంత్రికి సంస్కరణల నివేదిక అందజేసిన కమిటీ

మార్కెటింగ్ సంస్కరణల కోసం ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చిన నివేదికను మూడు దఫాలుగా అమలు చేస్తామని మార్కెటింగ్ శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. త్వరలో ఈ నివేదికను రాష్ట్ర కేబినెట్‌కు సమర్పించి.. నివేదికలోని సంస్కరణలు, ప్రతిపాదనలకు ఆమోదం పొందుతామన్నారు. పూనం మాలకొండయ్య నేతృత్వంలోని ఉన్నతస్థాయి అధికారుల కమిటీ శుక్రవారం సచివాలయంలో మంత్రి హరీశ్‌రావుకు మార్కెటింగ్ సంస్కరణల నివేదికను సమర్పించింది. మార్కెటింగ్ సంస్కరణలు అమలుచేయడం ద్వారా పోటీతత్వం పెరిగి రైతులకు గిట్టుబాటు ధర లభించే వీలుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
పత్తికి రూ.4,050, మొక్కొజొన్నలకు రూ.1,310, వరికి ఏ గ్రేడ్ రూ.14,00, సాధారణ రకానికి రూ. 1,360 మద్దతు ధర ఉన్నదని చెప్పారు. ఐకేపీ, కో ఆపరేటివ్ సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలుకు 937 కేంద్రాలు తెరుస్తున్నామన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 78 పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తక్కువ ధరకు రైతులు ధాన్యం అమ్ముకోవద్దని మంత్రి కోరారు. సంస్కరణల ద్వారా మార్కెట్ వ్యవస్థను పునర్నిర్మించడం, ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారంగా మార్చడం, మార్కెట్లకు వచ్చే సరుకుల వివరాలన్నీ గేటు వద్దనే రికార్డు చేయడం వంటి చర్యలు చేపడుతామని చెప్పారు. ఆపద్బంధు పథకాన్ని పటిష్ఠంగా అమలు చేస్తామని తెలిపారు.
ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే ఆ మార్కెట్‌కు వెళ్లి రైతు ధాన్యం అమ్ముకునేవిధంగా వీలు కల్పిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వేయింగ్ మిషన్లుంటాయని, రైతులు అమ్ముకున్న ధాన్యానికి రావాల్సిన డబ్బుల గురించి రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పనిలేకుండా చెల్లిస్తామని చెప్పారు. మార్కెట్‌కు తీసుకొచ్చిన ధాన్యం ఆధారంగా ఆపద్బంధు పథకం కింద వడ్డీ లేకుండా రుణం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.