Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ముఖద్వారం ముంగిటికి గోదారమ్మ!

-నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌ను తాకిన కొండపోచమ్మ నీళ్లు
-పక్షంరోజులుగా పరుగులు తీస్తూ కాళేశ్వర జలప్రయాణం
-మండుటెండల్లోనూ మత్తళ్లు దుంకుతూ గమ్యంచేరిక
-ఎడారిలా మారిన మంజీరకు జీవం
-ముఖద్వారం ముంగిటికి గోదారమ్మ!

జలాశయాలను నింపుకుంటూ.. ఆయకట్టును తడుపుకుంటూ.. చెరువులు, చెక్‌డ్యాంల మత్తడులు దుంకిస్తూ.. భూమి ఉపరితలంతోపాటు భూగర్భాన్ని నీలంరంగులోకి మారుస్తూ.. వందల కిలో మీటర్లు ఎదురెక్కుతూ ప్రవహించిన గోదారమ్మ.. తెలంగాణ గడ్డపై తన ముఖద్వారం ముంగిటకు చేరింది. కొండపోచమ్మ సాగర్‌ నుంచి విడుదలైన కాళేశ్వరం జలాలు హల్దీవాగు ద్వారా పక్షం రోజులపాటు పరుగులు పెట్టి నిజాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ను తాకాయి. మండుటెండల్లోనూ అనేక చెక్‌డ్యాంలు, చెరువుల మత్తళ్లను దుంకిస్తూ.. వట్టిపోయిన మంజీరాకు జీవంపోసింది.

గోదారమ్మ గలగలలు నిజాంసాగర్‌ను తాకాయి. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కెనాల్‌ నుంచి విడుదలైన కాళేశ్వరం జలాలు.. హల్ద్దీవాగు, మంజీరా నది ద్వారా పక్షం రోజులపాటు 90 కిలోమీటర్లు ప్రయాణించి కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం గోలిలింగాల వద్ద బుధవారం రాత్రి నిజాంసాగర్‌ బ్యాక్‌వాటర్‌లో కలిశాయి. వాగులు, వంకలు దాటుకుని.. చెరువులు, జలాశయాలకు పునర్జీవం పోస్తూ వందల కిలోమీటర్లు ఎదుర్కెక్కిన గోదావరి తెలంగాణ రాష్ట్రంలో తన ముఖద్వారానికి చేరువైంది. కందకుర్తి నుంచి తెలంగాణలో తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన గోదారమ్మ తిరిగి తన ముఖద్వారం సమీపానికి చేరడం అబ్బురపరుస్తున్నది. నిజాంసాగర్‌ ఆయకట్టు ప్రాంత రైతులకు జల పండుగలాంటి సందర్భమిది. ఈనెల 6న సీఎం కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం అవుసులపల్లి వద్ద సంగారెడ్డి కెనాల్‌ నుంచి గోదావరి నీటిని హల్దీవాగులోకి విడుదల చేశారు. రెండు, మూడు రోజులు రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసిన అధికారులు.. ఆ తర్వాత 1,600 క్యూసెక్కులకు పెంచారు.

ఇప్పటివరకు కొండపోచమ్మ నుంచి 1.2 టీఎంసీల నీళ్లు ప్రవహించాయి. మరో 4 లేదా 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించినట్టు ఈఎన్సీ హరిరాం తెలిపారు. ఒక టీఎంసీ నీటిని నింపడానికి వారం రోజుల సమయం పడుతుంది. అలా 4 టీఎంసీలు అనుకున్నా మరో నెల రోజుల వరకు నీటిని విడుదల చేయనున్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టు నీటి నిల్వసామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 6.04 టీఎంసీలు ఉన్నాయి. కాళేశ్వరం జలాలతో నిజాంసాగర్‌ నిండుకుండలా మారనుండటంతో ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలోని 2.35 లక్షల ఎకరాల ఆయకట్టుకు వానకాలం సాగుకు ఢోకా లేకుండా పోనున్నది. దీంతో రైతులు సంబురపడుతున్నారు. సంగారెడ్డి కెనాల్‌ ద్వారా హల్దీవాగులోకి చేరిన కాళేశ్వరం జలాలు మధ్యలో 4 పెద్ద చెరువులు, 32 చెక్‌డ్యాంలను మత్తళ్లు దుంకించాయి. వట్టిపోయిన మంజీరాకు జీవం పోశాయి. వీటిలో సిద్దిపేట జిల్లాలో 9, మెదక్‌ జిల్లాలో 23 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి.

అనుకున్నది ఆలస్యం కాకుండా..
కాళేశ్వరం జలాలను తరలించి నిజాంసాగర్‌కు ఆయకట్టుకు ఊపిరిపోయాలని సీఎం కేసీఆర్‌ తలిచారు. మల్లన్నసాగర్‌ నుంచి ప్రత్యేక టన్నెల్‌ ద్వారా రోజుకు 3వేల క్యూసెక్కులు జలాలను తరలించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం ప్యాకేజీ 17,18 కింద దాని పనులు కొనసాగుతున్నాయి. ఈలోగానే నిజాంసాగర్‌ ఆయకట్టు రైతులకు జాప్యంలేకుండా సీఎం కేసీఆర్‌ అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. కొండపోచమ్మ సాగర్‌ నుంచి హల్దీవాగు ద్వారా నిజాంసాగర్‌కు నీళ్లను తరలించేందుకు పూనుకుని విజయవంతం చేశారు. దీంతో నిజాంసాగర్‌ పూర్వవైభవాన్ని సంతరించుకోనున్నది.

ఎండల్లోనూ మత్తడులు కేసీఆర్‌తోనే సాధ్యం: మంత్రి హరీశ్‌రావు
పంటలు ఎండిపోకుండా ఎండకాలంలో గోదావరి జలాలు ఇవ్వడం, మత్తడులు దుంకించడం సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందని ఆర్ధికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. బుధవారం మెదక్‌ మండలం బాలానగర్‌ గ్రామం బొల్లారం మత్తడి వద్ద గోదావరి జలాలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డితో కలిసి మంత్రి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..వాస్తవానికి కాలం మంచిగై వానలు పడితే బొల్లారం మత్తడి వద్ద పడ్డ నీరు నిజాంసాగర్‌ వైపు పోయి.. అక్కడి నుంచి గోదావరిలోకి పోవడం చరిత్ర అన్నారు. కానీ, ఆ చరిత్రను తిరగరాసి గోదావరి నీళ్లను బొల్లారం నుంచి నిజాంసాగర్‌కు తీసుకుపోయిన ఘనత కేసీఆర్‌దని, నీటికి కొత్త నడక నేర్పారని చెప్పారు. ఇవాళ రైతులకు నమ్మకం, ఆత్మవిశ్వాసం పెరిగిందని.. ఇక కాలంతో పనిలేకుండా మొగులువైపు చూడకుండా రెండు పంటలు పండుతాయనే ధీమా ఏర్పడిందని అన్నారు. మెదక్‌ జిల్లా చరిత్రలో ఎప్పుడూ యాసంగిలో పండనటువంటి పంట, ఇప్పుడు పండుతున్నదని, రైతులు చాలా సంతోషంగా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.