
-ముహూర్తం: మధ్యాహ్నం 1.25 గంటలు -వేదిక: రాజ్‌భవన్ -మంత్రులుగా ఒకరు లేదా ఇద్దరు.. త్వరలో పూర్తిస్థాయి మంత్రివర్గం -ఎన్నికల కమిషన్ గెజిట్‌కు గవర్నర్ ఆమోదం -అసెంబ్లీని ఏర్పాటుచేస్తూ నోటిఫికేషన్ జారీ -ప్రభుత్వ ఏర్పాటుకు టీఆర్ఎస్కు ఆహ్వానం -టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక -గవర్నర్‌కు తీర్మానప్రతినిఅందించిన ఎమ్మెల్యేలు -అతిత్వరలో అసెంబ్లీ సమావేశం -నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ -రేపు రాష్ట్ర కార్యవర్గ సమావేశం
రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణం స్వీకరించనున్నారు. ఆయనతోపాటు ఒకరు లేదా ఇద్దరు మంత్రులుగా ప్రమాణంచేసే అవకాశం ఉంది. తర్వాత వారంపదిరోజుల్లో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటవుతుందని తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం కేసీఆర్ స్వయంగా మీడియాకు తెలిపారు. కేసీఆర్ సీఎం బాధ్యతలు చేపట్టనుండటం ఇది రెండోసారి. కేసీఆర్ ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌లో ఏర్పాట్లుచేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి, స్పష్టమైన మెజార్టీ సాధించిన టీఆర్ఎస్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ నరసింహన్ ఆహ్వానించారు. అంతకుముందు రాష్ట్ర సీఈవో రజత్‌కుమార్ గవర్నర్‌ను కలిసి రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలను అందించారు. ఎన్నికల కమిషన్ గెజిట్‌ను గవర్నర్ ఆమోదించారు. ఇదేక్రమంలో ప్రస్తుత ఆపద్ధర్మ సీఎంగా కేసీఆర్, ఆయన మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్.. తదుపరి ప్రభుత్వం ఏర్పడేవరకు బాధ్యతల్లో కొనసాగాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు. అనంతరం కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీచేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి, కేసీఆర్‌ను టీఆర్ఎస్ఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నట్టు తెలియజేస్తూ తీర్మాన ప్రతిని అందజేశారు. గవర్నర్‌వద్దకు వెళ్లినవారిలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి,లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, గొంగిడి సునీత, పద్మాదేవేందర్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, కాలె యాదయ్య, రవీందర్, రేఖానాయక్ తదితరులున్నారు.
టీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా కేసీఆర్ ఎన్నిక టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. ప్రారంభోపన్యాసంచేసిన మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. రాష్ట్రానికి కేసీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని, ఆయన నాయకత్వంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని, సంక్షేమ రాజ్యంగా ముందుకు సాగుతుందన్నారు. కేసీఆర్‌ను మరోసారి సీఎంగా ఎన్నుకోవడంద్వారా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుకుందామని చెప్పారు. ఎల్పీ నేతగా కేసీఆర్ పేరును ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ప్రతిపాదించగా, ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ బలపర్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా మద్దతు పలికారు.
అతిత్వరలో అసెంబ్లీ సమావేశం అతిత్వరలో శాసనసభ సమావేశం కానున్నది. కొత్త సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో సీనియర్ సభ్యులుగా కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్, రెడ్యానాయక్ ఉన్నారు. ఎర్రబెల్లి, లేదా రెడ్యానాయక్‌లలో ఒకరు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. స్పీకర్ ఎన్నిక కార్యక్రమాన్ని కూడా ప్రొటెం స్పీకర్ నిర్వహిస్తారు.
నేడు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంకానుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఉభయసభల్లో అనుసరించాల్సిన వైఖరిపై చర్చిస్తారు.
రేపు తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణభవన్‌లో నిర్వహించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం నేపథ్యంలో పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ వ్యవహరించాల్సిన అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేయడంలో కీలకపాత్ర వహించాలని ఈ సమావేశంలో పార్టీశ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశనం చేసే అవకాశం ఉన్నది.