Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ముందస్తుకు రెడీ

-వందకు పైగా స్థానాల్లో గెలుస్తాం.. -టీఆర్‌ఎస్ అభ్యర్థులకు 40 వేల నుంచి 60 వేల మెజార్టీ ఖాయం -అన్ని సర్వేలూ ఇదే చెప్తున్నాయి త్వరలో మరో సర్వే విడుదల చేస్తాం -తెలంగాణ పునర్నిర్మాణం ఒక మహాయజ్ఞం -చిల్లరమల్లర రాజకీయం కాదు -మానవీయ కోణంలోనే అన్ని పథకాలు -ఓట్ల కోసం పెట్టిన పథకాలు కావివి -అన్ని రాష్ర్టాలవారూ మన పథకాల గురించి ఆరా తీస్తున్నారు -చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే -2020 నాటికి ఆకుపచ్చ తెలంగాణ -రూ.లక్ష కోట్ల విలువకు చేరుకోనున్న తెలంగాణ సాగు -పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు -రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ -హైదరాబాద్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీ కావాలి -జరిగింది తక్కువ.. ఇంకా జరగాల్సింది ఉంది: సీఎం కేసీఆర్ -ముఖ్యమంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన దానం నాగేందర్

రాబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ వందకుపైగా స్థానాల్లో గెలుస్తుందని.. ఏ సర్వే చూసినా ఇవే ఫలితాలు వెలువడుతున్నాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు తమ ప్రభుత్వ పాలనపై పూర్తి నమ్మకమున్నదని.. అవసరమైతే ప్రజల మధ్యకు ముందస్తుగానే పోదామని ఆయన స్పష్టంచేశారు. గెలిచే అన్ని స్థానాల్లో 40వేల నుంచి 60 వేల ఓట్ల మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు.. పునర్నిర్మాణం ఇతర పార్టీలకు రాజకీయమని, టీఆర్‌ఎస్ పార్టీకి మాత్రం అదొక టాస్క్ .. ఒక యజ్ఞం.. పవిత్రమైన కార్యక్రమమని తెలిపారు. ప్రతిపక్షం పదే పదే తప్పుడు ఆరోపణలు, దుష్ప్రచారాలు చేయకుండా ఎలక్షన్స్‌కు పోదామా? మీ సంగతి మా సంగతి ప్రజలు తేలుస్తరని సవాల్ విసిరారు. హైదరాబాద్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీ కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలో మానవీయ కోణంలో అన్ని పథకాలు ప్రవేశపెడుతున్నామని వివరించారు. వచ్చే రెండేండ్లలో రాష్ట్రంలో ఎటుచూసినా ఆకుపచ్చగానే కనబడుతుందని 2020 జూన్ కల్లా ఎటుపోయినా పచ్చని పంట పైరుతో తెలంగాణ వ్యవసాయ రంగం రూ.లక్ష కోట్ల విలువైన పంట దిగుబడిని సాధిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో మాజీ మంత్రి దానం నాగేందర్ టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగేందర్‌కు ఆయన గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే..

తెలంగాణ పునర్నిర్మాణం ఒక యజ్ఞం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర, తెలంగాణ నిర్మాణం మరో చరిత్ర. అన్ని రాజకీయ పార్టీలకు తెలంగాణ ఉద్యమం చిల్లర మల్లర రాజకీయంగా కనపడ్తది. ఏదో మాములు రాజకీయంలాగా కనిపిస్తది. కానీ, ఇది ప్రత్యేక పరిస్థితి. తెలంగాణ చరిత్ర, ఏర్పాటు.. పునర్నిర్మాణం.. వేరే పార్టీలకు రాజకీయం.. కానీ టీఆర్‌ఎస్‌కు ఒక టాస్క్.. ఒక యజ్ఞం.. పవిత్రమైన కార్యక్రమం.. అన్ని వర్గాల అనుమానాలు, అపోహలు, అపనమ్మకాలను పటాపంచలు చేశాం. ఉద్యమాన్ని ప్రారంభించిననాడు నేను ఒక్కడిగానే ప్రారంభించిన. రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆనాడు అధికారం, అహంకారంతో ఉద్యమాన్ని అణచివేయాలని చూసిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు అది లేదు. స్వరాష్ట్రంలో ఏం చేసినా ప్రజల కోణంలోనే చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు రాజకీయాల కోసం, ఓట్ల కోసం పెట్టినవి కావు. తెలంగాణ రాకముందు ఒకరోజు వరంగల్ పర్యటన ముగించుకొని వస్తున్నాను. స్థానిక నాయకులు సార్.. తండా తగులబడింది. గుడిసెలు కాలిపోయాయి అని చెప్పారు. ఆ తండావాసులను పరామర్శించడానికి వెళ్లాను. ఓ కుటుంబంలో బిడ్డ పెండ్లి కోసం దాచిపెట్టుకొన్న రూ.55 వేలు కూడా ఆ మంటల్లో కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబ పెద్ద విషం తాగి చనిపోవడమే దిక్కంటూ ఏడ్చిండు. సచ్చిపోవాల్సిన అవసరం లేదు.. నీ బిడ్డ పెండ్లికి వస్తానని చెప్పాను. వెళ్లాను. సిద్దిపేటలోనూ ఇదే విధంగా జరిగాయి. ఇలాంటివారిని ఉద్దేశించి ప్రవేశపెట్టిన పథకమే కల్యాణలక్ష్మి. తెలంగాణ కోసం నేను నడుం బిగించిన నాడు వందకు వంద శాతం తెలంగాణ వచ్చి తీరుతుందని నా సిక్స్త్‌సెన్స్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు పెడుతున్నవి తమాషా స్కీంలు కావు. పేదల బాధ నుంచి వచ్చిన పథకాలు. పేదలు ఎక్కడ ఉన్నా పేదలే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అగ్రకులాల్లో ఉన్న పేదవారికి కూడా కల్యాణలక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తున్నాం. తొలుత పింఛను రూ.1000 ఇద్దామంటే.. అంత అవసరం లేదన్నారు. అధికారులు వ్యతిరేకించారు. సాధ్యం కాదన్నారు.

తెలంగాణలో అమలుచేసే పథకాలు అషామాషీగా వచ్చినవి కావు. మానవీయకోణంలో ఆలోచించి పథకాలు రూపొందించాం. ఫక్తు రాజకీయం, ఫక్తు ఓట్ల కోసం కాదు. మనం మానవీయ కోణంలో ఎక్కువగా పోతున్నాం. ఆ కోణంలోనే అనేక పథకాలను ప్రవేశపెట్టాం. దేశంలో అనేక రాష్ట్రాలవారు, నీతి ఆయోగ్ సమావేశాలు ఇతర సమావేశాలకు ఢిల్లీ వెళ్లినప్పుడు అడుగుతున్నారు.. ఇన్ని పథకాలు ఒకేసారి ఏ విధంగా ప్రవేశపెడుతున్నారని అడిగారు. ప్రజల అవసరాలు, ఆలోచనలు , చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే. ఎవ్రీథింగ్ ఇజ్ పాజిబుల్.. దానికి ఉదాహరణగా తెలంగాణ రాష్ట్రాన్నే సాధించాం.

90 శాతం పేదలున్న రాష్ట్రం మనది తెలంగాణ రాష్ట్రం పేద ప్రజల రాష్ట్రం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 85 శాతం మంది ఉన్నారు.. అగ్రవర్ణాల్లో ఐదు శాతం పేదలున్నారు. వీరందరు కలిస్తే 90 శాతం పేదలు ఉన్న రాష్ట్రం. కల్యాణలక్ష్మి అగ్రకుల పేదలకు కూడా ఇస్తున్నాం. ఇండ్లు లేనివారికి డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. గ్రామాలను మాత్రమే ఎమ్మెల్యేలు ఎంపిక చేస్తారు. లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేస్తారు. ఐడీహెచ్ కాలనీలో కుల మతాలకు అతీతంగా లబ్ధిదారులకు ఇండ్లు కట్టి ఇచ్చాం. ఏ ఫ్లోర్‌లో ఎవరికి ఇల్లు కేటాయించాలనేది లాటరీ విధానంలో ఎంపిక చేశాం.

కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదు.. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకంలేదు. వారికి తెలివితేటలు లేవు. నాదాన్ దుశ్మన్, తెలివి తక్కువ దుశ్మన్ అన్నట్లుగా కాంగ్రెస్ వారి తీరు ఉన్నది. అబద్ధం ఆడితే అతికినట్లు ఉండాలె అన్నరు పెద్దలు. వారికి అది కూడా లేదు. ఇసుక కుంభకోణం అంటున్నారు.. ఇసుక ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 2004 నుంచి 2014 వరకు పది సంవత్సరాల్లో రూ.39 కోట్ల్ల ఆదాయం వచ్చింది. అదే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల కాలంలో రూ.1675 కోట్ల ఆదాయం వచ్చింది. దీనిద్వారా ఎవరు దొంగ పనిచేసినట్లు ఎవరు సర్దార్ పని చేసినట్లు?

విద్యుత్ రంగంలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాం.. తెలంగాణ ఏర్పడే సమయంలో తెలంగాణలో చిమ్మ చీకట్లు అలుముకుంటాయి అన్నారు.. కరంటే రాదు.. తెలివే రాదు.. దొడ్డు మెదడు అన్నరు. ఎన్నో శాపనార్థ్ధాలు పెట్టిండ్రు. ఎన్ని తిట్లు తిట్టాలో అన్ని తిట్టిండ్రు. కానీ ఇప్పుడు దేశంలోనే విద్యుత్ సరఫరాలో మొదటిస్థానంలో తెలంగాణ ఉన్నది. వ్యవసాయానికి 24 గంటల నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయడంతోపాటుగా అన్ని వర్గాలకు నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నాం. ఈవోడీబీలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నాం. సౌర విద్యుత్‌లోనూ మొదటి స్థానంలో ఉన్నాం. మిషన్ భగీరథ ద్వారా నంబర్‌వన్‌లో ఉన్నాం.. ఇంటింటికీ నెల.. నెలన్నరలో నీటిని ఇవ్వబోతున్నాం. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్కోచ్ అవార్డులు వచ్చాయి. ఇప్పటికి మొత్తం అన్ని రకాల.. 90 వరకు అవార్డులు వచ్చాయి. గత నాలుగు సంవత్సరాల్లో అనేక అవార్డులు తీసుకునే స్థాయికి వచ్చాం. నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధితోనే ఇది సాధ్యమైంది.

కేసీఆర్‌ను గద్దె దించడమే మీ లక్ష్యమా? కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం అంటున్నరు.. కేసీఆర్‌ను గద్దె దించడం ఏం లక్ష్యం? మీకు చేతనైతే ప్రజలకేం చేస్తామో చెప్పాలి. బీసీలకు అది చేస్తాం.. దళితులకు ఇది చేస్తాం.. గిరిజనులకు ఇది చేస్తామని చెప్పాలి. మైనార్టీలకు ఇది చేస్తామని చెప్పాలి. కేసీఆర్‌ను గద్దె దింపడం దిక్కుమాలిన లక్ష్యం. చెప్తే కూడా సిగ్గుపోతది. ఎక్కడ ఉపఎన్నిక వచ్చినా ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్ పతనం ప్రారంభమంటరు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల డిపాజిట్లు పోతున్నయి. నారాయణ్‌ఖేడ్, పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారు. నారాయణ్‌ఖేడ్ స్థానంలో అక్కడి ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోతే ఆయన కొడుక్కు కాంగ్రెస్ టిక్కెట్టు ఇచ్చినా 53 వేల మెజార్టీతో గెలిచాం. పాలేరులో అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట్‌రెడ్డి చనిపోతే ఆయన ధర్మపత్ని పోటీ చేశారు. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి 46 వేల మెజార్టీతో గెలిచారు. టీఆర్‌ఎస్ పార్టీ అహంకారంతో పనిచేయదు. జీహెచ్‌ఎంసీ పుట్టిన నాటినుంచి ఏ పార్టీకి రాని మెజార్టీ టీఆర్‌ఎస్‌కు వచ్చింది. 99 స్థానాల్లో గెలిచాం. జీహెచ్‌ఎంసీలో సొంతంగా మెజార్టీ వచ్చినా మిత్రపక్షమైన ఎంఐఎంకు ఏకగ్రీవంగా ఎమ్మెల్సీ స్థానాన్ని ఇచ్చాం. కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నాం. బోనాలు, రంజాన్, క్రిస్మస్, బతుకమ్మ పండుగలకు బట్టలు ఇస్తున్నాం. ప్రతి పండుగను గౌరవిస్తున్నాం. దీనితో ప్రజలు ఆదరిస్తున్నారు.

వందకు పైగా స్థానాల్లో గెలుస్తామని సర్వేలు చెప్తున్నాయి రాష్ట్రంలో ఇప్పటికే మూడు నాలుగు సర్వేలు చేయించాం. మరో మూడు నాలుగు రోజుల్లో మరో సర్వే విడుదల చేస్తాం. ఏ సర్వే అయినా టీఆర్‌ఎస్‌కు వందకుపైగా స్థానాలు గెలుస్తామని చెప్తున్నది. కాంగ్రెస్ వాళ్లకు పనిచేయవస్తలేదు. వీళ్లు స్వయంగా పనిచేసిన వారు కాదు. కాంగ్రెస్ ఎక్కడ ఉన్నా ఇంతే.

కాంగ్రెస్ పార్టీ దివాళా తీసింది రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న ఆరునెలల్లో విద్యుత్ సమస్యను అధిగమించాం. దీంతో ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్ల కంపెనీలు, కాంగ్రెస్ పార్టీ దివాళా తీశాయి. రీ డిజైనింగ్ ఎందుకు చేసినమో అసెంబ్లీలో చూపించినప్పుడు కాంగ్రెస్ నేతలు బహిష్కరించారు. ఎందుకు బహిష్కరించారో వారికే తెల్వాలె. రాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. గతంలో హోంగార్డులతో వెట్టిచాకిరీ చేయించారు. ఇప్పుడు దేశంలో హోంగార్డులకు అత్యధికంగా జీతం ఇచ్చిన రాష్ట్రం మనదే. ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బందులుంటాయి. వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని 30 శాతం అలవెన్స్ ఇచ్చే ఏకైక రాష్ట్రం కూడా మనదే. గత పాలనలో ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లో చనిపోతే చాలా ఇబ్బందులుండేవి, కానీ ఇప్పుడు శవాన్ని తీసుకుపోయి ఇంటికాడ దింపి వస్తున్నాం.

హాస్టళ్లలో కడుపునిండా తిండి హాస్టళ్లలో మన బిడ్డలకు మంచి ఆహారం అందిస్తున్నాం. గతంలో వంద గ్రాములు, ఇన్ని గ్రాములు అంటూ పెట్టేవారు. అన్నం కొలిచి పెట్డడం దిక్కుమాలిన పని. హాస్టళ్లలో కడుపునిండా పెట్టాలని చెప్పిన, ఇప్పుడు హాస్టల్ విద్యార్థులకు తిన్నంత పెడుతున్నరు. రాష్ట్రంలో 204 మైనార్టీ పాఠశాలలు, 594 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేసి చాలా గొప్ప మెనూ అమలుచేస్తున్నాం. వారానికి మూడుసార్లు మాంసం పెడుతున్నాం. మన గురుకులాల విద్యార్థులు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. నాసాకు సైతం ఎంపికయ్యారు. మొన్న ఇఫ్తార్‌కు వెళ్లినప్పుడు అంకుల్.. మీ వల్లనే నాసాకు వెళ్లామని నాతో చెప్పినప్పుడు సంతోషపడ్డ. బీసీల కోసం 119 గురుకులాల ఏర్పాటుపై వచ్చే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొంటాం. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికీ బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌ను ఏర్పాటుచేస్తాం.

అభాసుపాలు కావొద్దు ఇప్పుడు రాష్ట్రంలో పెట్టుబడులు పెరిగాయి. వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. వరంగల్ ఉపఎన్నిక సమయంలో కాంగ్రెస్ నాయకుడు జైపాల్‌రెడ్డి మాట్లాడిండు.. కేసీఆర్.. నీవు ఉద్యమంలో ఎక్కడ ఉన్నవు అని.. రౌతు పట్టుకొని నెత్తి పగుల కొట్టుకోవాల్నా.. ఇదేం దిక్కుమాలిన ప్రశ్న.. దీనిపై ఎవరు తప్పుచేస్తే వారికి శిక్ష వేయాలని వరంగల్ ప్రజల్ని అడిగాను.. పసునూరి దయాకర్ 4.64 లక్షల మోజార్టీతో గెలిచాడు. అసంబద్ధ, అర్థంలేని, అభాసుపాలయ్యే మాటలు మాట్లాడవద్దు. మాట్లాడితే తెలివితేటలుండాలి.

హైదరాబాద్ స్వర్గసీమ కావాలి.. రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది తక్కువ .. ఇంకా జరుగాల్సింది ఉంది.. రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా పెరుగుతున్నది. మొట్టమొదట 15-16 శాతం ఉండే.. దాని మీద 21 శాతం ఆదాయం వచ్చింది. ఆ తరువాత 20 శాతం వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి 7 శాతం మాత్రమే వృద్ధి నమోదయింది. దేశంలో ఏ రాష్ట్రంలో 10 శాతం కంటే ఎక్కువ లేదు. దీనికి కడుపు కట్టుకొని, నోరు కట్టుకొని పనిచేయాలి. లంచాలు తీసుకోకుండా పనిచేయాలి. కుంభకోణాలు చేయకుండా పనిచేయాలి. చిత్తశుద్ధితో పనిచేయాలి. వట్టిగా రాదు. ఏపీలో డమ్కీలు తప్ప ఏం లేదు పని. మేం ఇంతోల్లం అంతోల్లం ఏం చేయలేదు. మా అంత పెద్ద ఇది లేదన్నారు. కష్టం చేయాలి. వట్టిగా మాట్లాడుడు కాదు.. గొర్రెలు, మేకల పంపిణీకి రూ.5 వేల కోట్లు పెట్టినం. గొల్ల, కుర్మలకు ఇప్పటికే రూ.1000 కోట్ల ఆదాయం వచ్చింది. మనుషులకే కాదు పశువులకు అంబులెన్స్‌లు పెట్టించాం.

మిషన్ భగీరథ ద్వారా రాబోయే నెల నెలన్నరలో ఇంటింటికి మంచి నీళ్లు ఇస్తాం. 60-70 శాతం పనులు పూర్తి అయ్యాయి. కష్టపడితే పని అయింది. చనిపోతే ఉచితంగా దవాఖాన నుంచి వారి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాలను చేపట్టాం. హైదరాబాద్ సిటీలో చాలా పనులు ప్రారంభించాం. నగరంలో చాలా చాలా జరగాలి. దీనిని మురికిగుంట లాగా చేశారు. రాబోయే ఎన్నికల తరువాత హైదరాబాద్ అభివృద్ధి టాప్ ప్రయార్టీ తీసుకుందాం. హైదరాబాద్ స్వర్గసీమ కావాలి. కంపుపోవాలి. మూసీ మురికి పోవాలి. మన పిల్లలకు ధనం సంపాదించి ఇవ్వడం కాదు. వారు బతికేందుకు యోగ్యమైన వాతావరణం ఉండాలి. ప్రపంచంలోనే బెస్ట్ సిటీ హైదరాబాద్ కావాలి. దీనికోసం అవసరమైతే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలి. నాలుగేండ్లుగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉన్నది. గతంలో ఎప్పుడూ ఏదోచోట కర్ఫ్యూలు ఉండేవి. ఆందోళనలు జరిగేవి. నాలుగేండ్లుగా ఇవేవీ లేవు.

ప్రతి పనికీ రాజకీయాలేనా? టీఆర్‌ఎస్ చేపట్టిన ప్రతి పనిని అడ్డుకోవడమే ప్రతిపక్షాల పనిగా మారింది. ప్రతి పనికీ రాజకీయాలేనా? ఇప్పుడు టీఆర్‌ఎస్ సర్కారు చేస్తున్న పనులు అప్పుడు వాళ్లు పాలించినప్పుడు ఎందుకు చేయలేదు. సంక్షేమ పథకాలపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నరు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు లేవు. నిర్మాణాత్మకమైన ప్రతిపక్షం ఉండాలి కానీ ఇలా చిల్లర మల్లర రాజకీయాలు చేసేవారు ఉండరాదు. ఉద్యమం ఎందుకు చేశామో ఇప్పుడు వాటన్నింటినీ నెరవేర్చుకుంటున్నాం. రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టుకున్నాం. రైతుల కోసం రూ.12 వేల కోట్లను బడ్జెట్‌లో పెట్టుకున్నాం. ఉద్యమంలో ఎంతమంది శత్రువులు వచ్చినా ఎదుర్కొన్నాం. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించే పనిలో తెలంగాణ సర్కారు కృషి చేస్తున్నది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాలకు నీరిచ్చినం. త్వరలో 8 లక్షల ఎకరాలకు నీరిచ్చి తీరుతాం. కేసీఆర్ చేప్పేది తప్పైతే ప్రజలు మాకు శిక్ష వేస్తారు, లేకుంటే విమర్శించే వారికి వేస్తారు, అవసరమైతే ప్రజల ముందుకు వెళ్దామా. కాళేశ్వరం ప్రాజెక్టు కడుతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్లు 196 కేసులు వేశారు. ఇంతకన్న దుర్మార్గం ఉంటుందా?

ముందస్తుకు సిద్ధం రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కే ప్రజలు పట్టం కడుతరు, పిచ్చి పిచ్చి పనులు చేస్తే తరిమికొట్టేందుకు జనం రెడీగా ఉన్నరు. ఆరునూరైనా సరే తెలంగాణ ప్రగతి చక్రం తిరుగుతూనే ఉంటుంది, ఇప్పుడు ప్రగతిబాటలో ఉన్నాం, అనుకున్న తెలంగాణ సాధించుకుని, తలెత్తుకుని బతుకుతున్నాం. వందకుపైగా స్థానాల్లో 40, 50, 60 వేల ఓట్లకుపైగా మెజార్జీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుస్తరు. మన నేతలు, ఎమ్మెల్యేలతో పోలిస్తే.. ప్రతిపక్ష పార్టీలు 20 నుంచి 40 శాతం వ్యత్యాసంలో ఉన్నరు. అభివృద్ధిని జీర్ణించుకోలేకుండా పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసుకుంటూ దుష్ప్రచారం చేస్తున్నరు. ప్రతి రంగంలో అభివృద్ధి జరుగుతుంది. చిల్లర రాజకీయాలతో అభివృద్ధి ఆగదు. మూర్ఖంగా మాట్లాడితే ఊరుకోం. ప్రజల్లో మా పాలనపై నమ్మకముంది. అవసరమైతే ప్రజల మధ్యకు ముందస్తుగానే పోదాం.

పాజిటివ్ నిర్ణయం తీసుకొన్న దానం దానం నాగేందర్ సేవలు హైదరాబాద్ నగరానికి ఎంతో ఉపయోగపడుతాయని సీఎం కేసీఆర్ అన్నారు. నాగేందర్ పాజిటివ్ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. పార్టీలో పాత కొత్త కలిసి సమన్వయం చేసుకోవాలని, వారంరోజుల్లో అందరూ పాత కొత్త లేకుండా కలిసిపోవాలని.. ప్రేమతో కలిసి పనిచేయాలన్నారు. బంగారు తెలంగాణలో పేదరికం పోవాలని,.. అందుకోసం పేదలందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. దానం నాగేందర్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నది సుఖపడటానికి కాదని స్పష్టంచేశారు. హైదరాబాద్ నగరం అభివృద్ధికి మరింత మంది నాయకుల సేవలు అవసరమని, కష్టపడి పనిచేస్తామని ముందుకొచ్చేవారిని టీఆర్‌ఎస్ ఎప్పుడూ స్వాగతిస్తుందని పేర్కొన్నారు. దానం నాగేందర్‌కు భవిష్యత్తు ఉంటుందని.. కార్యకర్త స్థాయి నుంచి ప్రజల మధ్యలో నుంచి ఎదిగిన నాయకుడు దానం నాగేందర్ అని అన్నారు. దానం టీఆర్‌ఎస్‌లో చేరడమంటే బండను నెత్తికెత్తుకున్నట్టేనని ఆయన తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో కష్టపడి పని చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎైక్సెజ్‌శాఖ మంత్రి పద్మారావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ జీ దేవీప్రసాద్‌రావు, టీఎస్‌టీఎస్సీ చైర్మన్ సీహెచ్ రాకేశ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మన పంట విలువ రూ.లక్ష కోట్లకు చేరుతుంది రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతలతో తెలంగాణ రైతులు పండించే పంట విలువ రూ. లక్ష కోట్లకు చేరుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడి సాయంతో మూడు, నాలుగు నెలలు గడిస్తే భారతదేశంలో ధనిక రైతులు, ధనికులైన యాదవులు, ధనికులైన మత్స్యకారులు ఎక్కడున్నరంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉంటారు. ఇప్పటికే తెలివిగలోళ్ల్లు తెలంగాణలోనే ఉన్నరని రుజువైంది. ఆలిండియా ఐఏఎస్ టాప్ ర్యాంకర్ అనుదీప్ మన తెలంగాణ బిడ్డే. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం టీఆర్‌ఎస్‌కు పవిత్ర యజ్ఞం లాంటిది. ఇది అన్ని పార్టీల మాదిరిగా మాకు చిల్లర మల్లర వ్యవహారం కాదు. తెలంగాణ ఉద్యమంలో శత్రువులు ఎంత అడ్డుపడ్డా ఎదుర్కొని ముందుకెళ్లాం, అదే స్ఫూర్తితో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర, ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం మరో చరిత్ర. టీఆర్‌ఎస్ చేస్తున్న అభివృద్ధితో కాంగ్రెస్ దివాళా తీసింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి మానవీయ కోణంలో నుంచి వచ్చాయి. తెలంగాణ సమాజంలోని బాధ, ఆవేదన, ఇతర పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని సంక్షేమ పథకాల అమలుతో ప్రజలకు అంతా మంచే చేస్తున్నం, మంచిగా పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు ఆదరిస్త్తరు. మంచి జరుగుతుందనే విశ్వాసం కలిగితే ప్రజలు నెత్తిన పెట్టుకుంటరు.

కొంచెం ఉంటే కన్నుపోయేది కదా..! కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి కేసీఆర్ రెండు పిట్ట కథలను వినిపించారు. ఓ ఊరిలో ఒక వ్యక్తి చనిపోతే చాలామంది పరామర్శించడానికి పోయారు.. వారందరు వచ్చి ఎలా చనిపోయాడంటూ అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల్లాంటి ఓ వ్యక్తి అడిగితే పాము కుట్టి చనిపోయాడని చెప్పారు. వెంటనే ఆ వ్యక్తి.. అయ్యో ఇంకా నయం కొంచెం అయితే కన్ను పోయేది కదా అన్నాడు. అలా ఉంది కాంగ్రెస్ నాయకుల తీరు అని సీఎం కేసీఆర్ అన్నారు. మరో పిట్ట కథను చెప్తూ ఓ ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు.. ఆ వ్యక్తికి అంతిమయాత్ర నిర్వహిస్తున్నారు.. ఆ సందర్భంలో కాంగ్రెస్‌పార్టీ నాయకుడిలాంటి వారు అక్కడికి వచ్చి తెలిసి కూడా అడుగుతరు.. ఏరా సచ్చిపోయిండా? అని.. లేదు లేదు ఇయనను ఊరు తిప్పుక రాపోతున్నం.. సాయంత్రం నీ ఇంటి కాడా దింపమంటే దింపుతం అని వ్యంగ్యంగా జవాబిచ్చారని కేసీఆర్ అన్నారు. దీంతో సభలో నవ్వుల జల్లులు విరిశాయి.

రాష్ట్రంలో ప్రతి రంగంలో స్థిరమైన అభివృద్ధి కొనసాగుతున్నది. ఈ అభివృద్ధి ఇదే విధంగా కొనసాగాలి. చిల్లర రాజకీయ గోల వల్ల అభివృద్ధి ఆగొద్దు.. ప్రతిపక్షాలు మూర్ఖంగా మాట్లాడితే ఎలక్షన్స్‌కు పోదామా? ప్రజల తీర్పును అడుగుదామా? మీకు బాగుంది అంటున్నారు కదా.. మీ సంగతి మా సంగతి ప్రజలు తేలుస్తరు. ప్రజలను తీర్పు అడిగే రోజులు దగ్గరే ఉన్నాయి. జనం కూడా రెడీగా ఉన్నారు. – కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.