-నాలుగున్నరేండ్ల పాలన టీజర్ మాత్రమే -దీనికే భయపడి కూటములు కట్టిన ప్రతిపక్షాలు -కాంగ్రెస్, టీడీపీ అవినీతి కవలలు -1.09 లక్షల ఉద్యోగాల భర్తీకి అనుమతించాం -ఈ ఎన్నికలు యువత భవిష్యత్తు కోసమే.. -జగిత్యాల టీఆర్ఎస్ యువజన విభాగం సభలో ఎంపీ కల్వకుంట్ల కవిత
నాలుగున్నరేండ్ల కేసీఆర్ పాలన టీజర్ మాత్రమే. ఈ టీజర్‌ను చూసే ప్రతిపక్షాలు తట్టుకోలేక కూటమిగా ఏర్పడ్డాయి. ముప్పైఏండ్ల క్రితం కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయిన జగిత్యాల బ్రదర్స్ కేసీఆర్ పాలనతో భయపడి మళ్లీ ఒక్కటవుతున్నారు. పీనుగులాంటి కాంగ్రెస్‌కు ఊపిరి ఊదేందుకు టీడీపీ యత్నిస్తున్నది. – ఎంపీ కవిత
నాలుగున్నరేండ్ల కేసీఆర్ పాలన టీజర్ మాత్రమేనని, దీన్నిచూసే ప్రతిపక్షాలు తట్టుకోలేకసిద్ధాంతాలు పక్కనపెట్టి కూటములతో ఒక్కటవుతున్నాయని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసలు సినిమా ముందున్నదని, ఎన్ని కూటములు వచ్చినా భయపడిపోవాల్సిందేనని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలు అవినీతి కవల పిల్లలని, ఆ పార్టీలకు సీనియార్టీయే తప్ప సిన్సియార్టీ లేదని తెలిపారు. గత ఎన్నికల సమయంలో ఇదే ఆఖరిసారి పోటీ అని చెప్పిన సీనియర్ నాయకుడు జీవన్‌రెడ్డి.. ఇప్పుడు మళ్లీ ఎలా పోటీచేస్తారని, ఇదే వారి సిన్సియార్టీకి నిదర్శనమన్నారు. యువతకు సీనియార్టీ ఉం డదు కానీ సిన్సియార్టీ ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం జగిత్యాలలోని దేవిశ్రీ గార్డెన్స్‌లో టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో బహిరంగసభ, పెన్షనర్లు, మైనార్టీల సమావేశాల్లో కవిత మాట్లాడుతూ.. జగిత్యాలలో భారీగా హాజరైన యువతను చూస్తే, ఎస్సారెస్పీ గేట్లు ఎత్తిన సమయంలో వచ్చే వరద ప్రవాహం గుర్తుకొస్తున్నదన్నారు. యువతదే భవిత అని, రేపటి తరాల కోసమే సీఎం కేసీఆర్ ఆరాటమని చెప్పారు. ప్రస్తుత ఎన్నికలు అధికారం కోసం జరుగుతున్నవి కావని, ముందుతరాల భవిష్యత్ కోసం జరుగుతున్నవని పేర్కొన్నారు.
ముప్పైఏండ్ల క్రితం కృష్ణా పుష్కరాల్లో తప్పిపోయిన జగిత్యాల బ్రదర్స్ కేసీఆర్‌కు భయపడి మళ్లీ ఒక్కటవుతున్నారని ఎద్దేవా చేశారు. మూడు దశాబ్దాలపాటు ఒకరినొకరు విమర్శించుకొంటూ రాజకీయాలు చేసిన ఎల్ రమణ, జీవన్‌రెడ్డి ఇప్పుడు పక్కపక్కనే కూర్చొని నీతులు చెప్తుంటే వికారం పుడుతున్నదన్నారు. చంద్రబాబుకు తొత్తుగా మారి ఎల్ రమణ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కవిత మండిపడ్డారు. తెలంగాణలో టీడీపీ నాయకులు నోట్ల కట్టలతో దిగుతున్నారని, వారం రోజుల క్రితం జగిత్యాలకు తరలిచేందుకు సిద్ధంగా ఉన్న రూ. 59 లక్షలను హైదరాబాద్‌లో పట్టుకున్నారని, నాలుగు రోజుల క్రితం ధర్మపురిలో ఆంధ్ర పోలీసుల నిఘాను చేధించారని కవిత చెప్పారు. ఇవన్ని చూస్తే, కేసీఆర్ చెప్పినట్టు చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారనేది నిజమే అనిపిస్తున్నదన్నారు.
చంద్రబాబుది కొంచెపు బుద్ధి తెలంగాణ ప్రజల కష్టాలను పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ గోదావరి, కృష్ణా నదులపై కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మిస్తుంటే.. వాటిని నిలిపివేయాలంటూ చంద్రబాబు కేంద్రానికి 30 లేఖలు రాశారని, అలాంటి వ్యక్తి భవిష్యత్తులో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కానిస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణ యాసలో చెప్పాలంటే చంద్రబాబు కొంచెపు బుద్ధి కలవాడు అని ఎంపీ కవిత అన్నారు. పదేండ్లలో కాంగ్రెస్ 24 వేల ఉద్యోగాలిస్తే, నాలుగున్నరేండ్ల లో తెలంగాణ ప్రభుత్వం 1.09 లక్షల ఉద్యోగాల భర్తీకి అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం చేసిన మంచిపనులు, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, భారీ మెజార్టీతో టీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావాలని యువతకు పిలుపునిచ్చారు. సమావేశంలో జగిత్యాల టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దేవీప్రసాద్, టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దావ సురేశ్, మిట్టపెల్లి సుదర్శన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కిషన్ తదితరులు పాల్గొన్నారు.