Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మునుగోడు జనం ఓట్లు గుద్దితే.. ఢిల్లీ గద్దె దద్దరిల్లాలె!

-మీరిచ్చే మెజారిటీయే బీఆర్‌ఎస్‌కు పునాది
-శాసనసభ్యులంటే సంతలో కొనే పశువులా?
-ఇప్పటి వరకు చూసింది చాలా తక్కువ
-రాబోయే రోజుల్లో మరిన్ని బయటపడుతయి
-ఢిల్లీ పీఠం దిమ్మదిరిగిపోయే పరిస్థితి వస్తది
-ఏమిటీ అరాచకం? మోదీ జవాబు చెప్పు..
-మోదీ అండదండలు లేకుండానే ఆరెస్సెస్‌ వాళ్లు ఈ పని చేస్తరా?
-ఆ వందల కోట్లు ఎక్కడినుంచి వచ్చాయి?
-ప్రలోభ పెట్టినా ఎడమ కాలి చెప్పుతో కొట్టిన ఎమ్మెల్యేలు
-తెలంగాణ ఆత్మగౌరవాన్ని హిమాలయమంత ఎత్తునకు ఎత్తిన సిసలైన తెలంగాణ బిడ్డలు
-మనం మౌనంగా ఉంటే, మనకే శాపం
-మెడల పాములై మనలనే కాటేస్తరు
-బీజేపీని బంగాళాఖాతంలో పడేయాలి
-ఓటు ఆయుధంతో యుద్ధం చేయాలె
-మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు
-చండూరు బహిరంగ సభలో బీజేపీపై నిప్పులు

బీఆర్‌ఎస్‌కు మునుగోడే పునాదిరాయి
తెలంగాణ మాదిరిగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పుట్టుకొచ్చిందే బీఆర్‌ఎస్‌ పార్టీ. దేశ రాజకీయాలను మలుపుతిప్పే సువర్ణావకాశం మునుగోడుకు వచ్చింది. కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అద్భుతమైన మెజారిటీతో గెలిపించి బీఆర్‌ఎస్‌కు పునాదిరాయి వెయ్యాలి.

వడ్లు కొనలేరట.. ఎమ్మెల్యేలను కొంటరట!
పండిన పంటను కొనుమని ఢిల్లీకి పోయి అడిగినం.. వడ్లు కొనుడు చేతగాదు కానీ వందల కోట్లు సంచుల్లో పెట్టుకొని ఎమ్మెల్యేలను కొనేందుకు వస్తరు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఉంటుందా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా.. వద్దా? వడ్లు కొనాలని కోరితే.. తెలంగాణోళ్లు నూకలు తినాలని అవమానించారు. ఇప్పుడు సిగ్గులేకుండా వచ్చి ఓట్లడుగుతరా? ఎవరైతే నూకలు తినుమన్నరో.. ఈ ఎలక్షన్ల మనం వాళ్ల తోకలు కత్తిరియ్యాలె.

దొంగలు దొరికి జైల్లో ఉంటే, ప్రమాణం ఏం చేస్తది?
ఢిల్లీ నుంచి వచ్చి దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి, దొరికిపోయినోళ్లు ఇప్పుడు జైల్లో ఉన్నరు. ఒక్క మాట సూచన ప్రాయంగా చెప్తున్నా. నిన్న మొన్న మీరు టీవీల్లో చూసింది తక్కువే. దొరికింది ఇంకా ఉన్నది. ఢిల్లీ పీఠమే దిమ్మదిరిగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అవన్నీ బయట పడుతయి. ఎవడో ఒకడు తలకుమాసినోడు తడి బట్టలతోని ప్రమాణం చేస్తవా? అంటడు. ఇంకొకడు వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తవా? అంటున్నడు. దొంగలు దొరికి జైల్లో ఉంటే, తడిబట్టల ప్రమాణం ఏం చేస్తది?

ఆత్మగౌరవ బావుటాను ఎగరేసిండ్రు
నిన్న, మొన్న కొంతమంది ఢిల్లీ బ్రోకర్‌ గాండ్లు, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని వచ్చిండ్రు. మీకు వంద కోట్లు ఇస్తం పార్టీ ఇడిసిపెట్టి రమ్మన్నరు. వాళ్లను ఎడమ కాలి చెప్పుతో కొట్టి.. తాము అంగట్లో సరుకులు కాము అని చెప్పి నలుగురు ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తు ఎత్తిండ్రు.

మునుగోడు అభివృద్ధి.. నా బాధ్యత
తెలంగాణ బిడ్డగా మునుగోడు అభివృద్ధి నా బాధ్యత. మీ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత నాది. చండూరును డివిజన్‌ చేసే బాధ్యత నాది. మీకు 100 బెడ్ల దవాఖాన ఇచ్చే బాధ్యత నాది. మీ రోడ్లు బాగు చేసే బాధ్యత నాది. ఎన్నికలు కాగానే మీకు వెంట వెంటనే ఫలితాలు కనిపిస్తయి.

రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఇప్పటికి బయటపడింది చాలా తక్కువేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆధారాలు బయటపడుతాయని, ఢిల్లీ గద్దె దద్దరిల్లిపోతుందని చెప్పారు. పెట్టుబడిదారుల తొత్తుగా ఉన్న బీజేపీని కూకటివేళ్లతో పెకిలించి, బంగాళాఖాతంలో పడేస్తే తప్ప దేశానికి నిష్కృతి లేదన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం చండూరులో నిర్వహించిన బహిరంగసభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై, మోదీ పాలనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వందల కోట్ల అక్రమధనం తెచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కూలగొట్టే అరాచక వ్యవస్థను తయారు చేశారని మండిపడ్డారు. ‘ఢిల్లీ నుంచి వచ్చి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికిపోయినవాళ్లు ఇప్పుడు జైళ్లలో ఉన్నారని గుర్తు చేశారు. కేసు కోర్టులో ఉన్నదని, తాను రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున, మాట్లాడితే ప్రభావితం చేశారని నిందలు వేస్తారు కాబట్టి ఎక్కువగా మాట్లాడటం లేదన్నారు. ‘కానీ ఒక్క మాట సూచనప్రాయంగా చెప్తున్నా. నిన్నమొన్న మీరు టీవీల్లో చూసింది తక్కువే. దొరికింది ఇంకా ఉన్నది. ఢిల్లీ పీఠమే దుమ్మురేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో అన్నీ బయటపడుతయి’ అన్నారు. రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికినా ‘ప్రమాణాల’ డ్రామా ఆడటంపై సీఎం మండిపడ్డారు. ‘ఎవడో తలకుమాసినోడు తడి బట్టలతోని ప్రమాణంచేస్తవా? అంటడు. ఇంకొకడు పొడి బట్టలతో ప్రమాణం చేస్తవా? అంటున్నడు. ఇది రాజకీయమా?’ అని గద్దించారు.

మీకు పదవిలో ఉండే హక్కుందా?
‘మోదీ గారూ.. ఇంకా ఏం కావాలి మీకు? ఈ దేశంలో ప్రధాని పదవిని మించింది లేదు కదా! రెండుసార్లు అవకాశం వచ్చింది కదా! ఎందుకీ కిరాతకం? ఈ కొనుగోళ్ల వ్యవహారం సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు జవాబు చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. ‘మోదీ అండ లేకుండానే ఆరెస్సెస్‌ ప్రముఖులు హైదరాబాద్‌కు వచ్చి దుర్మార్గపు పని చేస్తారా? ఆఫర్‌ చేసిన వందల కోట్లు ఎవరిచ్చారు? ఎక్కడి నుంచి డబ్బు వచ్చింది? అని నిలదీశారు. దీని వెనుక ఉన్నవారు ఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండటానికి అర్హులు కారని చెప్పారు. ఇంత అరాచకం జరుగుతున్నా మౌనంగా ఉంటే.. అదే మనకు శాపమవుతుందని హెచ్చరించారు.

ప్రజాధనం కార్పొరేట్‌ గద్దలకా?
75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ప్రజలు ఇచ్చిన రూ.లక్షల కోట్ల విలువైన డబ్బు, ఆస్తులతో భారత విద్యుచ్ఛక్తి సంస్థలను నెలకొల్పారని.. లక్షల కోట్ల విలువైన ప్రజాధనాన్ని పుట్నాలు, పేలాల మాదిరిగా అగ్గువకు ప్రైవేట్‌కు ఇచ్చేందుకు మోదీ సిద్ధమయ్యారని కేసీఆర్‌ హెచ్చరించారు. ప్రైవేట్‌కు ఇచ్చినా ప్రజలకు పైసా లాభం ఉండదని తెలిపారు. ఉల్టా ముక్కుపిండి వసూలు చేస్తారని హెచ్చరించారు. ‘ఈ దుర్మార్గాన్ని కొనసాగనిద్దామా? ప్రభుత్వ రంగంలో ఉండే ప్రజా పెట్టుబడులను ఈ ప్రైవేట్‌ కార్పొరేట్‌ గద్దలకు అప్పజెప్దామా?’ అని ఆలోచించాలని ప్రజలను కోరారు. ‘పండిన పంటను కొనుమని ఢిల్లీకి పోయి అడిగినా.. వడ్లు కొనుడు చేతగాదు. కానీ.. వందల కోట్లు సంచుల్లో పెట్టుకొని ఎమ్మెల్యేలను కొనేందుకు వస్తరు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఉంటుందా? ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలా.. వద్దా’ అని ప్రశ్నించారు. ‘గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయి. మీటర్‌ పెడుతరట, చేనేతపై జీఎస్టీ వేస్తరట.. వాటిమీద మనం కొట్లాడాలి’ అని పిలుపునిచ్చారు. వీటన్నింటికీ ప్రజలు జవాబు చెప్పకపోతే, ఓటు ద్వారా తిరుగుబాటు చేయకపోతే.. మీ ఆటలు నడువవనే సందేశం మునుగోడు ఎన్నిక ద్వారా ఇవ్వకపోతే బీజేపీవాళ్లు అరాచకం చేస్తారని హెచ్చరించారు. అప్పుడు తాము, వామపక్షాలు చేయగలిగేది ఏదీ ఉండదన్నారు.

మునుగోడు అభివృద్ది నా బాధ్యత..
తెలంగాణ బిడ్డగా మునుగోడు అభివృద్ధి తన బాధ్యత అని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు. ‘మీ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను పూర్తి చేసే బాధ్యత, చండూరును డివిజన్‌ చేసే బాధ్యత నాది. మీకు 100 బెడ్ల హాస్పిటల్‌ ఇచ్చే బాధ్యత నాది. మీ రోడ్లు బాగు చేసే బాధ్యత నాది. ఎన్నికలు కాగానే మీకు వెంట వెంటనే ఫలితాలు కనిపిస్తయి’ అని హామీ ఇచ్చారు. సామాన్యమైన వ్యక్తిగా, ప్రజల మధ్య, ప్రజల వ్యక్తిగా ఉన్న ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని, కారు గుర్తుకు ఓటేయాలని కోరారు.

ఉచిత విద్యుత్తు ఇస్తారో లేదో చెప్పాలి
గతంలో 70 కోట్లు ఉన్న చేనేత బడ్జెట్‌ను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 1200 కోట్లు చేశామని సీఎం కేసీఆర్‌ గుర్తుచేశారు. చేనేత బీమా వంటి పథకాలు తెచ్చామన్నారు. చేనేత రంగానికి మరింత చేస్తామని చెప్పారు. కేసీఆర్‌ ఉన్నంతవరకు ఎవ్వడూ రైతుబంధును ఆపలేడని ఉద్ఘాటించారు. కార్పొరేట్‌ గద్దలకు నుక్సానా వచ్చిందని మోదీ 14 లక్షల కోట్లు ఇచ్చారని, వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వడానికి మాత్రం మనసు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశంలోని రైతులకు ఉచిత కరంటిస్తే ఏటా ఖర్చయ్యేది రూ.1.45 లక్షల కోట్లేనన్నారు. ‘పెట్టుబడిదారులకు 14 లక్షల కోట్లు ఇచ్చినప్పుడు రైతులకు ఉచిత విద్యుత్తు ఇవ్వలేమా మోదీ?’ అని నిలదీశారు. దీనికి సమాధానం చెప్పిన తర్వాతే మునుగోడులో ఓట్లడగాలని డిమాండ్‌ చేశారు.

నూకలు తినుమన్నోళ్ల తోకలు కత్తిరియ్యాలె
యాసంగిలో నూకలు ఎక్కువవుతాయని, కాబట్టి వడ్లు కొనాలని కోరితే ‘తెలంగాణోళ్లు నూకలు తినండి’ అని అవమానించారని కేసీఆర్‌ గుర్తుచేశారు. నూకలు తినుమని చెప్పి, మళ్లీ సిగ్గులేకుండా వచ్చి ఓట్లు అడుగుతరా? అని మండిపడ్డారు. ‘ఎవరైతే నూకలు తినుమన్నరో.. ఈ ఎలక్షన్లల మనం వాళ్ల తోకలు కత్తిరియ్యాలె’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీ నేతలు చాలా ప్రలోభాలు పెడుతారని, గాయి గాయి, గత్తర గత్తర, గోల్‌మాల్‌, అడివడివి చేస్తరని కేసీఆర్‌ తెలిపారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఏ ఒక్కరూ కనిపించరన్నారు. ‘ఇంటికి తులం బంగారం ఇస్తమంటరు. మనం ఎత్తుకున్న పిల్లల ముక్కుల శీమిడి ఉంటే తీస్తరు. మూడు తారీఖ్‌ తర్వాత ఎవడన్నా కనబడుతడా? ఇదే ప్రభాకర్‌రెడ్డి, ఇదే కేసీఆర్‌, ఇదే సీపీఐ జెండాలే ఉంటయి’ అని చెప్పారు.

పోరాడేటోనికే కత్తి ఇయ్యాలె..
దుర్మార్గమైన బీజేపీని కూకటివేళ్లతో సహా పీకేసి, బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప భారతదేశానికి నిష్కృతి లేదని సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన ప్రభుత్వాలను కూలగొట్టే దుర్మార్గులను తన్ని తరిమేయకపోతే దేశం బాగుపడదు’ అన్నారు. అయితే.. కత్తి ఒకరి చేతుల్లో పెట్టి యుద్ధం ఇంకొకరిని చేయమంటే ధర్మం కాదని తెలిపారు. ‘ధరలు పెంచినవాళ్ల చేతికి కత్తి ఇస్తే మన మెడ కోస్తాడు, అదే కత్తితో మనల్ని నరికేస్తాడు’ అని హెచ్చరించారు. ఏ టీఆర్‌ఎస్‌ పార్టీ, ఏ వామపక్షాలు, ఏ క్రియాశీల పార్టీలు, ఏ ప్రగతిశీల రాజకీయ శక్తులు ఈ అరాచకాల మీద పోరాటం చేస్తున్నారో వాళ్ల చేతుల్లో కత్తి పెట్టాలని కోరారు. అప్పుడే ఈ ప్రైవేటీకరణ, పెట్టుబడిదారుల తొత్తు ప్రభుత్వాలను చీల్చి చెండాడి ప్రజల ఆస్తులను కాపాడుతారని వివరించారు. అలాంటి పార్టీలను ప్రజ లు గౌరవిస్తే దేశం బాగుంటుందని చెప్పారు.

ఆదివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరులో నిర్వహించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహిని. సభా ప్రాంగణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సీఎం కేసీఆర్‌ కటౌట్లు, ఎర్రజెండాలు

సభలో జగదీశ్‌రెడ్డి లేకపోవడం బాధగా ఉన్నది..
గత 20 ఏండ్లలో మంత్రి జగదీశ్‌రెడ్డి లేకుండా నల్లగొండ జిల్లాలో ఏ సభలోనూ తాను మాట్లాడలేదని కేసీఆర్‌ అన్నారు. ‘జగదీశ్‌రెడ్డి 2001 నుంచి ఉద్యమంలో ఉన్నాడు. ఏం తప్పు చేసిండని ఆయనపై నిషేధం విధించిన్రు? ఆయన ఏమైనా గుండాగిరి చేశారా? టీఆర్‌ఎస్‌కు, వామపక్షాలకు అసలు అలాంటి చరిత్ర ఉన్నదా?’ అని ఎన్నికల సంఘాన్ని నిలదీశారు. ప్రశాంత వాతావరణంలో తమ ప్రచారం తాము చేసుకొంటుంటే ఇలా చర్యలు తీసుకోవడమేమిటని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి లేనందుకు తనకు బాధగా ఉన్నదన్నారు.

ఆలోచించి ఓటు వేయండి
మన తలరాత మనమే రాసుకొనే ఆయుధం ఓటు
ఒళ్లు మరిచిపోయి ఓటు వేస్తే ఇల్లు కాలిపోతది: ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఓటు వేసేటప్పుడు ఆలోచించి వెయ్యాలని మునుగోడు ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. దేశంలో ఓటు విలువపై చైతన్యం వస్తే.. నయవంచనలు, నాటకాలు, మోసాలు ఎంతమాత్రం నడువవని స్పష్టంచేశారు. ప్రలోభాలకు లొంగేది లేదని ప్రజలు గట్టిగా చెప్పేదాకా దేశంలో దుర్మార్గ రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయన్నారు. ‘మేము పాములం.. కరుస్తం.. అయి నా మాకే ఓటు వెయ్యాలి’ అని బీజేపీ వాళ్లు అంటున్నారని.. దీనిపై ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. మునుగోడులో అవసరం లేకుండా వచ్చిన ఉపఎన్నిక జరుగుతున్నదని, ఉప ఎన్నిక ఫలితాన్ని ప్రజలు ఎప్పుడో తేల్చేశారని కేసీఆర్‌ అన్నారు. ఓటు అనేది మన తలరాత మనమే రాసుకొనే పెద్ద ఆయుధమని తెలిపారు. ప్రజాస్వామిక వ్యవస్థను నిలబెట్టే అద్భుతమైన, శక్తిమంతమైన ఆయుధమని చెప్పారు. ఒళ్లు మర్చిపోయి ఓటేస్తే ఇల్లు కాలిపోతదని సీఎం హెచ్చరించారు. ఏది మంచి.. ఏది చెడ్డ.. సమాజానికి ఏది అవసరమో.. ఆలోచించి ఓటేస్తే బతుకులు బాగుపడతయని వివరించారు. ఎటమటంగా ఓటేస్తే చాలా ప్రమాదమని హెచ్చరించారు.

అంగట్లో సరుకులం కాదని నిరూపించిన ఆ నలుగురు
‘నిన్న, మొన్న కొందరు ఢిల్లీ బ్రోకర్‌ గాళ్లు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కొందామని.. ఒక్కొక్కరికీ వంద కోట్ల రూపాయలు ఇస్తం, మీరు పార్టీ (టీఆర్‌ఎస్‌) ఇడిసిపెట్టి రమ్మని మన ఎమ్మెల్యేలను అడిగితే.. వాళ్లను ఎడమ కాలి చెప్పుతోని కొట్టి ‘రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా, మేము అంగట్లో సరుకులం కాదు, మేం తెలంగాణ బిడ్డలం’ అని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతమంత ఎత్తు ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలలైన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు నాతో వచ్చారు’ అని సీఎం కేసీఆర్‌ వారిని సభకు పరిచయం చేశారు. రాజకీయాలకు ఇటువంటి వాళ్లు కావాలని చెప్పారు. వంద కోట్లు ఇస్తామంటే గడ్డిపోచతో సమానంగా ఇసిరి కొట్టేసి, తెలంగాణను కాపాడిన బిడ్డలు వీళ్లు అని ఎమ్మెల్యేలను ప్రశంసించారు.

బీఆర్‌ఎస్‌కు మునుగోడే పునాదిరాయి
-మునుగోడుకు సువర్ణావకాశం
-గెలవంగనే రెవెన్యూ డివిజన్‌, 100 పడకల దవాఖాన
-మునుగోడు సభలో సీఎం కేసీఆర్‌

గెలిచిన 15రోజుల్లో రెవెన్యూ డివిజన్‌, 100 పడకల దవాఖాన మంజూరు
కృష్ణా నీళ్ల వాటా తేల్చేందుకు ఎనిమిదేండ్లు సమయం మోదీకి సరిపోలేదా? అని సీఎం కేసీఆర్‌ నిలదీశారు. మునుగోడులోని ప్రతి ఎకరానికి నీళ్లు తెచ్చే బాధ్యత, ఎంతవరకైనా కొట్లాడి తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు. ప్రజలకు సేవ చేసేవాళ్లు కావాలని, గెలిచి పత్తాలేకుండా పోయేవాళ్లు కాదని అన్నారు. ఓడిపోయినా ప్రభాకర్‌రెడ్డి కష్టసుఖాల్లో మీ మధ్యనే ఉన్నాడని, కాబట్టి ఇలాంటివాళ్లను గెలిపించుకొంటే సేవ చేస్తారని కేసీఆర్‌ స్పష్టంచేశారు.

దేశ రాజకీయాలను మలుపుతిప్పే సువర్ణావకాశం మునుగోడు ప్రజలకు వచ్చిందని, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా అందు కు పునాదిరాయి వెయ్యాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ మాదిరిగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు పుట్టుకొచ్చిందే బీఆర్‌ఎస్‌ పార్టీ అని స్పష్టంచేశారు. ఒకనాడు సిద్దిపేట ప్రజలు ఉప ఎన్నికలో తనను గెలిపించి తెలంగాణ ఉద్యమానికి పంపారని, ఇవాళ మునుగోడులో ప్రభాకర్‌రెడ్డిని గెలిపించడం ద్వారా బీఆర్‌ఎస్‌ అప్రతిహత ప్రస్థానానికి బాటలు వేయాలని కోరారు. బీఆర్‌ఎస్‌కు పునాదిరాయి కాబోతున్న మునుగోడును గుండెల్లో పెట్టుకొంటానని, అన్నిరకాలుగా అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

నీళ్లు, కరెంటు అందరికీ రావాలని, వీటిని సాధించేందుకు సాగే పోరులో మునుగోడు ప్రజలూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివారం మునుగోడు సభలో మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, అరాచక, కిరాతక రాజకీయాలతో రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొడుతూ, సమాజాన్ని అస్థిర పరుస్తూ, అతలాకుతలం చేస్తున్నదని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను గెలిపించడం ద్వారా మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీజేపీది పైన పటారం.. లోన లొటారం, డంబాచారం అన్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. విశ్వగురువుగా చెప్పుకొనే విషగురువు తమ మాయమాటలతో తెలంగాణ ప్రజానీకాన్ని వంచించలేరని, ఇది చైతన్యవంతమైన గడ్డ అని హెచ్చరించారు. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ 82కు చేరిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఇండియా ఆకలి రాజ్యంగా మారుతదా? అపార వనరులున్న దేశంలో నిరుద్యోగం తాండవిస్తదా? అని ప్రశ్నించారు. గ్యాస్‌ సిలెండర్‌ ధర రూ.1,200 చేసిందెవరని, పెట్రో ధరలు పెంచిందెవరని ప్రశ్నించారు. ఇంత భారీగా ధరలు పెంచినా ఓట్లు వేయాల్నా? మనకి పౌరుషం లేదా? అని గర్జించారు. ప్రజలు ఆలోచించి ఓటువేయాలని, అర్థమైనా అర్థంకానట్టు వ్యవహరిస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయని హెచ్చరించారు. ఓటును సక్రమంగా వినియోగిస్తే బీజేపీకి బుద్ధి వస్తుందన్నారు.

ఫ్లోరైడ్‌ బాధితులను ప్రదర్శించారు
టీఆర్‌ఎస్‌ కంటే ముందు నుంచి ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ మునుగోడు గోస తీర్చలేకపోయాయని అంశాలస్వామి అనే ఫ్లోరైడ్‌ బాధితుడిని ఢిల్లీ తీసుకెళ్లి, ఆనాటి ప్రధాని వాజ్‌పేయి టేబుల్‌పై పడుకోబెట్టినా ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అమెరికా వాళ్లను, ఇంగ్లిషోళ్లను, ఇతర దేశస్తులను పిలిచి ఎగ్జిబిషన్‌ మాదిరి చూపారు తప్ప సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టలేదని మండిపడ్డారు. తాను కూడా ఇక్కడి పరిస్థితులను చూసి ఏడ్చానని గుర్తుచేసుకొన్నారు. ఫ్లోరైడ్‌ సమస్యలపై తానే ‘సూడు సూడూ నల్లాగొండ.. గుండె మీదా ఫ్లోరైడ్‌ బండ, ఎండిపోయినా బొక్కలపైనా ఎగురుతున్న ఈ జెండాలెన్నో, నల్లగొండకు నరకం చూపిన రాజకీయ జెండాలెన్నో’ అని పాట రాశానని సెల్‌ఫోన్లలో వినాలని కోరారు.

నయవంచక జెండాలతో అప్రమత్తం
మునుగోడుకే కాకుండా మొత్తం దేశానికే నరకం చూపే నయవంచక జెండాలు మన మధ్యనే తిరుగుతున్నాయని, వాటిని గుర్తించాలని సీఎం అప్రమత్తంచేశారు. హంసలాగ పాలను, నీళ్లను వేరేచేసే శక్తిని సాధించుకోవాలని, అప్పుడే సమాజం బాగు పడుతుందని చెప్పారు. అలవోకగా ఓటువేసి ఇల్లు కాలబెట్టుకొనే పరిస్థితి తెచ్చుకోవద్దని హితవు చెప్పారు. నదుల్లో 70 వేల టీఎంసీల నీరు ఉన్నా సాగు, తాగు నీరు లేకపోవడానికి కారణమెవరు?అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం బ్యాడ్‌ పవర్‌ పాలసీతో కరెంటు రాదని, బ్యాడ్‌ వాటర్‌ పాలసీతో నీళ్లు రావని స్పష్టంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.