Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మునుగోడులో టీఆర్‌ఎస్‌కే బంపర్‌ మెజార్టీ

-రెండో ప్లేసులో కాంగ్రెస్‌.. బీజేపీకి మూడో స్థానమే
-ఇది ఉప ఎన్నిక కాదు.. రెండు భావజాలాల మధ్య సంఘర్షణ
-కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిది స్వార్థం
-బీజేపీ డబ్బు మదంతోనే ఉప ఎన్నిక
-ఏం చేశామో చెప్తున్నాం.. బాజాప్తా ఓట్లడుగుతున్నం
-ప్రభుత్వ పథకాలతో 99.15 శాతం మందికి లబ్ధి
-ఎనిమిదేండ్లలో కేంద్రం ఏం చేసిందో చెప్పగలరా?
-మోదీ విధానం అయితే జుమ్లా.. లేకుంటే హమ్లా
-ఎన్నికల తేదీలు ప్రధాని ఆఫీస్‌లో ఖరారు
-కాంగ్రెస్‌ను ఆ పార్టీ వాళ్లే నాశనం చేస్తున్నారు
-రేవంత్‌ను అధ్యక్షుడిని చేసినప్పుడే మూకుమ్మడి ఆత్మహత్య చేసుకున్నట్టు
-గుజరాత్‌లో ఎన్నికలున్నా రాహుల్‌ ఎందుకు వెళ్లరు?
-బ్రిటన్‌ ప్రధాని ఆత్మాభిమానంతో రాజీనామా చేశారు
-మోదీకి ఆత్మ లేదు.. అభిమానం అసలే లేదు
-ఒకటీ రెండు రోజుల్లో బీజేపీ ‘పట్టీ’ డ్రామా
-మునుగోడులో బీజేపీకి చెంపపెట్టు తప్పదు
-‘నమస్తే తెలంగాణ’తో మంత్రి కేటీఆర్‌

మాది చాలా చిన్న కంపెనీ అని రాజగోపాల్‌ రెడ్డి స్వయంగా చెప్పారు. తమ కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ వచ్చిందని చెప్పిందీ ఆయనే. చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్‌ ఇచ్చిన పెద్దలు ఎవరు? దాని వెనుక ఉన్న గుజరాత్‌ గద్దలు ఎవరు? అన్నది మునుగోడు ప్రజలు ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే కోసం రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఇస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ.. బీజేపీకి రాజగోపాల్‌రెడ్డి వేసిన ఎర పెద్దది. తనతోపాటు చాలా మందిని తీసుకొస్తాను.. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను, మా ఎంపీ అన్నను కూడా తీసుకొస్తానని బీజేపీకి ఎర వేశారు. ఇందులో భాగంగానే వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీగా ఉంటూనే తమ్మునికి ఓటేయాలని అడుగుతున్నారు.

బ్రిటన్‌లో తన ఆర్థిక విధానాలు విఫలమయ్యాయనే కారణంతో లిజ్‌ ట్రస్‌ 45 రోజులకే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మన దేశంలో 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకొని ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘50 రోజుల సమయం ఇవ్వండి.. వ్యవస్థను గాడిలో పెట్టకుంటే నన్ను సజీవంగా తగలబెట్టండి’ అని. ఇప్పటికి దాదాపు ఆరేండ్లు గడిచిపో యాయి. దేశంలో ఏం మారింది?

మాటిమాటికీ సబ్‌కా సాత్‌
సబ్‌ కా వికాస్‌ అంటున్నారు. ఈ దేశంలో ఎవరి వికాసం జరిగింది? దేశంలో అదానీకి.. రాష్ట్రంలో రాజగోపాల్‌ రెడ్డికి మాత్రమే వికాసం అయ్యింది. మోదీ 2014లో ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిండు కదా. బై మిస్టేక్‌లో ప్రజలందరి డబ్బును దేశంలో అదానీ ఖాతాలో, రాష్ట్రంలో రాజగోపాల్‌రెడ్డి ఖాతాలో వేసినట్టున్నారు.

– మంత్రి కేటీఆర్‌

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు బంపర్‌ మెజార్టీ ఖాయమని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ‘నో డౌట్‌.. మేం అద్భుతమైన మెజార్టీతో విజయం సాధించబోతున్నాం. కాంగ్రెస్‌ నంబర్‌ 2, బీజేపీ నంబర్‌ 3 పొజిషన్‌లో ఉండబోతున్నాయి. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్సే విజయం సాధించబోతున్నది. సీఎం కేసీఆర్‌ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కావటం ఖాయం. దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టించబోతున్నారు’ అని పేర్కొన్నారు. ధన మదంతో, స్వార్థ రాజకీయాల కోసం ఉప ఎన్నికను బలవంతంగా రుద్దిన బీజేపీకి ప్రజలు చెంపపెట్టులాంటి సమాధానం చెప్తారని అన్నారు.

నాలుగు కోట్ల మంది ప్రజలకు తాగునీరు అందించే మిషన్‌ భగీరథకు నీతిఆయోగ్‌ సిఫారసు చేసినా రూ.19 వేల కోట్లు ఇవ్వని కేంద్రం.. రాజగోపాల్‌రెడ్డి అనే ఒక వ్యక్తికి మాత్రం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చిందని మండిపడ్డారు. ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రజలకు ఏం చేశామో, ఏయే పథకాలు అమలు చేశామో చెప్తూ బాజాప్తా ఓట్లు అడుగుతున్నామని అన్నారు. బీజేపీ నేతలు చెప్పుకోవడానికి మంచిపని కనీసం ఒక్కటైనా ఉన్నదా? అని నిలదీశారు. మతం, మసీదు, ముస్లిం, నిజాం, ఓవైసీ వంటివి చెప్పకుండా ఓట్లు అడిగే దమ్మున్నదా? అని సవాల్‌ విసిరారు. మంత్రి కేటీఆర్‌ శనివారం హైదరాబాద్‌లో ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేండ్లలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందిస్తే.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అడ్డగోలుగా పన్నులు పెంచుతూ ప్రజల నడ్డి విరిచిందని విమర్శించారు. ఇన్నాళ్లూ మోదీ బలంతో గెలువలేదని, ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటం వల్లే అధికారంలోకి వచ్చారని అన్నారు. కాంగ్రెస్‌ను ఎవరూ ప్రత్యేకంగా నాశనం చేయాల్సిన అవసరం లేదని, రేవంత్‌రెడ్డిని అధ్యక్షుడిగా నియమించినప్పుడే మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్నట్టేనని ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో ఎన్నికలు ఉన్నా.. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర అక్కడ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. ఇందులో ఏదైనా లోపాయికారి ఒప్పందం ఉన్నదా? అని అనుమానం వ్యక్తం చేశారు. వీటితోపాటు అనేక అంశాలను మంత్రి కేటీఆర్‌ పంచుకున్నారు.

మునుగోడు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందని భావిస్తున్నారు?
మునుగోడు ఉప ఎన్నిక ప్రజలు కోరుకున్నది కాదు. వాళ్ల మీద బలవంతంగా రుద్దిన ఎన్నిక. అదే నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యే మరణిస్తే, హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎంపీగా గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వచ్చాయి. మునుగోడులో మాత్రం అసహజంగా వచ్చింది. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేండ్లు బీజేపీతో కోవర్ట్‌ రాజకీయాలు కొనసాగిస్తూ.. చివరికి బేరం కుదిరిన తర్వాత పార్టీ మారారు. తమది చాలా చిన్న కంపెనీ అని ఆయనే స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు. మళ్లీ తమ కంపెనీకి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ వచ్చిందని చెప్పింది కూడా ఆయనే. చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్‌ ఇచ్చిన పెద్దలు ఎవరు? దాని వెనుక ఉన్న గుజరాత్‌ గద్దలు ఎవరు? అన్నది మునుగోడు ప్రజలు ఆలోచించాలి. ఒక ఎమ్మెల్యే కోసం రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్‌ ఇస్తారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ.. బీజేపీ వాళ్లకు రాజగోపాల్‌రెడ్డి వేసిన ఎర పెద్దది. తనతోపాటు చాలా మందిని తీసుకొస్తాను.. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను, తన అన్న ఎంపీని కూడా తీసుకొస్తానని, నల్లగొండను ఊడ్చుకొస్తానని బీజేపీకి ఎర వేశారు. ఇందులో భాగంగానే వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ ఎంపీగా ఉంటూనే తమ్మునికి ఓటేయాలని అడుగుతున్నారు.

బీజేపీ పాలనకు.. టీఆర్‌ఎస్‌ పాలనకు తేడాను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారు?
ఈ ఉప ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్యో.. పార్టీల మధ్యో వచ్చినది కాదు. రెండు భావజాలాల మధ్య జరుగుతున్న సంఘర్షణ. పేదలు బాగుండాలి.. అందరూ కలిసుండాలి.. కులమత బేధాలు లేకుండా సంక్షేమం, అభివృద్ధి అందరికీ అందాలన్నది టీఆర్‌ఎస్‌ విధానం, నినాదం. దీనినే మేం ఆచరణలో చేసి చూపెడుతున్నాం. ప్రజలు కలిసి ఉండకూడదు, పేదలు కాదు పెద్దలు ముఖ్యం, రైతులు కాదు కార్పొరేట్‌ గద్దలు ముఖ్యం అన్నది బీజేపీ విధానం. మోదీ ప్రభుత్వం రూ.400 ఉన్న వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.1200 కు పెంచి దేశంలో ఆడబిడ్డలకు పొగబెట్టింది. ఆయిల్‌ కంపెనీలకు మాత్రం రూ.22 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. మోదీ అధికారంలోకి వచ్చినప్పుడు ముడి చమురు ధర బ్యారెల్‌కు సుమారు 94 డాలర్లు. ఈరోజు దాదాపు 100 డాలర్లుగా ఉన్నది. 2014లో పెట్రోల్‌ ధర దాదాపు రూ.70 ఉంటే.. ఇప్పుడు రూ.110 దాటింది. ముడిచమురు ధర పెరగలేదు.. కానీ మోదీ చమురు ధర, మోదీ పెట్రోల్‌ ధర మాత్రమే పెరిగింది. ఎందుకంటే అదనపు సెస్సుల రూపంలో కేంద్రం ఇప్పటికి దాదాపు రూ.30 లక్షల కోట్లు ప్రజల నుంచి వసూలు చేసింది.

మునుగోడులో రోడ్డు రోలర్‌ గుర్తును మళ్లీ కేటాయించడంపై మీ అభిప్రాయం?
దేశంలో ప్రస్తుతం అన్‌ డిక్లెర్డ్‌ ఎమర్జెన్సీ నడుస్తున్నది. వ్యవస్థల దుర్వినియోగం పరాకాష్ఠకు చేరింది. ఎన్నికల కమిషన్‌ కూడా మోదీ చెప్పినట్టు ఆడాల్సిందే. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలు వేర్వేరుగా పెట్టండి అంటే.. పెట్టాలంతే. డేట్లు ఖరారు చేసేది ప్రధానమంత్రి ఆఫీస్‌. 11 ఏండ్ల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్‌ గుర్తును తొలగించింది. ఇప్పుడు మళ్లీ మునుగోడుకు పంపింది. మీ నిబంధనలను మీరే ఎలా అధిగమిస్తారు? ఎలక్షన్‌ కమిషన్‌ నడుపుతున్నారా? సర్కస్‌ కంపెనీ నడుపుతున్నారా? గతంలో ఇదే జిల్లాలోని భువనగిరి లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ కేవలం 5 వేల ఓట్లతో ఓడిపోయింది. రోడ్డు రోలర్‌ సింబల్‌కు 29 వేల ఓట్లు వచ్చాయి. అందుకే రోడ్డు రోలర్‌ వద్దని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను కోరితే అంగీకరించారు. ఎన్నికల సంఘం నుంచి ఆ గుర్తును పంపిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఇక్కడి రిటర్నింగ్‌ ఆఫీసర్‌పై చర్యలు తీసుకోవడం ఏమిటి? చర్యలు తీసుకోవాల్సింది రిటర్నింగ్‌ అధికారిపై కాదు.. ఎన్నికల కమిషనర్‌పై. ఒక ఉప ఎన్నికలో గెలవడానికి ఇంత అప్రజాస్వామికంగా అడ్డదారులు తొక్కాలా? ఎన్నికల సంఘం ఎవరి ఒత్తిడి కింద పనిచేస్తున్నది? ఎవరి తప్పుకు ఎవరిని బలి చేస్తున్నారు?

మోదీ ఆర్థిక విధానాలను ఎలా అభివర్ణిస్తారు?
బ్రిటన్‌లో తన ఆర్థిక విధానాలు విఫలం అయ్యాయనే కారణంతో లిజ్‌ ట్రస్‌ 45 రోజులకే ప్రధాని పదవికి రాజీనామా చేశారు. మనదేశంలో 2016లో పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత ప్రధాని కన్నీళ్లు పెట్టుకొని ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ‘50 రోజుల సమయం ఇవ్వండి.. వ్యవస్థను గాడిలో పెట్టకుంటే నన్ను సజీవంగా తగలబెట్టండి’ అని మోదీ అన్నారు. ఇప్పటికి దాదాపు ఆరేండ్లు గడిచిపోయాయి. దేశంలో ఏం మారింది? ఎనిమిదేండ్లలో సాధించిందల్లా.. 30 ఏండ్లలోనే అత్యధిక నిరుద్యోగిత రేటు, 40 ఏండ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం, ప్రపంచలోనే అత్యధిక గ్యాస్‌ సిలిండర్‌ ధర మాత్రమే. మోదీ ఒకప్పుడు మన్మోహన్‌సింగ్‌ను ఉద్దేశించి ‘ఆయన వయసు, డాలర్‌ రెండూ పోటీ పడుతున్నాయి. ఏది వేగంగా పెరుగుతున్నదో అర్థం కావడం లేదు’ అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు మోదీ వయసు 70 దాటింది.. డాలర్‌ 83 దాటిపోయింది. దీనికి ఏమని సమాధానం ఇస్తారు? కొవిడ్‌ తర్వాత అతి ఎక్కువ పేదవాళ్లు ఉన్న దేశంగా భారత్‌ నిలవడం దారుణం. ఓవైపు తెలంగాణలో సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అన్నరాశులు పోస్తుంటే .. మోదీ నాయకత్వంలో దేశం ఆకలి సూచీలో 55 ర్యాంకు నుంచి 107 ర్యాంకుకు దిగజారిపోయింది. బ్రిటన్‌లో లిజ్‌ ట్రస్‌కు ఆత్మాభిమానం ఉంది కాబట్టి రాజీనామా చేశారు. ఇక్కడ మోదీకి ఆత్మ లేదు, అభిమానం లేదు. అధికారం యావ, ఫొటోల పిచ్చి తప్ప వేరే ఏదీ పట్టదు. అందుకే ఆయన ప్రచార మంత్రి తప్ప ప్రధానమంత్రి కాదు.

మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటేయాలి?
చేసిన పనిని చెప్తున్నాం, బరాబర్‌ ఓట్లడుగుతున్నాం. ఈ రోజు తెలంగాణలో అత్యధిక ధాన్యం పండిచే జిల్లా మాది అని నల్లగొండ రైతులు కాలర్‌ ఎగరేసుకొని చెప్పొచ్చు. ఒకప్పుడు కరువు ప్రాంతమైన ఆలేరు, భువనగిరి, మునుగోడు, దేవరకొండ వంటిచోట్ల ఇప్పుడు అద్భుతమైన పంటలు పండుతున్నాయి. ఎటు చూసినా వరి, పత్తి చేలు కనిపిస్తున్నాయి. ఫ్లోరోసిస్‌ భూతాన్ని శాశ్వతంగా నిర్మూలించగలిగే శక్తి ఉన్న పథకం మిషన్‌ భగీరథ. దానికి రూ.19వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్‌ సిఫారసు చేస్తే 19 పైసలు కూడా ఇవ్వని దుర్మార్గుడు మోదీ. అదే జిల్లాలో ఒక వ్యక్తికి మాత్రం రాజకీయ ప్రలోభం కోసం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చారు. వాళ్లకు మాకు తేడా అదే. ఇలా మేము చేసిన వే చెప్పి ఓట్లు అడుగుతున్నం. మళ్లీ గెలిపిస్తే దత్తత తీసుకుంటా అని, ఇంకా ఏమైనా పను లు మిగిలిపోతే పూర్తి చేస్తానని అంటున్నాను. ఇప్పుడు గెలిచినా ఉండేది 14 నెలలే. అం దుకే వేగంగా పనులు పూర్తి చేసేందుకు దత్తత తీసుకుంటానని అంటున్నా. మా మీద పోటీ చేసే బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు మునుగోడుకు ఏం చేశారో ఒక్క మాట అయినా చెప్పగలరా? మునుగోడు ప్రజలు చైతన్యవంతులు. అద్భుతమైన తీర్పు ఇచ్చి టీఆర్‌ఎస్‌ను మంచి మెజార్టీతో గెలిపిస్తారని నమ్మకంగా ఉన్నాం.

ఈ ఎన్నిక ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఎలా ఉండబోతున్నది?
మునుగోడు ఎన్నికల ఫలితం బీజేపీ దివాళాకోరుతనాన్ని, మునుగోడు ప్రజల చైతన్యాన్ని చూపెడుతుంది. ఓటర్లు డబ్బు రాజకీయాలను తిరస్కరిస్తున్నారనే సందేశాన్ని ఇస్తుంది. బీజేపీ వాళ్లు డబ్బుతో ఏదైనా కొనొచ్చు అనే భ్రమల్లో ఉన్నారు. బాగా డబ్బున్న అభ్యర్థిని పెట్టుకున్నాం. ఇంటికో తులం బంగారం ఇద్దామనే ఉద్దేశంతో ఉన్నారు. తెలంగాణ ప్రజల చైతన్యం వారికి చరమగీతం పాడుతుంది. మునుగోడు ఎన్ని క రిఫరెండం కానే కాదు. ఇదొక యూనిట్‌ టెస్ట్‌ అంతే. ప్రతి ఎన్నిక ప్రజల మూడ్‌ను ప్రతిబింబిస్తుంది. అయితే అది ఆ నియోజకవర్గానికే పరిమితం అవుతుంది. ఇప్పటికప్పుడు రాష్ట్రంలో ఎక్కడ సర్వే చేసినా ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారని తేలుతుంది.

సింహం సింగిల్‌గా వస్తుందని పదేపదే చెప్పే మీరు.. ఈ ఎన్నికల్లో వామపక్ష పార్టీల మద్దతు ఎందుకు తీసుకున్నారు?
మాతో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకొంటామని 2001లోనే చెప్పాం. మా దారిలో వచ్చి.. మాతో కలిసి వచ్చి, మా సిద్ధాంతాలు నచ్చి మద్దతు ఇస్తే స్వాగతిస్తాం. మేం ఎన్నడూ మా బాట వదిలిపెట్టలేదు. ఉదాహరణకు సీపీఎం గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. ఇప్పుడు వాళ్లు టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నారు. సీఎం కేసీఆర్‌ చక్కగా చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్లు మా బాటలోకి వచ్చారు తప్ప మా సిద్ధాంతం.. మా పద్ధతి.. మా వ్యవహారం మారలేదు.

మునుగోడు ప్రజలు బీజేపీకి, రాజగోపాల్‌రెడ్డికి ఎందుకు ఓటేయొద్దు?
మాటిమాటికి సబ్‌కా సాథ్‌ సబ్‌ కా వికాస్‌ అంటున్నారు. ఈ దేశంలో ఎవరికి వికాసం అయింది? దేశంలో ఆదానీకి.. రాష్ట్రంలో రాజగోపాల్‌ రెడ్డికి మాత్రమే వికాసం అయ్యింది. మోదీ 2014లో ఒక్కో భారతీయుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిండు కదా. బై మిస్టేక్‌లో ప్రజలందరి డబ్బును దేశంలో ఆదానీ ఖాతాలో, రాష్ట్రంలో రాజగోపాల్‌రెడ్డి ఖాతాలో వేసినట్టున్నారు. ఇంత దివాళాకోరు పార్టీని నా జీవితంలో చూడలేదు. సూటిగా సుత్తిలేకుండా అడుగుతున్నా.. నిజాం పేరు లేకుండా, ముస్లిం అనకుండా, ఓవైసీ అని చెప్పకుండా ఓటు అడిగే దమ్ము బీజేపీకి ఉన్నదా? రాజగోపాల్‌రెడ్డి ప్రతి ఇంటికి తులం బంగారం ఇచ్చినా మునుగోడు ప్రజలు చైతన్యవంతమైన తీర్పు ఇస్తారు. వచ్చే నెల 6న బీజేపీకి చెంపపెట్టులాంటి సమాధానం ఇస్తారు.

మునుగోడులో అభివృద్ధి జరగలేదన్న రాజగోపాల్‌రెడ్డి విమర్శపై మీ సమాధానం?
దండుమల్కాపూర్‌లో 580 ఎకరాల్లో పార్క్‌ ప్రారంభించినప్పుడు ‘కేటీఆర్‌ మన మంత్రిగా ఉండటం మన అదృష్టం’ అని రాజగోపాల్‌రెడ్డి ప్రశంసించారు. ఓ యూట్యూబ్‌ చానల్‌ ఇంటర్వూలో ‘కేసీఆర్‌ గొప్పోడు. మిషన్‌ భగీరథలో కొన్ని గ్యాప్స్‌ ఉన్నాయని అడగగానే రూ.50 కోట్లు మంజూరు చేశారు’ అని అన్నారు. ఇప్పుడేమో అభివృద్ధి కాలేదంటున్నారు. గతంలో చెప్పినవి కరెక్టా.. ఇప్పుడు చెప్పినవి కరెక్టా? అనేది ముందు రాజగోపాల్‌రెడ్డి స్పష్టత తెచ్చుకోవాలి. ఆయన ఓడిపోతానని గందరగోళంలో ఉన్నారు. బండి సంజయ్‌తోపాటు ఆయన కూడా మానసిక చికిత్సాలయానికి వెళ్లి చూపించుకుంటే మంచిది.

ఇది మా విజయం
దండుమల్కాపూర్‌లో 580 ఎకరాల్లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ పెట్టాం, ఫ్లోరోసిన్‌ను నిర్మూలించాం. శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లు కడుతున్నాం. 24 గంటల కరెంటు ఇస్తున్నాం. మునుగోడు పరిధిలో 1.46 లక్షల మందికి రైతుబంధు, 40వేల మందికి ఆసరా పెన్షన్లు, 37 వేల మందికి కేసీఆర్‌ కిట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే 2.40 లక్షల మంది ఓటర్లున్న మునుగోడులో 2,38,915 మందికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. అంటే 99.15 శాతం మంది లబ్ధి పొందుతున్నారు. ఇది మా విజయం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ వంటివి కలిపితే ఇంకా పెరుగుతుంది.

నేషనల్‌ మీడియా మోదీయా అయిపోయింది
మనదేశంలో నేషనల్‌ మీడియా పూర్తిగా ‘మోదీ’యాగా మారింది. ప్రశ్నించే దమ్ము పోయింది. తెలుగులో రాసినా వాళ్లు పట్టించుకోరు. ఇంగ్లిష్‌ మీడియాకు ప్రశ్నించే దమ్ములేదు. ఎక్కడ తమపై ఈడీ రైడ్‌ అవుతుందో, ఐటీ వస్తుందో, సీబీఐ ఎంక్వైరీ అవుతుందోనని భయం. ప్రతిపక్ష నాయకుల మీద మాత్రమే సంచలన కథనాలు వస్తాయి. మోదీ మీద రావు. మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా వల్ల కానిది ‘ద వైర్‌’ అనే వెబ్‌సైట్‌ బయటపెట్టింది. కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ అనే సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసి సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలు, జర్నలిస్టులు, ప్రతిపక్ష నాయకులు, బిజినెస్‌ ప్రముఖులు ఇలా.. దేశంలో ముఖ్యమైన వ్యక్తులందరి ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నదని చెప్పింది. చివరికి మోదీ క్యాబినెట్‌లోని మంత్రులు, ఎంపీల ఫోన్లను కూడా ట్యాప్‌ చేస్తున్నారు. పెగాసస్‌ వాస్తవమా కాదా? మీడియా విచారించాలి.

ఆయన బీజేపీలోకి ఎందుకు పోయిండు?
డబ్బు మదంతో ఈ ఎన్నికను ప్రజల మీద రుద్దింది బీజేపీ. ఆ పార్టీ అభ్యర్థి నాలుగేండ్లు నియోజకవర్గాన్ని అనాథలా వదిలిపెట్టింది వాస్తవం కాదా? ప్రజలు చస్తున్నారో బతుకుతున్నారో ఏనాడైనా చూశారా? అసలు ఆయన బీజేపీలోకి ఎందుకు పోయినట్టు? చేనేత మీద జీఎస్టీ వేసినందుకు నచ్చి పోయిండా? ఫ్లోరోసిస్‌ నిర్మూలనకు పైసలు ఇవ్వనందుకు పోయిండా? శివన్నగూడానికి, లక్ష్మణపురానికి నీళ్లిచ్చే కృష్ణాలో వాటా తేల్చకుండా కేసులు వేసి అడ్డుకున్నందుకు పోయిండా? 2016లో మర్రిగూడకు నడ్డా వచ్చి 300 పడకల దవాఖాన అని చెప్పి, ఇప్పటికీ కనీసం కాగితం కూడా ఇవ్వనందుకు పోయిండా? ప్రజలకు చెప్పాలి.

అయితే జుమ్లా.. లేకుంటే హమ్లా..
మోదీ, ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు సత్యహరిశ్చంద్రుడి చుట్టాలు అయినట్టు.. మిగతా పార్టీల వారు మాత్రమే అవినీతిపరులు అయినట్టు హడావుడి చేస్తున్నారు. ఒక్క బీజేపీ నాయకుడి మీద కూడా ఎందుకు కేసులు ఉండవు? ఆ పార్టీలో చేరితే ఉన్న కేసులన్నీ మటుమాయం అవుతాయి. ఏపీలోని సుజనా చౌదరి, సీఎం రమేశ్‌పై కేసులు ఎక్కడికి పోయాయి? అయితే జుమ్లా (అబద్ధం).. లేకపోతే హమ్లా (దాడి) మోదీ విధానం.

దేశ చరిత్రలోనే అసమర్థ ప్రధాని మోదీ
మోదీ విధానాలకు చేనేత రంగం క్లాసిక్‌ ఎగ్జాంపుల్‌. మోదీ ముఖ్యమంత్రిగా వెలుగులోకి వచ్చిన గుజరాత్‌లోని సబర్మతి ఆశ్రమంలో ఒకప్పుడు మహాత్మాగాంధీ చరఖా ముందు కూర్చొని నూలు వడికారు. ఈ దేశానికి స్వదేశీ నినాదం ఇచ్చారు. ఖాదీ, చేనేత వంటి స్వదేశీ ఉత్పత్తులు వాడాలని ప్రోత్సహించారు. విదేశీ వస్తువులను బహిష్కరించాలన్న ఉద్యమానికి బలం ఇవ్వాలని పిలుపు ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మోదీ కంటే ముందు పనిచేసిన 14 మంది ప్రధానుల్లో ఎవరూ చేనేత మీద పన్ను వేసే దౌర్భాగ్యపు పని చేయలేదు. చేనేత, ఖాదీ ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ వేసిన మొదటి ప్రధానిగా మోదీ చరిత్రలో నిలిచిపోయారు. అంతేకాదు.. ఆలిండియా హ్యాండ్లూమ్‌ బోర్డ్‌ రద్దు, ఆలిండియా హ్యాండీక్రాఫ్ట్‌ బోర్డ్‌ రద్దు, బున్‌కర్‌ బీమా యోజన రద్దు, సబ్సిడీలు 40 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు వంటివి అమలు చేసి చేనేత రంగానికి ఉరివేశారు. ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక, చేనేత వ్యతిరేక, మహిళా వ్యతిరేక, యువజన వ్యతిరేక పాలసీలు అమలు చేయడం తప్ప.. దేశంలో ఏ ఒక్క వర్గానికి ఒక్క మంచి పని చేయలేదు. ఈ ప్రభుత్వం ‘మోస్ట్‌ ఇనెప్ట్‌, ఇన్‌ఎఫీషియెంట్‌, మోరల్లీ కరప్ట్‌, క్రోనీ క్యాపిటలిస్ట్‌ గవర్నమెంట్‌’.

ఉచిత కరెంటుకు మనసు రాదేం
ఈ దేశ ప్రధానిగా మోదీ విఫలమయ్యారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో సంవత్సర కాలంలో 50 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి ఆయన దగ్గర సమాధానం ఉన్నదా? పైగా చేనేతపై 5 శాతం పన్ను వేశారు. ఇలాంటి ప్రభుత్వమా దేశం కోరుకున్నది? రూ.11.2 లక్షల కోట్ల కార్పొరేట్‌ లోన్లను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వానికి రైతుల కోసం ఉచిత కరెంటు ఇవ్వడానికి మనసు రావడం లేదు. దేశంలో రైతులు, చేనేతలే పెద్ద వర్గాలు. అది ఆయన అర్థం చేసుకోలేదు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.