-మునుగోడులో టీఆర్‌ఎస్ జయభేరి
-ముందే ఖరారైన 2023 విజయం…
-ఇది మునుగోడిచ్చిన విజయ సందేశం
-కేసీఆర్ వెంటే తెలంగాణ ప్రజానీకం..
-బీఆర్‌ఎస్ జైత్రయాత్రకు ఆశీర్వచనం
-ముఖ్యమంత్రి విజన్‌పై ప్రజల్లో అచంచల విశ్వాసం
-మునుగోడు ఫలితంతో స్పష్టమైన మనోగతం..
-రోజురోజుకూ పెరుగుతున్న టీఆర్‌ఎస్ బలం
-65 లక్షల కార్యకర్తలతో తిరుగులేని శక్తిగా ఆవిర్భావం
-అసెంబ్లీలో 105 కు పెరిగిన ఎమ్మెల్యేల సంఖ్య
-కూసుకుంట్ల ఘన విజయం
-ఆత్మగౌరవం ముందు తలవంచిన అహంకారం
-రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల మెజారిటీ
-డిపాజిట్ కూడా దక్కించుకోలేని కాంగ్రెస్ పార్టీ
-2018 తర్వాత రాష్ట్రంలో ఐదు సీట్లకు ఉప ఎన్నికలు.అందులో మూడు టీఆర్‌ఎస్‌వే.. ! -ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 సీట్లకు బైపోల్స్. మూడింటికి మూడు టీఆర్‌ఎస్‌వే… -హ్యాట్రిక్!! ఈ హ్యాట్రిక్ పరంపర మున్ముందు కొనసాగనుంది.
2014, 2018 ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్ 2023లోనూ గెలవడం ఖాయమైంది… హ్యాట్రిక్!!!
ఏడాదిలో జరిగే సాధారణ ఎన్నికల ఫలితం కూడా ముందే ఖరారైంది. కేసీఆర్ హ్యాట్రిక్‌కు మునుగోడు రాచబాట పరిచింది. స్వాతంత్య్రానంతరం ఎన్నడూ లేని రీతిలో పన్నెండుకు పన్నెండు సీట్లను ఇచ్చి,టీఆర్‌ఎస్ కంచుకోటగా మారిన నల్లగొండ ఇప్పుడు గులాబీ కొండ. ఉత్తరం లేదు, దక్షిణం లేదు, తెలంగాణలోని ప్రతి ఊరూ కేసీఆర్ వెంటే, వెన్నంటే అని చాటిచెప్పింది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ఎదురులేదని,కేసీఆర్‌కు తిరుగులేదని చాటింది మునుగోడు!
నిజానికి మునుగోడు టీఆర్‌ఎస్ సీటు కాదు; కాంగ్రెస్‌ది! ఉప ఎన్నిక అవసరమై వచ్చింది కాదు; కుట్రతో తెచ్చింది! అక్కడ బరిలోకి దిగింది రాజగోపాల్ కాదు; కేంద్ర ప్రభుత్వం! యుద్ధం పార్టీల మధ్య కాదు;ధన అహంకారానికి, ప్రజల ఆత్మగౌరవానికి!
వందల కోట్ల డబ్బు. ఏరులై పారిన మద్యం. చెయ్యని కుయుక్తి లేదు. వెయ్యని ఎత్తుగడ లేదు. ఫేక్ గుర్తులు, ఫేక్ మెహందీలు, ఫేక్ జ్వరాలు, ఫేక్ డ్రామాలు, ఫేక్ ధర్నాలు, ఫేక్ వీడియోలు, ఫేక్ హామీలు… ఇలా ఎన్నో, ఎన్నెన్నో. బీజేపీ తన చేతిలో ఉన్న అస్రాలన్నీ ప్రయోగించింది. అయినా విజయం టీఆర్‌ఎస్‌నే వరించింది. 2023లో బీజేపీ ఇంతకంటే చేయగలిగింది ఏముంటుంది? కేసీఆర్‌ను ఆపడానికి దానిదగ్గర ఏముంది?
కేసీఆర్ అంటే ఒక్కడు కాదు; నాలుగు కోట్ల తెలంగాణ జనం! కేసీఆర్ విజయం ఎన్నికల్లో లేదు. తెలంగాణ ప్రజల సంక్షేమంలో ఉంది! కేసీఆర్ ఉన్నది ప్రగతి భవన్‌లో కాదు. ప్రతి తెలంగాణ పౌరుడి గుండెల్లో!
మునుగోడులో ఉప ఎన్నిక సృష్టించి,అక్రమాలతో గెలిచి, తర్వాత టీఆర్‌ఎస్ సర్కారును కూల్చి, బీఆర్‌ఎస్‌ను నిలువరించి, తెలంగాణ సమాజాన్ని చీల్చి పాగావేద్దామనుకున్న మోదీ- షా పన్నాగానికి మునుగోడు మొనగాడు ఇచ్చిన జవాబే ఈ విజయం. ఇది రాజగోపాల్ ఓటమి కాదు. అమిత్‌షా ఓటమి! ఇది బీజేపీకి పరాజయం… మోదీ- షాలకు పరాభవం! మునుగోడు ఓటరిప్పుడు మొనగాడు!
టీఆర్‌ఎస్‌పై కుట్రకు దిగిన సోదరులు రెంటికి చెడ్డరేవడయ్యారు. కేసీఆర్‌పై కత్తి దూసిన బీజేపీ పెద్దలు తామే చిత్తయ్యారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకున్న జనం విజయం తీరంలో నిలిచారు. చెడపకురా చెడేవు. ఇదీ మునుగోడు ప్రజలు ఢిల్లీకిచ్చిన సందేశం!
కొసమెరుపు: మునుగోడును గెలిచేందుకు బీజేపీ మొక్కని దిక్కు లేదు. ఎక్కని బండ లేదు. చెప్పని అబద్ధం లేదు. చివరికి తప్పు చేసి తడి బట్టలతో తప్పుడు ప్రమాణాలకూ తెగించారు. కానీ యాదాద్రి నర్సింహస్వామి మామూలోడా! తగిన శాస్తి చేసాడు. నర్సింహసామినిరా.. నిన్ను నంచుకుతింటనురా.. అంటూ!!
కేసీఆర్ బహుముఖ వ్యూహం ..
బీజేపీ గెలుపు.. భవిష్యత్తుకే ప్రమాదమనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారు. యాంటీ కమలం టీమ్‌ను ఒకచోటికి చేర్చడంలో సఫలీకృతులయ్యారు. బీజేపీని సైద్ధాంతికంగా వ్యతిరేకించే కమ్యూనిస్టులను కూడగట్టారు. పాత లీడర్లను చేర్చుకొని క్యాడర్‌లో పునరుత్తేజం నింపారు. తెలంగాణలో బీజేపీకి భవిష్యత్తు లేదనే విషయాన్ని మునుగోడు ఎన్నికతో మరోసారి రుజువు చేశారు.
తెలుగు నేలపై మరో అద్భుత రాజకీయ దృశ్యం ఆవిష్కృతం కానున్నదా..? మూడోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి చరిత్రలో హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అనిపించుకొంటారా? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే జవాబు ఇస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా వరుసగా మూడోసారి ప్రమాణం చేయలేదు. ఇప్పటివరకు ఉన్న ఈ రికార్డును ముఖ్యమంత్రి కేసీఆర్ బద్దలు కొడ్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని శాసనసభ స్థానాలకు మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ప్రజాభిప్రాయానికి కొలమానంగా చెప్తున్నారు. ఈ నెల మూడున జరిగిన మునుగోడు ఉప ఎన్నికల ఓట్లను ఆదివారం లెక్కించారు.
ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై 10,309 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తొలి రౌండు నుంచి తుది వరకు రౌండు రౌండుకూ టీఆర్‌ఎస్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరిచింది. నియోజకవర్గంలో ఏడు మండలాల్లోనూ మెజార్టీని సాధించింది. కారు స్పీడుతో కమలం రేకులు రాలిపోయాయి. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా కాపాడుకోలేకపోయింది. మొత్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వానికే మునుగోడు ప్రజలు పట్టం కట్టారు. మునుగోడు నియోజకవర్గంలో 2,41,805 ఓటర్లు ఉండగా, రికార్డు స్థాయిలో 2,25,192 మంది ఓటు హక్కు వినియోగించుకొన్నారు. పోలైన మొత్తం ఓట్లలో టీఆర్‌ఎస్‌కు 97,006, బీజేపీకి 86,697, కాంగ్రెస్‌కు 23,906 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా 10,309 ఓట్ల మెజారిటీతో టీఆర్‌ఎస్ విజయం సాధించింది.
సాధారణ ఎన్నికలకు విజయసంకేతం
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలే మరో ఏడాదిలో జరిగే సాధారణ ఎన్నికల్లో కూడా ప్రతిబింబించనున్నాయి. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించింది. ప్రత్యర్థులు, ప్రతిపక్షాలు దరిదాపుల్లో కూడా లేవు. టీఆర్‌ఎస్‌ను కేసీఆర్ ఒక్కడిగా మొదలుపెట్టినా.. నేడు అది 65 లక్షలకు పైగా కార్యకర్తల బలం ఉన్న పార్టీగా ఎదిగింది. రోజురోజుకూ పార్టీ బలం పెరుగుతూనే ఉన్నది. ఇప్పుడు జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది. భారత్ రాష్ట్ర సమితిగా దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పుకోసం కేసీఆర్ నడుంబిగించారు. మునుగోడు ఉప ఎన్నిక ముగియడంతో ఇక బీఆర్‌ఎస్‌పైనే దృష్టి సారించనున్నారు.
ప్రతి ఎన్నికలోనూ పెరుగుతున్న బలం
గడిచిన 8 ఏండ్లుగా ఏ ఎన్నిక చూసినా టీఆర్‌ఎస్ విజయపరంపర కొనసాగుతూనే ఉన్నది. ప్రతి ఎన్నికల్లోను పార్టీ తన పనితీరును మెరుగుపర్చుకొన్నది. రాష్ట్రంలో 119 శాసనసభ స్థానాలుంటే.. 105 స్థానాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలే ఉండటం గమనార్హం. ఇంత ఏకపక్షంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్న పార్టీ మరొకటి లేదు. ఈ క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్టీ మరోసారి విజయం సాధిస్తుందని చెప్పడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచలమైన విశ్వాసం ప్రధాన కారణమైతే.. పార్టీకి ఉన్న క్యాడర్ మరో కారణం. పార్టీకి ప్రతి సెగ్మెంట్‌లోను బలమైన అభ్యర్థులున్నారు.
అందుకే 2023 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మూడోసారి కూడా గెలుస్తుందని, హ్యాట్రిక్ విజయం కేసీఆర్ సొంతమవుతుందని విశ్లేషకులు చెప్తున్నారు. పార్టీకి ఒకట్రెండు నియోజకవర్గాల్లో చిన్నచిన్న సమస్యలు ఉండి ఉంటాయి. వాటిని అధిగమించడం ఎలాగో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసు. పార్టీ వాటిని సరిదిద్దుకొంటే ఈసారి 2018 ఎన్నికలకు మించి సీట్లు వచ్చినా ఆశ్చర్యం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ తమకు తాము టీఆర్‌ఎస్ (బీఆర్‌ఎస్)కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పుకొంటున్నాయి. కొంతవరకు టీఆర్‌ఎస్‌ను కట్టడిచేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గులాబీ శ్రేణులు వీటిపై అప్రమత్తంగా ఉండి దూకుడు పెంచడంతోపాటు ఎక్కడికక్కడ తమ తప్పులను వెంటనే సరిదిద్దుకుంటే పార్టీకి మరింత లాభం. ప్రజల అవసరాలను గుర్తించడం, వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుండేవారిని ప్రజలు కాపాడుకొంటారు. ఇలా చేయనివారిని ప్రజాక్షేత్రంలో ప్రజలు నిలదీస్తారు. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నపుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం ప్రజల్లో కనిపించింది. ప్రజలు రాజగోపాల్‌రెడ్డిని నిలదీశారు. ఈ తరహా పరిస్థితులు తమకు తలెత్తవద్దంటే టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉంటే పార్టీకి మరింత బలం చేకూరుతుంది.
ఎన్నిక ఏదైనా.. టీఆర్‌ఎస్‌దే గెలుపు
గులాబీ ప్రభంజనం ముందు మరే ఇతర పార్టీలు నిలబడలేక పోతున్నాయి. కారు వేగానికి ప్రతిపక్షాలు పటాపంచలవుతున్నవి. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత తెలంగాణకు 2014, 2018లో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. టీఆర్‌ఎస్ విజయ ఢంకా మోగించింది. 2014, 2019లో రెండుసార్లు లోక్‌సభ ఎన్నికలు రాగా.. కారు జోరు కొనసాగింది. ఎన్నిక ఏదైనా టీఆర్‌ఎస్‌దే గెలుపు అన్నంతగా రోజురోజుకూ తన బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. మున్సిపల్, పంచాయతీ ఇలా ప్రతిచోటా టీఆర్‌ఎస్ తన సత్తా చాటుతూనే ఉన్నది. 2016లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 150 స్థానాల్లో 99 చోట్ల విజయం సాధించింది. 66 శాతం ఓట్లతో హైదరాబాద్‌లో తిరుగులేని పార్టీగా ఆవిర్భవించింది. 2021లో 54 స్థానాలను కైవసం చేసుకొన్నది. 2020లో 120 మున్సిపాలిటీలకు జరిగిన పోరులో 44% ఓట్లతో 112 స్థానాల్లో గెలిచింది. 10 కార్పొరేషన్లలో అన్నింటినీ గెలిచి ప్రత్యర్థులను ఒంటి చేత్తో మట్టి కరిపించింది. 2014లో 538 జడ్పీటీసీలకు గాను 191, 2019లో 538 జడ్పీటీసీలకు 449 జడ్పీటీసీల్లో విజయ ఢంకా మోగించింది. 5,816 ఎంపీటీసీలకు 2014లో జరిగిన ఎన్నికల్లో 1860, 2019లో జరిగిన ఎన్నికల్లో 3571 స్థానాలు కైవసం చేసుకొన్నది.
పెరిగిన టీఆర్‌ఎస్ బలం
మునుగోడులో టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించటంతో అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 105 (ఒక ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే సహా)కు చేరింది. ఇప్పటిదాకా ఆరుగురు ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో 5కు పడిపోయింది.