Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మునుగోడులో మోతమోగాలె.. మంత్రి కేటీఆర్‌

-3న కారు గుర్తుకే ఓట్లు వెయ్యాలె.. గులాబీ జెండా ఎగిరి తీరాలె
-ఫ్లోరైడ్‌పై నల్లగొండ పెద్ద నేతలు చేతులెత్తేస్తే.. కేసీఆర్‌ కృష్ణా నీళ్లిచ్చిండు
-మంత్రి కేటీఆర్‌ ఉద్ఘాటన
-చండూరులో కేటీఆర్‌ భారీ ర్యాలీ.. జనం ప్రభంజనం
-ఇది అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం
-ఫ్లోరోసిస్‌ నివారణకు మోదీ 19 వేల కోట్లు ఇవ్వలేదు..
-కానీ, రాజగోపాల్‌రెడ్డికి 18 వేల కోట్ల కాంట్రాక్టిచ్చిండు
-22 కోట్ల రాజగోపాల్‌ని 2200 కోట్లకు చేర్చింది మోదీ
-చిన్న కాంట్రాక్టరుకు అంత పెద్ద పని వెనుక మతలబేంది?
-బిల్లుల కోసమే తప్ప.. అభివృద్ధిని ఏనాడైనా అడిగిండా?
-బీజేపీకి పొరపాటున ఓటేస్తే చేనేతకు మరణశాసనమే
-పంద్రాలాఖ్‌ వచ్చినోళ్లు ఎవరైనా ఉంటే మోదీకి ఓటెయ్యండి
-యాదాద్రి గుడిని అద్భుతంగా కట్టింది సీఎం కేసీఆర్‌ కాదా!
-గుడికి రూ.100 కోట్లడిగితే మోదీ వంద రూపాయలివ్వలే
-కేసీఆర్‌ కంటే పెద్ద హిందువా ప్రధాని మోదీ! ఎట్లయితడు?
-ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో కులవృత్తుల వికాసం
-నేతన్నల బతుకులు మార్చినం.. గీతన్నల కష్టాలు తీర్చినం
-మునుగోడును దత్తత తీసుకుంటా.. అభివృద్ధి బాధ్యత నాదే
-రోడ్‌ షోలో మంత్రి కేటీఆర్‌.. కూసుకుంట్ల నామినేషన్‌

దత్తత తీసుకొని అభివృద్ధి చేస్త
కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా. 3 నెలలకొకసారి అభివృద్ధి కార్యక్రమాలను నేనే పర్యవేక్షిస్తా. జగదీశ్‌రెడ్డి సూర్యాపేటను ఎంత బాగచూసుకుంటున్నడో, నేను సిరిసిల్లను ఎంత బాగ చూసుకుంటున్ననో.. అట్లాగే ఇద్దరం కలిసి బాధ్యత తీసుకుంటం. – కేటీఆర్‌

గురువారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రోడ్‌షోకు భారీగా హాజరైన ప్రజలు

మునుగోడు ఫ్లోరోసిస్‌ సమస్యకు పరిష్కారం చూపించే మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్‌ సూచిస్తే, కేంద్రంలోని మోదీ సర్కారు పైసా ఇయ్యలే. కానీ, సొంత లాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డికి మాత్రం రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు. ఇందులో మతలబు ఏందో ప్రజలు ఆలోచించాలి. ఈ ఉప ఎన్నిక మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి, రాజగోపాల్‌రెడ్డి అహంకారానికి మధ్యే. మూడో తారీఖున మునుగోడులో కారు గుర్తుపై ఓట్ల మోత మోగాలి. – కేటీఆర్‌

మునుగోడులో మోత మోగించాలని, మూడో తేదీన జరిగే ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి.. టీఆర్‌ఎస్‌ జెండా ఎగరేయాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధమని చెప్పారు. మునుగోడులో ఫ్లోరోసిస్‌ నివారణకు 19 వేల కోట్లు ఇవ్వని మోదీ.. ఇక్కడ రాజగోపాల్‌రెడ్డికి మాత్రం 18వేల కోట్ల విలువైన కాంట్రాక్టు ఇచ్చారని ధ్వజమెత్తారు. రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిన పని ఏమైనా ఉన్నదా? అని నిలదీశారు. మునుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గురువారం చండూరులో నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీలో మంత్రి జగదీశ్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ కోమటిరెడ్డి కాంట్రాక్టుల బాగోతంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఉపఎన్నిక మునుగోడు ప్రజలపై రుద్దినది అని, ఇక్కడి ప్రజలకు అవసరం లేని ఎన్నిక అని చెప్పారు. కేటీఆర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

కేసీఆర్‌కు మునుగోడు కష్టం తెలుసు
కేసీఆర్‌కు మునుగోడు కష్టం తెలుసు. 2006లో నల్లగొండ జిల్లాలోని 32 మండలాలు తిరుగుతూ ఆయనే స్వయంగా పాట రాసిండు. ‘చూడు చూడు నల్లగొండ.. గుండెనిండా ఫ్లోరైడ్‌ బండ.. నీ దుఃఖమెట్లా తీరాల నల్లగొండ’ అని ఆవేదన చెందిండు. శివన్నగూడెం గ్రామంలో పండుకొని.. అక్కడి కుటుంబాలకు, ఆడబిడ్డలకు మాటిచ్చిండు. ‘ఇప్పుడున్నోళ్లు మిమ్మలను పట్టించుకోవడం లేదు. తాగునీటి మంత్రి జానారెడ్డి అయిండు, సాగునీటి మంత్రి పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అయిండు. ఏ ఒక్కరూ ఒక్క పని చేయడంలేదు. తెలంగాణ వస్తది. మీ అందరి ఆశీర్వాదం ఉంటే.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తే మీ గోడు తీర్చే బాధ్యత నాది’ అన్నడు. ఇచ్చిన మాట నిలబెట్టుకొన్న నాయకుడు మన కేసీఆర్‌. కృష్ణానది నల్లగొండ జిల్లాను ఒరుసుకొంటూ పారుతది. అయినా సాగు, తాగునీటి కష్టాలు ఉంటయి. పెద్ద పెద్ద నాయకులున్నా.. రిజర్వాయర్లు కట్టలేదు. కేసీఆర్‌ సర్కారు వచ్చేదాకా ఆ ఆలోచనే జరుగలేదు. ఈ రోజు రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా శివన్నగూడెం రిజర్వాయర్‌ నిర్మాణం జరుగుతున్నది. లక్ష్మణాపురం రిజర్వాయర్‌ నిర్మిస్తున్నం. మిషన్‌ కాకతీయ కింద 323 చెరువులు ఇవాళ గంగాళాల్లా మారిపోయాయి.

కేసీఆర్‌ మునుగోడుకు చేసిందిదీ..
కేసీఆర్‌ ప్రభుత్వం వచ్చినంక మునుగోడుకు ఏం చేసిందో.. అన్నదమ్ములకు, అక్క చెల్లెండ్లకు చెప్పేతందుకు లెక్క తీసుకొని వచ్చిన. ఈ నియోజకవర్గంలో 1.13 లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు అందుతున్నది. పదేండ్ల కింద తెలంగాణ రాకముందు మునుగోడులో రైతుల పరిస్థితి ఏంది? ఇప్పుడెట్ల ఉన్నది? కరెంటు అర్ధరాత్రి దొంగోలె వచ్చేది. పెండ్లం పిల్లలను వదిలిపెట్టి దానికోసం కావలిగాయ పోయేది. ఎవలన్న ఊళ్లె సచ్చిపోతే కరెంటోళ్లకు ఫోన్‌చేసి ‘అంత్యక్రియలకు పోతున్నం. మేం స్నానాలు చేయాలె.. అర్ధగంట కరెంట్‌ ఇయ్యర నాయనా’ అని బతిలాడుకొన్న రోజులు యాదికున్నయా? ఉమ్మడి ఏపీలో ఠాణాల్లో పెట్టి విత్తనాలు పంచే దుస్థితి. అవి కూడా కల్తీ విత్తనాలు. రిజర్వాయర్లు, కాల్వలు లేవు. నీళ్లు రావు. నల్లగొండ మండలం మూసంపల్లిలో 67 బోర్లు వేసిన రామిరెడ్డికి ‘బోర్ల రామిరెడ్డి’ అని పేరు పెట్టుకొన్నరు. ఈ రోజు ఉన్నదా ఆ పరిస్థితి? రైతుబంధుతోపాటు రైతు రుణమాఫీ రూపంలో గత టర్మ్‌లో 42 వేల మందికి సాయం అందింది. ఈ టర్ములో కూడా కొందరికి మాఫీ అయింది. ఒక్క మునుగోడులోనే 42 వేల కనెక్షన్లకు ఉచితంగా కరెంటు వస్తున్నది. రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడొద్దని ఆ కుటుంబానికి రైతుబీమాతో భరోసా ఇచ్చిన సీఎం మన కేసీఆర్‌. మునుగోడులో 9,950 మంది ఆడబిడ్డలకు మగబిడ్డ పుడితే 12 వేలు, ఆడబిడ్డ పుడితే 13 వేలతోపాటు కేసీఆర్‌ కిట్లు అందినయి. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కింద 9వేలమందికి 1లక్షా 116 ఇచ్చి పెండ్లి చేసింది. వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, గీతన్నలు.. అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని నియోజకవర్గంలో 43 వేల మందికి పింఛన్లు అందిస్తున్నది.

చండూరు రోడ్‌షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, సీపీఐ నేత పల్లా వెంకట్‌రెడ్డి, పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల

ఇప్పుడు ఈ ఎన్నిక ఎందుకొచ్చింది?
ఈ రోజు మునుగోడు ఉప ఎన్నిక ఎందుకొచ్చింది? ఫ్లోరోసిస్‌ నిర్మూలన కోసం రూ.19 వేల కోట్లు ఇవ్వండని నీతి ఆయోగ్‌ సిఫారసు చేసినా ఇయ్యని మోదీ.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చి.. ఒక నాయకుడిని, ఆయన అన్నగారిని కొనుక్కోవడానికి ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ రోజు వేల కోట్ల కాంట్రాక్టులు పొంది.. వాటితో వచ్చే లాభంతో మునుగోడు ప్రజలను అంగడి సరుకులా కొంటానంటున్న ఒక కాంట్రాక్టర్‌ అహంకారానికి, మునుగోడు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. నాలుగేండ్లపాటు కనపడకపోయినా, ఒక్క సమస్య తీర్చకపోయినా.. హామీలను తుంగలో తొక్కినా.. ‘నాకేం కాదు.. అవసరమైతే ఒక్కొక్క ఓటుకు వేల రూపాయలిచ్చి అయినా కొంటా’ననే డబ్బు మదమున్న రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ప్రజలను తక్కువ అంచనా వేస్తున్నడు. ఈ నాలుగేండ్లలో ఒక్క పనైనా చేసిండా? ఒక్క గ్రామానికైనా వచ్చి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిండా? జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి దగ్గరకు ఒక్కరోజైనా వచ్చి ‘మాకీ పని కావాలె.. ఈ రోడ్డు కావాలె.. ఈ బ్రిడ్జి కావాలె.. ఫలానా ఊర్లో ఇల్లు కావాలె’ అని అడిగే పాపాన పోయిండా?

కేసీఆర్‌ నాయత్వంలో కులవృత్తుల వికాసం..
కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలో కులవృత్తులను గౌరవించింది. యాదవ సోదరులకు 5,765 గొర్రెల యూనిట్లు ఇచ్చింది. నిన్నమొన్న యాదవ సోదరులు మునుగోడు నుంచి మెసేజ్‌లు పెట్టిండ్లు.. ‘అన్నా.. రెండో విడత గొర్ల పంపిణీకి మాకు డబ్బులు పడ్డయి. కానీ ఎందుకో ఫ్రీజింగ్‌ పెట్టిండ్లు. వాపస్‌ పోతయని బీజేపీ ప్రచారం చేస్తున్నది’ అని! వాళ్లు లంగలు.. నమ్మకున్రి. వాళ్లకు ఇచ్చే ముఖం లేదు. ఇచ్చే తెలివి లేదు. గవర్నమెంట్‌ పైసలు ఇచ్చినంక వాపస్‌ తీసుకొంటదా? మీరు వెటర్నరీ డాక్టర్‌ దగ్గరకు పోయి గొర్లు కొనుక్కోవాలె. ఎన్నికలు వచ్చినయి కదా అని దావతులు చేసుకొంటే పైసలు ఒడిసిపోతయని ఫ్రీజ్‌ పెట్టినం. పైసలిచ్చి వాపస్‌ తీసుకొనే సంస్కారం లేని ప్రభుత్వం కాదు. యాదవ సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఏ పైసలైతే మీ ఖాతాలో పడ్డయో.. బరాబర్‌ మీకే ఉంటయి.

బీజేపీకి ఓటేస్తే చేనేతపై 5% ఉన్న జీఎస్‌టీ 12.. 28% ఖాయం
75 ఏండ్లలో చేనేత మీద పన్ను విధించిన మొట్ట మొదటి దుర్మార్గపు ప్రధానమంత్రి, చేనేతకు మరణ శాసనం రాసిన ప్రధాని మోదీ ఒక్కరే. ఈ రోజు 5% జీఎస్టీ వేసిండు. దబ్బన మునుగోడులో బీజేపీకి ఓటేస్తే ఆ 5%.. 12% అయితది. తరువాత 12% కాస్తా 28% అయితది. చేనేత బంద్‌ అయిపోయే రోజు వస్తది. ఆలిండియా హ్యాండ్లూమ్‌ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్‌ బోర్డు, పవర్‌లూం బోర్డు రద్దుచేసిండు. మహాత్మాగాంధీ పేరిట నేతన్నకు ఇచ్చే బున్‌కర్‌ బీమా యోజన తీసిపారేసిండు. కోయలగూడెం, గట్టుప్పల్‌, చండూరు తదితర ప్రాంతాల్లో మా నేతన్నలున్నరు. వారిని ఒక ప్రశ్న అడుగుతున్న. నేత కార్మికులకు పనికొచ్చే ఒక్క పనికూడా చేయని మోదీని గౌరవిద్దామా? లేదా చేనేత మిత్ర పేరుతో మీ కోసం నూలు, రసాయనాల మీద 40% సబ్సిడీ ఇస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గౌరవిద్దామా? నేతన్నకు చేయూత పేరుమీద మీకోసం ఒక రూపాయి వేసుకొంటే.. రెండురూపాయలు ప్రభుత్వం వేసి కరోనా సమయంలో రూ.వంద కోట్లను మీకు అందించిన కేసీఆర్‌ ప్రభుత్వానికి ఓటేద్దామా? నేతన్నకు బీమా తెచ్చి నేతన్నలు చనిపోతే రూ.5 లక్షలు కుటుంబానికి ఏర్పాటుచేసిన కేసీఆర్‌కు ఓటేద్దామా? ఉన్న పథకాలు రద్దు చేసిన మోదీకి ఓటేద్దామా? ఆలోచించండి.

రిజర్వాయర్లకు అడ్డం పడుతున్నదెవరు?
శివన్నగూడెం, లక్ష్మణాపురం రిజర్వాయర్లు కడుతున్నం. ఈ రెండింటిపైనా కేసులు వేసి అడ్డుపడుతున్నదెవరు? కృష్ణాజలాల్లో మన వాటా తేల్చకుండా ఇబ్బంది పెడుతున్నదెవరు? మోదీ కాదా? ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీళ్లల్లో 811 టీఎంసీల నీళ్లు ఉన్నయి. రాష్ట్రం వేరయింది. వాళ్ల హిస్సా వాళ్లకు, మా హిస్సా మాకు ఇవ్వండని అడిగినం. మాది కరువు, ఫ్లోరోసిస్‌ పీడిత ప్రాంతం. 575 టీఎంసీలు ఇవ్వండని కోరినం. మోదీ తలచుకొంటే.. బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయాలె. కానీ 8 ఏండ్ల నుంచి నాన్చి నాన్చి చావకొడుతున్నది మోదీ ప్రభుత్వం. ఎక్కడ కేసీఆర్‌కు మంచి పేరు వస్తదో.. ఎక్కడ రైతులు బాగుపడ్తరో అని ఆగం చేస్తున్నది మోదీ ప్రభుత్వం. వాళ్లను పచ్చి మోసగాళ్లని నేను ఊరకే అంటలేను. మోదీ ఎన్నికల సమయంలో ఏం చెప్పిండు.. మీరు జన్‌ధన్‌ ఖతాలు తెరవండి.. నేను ధనాధన్‌ పంద్రాలాఖ్‌ దేతా అన్నడా? మరి రూ.15 లక్షలు వచ్చినయా? వచ్చినవాళ్లు ఎవరైనా ఉంటే మోదీకి ఓటేయండి. రానివాళ్లంతా టీఆర్‌ఎస్‌కు ఓటేయండి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలన్నడు. అవతల పడ్డడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో మోదీని అడిగితే బయట పకోడీ బండి ఉన్నది.. ఇడ్లీ, మిర్చి బజ్జీల బండి ఉన్నది.. వారందరికీ పని దొరుకుతున్నది కదా.. అది ఉద్యోగం కాదా అని చెప్పిండు. మోదీ చెప్పిన రెండు కోట్ల ఉద్యోగాలు అవేనంట! బాత్‌ కరోడోమే.. కామ్‌ పకోడోమే.. స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనం ఉన్నది గుంజుకొస్త అన్నడు.. ఇప్పుడు తెల్లముఖం వేస్తున్నడు.

కేసీఆర్‌ కంటే పెద్ద హిందువా మోదీ?
ఉద్యోగాలు ఎక్కడయ్యా? అని గట్టిగ అడిగితే.. ‘హిందువువై జీవించు.. హిందువువై గర్వించు’ అంటడు. ఇదివరకేమన్న సిగ్గుపడ్డమా మనం? వాళ్లు వచ్చినంకనే బొట్లు పెట్టుకొంటున్నమా? వాళ్లు వచ్చినంకనే గుడికి పోతున్నమా? వాళ్లు వచ్చినంకనే మనకు దేవుడు తెలుసా? అదివరకు తెల్వదా? దేవుళ్లను కూడా రాజకీయం కోసం వాడుకొంటరు. ఒక్కటే ఆలోచించండి.. పక్కనే ఉన్న యాదాద్రి దేవాలయాన్ని అభివృద్ధి చేసిందెవరు? తిరుమలకు దీటుగా చేసింది ఎవరు? కేసీఆర్‌ కాదా? ఆయన కంటే పెద్ద హిందువా ఈ పోటీ చేసేటోడు? కేసీఆర్‌ కంటే పెద్ద హిందువా మోదీ? మన ఊళ్లె గుడి కడితె మీరు కూడా వందో.. రెండు వందలో చందా రాస్తరు. అట్లనే మనం కూడా మోదీని..అయ్యా నువ్వు పెద్ద హిందువు అంటవు కదా.. మా యాదాద్రి నరసన్నకు గుడి కడుతున్నం.. రూ.వంద కోట్లు ఇయ్యాలని అడిగినం. వంద కూడా ఇయ్యలే. అయన పెద్ద హిందువట! గట్టిగ మాట్లాడితే.. హిందుస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, బబ్బర్‌ఖాన్‌ లాంటి ముచ్చట్లు తప్ప పనికొచ్చే ముచ్చట చెప్పడు.

గురువారం మునుగోడు నియోజకవర్గం చండూరులో మంత్రి కేటీఆర్‌ రోడ్‌షోకు హాజరైన టీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ శ్రేణులు, ప్రజలు

దండుమల్కాపూర్‌లో ఇంటి జాగ..
తెలంగాణలో అతి పెద్ద పారిశ్రామిక సమూహం దండుమల్కాపురంలో 580 ఎకరాల్లో ఏర్పాటుచేసుకొన్నం. 16 వేల మంది పిల్లలకు కొలువులు కల్పించడానికి తెలంగాణలోనే పెద్దదైన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ పెట్టినం. దాదాపు పూర్తికావచ్చింది. కావాలంటే చూసిరావచ్చు. తొందర్లోనే ప్రారంభిస్తున్నం.

గిరిజనుల కల సాకారం చేసిందెవరు?
మునుగోడులో గిరిజన, లంబాడా సోదరులున్నరు. మా తండాలో మా పాలన అన్న పోరాటం ఎన్ని దశాబ్దాలది? ఆనాటి ఆరాటాన్ని తీర్చి.. రాష్ట్రంలో 3146 తండాలను, గూడేలను గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్‌ కాదా? 21 వేల మంది గిరిజన బిడ్డలకు వార్డు మెంబర్లుగా, సర్పంచ్‌లుగా అవకాశం ఇచ్చింది కేసీఆర్‌ కాదా? తండాల్లోనూ త్రీఫేజ్‌ కరెంట్‌ ఇస్తున్నది కేసీఆర్‌ కాదా? తండాల్లో గ్రామ పంచాయతీలకు బిల్డింగులు కట్టిస్తున్నది కేసీఆర్‌ కాదా? జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచింది కేసీఆర్‌ కాదా? కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో పండుకుంటడని ఒకడంటడు. అట్ల పండుకుంటె ఇయ్యాల మిషన్‌ భగీరథ నీళ్లొస్తున్నయా? రైతుబంధు, 24 గంటల కరెంటు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్లు, గొర్లు, గంగపుత్రులు, ముదిరాజ్‌లకు మోపెడ్లు, మోటరైజ్డ్‌ బోట్లు, వలలు, చేపపిల్లలు.. నేతన్నకు చేయూత, చేనేత మిత్ర.. ఇవన్నీ ఉత్తగనే వస్తున్నయా? కేసీఆర్‌ ఇంట్ల పండుకొంటెనే యాదాద్రి అయిందా? తెలంగాణ రాక ముందు 5 మెడికల్‌ కాలేజీలు ఉంటే ఒక్కటి కూడా నల్లగొండలో లేదు. కేసీఆర్‌ వచ్చిన తర్వాత నల్లగొండలో ఒకటి.. సూర్యాపేటలో ఒకటి నడుస్తున్నది నిజం కాదా? అటు చూస్తే యాదాద్రి, ఇటు చూస్తే దామరచర్లలో దేశంలోనే అతి పెద్ద విద్యుదుత్పత్తి కేంద్రం కట్టుకొంటున్నం.

దండుమల్కాపురం భూనిర్వాసితులకు పట్టాలిప్పిస్తా
6న 431 మందికి నేనే పట్టాలిస్తా
మా తమ్ముడు ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి దండు మల్కాపురానికి ఇన్‌చార్జిగా ఉండి నాకు ఒక మాట చెప్పిండు. భూములు కోల్పోయిన 431 మంది నిర్వాసితులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరిండు. ఈ వేదిక మీద నుంచి నా తమ్ముడు జీవన్‌రెడ్డికి చెప్తున్న. ఇది మీ కేసీఆర్‌ ప్రభుత్వం. మన ప్రభుత్వం. నవంబర్‌ ఆరో తేదీ తర్వాత కొత్తగా గెలిచే మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్లగొండ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి నేనే స్వయంగా వచ్చి, ఆ 431 మందికి పట్టాలిప్పించే బాధ్యత నాది.

మునుగోడును దత్తత తీసుకుంట
నారాయణపూర్‌ నుంచి ఇక్కడి దాకా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. రోడ్డు మీద తమ్ముళ్లను అడిగితే ఎట్లున్నది తమ్మీ అంటే ‘బరాబర్‌ గెలుస్తున్నమన్నా’ అని చెప్పిన్రు. అన్నా జర మా రోడ్డు చూడు అన్నరు. నేను మీ అందరికీ ఒక్కటే మాట ఇస్తున్న. మీరు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపిస్తే.. మునుగోడు నియోజకవర్గాన్ని నేను దత్తత తీసుకొంటా. ఎన్నికలకు ముందొకమాట.. తరువాత ఒక మాట కాదు. ప్రతి మూడు నెలలకొకసారి అన్ని అభివృద్ధి కార్యక్రమాలను నేను పర్యవేక్షిస్తా. ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లతో కూర్చుంటం. నాలుగేండ్లలో రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోని మునుగోడును, మీ గోడును విని పరిష్కరించే బాధ్యత మాది. ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క మాటకు కట్టుబడి ఉంట. నవంబర్‌ 3 నాడు మోత మోగాలె.. కారు గుర్తుమీద బ్రహ్మాండంగా ఓట్లు పడేటట్టు బాధ్యత తీసుకోండి. రాజగోపాల్‌రెడ్డి డబ్బులు ఇస్తడంట. అప్పనంగా మోదీ గుజరాత్‌కెల్లి పంపించిన వందల కోట్లు పంచిపెట్టి అంగడి సరుకులాగా మునుగోడు ప్రజలను కొనే ఆలోచన చేస్తున్నడు. మీ ఆత్మ గౌరవానికి, రాజగోపాల్‌రెడ్డి డబ్బు మదానికి, అహంకారానికి మధ్య పోటీ. మోదీ తెలంగాణకు చేసిన అన్యాయానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ఇది పోటీ. మునుగోడు ప్రజలు మీ సత్తా చూపెట్టాలి. సీపీఐ, సీపీఎం కామ్రేడ్లు కలిసివచ్చారు. కమిట్‌మెంట్‌తో గులాబీ, ఎరుపు జెండాలు కలిసి ఢంకా బజాయించి గెలుస్తామనే విశ్వాసం ఉన్నది. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ 15 రోజుల పాటు అవతలి వాళ్లు ఎంత ప్రలోభ పెట్టినా.. కుట్రలు చేసినా.. అన్నింటినీ ఎదుర్కొందాం. బ్రహ్మాండమైన మెజార్టీతో 6వ తారీఖునాడు గులాబీ జెండా రెపరెపలాడేలా చేసుకొందాం.

ప్రధాని టేబుల్‌ మీద ఫ్లోరోసిస్‌ బాధితులు

గతంలో ప్రధానుల టేబుళ్ల మీద ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్థులను తీసుకొని పోయి పండుకోబెట్టినా పరిష్కారం కాని పరిస్థితి. ప్రధానులు కూడా పట్టించుకోని సమస్యకు కేసీఆర్‌ పరిష్కారం చూపారు. 1996లో ఇదే మునుగోడులో.. నల్లగొండ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 400 నామినేషన్లు వేసి ఇక్కడి ప్రజలు దేశం దృష్టిని ఆకర్షించారు. ఫ్లోరైడ్‌ పరిష్కారానికి జల సాధన పోరాటం చేశారు. దుశ్చర్ల సత్యనారాయణ నేతృత్వంలో చాలా ప్రయత్నాలు జరిగినా పరిష్కారం దొరకలేదు. ఈ రోజు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాగునీటి, సాగునీటి గోడు పోయింది.

బీజేపీ వాళ్లు.. పచ్చి మోసగాళ్లు
మునుగోడు అభివృద్ధికి వెయ్యి కోట్లు ఇస్తానని అమిత్‌షా తనకు చెప్పిండని రాజగోపాల్‌రెడ్డి నారాయణపేటలో చెప్పిండు. ఇదే మాటలు బీజేపీ నేతలు దుబ్బాకలో, హుజూరాబాద్‌లో చెప్పిన్రు. ఎక్కడ ఉప ఎన్నికలు వస్తే అక్కడ చెప్పిన్రు. మీకు సుట్టాలుంటే దుబ్బాకకు, హుజూరాబాద్‌కు ఫోన్‌ చెయ్యండి.. ఒక్క పైసా అన్నా కేంద్రం ఇచ్చిందా? అని అడగండి. వాళ్లు పచ్చి మోసగాళ్లు. ఇదే రాజగోపాల్‌రెడ్డి పోయిన ఎన్నిక సమయంలో బిల్డింగ్‌ కట్టిస్తనని, రోడ్డు వేస్తనని చెక్కులిచ్చిండు. అవి బౌన్స్‌ అయినయి. చాలామంది పైసలు బాకీ ఉండి ఆయన చుట్టూ తిరుగుతున్నరు. ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవటానికి దుర్మార్గంగా ప్రవర్తించే నేతలను నమ్ముదామా? లేకపోతే నిజాయతీతో, చిత్తశుద్ధితో, ఈ ప్రాంత రైతన్న, గీతన్న, నేతన్న, యువకులు, మహిళల కోసం పనిచేస్తున్న ప్రభుత్వాన్ని గౌరవిద్దామా?

అసెంబ్లీలో కాంట్రాక్టర్ల బిల్లుల కోసం
అసెంబ్లీలో మైకు దొరికితే ‘కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవు’ అని ఏకైకమాట మాట్లాడేది. మైక్‌ బంద్‌ కాంగనే మా దగ్గరికి వచ్చి ‘అన్నా.. బిల్లులు ఇప్పియ్యే దండం పెడ్త’ అంటడు. మా కంపెనీ దివాలా తీస్తుందంటడు. ఆశ్చర్యమేందంటే రాజగోపాల్‌రెడ్డి ఆయన మాటల్లోనే అడ్డంగ దొరికిపోయిండు. ‘మాది చిన్న కంపెనీ.. అప్పులు చేసి నడిపిస్తన్నం’ అని చెప్పింది ఆయనే. ఇంకోదిక్కేమో.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు మోదీ ఇచ్చిండనీ ఆయనే చెప్తున్నడు. మునుగోడు సోదరులారా ఆలోచించండి. చిన్న కంపెనీకి అంత పెద్ద కాంట్రాక్టు ఇచ్చిన పెద్దలెవరు? దాని వెనుక మతలబేంది? ఆయన్ను, మునుగోడు ప్రజలను డబ్బుతో వశపరచుకొని ఏదో ఒకటి చేసి ఎన్నికల్లో గెలవాలని అహంకారం కాకపోతే ఏంది? ఇది మీ మీద బలవంతంగా రుద్దబడిన ఎన్నిక. మునుగోడు ప్రజలకు అవసరం లేని ఎన్నిక.

మాకు న్యాయం చేసిన నేత కేసీఆర్‌: పుట్టపాక పెద్దమ్మ
ఇక్కడకు వస్తుంటే.. పుట్టపాక రోడ్డు పక్కన ఒక పెద్దమ్మ మా కండువాలు, జండాలు చూసి గుర్తుపట్టి దగ్గరకు వచ్చింది. కేసీఆర్‌ బాగున్నడా అని అడిగింది. అందరి దీవెన తోని వందేండ్లు మంచిగ ఉంటడని అన్న. నువ్వు ఎట్లున్నవు అవ్వా అని అడిగితే.. కాళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులున్నయి కానీ బాగనే ఉన్న కొడుకా అని చెప్పింది. యాడికి పోతున్నవు అని అడిగితే.. అందరం కలిసి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించేతందుకు మునుగోడు ప్రజల ఆశీర్వాదం అడిగేతందుకు పోతున్న అని చెప్పిన. మంచిగ పోయిరా! తప్పకుండ గెలుస్తరు కానీ.. అక్కడ ఉండే ఆడబిడ్డలకు, అక్కచెండ్లెళ్లకు ఒక మాట చెప్పు.. ‘తెలంగాణ రాక ముందు పరిస్థితి.. ఇప్పుడున్న పరిస్థితి వేరు అని చెప్పు’ అన్నది. ఇంట్ల నా కోడలు పిల్ల నన్ను బాగ చూసుకొంటున్నదని చెప్పు. తెల్లారి లేవంగనే చాయ్‌ తాగుతవా? కాఫీ తాగుతవా అంటున్నది. టైంకు గోలీలు ఇస్తున్నది. బాగా మర్యాద ఇస్తున్నది. ఇందుకు కారణం నా పెద్ద కొడుకు కేసీఆరే అని చెప్పు బిడ్డా అని చెప్పింది. పేదింటి పెద్ద యాదమ్మ చెప్పిన మాట ఇది. రెండొందలు వచ్చే పింఛన్‌ను కేసీఆర్‌ పది రెట్లు పెంచి రెండు వేలు చేస్తే.. 22 కోట్లున్న రాజగోపాల్‌రెడ్డికి ఆస్తిని మోదీ పది రెట్లు పెంచి రూ.2200 కోట్లు పెంచిండు. కేసీఆర్‌ పేదోళ్లను పెద్దోళ్లను చేస్తే.. మోదీ పెద్దోళ్లను ఇంకా పెద్దోళ్లను చేస్తున్నడు. రాజగోపాల్‌రెడ్డిని ధనవంతుని చేసి మొత్తానికి నల్లగొండ జిల్లాకేదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నడని చెప్పాలని కోరింది. అమ్మా మీకు మంచినీళ్లొస్తున్నయా? అని అడిగిన. ‘కొడుకా.. ఒకనాడు మునుగోడు నియోజకవర్గం. మర్రిగూడ.. మునుగోడు.. చండూరు.. గట్టుప్పల్‌ పిల్లగాళ్లకు పిల్లనిచ్చేంతందుకు ఆలోచించేది. ఊళ్లె నీళ్లు వస్తున్నయా.. లేవా అని అడిగేది.. మా ఆడపిల్లను ఇస్తున్నం. భద్రంగా చూసుకోవాలె అని చెప్పేది. నీళ్ల కోసం ఆలోచన చేసేది. నా కొడుకు హైదరాబాద్‌ నుంచి వస్తూ వస్తూ ఎల్బీ నగర్‌లో 50 లీటర్ల నీళ్లు డబ్బా పట్టుకొచ్చేది. వారం రోజులు ఆ నీళ్లను భద్రంగా కాపాడుకునేది. ఇప్పుడా బాధలేదు. కేసీఆర్‌ పుణ్యమా అని ఇంటింటికి నల్లా నీళ్లు వస్తున్నవి. ఫ్లోరోసిస్‌ పీడ పోయింది మా ప్రాంతానికి. నడుములు వంకరపోయి.. బొక్కల్లో మూలుగ సచ్చిపోయి.. పిల్లలకు విషం లాంటి నీళ్లు ఇయ్యలేక.. విషం లాంటి తిండిపెట్టలేక. 2 లక్షలమంది మా నల్లగొండ జిల్లాలో జీవచ్ఛవాలుగా మారినం. ఈ రోజు మా మీద ప్రేమతో మాకు న్యాయం చేసిన నాయకుడు. చౌటుప్పల్‌లోనే మిషన్‌భగీరథ పైలాన్‌ కట్టి, అక్కడికి వచ్చి కార్యక్రమాన్ని పూర్తి చేసిన నేత కేసీఆర్‌.. అని మీకు చెప్పమన్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.