Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

30 ఏండ్లకు నీటి ప్రణాళిక

ప్రతి ఇంటికీ నల్లాద్వారా మంచినీరు అందించే పథకానికి తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అనే పేరును ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. ఈ పనులన్నీ పర్యవేక్షించడానికి తెలంగాణ మంచినీటి సరఫరా సంస్థ(లి.) (టీడీడబ్ల్యూఎస్‌సీ) ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇకనుంచి వాటర్ గ్రిడ్ పనులన్నీ ఈ కార్పొరేషన్ ద్వారానే జరుగుతాయి. రాబోయే పదిహేనేండ్ల కాలానికి ఉపయోగపడేలా రూపకల్పన చేసినప్పటికీ.. 30 ఏండ్ల వరకూ మంచినీటిని సరఫరా చేసే వ్యవస్థ సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

KCR-review-on-watergrid-project

-అంత పకడ్బందీగా వ్యవస్థ ఉండాలి -తెలంగాణ తాగునీటి సరఫరా కార్పొరేషన్ ఏర్పాటు -పీఆర్‌శాఖలో 620 మంది ఇంజినీర్ల నియామకం -అన్నిశాఖలు సమన్వయంతో పనిచేయాలి -సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాలు ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలవాలని అన్నారు. ప్రధాన గ్రామాలతో పాటు గిరిజన తండాలు, ఆదివాసీ గుడిసెలు, గంగిరెద్దుల, ఎరుకల వారి గుడిసెలతోపాటు పది ఇండ్లున్న ఆవాసాలకు సైతం మంచినీటిని అందించాలని అధికారులకు స్పష్టం చేశారు. డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులను ఇకనుంచి ప్రతివారం సమీక్షించాలని సీఎం ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు పనులపై సీఎం పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశానికి మంత్రులు టీ. హరీశ్‌రావు,కే తారకరామారావు, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ఐఏఎస్ అధికారులు రేమండ్ పీటర్, ఎస్‌కే జోషి, గోపాల్, జనార్దన్‌రెడ్డి, మిశ్రా, జగదీశ్వర్‌లతోపాటు గ్రామీణాభివృద్ధి, నీటిపారుదలశాఖ, మున్సిపల్‌శాఖ ఇంజినీరింగ్ అధికారులు సత్యనారాయణ, సురేందర్‌రెడ్డి, మురళీధర్ తదితరులు హాజరయ్యారు.

620 మంది ఇంజినీర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్ డ్రింకింగ్ వాటర్ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి కావాల్సిన ఇంజినీర్లను నియమించుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ద్వారా 620 మంది ఇంజినీర్లను నియమించుకోవాలని సూచించారు. సీఎం ఆదేశాలతో త్వరలో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలచేసే అవకాశం ఉంది. సరిపడినంత ఇంజినీర్లు ఉంటేనే పనులు వేగవంతం అవుతాయని సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశంలో అన్నారు. ప్రజలకు తాగునీరు అత్యంత ముఖ్యమైనదని, ప్రజలందరికీ మంచినీళ్లు అందించే విషయాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నదని చెప్పారు. ఈ ప్రాజెక్టును ప్రజలకు అత్యవసరమైనదిగా గుర్తించి, ఈ పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

పైపులైన్ల నిర్మాణానికి త్వరలో ఆర్డినెన్స్ డ్రింకింగ్ వాటర్ పైపులైన్ నిర్మాణానికి సంబందించిన విధివిధానాలను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పైపులను ఉత్పత్తి చేసే కంపెనీలకే పనులు ఇవ్వాలని అధికారులకు సూచించారు. పైపులు వేయడం, జాయింట్లు బిగించడం, వాటిని నిర్వహించడంలాంటి పనులను సదరు పైపులు సరఫరా చేసిన కంపెనీలే పదేండ్లపాటు చూసుకునేలా బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ప్రాజెక్టు ప్రతి దశలో హైడ్రాలిక్ పరీక్షలు నిర్వహించాలన్నారు.ఇన్‌టేక్ వెల్ నిర్మాణానికి, ప్రాజెక్టులనుంచి నీటిని కేటాయించే విషయంలో పూర్తి స్థాయిలో సహకరించాలని నీటిపారుదలశాఖ అధికారులను సీఎం ఆదేశించారు.

మే చివరి నాటికి ఇన్‌టేక్ వెల్స్ అడుగుభాగం నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. పైపులైన్ నిర్మాణానికి సంబంధించిన రైట్ ఆఫ్ వేను కూడా ఖరారు చేశారు. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేయాలని నిర్ణయించారు. ప్రతి ఇంటికీ మంచినీటి పైపులైన్లు వేసే బాధ్యత ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులదేని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. పైపుల నాణ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పైపులనే వాడాలన్నారు.

ఆటవీశాఖ భూములను అభివృద్ధి పనులకు ఉపయోగించుకునే విషయంలో దేశవ్యాప్తంగా కొత్త విధానం కూడా అమలులోకి రానున్నదని అధికారులకు సీఎం తెలిపారు. రాష్ట్రంలో లక్ష ఎకరాల భూమిని సేకరించి, ఆటవీశాఖకు నష్టపరిహారంగా అందించేందుకు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని, అటవీభూముల్లో జరిగే అభివృద్ధి పనులకు సహకరించాలని ఆటవీశాఖ అధికారులను సీఎం కోరారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

పట్టణాల్లో పైపుల నిర్మాణం బాధ్యత మున్సిపాలిటీలదే డ్రింకింగ్ వాటర్ పథకం ద్వారా పట్టణప్రాంతాలకు సురక్షిత మంచినీరు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణాలలో వివిధ వాడలకు నీటిని తరలించేందుకు అవసరమయ్యే ఇంటర్నల్ పైపులైన్‌లను ఆయా మున్సిపాలిటీలు నిర్మించుకునే బాధ్యత మున్సిపాలిటీలదేనని స్పష్టంచేశారు. నీటి సరఫరా సక్రమంగా జరిగేందుకు పట్టణాల సమీపంలోని గుట్టలను ఉపయోగించుకోవాలన్నారు. పట్టణాల్లో కాంటూరు లెవల్స్ కూడా తీసుకొని పైపుల నిర్మాణం చేపట్టాలని సూచించారు.

రైల్వే జీఎంతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం గోదావరినుంచి హైదరాబాద్‌కు మంచినీళ్లను తరలించే క్రమంలో మూడు చోట్ల రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తుందని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. రైల్వేశాఖనుంచి ఈ మేరకు అనుమతులు తీసుకోవాలన్నారు. దీంతో సీఎం కేసీఆర్ వెంటనే దక్షిణ మధ్య రైల్వే జీఎం శ్రీవాత్సవతో ఫోన్‌లో మాట్లాడారు. తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డ్రింకింగ్ వాటర్ పథకానికి సహకరించాలని, పైపులైన్లు రైల్వే ట్రాక్‌ను దాటే చోట్ల త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని కోరారు. దీనికి రైల్వే జీఎం సానుకూలంగా స్పందించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.