Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మురిసిన గోల్కొండ

-ఎగిసిన మువ్వన్నెల జెండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి స్వాతంత్య్ర దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక గోల్కొండ కోటలో శుక్రవారం ఘనంగా నిర్వహించింది.

KCR

స్వాతంత్య్రం అనంతరం గోల్కొండ కోటలో ప్రభుత్వ హయాంలో జరిగిన మొట్టమొదటి వేడుకలు కావడంతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో రూపొందిన కళారూపాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ కళారూపాలైన పేరిణి శివతాండవం, చిందు, యక్షగానం, కొమ్ముకోయ నృత్యం, గుస్సాడి నృత్యం, లంబాడా నృత్యం, డప్పు నృత్యం, ఒగ్గుడోల్ల విన్యాసం, కొమ్ముబూర, మంద హెచ్చుల, ముజ్ర నృత్యం, ఖవ్వాలి, షెహ్రి బాజా వంటి కళా రూపాలను ప్రదర్శించారు. శుక్రవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేయగా, అంతకుముందు గంటపాటు కళా ప్రదర్శనలు సాగాయి.

మందహెచ్చుల కళా రూపాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గుర్తు చేసి ఏర్పాటు చేయాలని చెప్పారని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ రాళ్ల బండి కవితా ప్రసాద్ తెలిపారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కోటలోని రాణిమహల్‌లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జాతీయజెండాను ఆవిష్కరించారు. గోల్కొండ కోటను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేయడంతో అధికారులు, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. కోటలోపల, బయట అధికారులు మూడు రంగుల జెండాలను, బెలూన్లను, బ్యానర్లను ఏర్పాటు చేయడం ఆహుతులను ఆకట్టుకుంది. సీఎం పతాకావిష్కరణ అనంతరం విద్యార్థులు మూడు రంగుల బెలూన్లను గాలిలోకి వదలడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. -స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఉదయం ఏడు గంటలనుంచే గోల్కొండ కోటకు సందర్శకుల రాక ప్రారంభమైంది. -ఉదయం 8గంటలకు సాంస్కృతిక, కళారూపాల ప్రదర్శన ప్రారంభమైంది. -ముందుగా ఒగ్గు కళాకారులు, డప్పు కళాకారులు, షేర్‌బ్యాండ్, మర్ఫా, ముజ్రా, ఖవ్వాలి బృందాలు ప్రదర్శనలు చేశారు. -కోటలోని రాణిమహల్ వద్ద ఉదయం 9ః30గంటలకు జాతీయ జెండాను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించారు. -గౌరవ వందనాన్ని స్వీకరించడంతోపాటు పోలీసు అధికారులకు మెడల్స్, క్రీడాకారులకు నగదు పురస్కారాలు అందజేశారు. -ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి దేశకీర్తి, తెలంగాణ ప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింపజేసిన మాలవత్ పూర్ణ, ఆనంద్‌లకు సన్మానిస్తున్నప్పుడు.. అతిథులందరూ నిల్చుని అభినందనలు తెలపాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. -ఆనంద్‌ను సన్మానించిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ అతడికి ముద్దుపెట్టి అభినందించారు. -వీరికి శిఖరాలను అధిరోహించడానికి తర్ఫీదునిచ్చిన శేఖర్‌బాబును 25 లక్షల రూపాయల నజరానాతో సన్మానించారు. -తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన మహిళలకు మూడు ఎకరాల భూమి కేటాయింపు పట్టాలను ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అర్హులకు అందజేశారు. -వేడుకలకు వచ్చే అతిథుల కోసం ఫతేదర్వాజ, బంజారీదర్వాజా, గోల్కొండ దవాఖాన తదితర ప్రాంతాల్లో పార్కింగ్‌ను ఏర్పాటు చేశారు. -చోటా బజార్‌లో నుంచి గోల్కొండ వైపుకు సామాన్య ప్రజలను అనుమతించారు. కోట ఎదురుగా ఉన్న జీహెచ్‌ఎంసీ వార్డు కార్యాలయం వరకు మాత్రమే సామాన్యులను అనుమతించిన పోలీసులు అక్కడి నుంచి కేవలం పాస్‌లు ఉన్న వారినే కోటలోకి పంపారు. -సభలో ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మేయర్ మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్యేలు అహ్మద్ పాషాఖాద్రి, ముంతాజ్‌ఖాన్ బలాలా, కౌసర్ మొయినుద్దీన్ ఒకేచోట కూర్చోని అందరినీ ఆకర్షించారు.

-గోల్కొండ కోట బయట, కోట లోపల భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. -వేడుకలను తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చినా.. పాస్‌లు లేక కొందరు కోట బయటనే ఉండి పోవాల్సి వచ్చింది.

అమర జవాన్లకు కేసీఆర్ నివాళులు పికెట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సైనిక అమరుల స్థూపం వద్ద స్వాతంత్య్రదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా విచ్చేసి అమర జవాన్ల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో లెప్టినెంట్ జనరల్ గురుముఖ్‌సింగ్, మేజర్ జనరల్ సీఏ పితావాలా, ఎయిర్‌వైస్ మార్షల్ డీ పూపట్, బ్రిగేడియర్ దిలీప్‌సింగ్, లెప్టినెంట్ జనరల్ (రిటైర్డ్) కేఆర్ రావు, డీఎండీయూ డైరెక్టర్ రియర్ అడ్మిరియల్ కే శ్రీనివాస్, రక్షణ శాఖ అధికారులు అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి స్మిత సబర్వాల్ పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.