-రెండోరోజూ ఉత్సాహంగా చీరెల పంపిణీ.. -సంతోషంగా అందుకున్న అతివలు.. -పలుచోట్ల పాల్గొన్న మంత్రులు
బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం రెండోరోజూ అట్టహాసంగా సాగింది. మంగళవారం పలువురు మంత్రులు ఆయా జిల్లాల్లో చీరెలను పంపిణీ చేశారు. తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం చీరెలను పంపిణీ చేయడాన్ని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్ష పార్టీల నేతలు చీరెలు తగులబెడుతున్నారని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాంనగర్లో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ముఠా గోపాల్, కార్పొరేటర్ వీ శ్రీనివాస్‌రెడ్డిలతో కలిసి హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.
చీరెలను తగులబెట్టిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నాయిని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా పాతబాన్సువాడలో, నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, మహ్మద్ షకీల్‌తో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ పెద్దన్నలా వ్యవహరిస్తున్నారని, అందుకే బతుకమ్మ చీరెల పంపిణీకి శ్రీకారం చుట్టారని చెప్పారు. తెలంగాణ ఆడపడు చులకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తుంటే ప్రతిపక్షాలు భయంతో వణికిపోతున్నాయని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.నిర్మల్ జిల్లా మంజులాపూర్, మాదాపూర్ గ్రామాల్లో ఆయన బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో 1.04 కోట్ల మందికి బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ లకా్ష్మరెడ్డి చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్, నవాబుపేట, నాగర్‌కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలాల్లో ఆయన బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగకు పంపిణీ చేసే చీరెలపైనా ప్రతిపక్షాలు దుర్బుద్ధిని చాటుకున్నాయని విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి విమర్శించారు.
సూర్యాపేటలోని మార్కెట్ యార్డులో ఆయన మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని ఆడపడుచులు సీఎం కేసీఆర్‌ను అన్నలా ఆదరిస్తున్నారని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా హవేళీ ఘనపురంలో ఆమె బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. అతివలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరెలను పంపిణీ చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కూకట్‌పల్లిలో చీరెలు పంపిణీ చేశారు.తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సికింద్రాబాద్‌లోని మోండామార్కెట్ పరిధిలో ఆయన బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. తెలంగాణ పండుగలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రపంచస్థాయి ఖ్యాతి తెచ్చిందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ చెప్పారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కిస్మత్‌పురాలో ఆయన బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.
అన్నివర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆశయమని ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు అన్నారు. సికింద్రాబాద్‌లోని అడ్డగుట్ట కమ్యూనిటీ హాలులో ఆయన బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. బతుకమ్మ చీరెలు నాణ్యతతోనే ఉన్నాయని రాష్ట్ర చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజారామయ్యర్ అన్నారు. హైదరాబాద్‌లోని రాంనగర్లో అతివలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. వివేకానందనగర్, అల్విన్కాలనీల్లో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు.