-పెళ్లిళ్లకు రూ.51వేలు సాయం -పాత్రలు అందించే పథకానికి ఫుల్‌స్టాప్ -అదనంగా రూ. 26 వేలు కలిపి బ్యాంకుల్లో జమ -కళ్యాణ లక్ష్మి పథకానికి కూడా మరో వెయ్యి జోడింపు
రాష్ట్ర ప్రభుత్వం మరో సంక్షేమ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. పేద ముస్లిం యువతుల పెళ్లికి ప్రభుత్వం రూ.51వేలను చెక్కు రూపంలో అందించాలని నిర్ణయించింది. 2008లో అప్పటి ప్రభుత్వం మాస్ మ్యారేజేస్ ఆఫ్ పూర్ ముస్లిం గర్ల్స్ పేరుతో ఒక పథకం ప్రవేశపెట్టింది. దానికింద రూ.15వేలతో పెళ్లి నజరానా కింద కొన్ని వస్తువులు కొని అందించేవారు. 2012లో ఆ మొత్తాన్ని రూ.25 వేలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
పెరిగిన మొత్తంతో సైతం వస్తువులు, ఇంట్లోకి అవసరమైన సామాను మాత్రమే కొనిచ్చేవారు. ఈ వస్తువుల కొనుగోలుకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆ పథకంలో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయి. దరఖాస్తుల స్కృటినీ నుంచి వస్తువుల కొనుగోలు వరకు అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వచ్చాయి.
నాసిరకం వస్తువులు ఇవ్వడం, అందులోనూ సరైన సమయానికి అందించకపోవడం, స్కీంను వర్తింపచేస్తున్నందుకు అధికారులకు లంచాలు ఇవ్వడం వంటి సమస్యలు తలెత్తి పథకం లక్ష్యం పక్కదారిపట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని సంపూర్ణంగా సమీక్షించింది. ఈ స్కీంకు కొత్తరూపును తెచ్చేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.25 వేల మొత్తానికి మరో 26వేల రూపాయలను కలిపి నేరుగా పెళ్లికూతురుకే అందించే పథకానికి రూపకల్పన చేశారు.
పెరిగిన మొత్తంతో కలిపి రూ.51వేలను చెక్కు రూపంలో పెళ్లి కూతురు పేర బ్యాంకులో జమ చేస్తారు. దీనివల్ల ఎలాంటి అక్రమాలకు చోటు ఉండబోదని అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త పథకానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త పేరును పెట్టేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఈ పథకానికి ఎలాంటి పేరును రూపొందించాలనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన కళ్యాణలక్ష్మికి అదనంగా మరో వెయ్యి రూపాయలను జోడించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి దళిత, గిరిజన యువతి పెళ్లికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకం కింద రూ.50 వేలు ఇవ్వాలని క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని దసరా నుంచి అమలు చేయనున్నారు.అయితే రూ.50000లో నాలుగు సున్నాలున్నాయని, ఒక శుభకార్యానికి ఈ నగదు ఇచ్చేటప్పుడు ఇన్ని సున్నాలు, చివరన సున్నా ఉండడం భావ్యం కాదని గుర్తించారు. దీంతో దానికి మరో వెయ్యి రూపాయలు కలిపి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే కళ్యాణ లక్ష్మీకి రూ.51వేల చెక్కును పెండ్లి సమయంలో అందించనున్నారు.