-ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతాం -బడ్జెట్‌లో ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం -ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్

విద్య, ఉపాధి రంగాలలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లు కచ్చితంగా అమలుచేస్తామని తెలిపారు. రంజాన్ మాసం పురస్కరించుకుని శుక్రవారం రాత్రి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ మహమ్మద్ సలీం ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనారిటీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లింల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, శాసన మండలి చైర్మన్ కే స్వామిగౌడ్, రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, భారీ నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం మహేందర్ రెడ్డి, మాజీ శాసనసభ్యుడు నోముల నర్సింహయ్య తదితరులతో పాటు పలువురు ముస్లిం మత పెద్దలు, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.