Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

మ్యానిఫెస్టివల్

యువతకు కొండంత బలం.. వృద్ధులకు రెండింతల ఆసరా.. సాగు కష్టాలకు చరమగీతం.. నిరుపేదలకు డబుల్ భరోసా.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించిన టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టోను చూసిన రాష్ట్ర ప్రజల అభిప్రాయమిది. మ్యానిఫెస్టో అంటే ప్రజలకు మాట ఇచ్చుడే కాదు.. నిలబెట్టుకున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.

2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడంతోపాటు..అదనంగా కనీవినీ ఎరుగని ప్రజా సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి సుపరిపాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్‌ది. తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విపక్షాలు అడ్డగోలు హామీలిచ్చినా ప్రజలు నమ్మలేదు.. గతంలో వారు హామీలిచ్చి గాలికొదిలేసిన తీరు గుర్తుకొచ్చింది. అందుకే.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే సీఎం కేసీఆర్ ప్రకటించే మ్యానిఫెస్టో కోసం రాష్ట్రమంతా ఆసక్తిగా ఎదురుచూసింది.

ప్రతిపక్షాల అంచనాలను తలకిందులు చేస్తూ.. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ సీఎం కేసీఆర్ పాక్షిక మ్యానిఫెస్టోలో అద్భుత వరాలను ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేసే హామీలను ఇచ్చారు. రుణమాఫీ, రైతుబంధు పెంపు.. వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి పూర్తిగా బయటపడవేస్తాయనే భరోసా ఇచ్చాయి. పింఛన్ల పెంపు.. అర్హత వయస్సు తగ్గింపుతో వృద్ధులు, వికలాంగులు, ఇతర లబ్ధిదారుల జీవనప్రమాణాలు మెరుగుపడనున్నాయి.

ఎస్సీ, ఎస్టీ, బీసీలను కండ్లల్లో పెట్టుకొని చూసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. ఓసీల్లోని పేదలకూ ప్రయోజనం చేకూర్చుతుందని కార్పొరేషన్ల ప్రకటన స్పష్టం చేస్తున్నది. దేశానికే ఆదర్శంగా నిలిచిన డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకం విస్తరణతో.. పేదల కనీస అవసరాలన్నీ తీరనున్నాయి. జీవన ప్రమాణాలు పెరుగనున్నాయి. నిరుద్యోగ భృతి ప్రకటన యువతలో మనోధైర్యాన్ని నింపింది. మొత్తంగా.. దేశంలో పెద్ద ఎత్తున సంపదను సృష్టించడమే కాదు..ఆ సంపదను అంతేస్థాయిలో ప్రజలకు పంచుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలువబోతున్నది.

రూ.లక్ష వరకు పంటరుణం మాఫీ
టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో రైతుసంక్షేమాన్ని ప్రతిబింబించేదిగా ఉన్నదని యావత్ రైతాంగం హర్షం వ్యక్తంచేస్తున్నది. రూ.లక్షలోపు రుణమాఫీ, రైతుబంధు పెట్టుబడి సాయం ఎకరానికి ఏడాదికి రూ.10 వేలకు పెంపు, రైతుసమన్వయ సమితులకు గౌరవ భృతి కల్పిస్తామని హామీ ఇవ్వడం పట్ల రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణ మాఫీ ప్రకటించిన సీఎం కేసీఆర్.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఏడాది నుంచే రూ.4వేలకోట్ల చొప్పున నాలుగు దఫాల్లో రూ.16,124 కోట్లను మాఫీచేసి తన నిజాయితీని నిరూపించుకున్నారు. దీనివల్ల 35 లక్షల మంది రైతులు బ్యాంకు రుణాల నుంచి విముక్తిపొందారు. అనంతరం కొత్త రుణాలను సకాలంలో అందజేశారు. బ్యాంకు రుణాలు మాఫీ చేయడంతో పాటు.. సబ్సిడీపై ఎరువులు, విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా గడిచిన నాలుగేండ్లు సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కొత్త మార్కెట్లను ఏర్పాటు చేశారు. రైతులు పడిగాపులు పడకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి మద్దతు ధరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేపట్టారు.

42,00,000 మందికి ఈసారి లబ్ధి
రూ.లక్ష లోపు రుణం తీసుకున్నవారు 42 లక్షల మంది ఉంటారన్నది ఒక అంచనా. వీళ్లందరికీ ఏలాంటి ఇబ్బంది లేకుండా రుణమాఫీకి ఏర్పాట్లు చేయనున్నారు రైతుబంధు కేసీఆర్. మూడేండ్లు వ్యవసాయాన్ని చక్కదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించినప్పటికీ.. నాలుగో ఏడాది ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా రైతుకు ఎకరానికి ఏడాదికి రూ.8,000 వ్యవసాయానికి ముందస్తు పెట్టుబడి అందించేందుకు రైతుబంధు పథకాన్ని అమలుచేశారు. పథకాన్ని రూపొందించడమే కాకుండా.. ఇందుకోసం 2017-18 వార్షిక బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లను కేటాయించారు.

ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి సరికొత్త పథకం
రైతుబంధుకు పెంచిన రెండువేల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.రెండువేల కోట్లు అదనంగా రైతులకు లభిస్తుంది. వీటితో పాటు రాష్ట్రవ్యాప్తంగా మూడు స్థాయిల్లో ఏర్పాటు చేసిన రైతుసమన్వయ సమితిల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు గౌరవ భృతిని ఇవ్వనున్నట్లు కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.60 లక్షల మందికి ప్రయోజనం లభిస్తుంది.

టీఆర్‌ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో ఎస్సీ, ఎస్టీ వర్గాల అభివృద్ధికి ఒక వినూత్న పథకాన్ని చేపట్టబోతున్నది. పేదల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్న క్రమంలో ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నది. ఏళ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని దళిత, గిరిజనుల ఆర్థిక ప్రగతికిగాను పలు సంక్షేమ కార్యక్రమాలను టీఆర్‌ఎస్ నాలుగేండ్ల పాలనలో ఇప్పటికే వినూత్నంగా అమలుచేయడం చూశాం. వారి ఆత్మగౌరవం నిలిపే విధంగా ప్రభుత్వ వార్షిక బడ్జెట్‌లో కూడా అధిక మొత్తాన్ని కేటాయించారు. ఈ పంథాలోనే ఆ వర్గాల కోసం మరొక విశేష పథకాన్ని టీఆర్‌ఎస్ తన మ్యానిఫెస్టోలో ప్రతిపాదిస్తున్నది.

తరతరాలుగా అణచివేతకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీలకు కొత్త పథకం ఎంతో చేయూతనివ్వగలదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గొర్రెల పంపిణీ పథకం మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు ఆర్థిక ప్రగతిని సాధించేలా కొత్త ప్రత్యేక పథకం ఉండాలని, ఆ మేరకు సీఎం కేసీఆర్ దృష్టి నిలిపినట్టు చెబుతున్నారు. ఎస్సీల అభివృద్ధికి రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్లు, గిరిజనులకు రూ.6వేల కోట్ల నుంచి రూ.10వేల కోట్లు ఖర్చు చేసే పద్ధతిలో ఈ పథకాన్ని రూపొందించనున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో తుదిరూపునకు వచ్చేటప్పటికీ ఈ పథకాన్ని అందులో చేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు. దీనిని సమగ్రంగా రూపొందించడానికి పార్టీ వర్గాలు కృషి చేస్తున్నాయి. రాములుతోపాటు మరికొంతమందితో ఇందుకోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేశారు.

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి పలు పథకాలు
ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ సర్కారు ఇప్పటికే పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్న ది.ప్రధానంగా సబ్సిడీ రుణ పంపిణీ పథకం, నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు, భూపంపిణీ పథకం, స్టడీ సర్కిళ్ల ద్వారా నిరుద్యోగులకు శిక్షణ, 50 యూనిట్ల వరకు విద్యుత్ వాడకానికి బిల్లు చెల్లింపు, ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్స్, ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్వహణ, విదేశీ విద్యానిధి పథకం, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం, అట్రాసిటీ బాధితుల సహాయం వంటి పథకాలను అమలు చేస్తున్నది.

శాశ్వతాభివృద్ధే మా లక్ష్యం!
దళిత, గిరిజన కుటుంబాలు శాశ్వత ప్రాతిపదికన ఆర్థికాభివృద్ధి సాధించాల న్న ఆకాంక్షతో సీఎం కేసీఆర్ వినూత్న కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. గొర్రెల పంపిణీ పథకం మాదిరిగా ఎస్సీ, ఎస్టీల కోసమూ ఒక వినూత్న పథకం అమలు చేస్తే తెలంగాణలోని అన్ని దళిత, గిరిజన కుటుంబాలు ఆర్థిక ప్రగతిని సాధిస్తాయి. ఈ పథకం అమలుపై ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ త్వరలో సమావేశం కానుంది. అందరి సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత కొత్త పథకానికి ఒక తుది రూపాన్ని ఇస్తాం. – పీ రాములు, టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ సభ్యుడు

అద్భుత ఆసరాతో అమితానందం!

వయోవృద్ధులకు తెలంగాణ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎంతో ఇటీవలి సీఎం కేసీఆర్ పింఛన్ పెంపు ప్రకటనతో తేటతెల్లమైంది. ఇంటికి భారంగా భావించే వృద్ధులు, దివ్యాంగులు ఇప్పుడు ప్రభుత్వానికి సైతం పెద్దదిక్కుగా నిలుస్తున్నారంటే అది ఆయన విశాలదృష్టికి నిదర్శనం. సీఎం కేసీఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయాలతో ఆసరా పింఛన్లు పొందుతున్న పెద్దల గౌరవం మరింత ఇనుమడిస్తున్నది. ఉమ్మడి పాలనలో రూ. 200 పింఛన్ ఇవ్వడమంటే పెద్ద ఇబ్బందిగా భావించే పరిస్థితి వుండేది. అదికూడా నాలుగైదు నెలలకోసారి. ఏ నెలదో, రెండు నెలలదో చేతుల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కానీ, టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక సీఎం కేసీఆర్ వృద్ధులకు, దివ్యాంగులకు పెద్ద కొడుకుగా మారిన అద్భుతానందాన్ని ప్రజలు చవిచూస్తున్నారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లను ఊహించని విధంగా పెంచారు. రూ. 200 పింఛన్లను రూ. 1000కి పెంచారు. దివ్యాంగులకు ఇచ్చే రూ. 500 పింఛన్లను రూ. 1,500లకు పెంచారు. ఇప్పుడు మరింత చేయూతనిచ్చేందుకు ఆయన తాజా నిర్ణయం తీసుకోవడం విశేషం.

అలవికాని ఆనందం
తాజాగా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన మేరకు పింఛన్లను కేసీఆర్ ఏకంగా రెండింతలకు పెంచారు. దీంతో ప్రభుత్వ ఖజానాపై ప్రతి నెలా వందల కోట్లు వ్యయమైనా ఆయన సాహాసోపేత నిర్ణయం తీసుకున్నారు. అభాగ్యులకు అండగా నిలిచేందుకు ఎంత వ్యయమైనా భరించేందుకే ఆయన సిద్ధమయ్యారు. ఇక, వారి వయసును 57 ఏండ్ల వయోపరిమితికి తగ్గించడంతో రాష్ట్రంలో ఆసరా పింఛన్లు తీసుకునే వారి జాబితా మరింత పెరుగనుంది. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో ఇదే అంశానికి పెద్ద పీట వేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తాజాగా ప్రకటించారు. దీంతో ఆసరా పింఛన్‌దారుల్లో అలవికాని ఆనందం నెలకొంది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పింఛన్లు అందుకుంటున్న వారి సంఖ్య 39 లక్షలు దాటింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంతమంది లేరు. కానీ, తెలంగాణ రాష్ట్రంలో అర్హులందరికీ పింఛన్లు ఇచ్చేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అమల్లో పెట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు ఇవ్వగా సీఎం కేసీఆర్ జాబితాలో మరింత మందిని చేర్చారు. ఇప్పటికి మొత్తం 39,52,410 మందికి సర్కారు పింఛన్లు ఇస్తున్నది. వీరిలో 4,92,587 మంది దివ్యాంగులున్నారు.

అదనపు వ్యయం రూ.426 కోట్లు
రాష్ట్రంలో దివ్యాంగులకు ప్రస్తుతం రూ. 1,500 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. తెలంగాణ సర్కారు అధికారంలోకి రాగానే వీరికి రూ. 3,016 చొప్పున ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ తాజా నిర్ణయం తీసుకున్నారు. మ్యానిఫెస్టోలో దీనిని చేర్చారు. ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న వారి సంఖ్య 4,92,587. ఇప్పటి వరకు రూ. 1,500 చొప్పున రూ. 73.88 కోట్లను చెల్లిస్తున్నారు. కానీ, పింఛన్ రెండింతలుగా పెంచనుండటంతో మరో రూ. 74.67 కోట్లు అదనంగా భారం ప్రభుత్వం మోయాల్సి వస్తుంది. ఈ లెక్కన ప్రతి నెలా దివ్యాంగులకు రూ. 148.56 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆసరా పింఛన్లతో ప్రభుత్వం అదనంగా భరించాల్సిన వ్యయం రూ. 426.57 కోట్లు.

ఇక 57 ఏండ్ల వారికీ పింఛన్
రాష్ట్రంలో ఆసరా పింఛన్‌దారుల జాబితా మరింత పెరుగనుంది. అర్హులైన వారి వయోపరిమితిని తగ్గిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం 60 ఏండ్లు పైబడిన వారికే పింఛన్ ఇస్తున్నారు. కానీ, వచ్చే ప్రభుత్వంలో 57 ఏండ్లు పైబడిన వారికీ పింఛన్లు ఇస్తామని ఆయన తాజాగా ప్రకటించడంతో అర్హుల జాబితా పెరుగనుంది.

నిరుద్యోగులకు పూర్తి భరోసా.. అమలుకు ప్రణాళిక
ఉన్నత చదువులు చదివినా సరైన ఉద్యోగం రాక, ఉపాధి దొరుకక నిరాశలో కొట్టుమిట్టాడుతున్న నిరుద్యోగ యువతకు టీఆర్‌ఎస్ ప్రత్యేక భృతిని ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో దాదాపు 12 లక్షల మందికి నిరుద్యోగభృతి లభించనున్నది. పకడ్బందీగా నిరుద్యోగభృతిని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నది. దేశంలో ఇప్పటికే దాదాపు పది రాష్ర్టాలు నిరుద్యోగభృతిని అమలు చేస్తున్నప్పటికీ, అంతగా విజయవంతం కాలేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. కానీ తెలంగాణలో పక్కాగా అమలు చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్థిక శాఖను ఆదేశించారు. దీనిపై విశ్లేషణ జరిపి నివేదిక ఇచ్చిన తరువాతే ముఖ్యమంత్రి ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగభృతిని ప్రకటించారు. అది కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అమలు చేస్తామని వెల్లడించారు.

ప్రస్తుతం దేశంలో గోవా, ఉత్తరప్రదేశ్, కేరళ,తమిళనాడు, మహారాష్ట్ర,కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ర్టాలలో నిరుద్యోగ భృతి అమలులో ఉన్నది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల అక్టోబర్ 2నుంచి నిరుద్యోగభృతిని ఇస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు రెండు వేల రూపాయల భృతిని ప్రకటించిన టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేండ్లు గడిచినా దానిని అమలు చేయలేదు. మిగతా రాష్ర్టాలలో కూడా ఇది నామమాత్రంగానే అమలవుతున్నది. గోవా రాష్ట్రంలో లక్షా20వేల మందికి 3వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతినిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లో 96వేల నిరుద్యోగులకు గాను 10వేల మందికి మాత్రమే భృతి అందుతున్నట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఇక కేరళ,త్రిపుర, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలలో వేయి నుంచి 1500మంది కి మాత్రమే నామమాత్రంగా భృతి అందుతున్నట్లు ప్రకటించింది.

టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా 50వేల ఉద్యోగాలు, వివిధ రకాల పరిశ్రమలు,ఐటీ ద్వారా దాదాపు 7లక్షల మంది యువతీ,యువకులకు ఉద్యోగావకాశాలు లభించాయి. రాష్ట్రంలో పది నుంచి 12లక్షల మంది ఇంకా నిరుద్యోగులు ఉండే అవకాశముందని అధికారులు లెక్క వేశారు. వారందరికీ నెలకు 3,016రూపాయల నిరుద్యోగ భృతిని ఇవ్వడానికి ముఖ్యమంత్రి అంగీకరించారు. దీనికి గాను బడ్జెట్‌లో నెలకు రూ.360కోట్లు సంవత్సరానికి దాదాపు రూ.4,300 కోట్ల రూపాయలను కేటాయించాల్సి ఉంటుందని అధికారులు లెక్క గట్టారు. శాస్త్రీయ లెక్కల ఆధారంగా ముఖ్యమంత్రి ఈ భృతిని ప్రకటించారు.

నిరుద్యోగులకు భరోసా
ఇన్నాళ్లూ ఏ ప్రభుత్వాలు కూడా నిరుద్యోగుల పరిస్థితిని గుర్తించలేదు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలో నిరుద్యోగ భృతి కింద రూ. 3016 ఇస్తామని పేర్కొనడం హర్షణీయం. నాలుగున్నరేళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మ్యానిఫెస్టోను సిద్ధం చేయడం గొప్పవిషయం. – కిశోర్‌గౌడ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు

కేసీఆర్ వెంటే మేమంతా
రైతులకు సీఎం కేసీఆర్ ఎకరానికి రూ.8 వేలు ఇచ్చారు. రూ.10వేలకు పెంచుతున్నట్టు ప్రకటించారు. రైతు బీమా అమలుచేస్తున్నారు. రూ.లక్ష రుణం మాఫీ చేస్తానన్నారు. రైతుకు అండగా నిలబడిన సీఎం కేసీఆర్ వెంటే మేమంతా ఉంటాం. – చెవ్వా నర్సిరెడ్డి, కందుల వారిగూడెం, సూర్యాపేట జిల్లా

జన్మంతా రుణపడి ఉంటాం
ఇవాళ సీఎం కేసీఆర్ ప్రభుత్వం పింఛన్‌ను రూ. 3016కు పెంచుతున్నది. అంతేకాదు, సంక్షేమ పథకాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లల్లో 5 శాతం రిజర్వేషన్ కూడా కల్పిస్తున్నారు. దివ్యాంగుల సంక్షేమం కోరే ఇలాంటి ప్రభుత్వం మరేదీ లేదు. మేమంతా సీఎం కేసీఆర్‌కు జన్మంతా రుణపడి ఉంటాం. – కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, వికలాంగుల సహకార సంస్థ ఛైర్మన్

మ్యానిఫెస్టో చారిత్రాత్మకం
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల పాక్షిక మ్యానిఫెస్టో అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉన్నది. ఉద్యోగులకు ఐఆర్‌తో పాటు పీఆర్‌ను ఇస్తామని ప్రకటించడం, చిరుద్యోగులకు ఉద్యోగ భరోసానివ్వడం స్వాగతించదగ్గది. రైతుబంధుతో పాటు రైతులకు రూ.లక్షలోపు రుణాల మాఫీ, పింఛన్ల రెట్టింపు వంటి హామీలు టీఆర్‌ఎస్ సంక్షేమ బాటకు నిదర్శనం. నిరుద్యోగభృతి 3,016గా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం. -దేవీ ప్రసాద్, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్

అన్ని వర్గాల మద్దతు
ప్రజల క్షేమాన్ని కోరే విధంగా ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్ పార్టీకి నాయూ బ్రాహ్మణుల మద్దతు ఎప్పటికీ ఉంటుంది. రుణమాఫీతో రైతులు, నిరుద్యోగ భృతితో చదువుకున్న యువత, పింఛన్‌తో వృద్ధులకు మరింత చేయూత అందించాలని నిర్ణయించడం గొప్ప విషయం. సబ్బండ వర్గాలకు చేయూతనందించే విధంగా టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో అంశాలున్నాయి. – రాసమల్ల బాల్‌కిషన్, నాయీబ్రాహ్మణ సేవాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.