హైదరాబాద్ షాన్ చార్మినార్.. అది కులీకుతూబ్ షా జాన్! అవి ఆకాశాన్నంటే నాలుగు స్తంభాలు కావు.. హైదరాబాద్‌లోని హిందూ..ముస్లిం.. సిక్కు.. ఇసాయి ఐక్యతకు చిహ్నాలు! ఈ పాఠాన్ని బాగా ఆకళింపు చేసుకొన్న వ్యక్తి తెలంగాణ తొలిముస్లిం డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ! జీవన సత్యాలను తండ్రి నుంచి.. రాజకీయసత్యాలను కేసీఆర్ నుంచి నేర్చుకున్న అలీసాబ్ నిజాయితీని బాటగా పర్చుకున్నాడు.. ఆ గురువుల దువాతో ముందుకు సాగుతున్నాడు.. అతని ప్రస్థానమే ఈ ఆచార్యదేవోభవ….

మాది హైదరాబాద్ లోకల్. నాన్న (పీర్ మహ్మద్) డెయిరీ ఫామ్ బిజినెస్ చేస్తుండే. తర్వాత మేం కూడా దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఆల్ఓవర్ సిటీలో మాకు ఏడు బ్రాంచులున్నాయి. ఏడుగురు అన్నదమ్ములు, ఏడుగురు అక్కచెల్లెళ్లు. అందరిలోకి నేనే పెద్ద. నాకు పదేళ్లున్నప్పుడే పాల బిజినెస్‌లోకి అడుగుపెట్టిన. ఒకరకంగా చెప్పాలంటే నాకు తొలి గురువు మా నాన్నే! వ్యాపారానికే కాదు నా జీవనపాఠానికి కూడా.
అసలు మా నాన్న డెయిరీ ఫామ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టడమే ఓ విచిత్రం. ఆ రోజుల్లో మా ఫాదర్ జిమ్ పట్ల బగా షౌకీన్. అందుకే బేగంబాజార్లోని తాలీంఖానాలో రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్కు వెళ్తుండె. ఆయన గురువుకి పెరుగు షాప్ ఉండె. రోజు అందులో కూర్చోని కూర్చోని ఆ బిజినెస్ గురించి బాగా తెల్సుకున్నడు. అట్ల బాబూ మియా డెయిరీ ఫామ్ పేరుతో పాల బిజినెస్ స్టార్ట్ చేసిండు. ఆ రోజుల్లో యాదవ్‌లే పాల బిజినెస్ చేసేవాళ్లు. డెయిరీ ఫామ్ పెట్టిన ఫస్ట్ ముస్లిం మా నాన్ననే. బాబూ మియా డెయిరీఫామ్ అంటే ట్విన్ సిటీస్‌లో పేమస్! ఈ పాల బిజినెస్ వల్ల నన్ను మా ఫ్రెండ్స్ అందరూ యాదవ్ సాబ్ అని పిలిచేటోళ్లు. మా ఫాదర్‌కు హిందూముస్లిం ఫీలింగ్ లేకుండే. ఆయనదంతా సెక్యులర్ తత్వం. మా ఇంట్లో కూడా అదే పద్ధతి. అదే అలవాటు మాకూ వచ్చింది.
స్కూలింగ్.. ఫిఫ్త్ క్లాస్ దాకా కట్టల్గూడ హైస్కూలే! సెవెన్త్ వరకు అజంపురా హైస్కూల్. ఎయిత్ నుంచి చాదర్‌ఘాట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో! సెవెన్త్ దాకా నాది ఉర్దూ మీడియమే! హైస్కూల్లో అజీజ్ సాబ్, కాలేజ్ డేస్‌లో కమాల్ సాబ్, బషీర్ సాబ్ అనే గురువులు నన్ను బాగా ఇష్టపడేవారు. వాళ్ల సాన్నిధ్యంలో పుస్తక పాఠాలే కాదు సమాజంలోని పాఠాలూ నేర్చుకున్న. అలాంటి సత్గురువుల అడుగుజాడల్లో నడుస్తూ బికామ్ దాకా చదివిన.
తర్వాత తిలక్‌రోడ్‌లోని ఈవినింగ్ లాకాలేజ్‌లో అడ్మిషన్ తీసుకున్న కానీ కంప్లీట్ చేయలే. ఎందుకంటే మా ఫాదర్‌కి అంత సాటిస్ఫాక్షన్ లేకుండె. అకౌంట్లు చూసుకోవడం వచ్చేంత చదువుంది కదా చాలు.. బిజినెస్ చూసుకుంటే మంచిది అని అనుకుంటుండె. అందుకే అక్కడికే ఫుల్స్టాప్ పెట్టి డెయిరీ ఫామ్ బిజినెస్‌లో బిజీ అయిపోయిన. అప్పటికే అంటే నాకు పదిహేనేళ్లు వచ్చేసరికే డెయిరీ ఫామ్ బిజినెస్ అనుపానలన్నీ తెలిసిపోయినయ్.
అసలు నా చైల్డ్ హుడ్ అంతా ఒక్క క్షణం తీరికలేకుండా గడిచిపోయింది. పొద్దున స్కూల్‌కి పోయేదాకా పనిచూసుకోవాలే.. మళ్లీ స్కూల్ నుంచి రాంగానే ఈ పనిలో పడిపోవాలె. నో సండే… నో మండే.. నో స్పోర్ట్స్! బడి, పని అంతే! హాలీడెస్లో మాత్రం కొంత ఫ్రీ టైమ్ దొరికేది. అట్ల మొదటి నుంచి ఒక రెస్పాన్స్‌బుల్ లైఫ్‌నే లీడ్ చేసిన. దాన్ని అలవాటు చేసిందీ మా ఫాదరే. కష్టపడి పనిచేయాలనే ఆయన తత్వాన్ని నేనూ ఒంటపట్టించుకున్న. అందుకే మా నాన్న నేర్పిన వ్యాపార మెళకువలను వారసత్వంగా తీసుకున్న కానీ ఆయన సంపాదించిన ఆస్తిలో పైసా కూడా తీసుకోలేదు.
పోలీస్ యాక్షన్ కంటే ముందు మా నాన్న దగ్గర చాలా డబ్బుండేది. ఆ తర్వాతా బాగా సంపాదించాడు. అదంతా నా తమ్ముళ్లకు ఇచ్చేసి నేను సొంతంగా నా వ్యాపారాన్ని డెవలప్ చేసుకున్న. అవసరానికి మించిన ఆస్తి సంపాదించుకోవాలనే ఆశ నాకు లేదు. ఆ పెద్దరికం కూడా నాన్న నుంచి నేర్చుకున్నదే! ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. పధ్నాలుగు మంది పిల్లల ఆలనాపాలనతో మా అమ్మానాన్నలు పడ్డ కష్టాలు చూశాను కాబట్టి ఇంటికి పెద్ద కొడుకుగా నేను పరిమిత కుటుంబం అనే నియమాన్ని పాటించిన. నలుగురు పిల్లలతో కుటుంబ నియంత్రణ చేసిన. ఇదే పాలసీని నా తమ్ముళ్లు, చెల్లెళ్లు కూడా పాటించిండ్రు!
రాజకీయాల ఆలోచనే లేకుండె కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ పెట్టేదాకా నాకు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనలేదు. 69 మూవ్మెంట్లో స్టూడెంట్స్ అందరితోపాటు జై తెలంగాణ అంటూ ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొన్నాను కానీ అప్పటికి రాజకీయాల పట్ల నాకెలాంటి అభిప్రాయాలూ లేవు. 71,72 టైమ్‌లో నేను అన్వర్ ఉలూం కాలేజ్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడు జలీల్‌పాషా అనే లీడర్ తెలంగాణ ప్రజా సమితి తరపున నన్ను తెలంగాణ ఉద్యమంలోకి తీసుకొచ్చాడు కానీ నేనప్పుడు అంత సీరియస్‌గా లేను.
ఎప్పుడైతే కేసీఆర్ సాబ్ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి తెలంగాణరాష్ట్ర సాధన కోసం టీఆర్ఎస్ను పెట్టిండో.. దానికోసం బహిరంగ ప్రకటన చేసిండో అప్పుడు తెలంగాణ గురించి, రాజకీయాల గురించి సీరియస్‌గా ఆలోచించిన. ఒక నిర్ణయానికి వచ్చి నా అంతట నేనే వెళ్లి కేసీఆర్సాబ్ని కలిసిన. తెలంగాణ కోసం ఆయనకున్న కమిట్మెంట్.. ఆయన అభిప్రాయాలు నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసినయ్. ఇన్సిపిరేషన్ ఇచ్చినయ్. అంతే అప్పటికప్పుడు టీఆర్ఎస్లో జాయిన్ అయిన. అట్లా కేసీఆర్ సాబ్ దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకున్న.
నా పొలిటికల్ గురువు ఆయనే! ఒకరకంగా నేను చాలా అదృష్టవంతుడిని. ఆ దేవుడి దయో… మా పేరెంట్స్ దువా (ఆశీర్వాదం)నో తెల్వదు కానీ కేసీఆర్ సాబ్ నన్ను ఆయన ఫామిలీ మెంబర్‌గా.. సొంత బ్రదర్‌లాగా ట్రీట్ చేస్తడు. నేనూ ఆ అభిమానాన్ని అట్లనే కాపాడుకుంటా! ఆయనెట్ల తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం అనుక్షణం ఆలోచిస్తడో మేమందరం కూడా ఆయన ఆలోచనలకు సరైన రూపమివ్వడానికి అంతే కష్టపడాలనుకుంటున్నం.. కష్టపడుతున్నం… కష్టపడతం కూడా! ఈ రోజు నేను రెవెన్యూ మినిష్టర్‌గా, డిప్యూటీ సీఎంగా పారదర్శక పాలనను అందించాలనుకుంటున్న. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మధ్య ఏజెంట్లు లేకుండా డైరెక్ట్‌గా కలుసుకునే చర్యలు చేపట్టాలనుకుంటున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్కు కరప్టెడ్ డిపార్ట్మెంట్ అని పేరుంది.
కరప్షన్‌ను గ్రాడ్యువల్‌గా కంట్రోల్ చేస్తాం. క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేయాలనుకుంటున్నం. హెల్ప్లైన్లు పెడ్తాం. ఆన్లైన్లో పనులయ్యేలా చేస్తాం. కాలాయాపన తగ్గించి ప్రజల పనులు సాధ్యమైనంత త్వరగా, తేలికగా పూర్తయ్యేలా చేస్తాం. రాబోయే రెండేళ్లల్లో మీరే చూస్తారు.. ఎన్ని మంచి మార్పులు వస్తాయో!
ఫిల్టర్ వాటర్ నేను మిత భాషిని. రౌడీయిజానికి చాలా దూరం. నామీద ఒక్క పోలీస్ కేస్ కూడా లేదు. ప్లీజింగ్ నేచర్ నాది. ఇదీ నాన్నతో వచ్చిందే! మహమూద్ అలీ సాబ్ అంటే ఫిల్టర్ వాటర్ అంటారు అందరూ! నాకు జన్మనిచ్చిన తండ్రి దగ్గర్నుంచి చదువునేర్పిన గురువులు, రాజకీయాల్లో చేర్చుకున్న కేసీఆర్ వరకూ నాకు అందరూ నేర్పింది ఒక్కటే.. పేదవారికి చేతనైనంత సాయం చెయ్ అని! దాన్నే అమలు చేస్తున్న. నేను సెల్ఫ్ మేడ్ మ్యాన్ని.
కష్టం విలువ బాగా తెలుసు. కాబట్టి ప్రజల పట్ల బాధ్యతగా ఉంటాను. చిన్నప్పటి నుంచీ నేనంటే అందరికీ ఇష్టం. నా అదృష్టం కొద్దీ కేసీఆర్ సాబ్ కూడా నన్ను బాగా లైక్ చేస్తడు. నా పనిపట్ల ఆయనకు విశ్వాసం ఉంది. రీసెంట్గా నా కొడుకు కూడా టీఆర్ఎస్లో జాయిన్ అయిండు. నేను పాలిటిక్స్‌లోకి రావాలనుకుంటున్న అని నా కొడుకు నన్ను అడిగిన క్షణమే చెప్పిన.. మనకు పొలిటికల్ లైఫ్ ఇచ్చిన కేసీఆర్సాబ్కి, మనల్ని యాక్సెప్ట్ చేసిన ప్రజలకు జీవితమంతా లాయల్‌గా ఉండాలె అని! తెలంగాణపట్ల సార్కున్న కమిట్మెంటే మనకుండాలనీ చెప్త. నిజంగా నా దృష్టిలో కేసీఆర్ మహాత్మా. ఈ విషయాన్నే నేను బయట మీటింగ్స్‌లో చెప్తుంటే కేసీఆర్ నన్ను వారిస్తున్నరు.
ఎవరు ఏమనుకున్న అది నా మనసులో మాట బస్ అంతే! అది కేసీఆర్ సాబ్ మీద నాకున్న గౌరవం.. నమ్మకం! తెలంగాణ అని తిరుగుతున్నరు అది వచ్చేదుందా.. పొయ్యేదుందా… అని చాలామంది వెక్కిరిచ్చిండ్రు. వాళ్లందరికీ ఒక్కటే మాట చెప్పిన.. సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సత్యమో.. కేసీఆర్ సాబ్ నాయకత్వంలో తెలంగాణ రావడం కూడా అంతే తథ్యం! అని.
మునుపటి హైదరాబాద్.. హైదరాబాద్ సంస్కృతి గంగా జమునా తెహ్జీబ్ లాంటిది. నిజానికి ఇక్కడ హిందూముస్లిం అనే భేదం లేదు. అందరిదీ ఒకటే మతం.. మానవత్వం. కానీ కొన్ని కారణాల వల్ల ప్రజల మధ్య అంతరాలు పెరిగినయ్. ఒకప్పుడు రూలర్స్ అయిన ముస్లింలను ఇప్పుడు అణచివేశారు. ఏ హైదరాబాదీనైనా పరాయి ప్రాంతం వాళ్లు నవాబ్ అనే పిలిచేవాళ్లు. నేను బిజినెస్ పనిమీద లక్నో లాంటి చోట్లకు వెళ్లినప్పుడు అరే.. హైదరాబద్కే నవాబ్ సాబ్ ఆయే అంటూ ఎంతో మర్యాద చేసేవాళ్లు. అలాంటి ఐడెంటిటీ ఇప్పుడు మళ్లీ మన హైదరాబాదీలకు రావాలి. ఆ సమైక్య సంస్కృతి రావాలి. దానికి ఆశ కేసీఆర్సాబే! ఆయనను మించిన సెక్యులర్ లీడర్ లేడు!
యే సబ్ నహీ జమ్తా మా నాన్న నాకు మూడు మాటలు చెప్పిండు. ఒకటి… అందరితో ప్రేమగా ఉండు. రెండు.. హలాల్ – ఆడిన మాటకు కట్టుబడి ఉండడం హలాల్! హరామ్ … నమ్మిన వాళ్లను మోసం చేయొద్దు! మూడు సత్యం.. ప్రాణంపోతున్నా అబద్ధం చెప్పొద్దు.. సత్యమే మాట్లాడు అని! ఈ మూడింటిని ఇప్పటికీ పాటిస్తా. పొలిటికల్ లీడర్స్ ఎంతో మంది సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఎన్నో వాగ్దానాలు చేస్తారు. కానీ నేను అలా కాదు. ఒక మాట చెప్పానంటే దానికి కట్టుబడే ఉంటా. ఇది మా నాన్న దగ్గర నేర్చుకున్న విలువైన పాఠం. నేను రాజకీయాల్లోకి వచ్చాక చాలామంది అరే ఆప్‌తో షరీఫ్ ఆద్మీ హై! ఇస్మేతో ఝూట్ బోల్నా పడ్తా.. యే సబ్ ఆప్కో నహీ జమ్తా అని వారించిన్రు. అయినా నిరుత్సాహపడలేదు.. అట్లాగని నా పద్ధతీ మార్చుకోలేదు. అదే నిజాయితీ నన్ను ఇవ్వాళ నిలబెట్టింది!