Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణి

-అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్‌ఫుల్ ప్రజెంటేషన్ -ఐదేండ్లలో కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తాం -మీ బిడ్డగా… కేసీఆర్‌గా… సీఎంగా… ఆ బాధ్యత నాది -గొప్పదనం, అన్యాయాలు వివరిస్తూ , భవిష్యత్‌పై నమ్మకమిస్తూ.. -మూడు గంటలు అనర్గళంగా సీఎం సాంకేతిక ప్రసంగం -చేస్తే వ్యవసాయమే చేయాలనిపించేలా భరోసా -బంగారు తెలంగాణ దిశగా రోడ్‌మ్యాప్ ఆవిష్కారం

-ఇరిగేషన్‌కు వచ్చే ఏడాది మరో రూ.5వేల కోట్లు -తెలంగాణ నైజం.. లివ్ అండ్ లెట్‌లివ్ -ఐదేండ్లలో నీరందిస్తా.. -మీ బిడ్డగా… కేసీఆర్‌గా… సీఎంగా… ఆ బాధ్యత నాది -మా ప్రస్థానాన్ని ఎవరూ ఆపలేరు -నోమోర్ ప్రాణహిత-చేవెళ్ల. ఇక అది కాళేశ్వరం ప్రాజెక్ట్ -కృష్ణా గోదావరిలో నేను వేసినన్ని నాణేలు ఎవరూ వేసి ఉండరు -58 ఏండ్ల సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రయాణం అంతా పెయిన్‌ఫుల్. -దుమ్ముగూడెం పెద్ద దగా.. ఖమ్మం జిల్లాకు గ్రావిటీ నీళ్లను వదులుకొని లిఫ్టు నీళ్లకు కరెంటు బిల్లులు కట్టుకోవాలె! -ఎగువ రాష్ట్రాల్లో 450 బాబ్లీలున్నాయి. అందుకే సింగూరు ఎండిపోయి మొసళ్లు ఊర్లమీదకొస్తున్నయి

CM-KCR-presentation-on-Telanganan-Irrigataion-Projects

భగవంతుడు ఎలా మనసు కలిగించాడో తెల్వదుగానీ కాకతీయ రాజులు గొలుసుకట్టు చెరువులు కట్టారు. ఇట్లా 75వేల పైచిలుకు చెరువులు తెలంగాణలోని మేజర్ గ్రామాల్లో నిర్మించారు. ప్రతి చెరువు కట్టమీద పోచమ్మో మైసమ్మో గుడి దాని ముందు కాకతీయ రెడ్డిరాజుల శిలాశాసనాలు కనిపిస్తాయి. కుతుబ్‌షాహీలు ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అసఫ్‌జాహీలు ఇంకో అడుగు ముందుకేశారు. 1956 నాటికే 20 లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది.

తెలంగాణ సాగునీటి కథ రాసుకుంటే రామాయణమంత.. వింటే భారతమంత. కాకతీయ రాజులు, కులీకుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు నిర్మించిన చెరువులు ధ్వంసమయ్యాయి. అప్పర్‌మానేర్, కోయిల్‌సాగర్, ఎస్సెల్బీసీ వట్టిపోయాయి. ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టకపోవడం, కరెంటు కోతలు, బిల్లుల మోతలతో రైతు బతుకు దుర్భరంగా మారింది. తెలంగాణ బతుకు ఆ రోజు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి.

ఎవరెన్ని ఆటంకాలు, అవరోధాలు కల్పించినా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించి తీరుతాం. తెలంగాణ ప్రజలకు నీరు ఇవ్వవలిసిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా వంద శాతం ఆ దిశగా మా ప్రస్థానం కొనసాగుతుంది. దీనిని ఆపాలని ఎవరైనా అనుకుంటే అది వాళ్ల భ్రమే. తెలంగాణ ఉద్యమం మొయిన్ ట్యాగ్‌లైన్ నిధులు, నియామకాలు.. నీళ్లు. రాష్ట్రం ఏర్పడింది కనుక రెండు ఇప్పటికే సాధించుకున్నాం. కావాల్సింది నీళ్ల సమస్యకు పరిష్కారం. – గురువారం అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా గతం, వర్తమానం , భవిష్యత్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు

తెలంగాణ సమగ్ర జలదృశ్యం.. యావత్ ప్రజానీకానికి అవగతమయ్యింది! ఏ నది ఎక్కడినుంచి.. ఎక్కడికి పారుతున్నదో..ఆనకట్టలెక్కడున్నయో.. బరాజ్‌లెన్ని ఉన్న యో.. ఎవరెంత నీటిని తరలించుకున్నారో..! ఒక్కొక్క చుక్క నీటికీ లెక్క చెప్తూ.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన అపూర్వ ప్రయోగం.. మహాద్భుతాన్ని ఆవిష్కరించింది! తెలంగాణకున్న నీటి వనరుల గొప్పతనంతోపాటే.. ఆరు దశాబ్దాల సమైక్యపాలనలో జరిగిన అన్యాయం లోతెంతో తెలిసింది! ఏ ప్రాజెక్టు వెనుక ఎంతటి కుట్ర దాగుందో తేటతెల్లమయ్యింది! గత పాలకుల నిర్లక్ష్యపు మూల్యం ఎంత భారంగా పరిణమించిందో గుండెను పిండింది! రాష్ట్రంలో నిత్యం కరువుకు కారణమేందో కండ్ల ముందు కదలాడింది! అదే సమయంలో.. తెలంగాణ నీటిపారుదలరంగ స్థితిగతులు..

ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఆవశ్యకతను ఒక ఉపాధ్యాయుడిలా.. సాగునీటిరంగ మేధావిలా వివరించిన తీరు భవిష్యత్‌పై నమ్మకాన్ని కలిగించింది! త్యాగాల పునాదులపై ఆవిర్భవించిన తెలంగాణ.. బంగారు తెలంగాణ కావాలన్న ఆర్తి ఉన్న మనలో ఒకడిగా.. మన బిడ్డగా.. మన ఇంటి పెద్దగా.. దాదాపు మూడు గంటలపాటు ఏకధాటిగా ముఖ్యమంత్రి విడమర్చిన తీరుతో.. తెలంగాణ మాగాణం కోటి ఎకరాల్లో పసిడి పంటలు పండించనున్న భావి దృశ్యం గోచరించింది! ప్రతి మాటలోనూ మన హక్కు మేరకు ప్రతి నీటి బొట్టునూ నిలుపుకోవాలనే తపన! ఎండి.. బీటలువారిన తెలంగాణ మాగాణాన్ని పునరుజ్జీవింపజేసేందుకు చేయబోయే కృషిని వివరించడమేకాకుండా.. ఉత్త కాలువలు తవ్వడం కాకుండా.. వరద వచ్చినప్పుడు ఒడిసిపట్టుకునేందుకు ఎక్కడెక్కడ బరాజులు.. రిజర్వాయర్లు కట్టబోతున్నదీ పూస గుచ్చినట్టు వివరిస్తున్న ప్రతి సందర్భంలోనూ తెలంగాణను డెల్టాలా మార్చివేయాలన్న ఆకాంక్ష! అలా చేయగలమన్న విశ్వాసం! వాటర్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ అవతారమెత్తి..

నిండైన తెరలపై.. అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని విహంగవీక్షణం చేయించినట్టు.. ముఖ్యమంత్రి పవర్‌ఫుల్‌గా.. పాయింట్‌లవారీగా ఇచ్చిన ప్రజెంటేషన్.. రానున్న రోజుల్లో చేస్తే.. వ్యవసాయమే చేయాలి అనిపించేంత భరోసానిచ్చింది! కేంద్ర జలసంఘానికి సైతం తెలియని అంశాలను.. పొరుగు రాష్ట్రాలకు సైతం అంతుచిక్కని సంగతులను ల్యాప్‌టాప్‌ముందు కూర్చొని.. గూగుల్ మ్యాప్‌లతో గుట్టువిప్పిన చంద్రశేఖరుడి మేధస్సుకు అఖిల భారతం సెభాషన్నది! రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజెంటేషన్.. న భూతో న భవిష్యతి అన్న తీరున విఖ్యాతి పొందింది! తెలంగాణ నేలను అడుగడుగూ అధ్యయనం చేసి.. నీటి వాలు, సాలు గురించి అనర్గళంగా.. పొల్లుపోకుండా వివరించగలిగిన అరుదైన ముఖ్యమంత్రిని దేశం తొలిసారి చూసింది!

కోటి ఎకరాల లెక్క ఇది.. -ఖమ్మం సీతారామ ప్రాజెక్టు ద్వారా 6 లక్షల ఎకరాలు -దేవాదుల కింద వరంగల్‌లో 6 లక్షలు -తమ్మిడిహట్టి ద్వారా 2 లక్షల ఎకరాలు -కాళేశ్వరం ప్రాజెక్టుతో 26 లక్షల ఎకరాలు -లోయర్ పెనుగంగ ద్వారా 60వేల ఎకరాలు -పాలమూరు-రంగారెడ్డి ద్వారా 15 లక్షల ఎకరాలు -ఎస్సెల్బీసీ ద్వారా నల్లగొండలో లక్ష ఎకరాలు -మహబూబ్‌నగర్‌లో ఆన్‌గోయింగ్ ప్రాజెక్టుల ద్వారా 8 లక్షల ఎకరాలు -ఎస్సారెస్పీ స్టేజ్-2లో మిడ్‌మానేరును కాళేశ్వరంతో కనెక్ట్ చేసి నింపుకొంటే 9 లక్షలు, వరద కాల్వ ద్వారా 2 లక్షల ఎకరాలు -ఆదిలాబాద్ మీడియం ప్రాజెక్టు ద్వారా 1.75 లక్షలు -నిజాంసాగర్ కింద మరో 2 లక్షల ఎకరాలు -మొత్తం 96 లక్షల ఎకరాలకు నీళ్లు తీసుకువస్తం. -ఇప్పటికే 20 లక్షల ఎకరాలకు సాగునీరు

ఎవరెన్ని ఆటంకాలు, అవరోధాలు కల్పించినా తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించి తీరుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. తెలంగాణ ప్రజలకు నీరు ఇవ్వవలిసిన బాధ్యత తమ ప్రభుత్వం మీద ఉందని, ఎవరు అవునన్నా కాదన్నా వంద శాతం ఆ దిశగా తమ ప్రస్థానం కొనసాగుతుందన్నారు. దాన్ని ఎవరూ ఆపలేరు. ఆపుతమనుకుంటే అది వాళ్ల భ్రమ తప్ప ఇంకోటి కాదు అని కేసీఆర్ హెచ్చరించారు. టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో చెప్పినట్లు, తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నట్లు కోటి ఎకరాలకు నీళ్లు రావాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు తెచ్చి తీరుతం. నా తెలంగాణ కోటి ఎకరాల వీణ కావాలి.

ప్రాణం పోయినా సరే… రాజీ పడకుండా నీళ్లు తెస్తం అని సీఎం తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చారు. ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ ఐదేండ్లలో పూర్తి చేసి రైతన్నల కన్నీరు తుడిచి ఆకుపచ్చ తెలంగాణ సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. గురువారం శాసనసభలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆవిష్కరించిన కేసీఆర్…సాగునీటిరంగం చరిత్రనుంచి ప్రారంభించి, సమైక్య పాలకుల ద్రోహాలు, తాజా ప్రాజెక్టుల పరిస్థితి, తెలంగాణ సర్కారు రీ డిజైనింగ్ ద్వారా ఏం సాధించనుంది… అనే అంశాలపై ఉద్వేగభరితంగా మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే…

ఇదీ… తెలంగాణ గోస… తెలంగాణ వ్యవసాయం సాగునీటి కథ రాసుకుంటే రామయణమంత.. వింటే భారతమంత. ఒకసారి పాత విషయాలను కొంచెం నెమరు వేసుకుంటే 2001లో ఆనాటికి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, తెలంగాణ ప్రజల దుస్థితి దుర్భరంగా ఉంది. వర్ష పాతం తగ్గిపోవడం, కరువులు రావడం, వలసలు పెరగడం జరిగింది. కాకతీయ రాజులు, కులీకుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు నిర్మించిన చెరువులు ధ్వంసమయ్యాయి. అప్పర్‌మానేర్, కోయిల్ సాగర్, ఎస్‌ఎల్‌బీసీ వట్టిపోయాయి. మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టకపోవడం, కరెంటు కోతలు, విద్యుత్ బిల్లుల మోతలతో రైతుల బతుకు దుర్భరంగా మారింది. తెలంగాణ బతుకు ఆ రోజు బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి. మహబూబ్‌నగర్ నుంచి 15-20 లక్షల మంది పొట్ట చేత బట్టుకుని దేశంలో ఎక్కడ నిర్మాణం జరిగినా పనిచేసే దుస్థితి. ఆనాటి ప్రభుత్వంలో నేను డిప్యూటీ స్పీకర్‌గా ఉన్నా.

మంత్రిగా కూడా అదే ప్రభుత్వంలో పనిచేశా. కరెంటు ఛార్జీలు పెంచే ప్రయత్నం చేస్తే క్యాబినెట్ మంత్రిగా 1.45 గంటలపాటు వ్యతిరేకించిన. ఎందుకో ఏమో నాటి సీఎం సీనియర్లను సంప్రదించకుండా విద్యుత్ చార్జీలు పెంచారు. నా నిరసనను వ్యక్తం చేస్తూ అది తెలంగాణ ప్రజలకు ఉరిశిక్ష అని బహిరంగ లేఖ రాసిన. కరెంటు చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వివిధ సంస్థలు చలో అసెంబ్లీ జరిపితే బషీర్‌బాగులో కాల్పులు జరిగాయి. ఇద్దరు ముగ్గురు బలిఅయ్యారు. ఇక తెలంగాణ ప్రాంతం సమైక్య రాష్ట్రంలో న్యాయాన్ని పొందజాలదని గుర్తించి నా పదవులకు రాజీనామా చేశాను.

అలాంటి విపత్కర పరిస్థితుల్లో మళ్లీ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినం. ఏప్రిల్ 21, 2001న జై తెలంగాణ నినాదం ఎగిసిపడింది. ఆచార్య జయశంకర్, బియ్యాల జనార్దన్‌రావు, కొండా లక్ష్మణ్‌బాపూజీ, అనేక మంది మేధావులు కలిసి పనిచేసినం. చాలామంది అపహాస్యం చేశారు. ఒడిదొడుకులు సృష్టించారు. సుదీర్ఘపోరాటంలో 36పార్టీలు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా లేఖలు ఇచ్చాయి. ఆత్మబలిదానాల మధ్య చివరికి 2014, జూన్ 2 తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అనంతరం సాధారణ ఎన్నికలు జరిగాయి. టీఆర్‌ఎస్ పార్టీ ఉద్యమాన్ని అగ్రభాగాన నిలిచి, రాష్ట్రాన్ని సాధించినందుకు, ఈ రాష్ట్రాన్ని మీరే చక్కదిద్దాలని, మంచి చెడులు చూడాలని టీఆర్‌ఎస్ పార్టీ చేతుల్లో ప్రజలు ప్రభుత్వాన్ని పెట్టారు.

నిధులు, నియామకాలు సాధించుకున్నాం… నీళ్లే మిగిలాయి తెలంగాణ ఉద్యమం మొయిన్ ట్యాగ్‌లైన్ నిధులు, నీళ్లు, నియమకాలు. వీటిలో రెండింటిని ఇప్పటికే సాధించుకున్నాం. నిధులు మన పరిధిలోనే ఉంటాయి కనుక అవి మన ప్రజల వికాసం కోసం ఖర్చు అవుతాయి. నియమకాలు కూడా స్వయం ప్రతిపత్తి కలిగిన రాష్ట్రం కనుక అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఉద్యోగాలు ఇక్కడి యువకులకే దక్కుతాయి. ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. ఈ టర్మ్‌లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాం. పరిష్కారం కావాల్సింది నీళ్ల సమస్య. ప్రజల వద్దకు వెళ్లినప్పుడు వారు మన ముందు పెడుతున్న సమస్య నీళ్లు. ఖమ్మం పోయినా.. నిజామాబాద్ పోయినా అదే ప్రశ్న. తాగునీరు, సాగునీరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సోదరులు, వ్యవసాయ ఆధారిత జీవితం గడుపుతున్న వారు తెలంగాణకు నీళ్లు ఎప్పుడు వస్తాయి.. ఎలా వస్తాయని ఎంతో ఆసక్తిగా అడుగుతున్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిశ్రమలు, ఐటీ, సంక్షేమం, అత్యంత ప్రాధాన్యమైన ఇరిగేషన్‌లో మన విధానం ఎలా ఉండాలనేది సాకల్యంగా సమీక్ష చేశాం.

2001నాటి స్థితి.. తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన 2001లో ఈ ప్రాంతం మీద పూర్తి వివక్ష కనిపించేది. జూరాల ప్రాజెకును పూర్తిగా నింపుకునే పరిస్థితి లేదు. కర్నాటక భూములు మునిగిపోతే వారికి పరిహారం ఇవ్వకపోవడంతో వారు అడ్డుకున్నారు. మనమే పోరాటం చేసి పరిహారం చెల్లించేలా చేసినం. ఆర్డీఎస్ ప్రాజెక్టు వద్ద అధికార పార్టీ సభ్యులే బాంబులు పెట్టి తూములు పేల్చారు. ఆర్డీఎస్ అన్యాయాన్ని ఎత్తి చూపేతందుకు అలంపూర్ నుంచి గద్వాల్‌కు పాదయాత్ర చేసిన. ఇదే శాసనసభలో నాటి సీఎంను నేనే ప్రశ్నించిన.. నాగార్జునసాగర్‌కు రెండు కాల్వలుంటే ఆంధ్రాకున్న కుడికాల్వల లిఫ్టులు ప్రభుత్వం నిర్వహించి తెలంగాణకు ఉన్న ఎడమ కాల్వల కరెంటు బిల్లు, నిర్వహణ రైతుల మీద ఎందుకు పెట్టారని నిలదీసినం. ప్రభుత్వం రియలైజ్ అయి జీవో మార్చింది.

అలాంటి పరిస్థితిలో తెలంగాణకు న్యాయంగా నీళ్లు ఎట్ల వస్తాయి. నా కార్ డ్రైవర్ పేరు బాలయ్య. ఆయనది సిద్దిపేట. 30-35 ఏండ్లు నా వద్ద డ్రైవర్‌గా ఉన్నారు. నేను కృష్ణా లేదా గోదావరి దాటే టూర్ అంటే చాలు వెంట రూపాయి బిల్లలు పెట్టుకుని వచ్చేది. రూపాయి బిల్ల నదిలో వేసి నమస్కరించడం తెలంగాణ సంప్రదాయం. ఎక్కడ గోదావరి వచ్చినా కృష్ణా వచ్చిన ఆగి నేను రూపాయి బిల్లలు వేసేవాడిని. కృష్ణా, గోదావరిలో నేను వేసినన్ని నాణాలు ఎవరు వేసి ఉండరు. ఈ విషయం అదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ కార్యకర్తలకు, పోలీసులకు కూడా తెలుసు. తల్లి గోదావరి.. మా బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులు ఎప్పుడు మార్చుతావు అనే దండం పెట్టి ఎన్నోసార్లు వేడుకున్న.

అంతా కుట్రలే.. చివరికి రాష్ట్రం సిద్ధించిన తర్వాత జల విధానంపై సమీక్షిస్తే బయటపడ్డ విషయాలు దారుణం. తెలంగాణ ప్రాజెక్టులంటే అంతరాష్ట్ర వివాదాల్లో పెడతారు. అలాంటి ప్రాజెక్టు ఇచ్చంపల్లి. బీజేపీ నాయకులు, నేటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎమ్మెల్యే లక్ష్మణ్, ఇతర నాయకులు గోదావరి జలయాత్ర కూడా చేశారు. అంతరాష్ట్ర వివాదం పేరుతో దీనిని చేపట్టలేదు. అంతర్రాష్ట్ర వివాదాల్లో కూరుకుపోయేలా చేయడం ఒక ఎత్తుగడ అయితే, పర్యావరణ నెపంతో ఆపడం రెండో ఎత్తుగడ. వన్యప్రాణుల పేరుతో ఆపడం ఇంకో ఎత్తుగడ. 2001లో ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్ 2ను అనుమతులు లేవని పెండింగ్‌లో పెట్టారు. టీఆర్‌ఎస్ పెట్టిన తరువాత దానిపై పోరాటం చేస్తే ఆనాటి ప్రభుత్వం ఉరుకులు పరుగులతో దాన్ని పూర్తిచేశారు. టీఆర్‌ఎస్ వచ్చి గగ్గోలు పెట్టిన తరువాతే అంతో ఇంతో పని జరిగింది.

రావాల్సింది 1071టీఎంసీల నీరు.. కాగితాల మీద, ఫైళ్లమీద తెలంగాణకు నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నాయి. గోదావరి, కృష్ణా నదుల్లో సమైక్య రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు నీటి కేటాయింపులు చేశాయి. దీనిపై మేం సుప్రీంలో కొట్లాడుతున్నాం. ఇదేమాసంలో ట్రిబ్యునల్ వద్ద వాదనలున్నాయి. గోదావరిలో 954టీఎంసీల నీళ్లు ఆనాటి ప్రభుత్వాలే కేటాయించి, సీడబ్ల్యుసీ అనుమతులు తెచ్చారు. కృష్ణాలో 299టీఎంసీల నికర జలాలు, 77 టీఎంసీల మిగులు జలాలు చూపారు. కల్వకుర్తి, నెట్టెంపాడుకు మిగులు జలాలు కేటాయిస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా కృష్ణాలో 37 6టీఎంసీలు కేటాయించారు. 259 టీఎంసీలు మైనర్ ఇరిగేషన్‌లో రెండు నదులపై చూపారు. ఇందులో 170 టీఎంసీలు గోదావరిలో, 89 టీఎంసీలు కృష్ణాలో చూపారు. మీడియం, మేజర్ ఇరిగేషన్‌లో 1071 టీఎంసీలు కేటాయించినట్లు చూపారు. తెలంగాణలో అడవులు, పట్టణాలు, ఇతరాలు పోను వ్యవసాయం చేసుకునే భూమి 1.65కోట్ల ఎకరాలు ఉంది. ఇంకో లెక్క ప్రకారం 1.11కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తేలింది. 1071టీఎంసీల నీరు తెలంగాణకు కేటాయిస్తే కోటిఎకరాల పైచిలుకు భూమి ఎందుకు పారదు?

భయంకర దగా దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ మనది కానటువంటి, మనకు పనికిరాని భయంకరమైన దగా ప్రాజెక్టు దుమ్ముగూడెం టెయిల్‌పాండ్. వాళ్లు చెప్పేది ఒకటి. ముసుగులో ఒకటి. ఈ ప్రాజెక్టు ద్వారా 1060 టీఎంసీల గోదావరిజలాల్ని టెయిల్‌పాండ్‌లో పోస్తరు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా ఖమ్మంకు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను బంద్ పెడతరు. అంటే ఉన్న హక్కును తెలంగాణ కోల్పోవాలి. గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను బంద్‌పెట్టి, టెయిల్‌పాండ్ ద్వారా వచ్చే నీటిని లిఫ్టు చేసి పాలేరులో పోసుకొని పారించుకోవాలి. దటీజ్ దుమ్ముగూడెం టెయిల్‌పాండ్. అది తెలంగాణ కోసం కట్టిన ప్రాజెక్టు కాదు. ఈప్రాజెక్టుతో ఖమ్మం జిల్లాలో 4500 ఎకరాల అటవీ, 16వేల ఎకరాల రైతుల సాగు భూమిని కోల్పోవాలి. దుమ్ముగూడెం టెయిల్‌పాండ్ ద్వారా ఖమ్మం జిల్లాకు గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను వదులుకొని లిఫ్టు ద్వారా కరెంటు బిల్లులు కట్టుకొని నీళ్లు తీసుకోవాలె. మరి ఈ ప్రాజెక్టును ఉంచాల్నా? తీసేయాల్నా?

450 బాబ్లీలు కట్టారు.. ప్రతిపాదించిన ప్రాజెక్టుల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటే… మనకో పెద్ద ఉత్పాతం వచ్చి పడింది. కొంతమంది నాయకులు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టు కడుతుండ్రంటూ గొడవ పెట్టినరు. చెప్తే భయానకం.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రెండూ ప్రమాదంలో ఉన్నయి. కృష్ణా, గోదావరి నదులపై మహారాష్ట్ర కర్ణాటకలు 450 బాబ్లీలను నిర్మించినవి. ఫలితంగా 35 ఏండ్ల చరిత్రలో ఒక చుక్క నీరు రాకుండా సింగూరు ఎండిపోయింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఒక్క చుక్క నీరు రాలేదు. మరి ఏం చేయాలి? ఎట్ల ముందుకుపోవాలి? ఎట్ల నీళ్లు తెచ్చుకోవాలి?

నీళ్లిచ్చే ప్రయత్నానికి మోకాలడ్డు… గతంలో సీఎం మాత్రమే హెలిక్యాప్టర్‌లో తిరిగేవాళ్లు. కానీ మూడు హెలిక్యాప్టర్లను అందుబాటులో ఉంచి మంత్రి హరీశ్‌రావు, సలహాదారు విద్యాసాగర్‌రావు, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో రెండు హెలిక్యాప్టర్ల ద్వారా కృష్ణా, గోదావరి బేసిన్లలో మొత్తం తిప్పి పరిశీలన చేయించినం. అనేక విషయాలు అధ్యయనం, అవగాహన చేసుకున్న తర్వాత స్థిరమైన నిర్ణయం ఎట్ల తీసుకుంటే తెలంగాణ బాగుపడతది? ఏ పద్ధతుల్లో చేస్తే ప్రాజెక్టులు సత్వరం పూర్తవుతయి? అని మేం ప్రయత్నిస్తుంటే. దానిని కొందరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నరు. మరి వాళ్లు ఎందుకు అట్ల చేస్తున్నరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న. పాలమూరు ఎత్తిపోతల పథకంపై ఆ జిల్లాకు చెందిన నేతలే పిల్ వేసినరు. అయినా హైకోర్టు అది రాంగ్ అని కామెంట్ చేసి… తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది… ప్రాజెక్టు కట్టుకోండి… గోహెడ్ అని చెప్పింది. ఇలా కొంతమంది ప్రజల్ని కన్ఫ్యూజన్‌లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నరు.

ఇది కిన్నెరసాని కుట్ర.. తెలంగాణ మీద జరిగిన కుట్రలు చెప్తే నమ్మలేకుండ ఉంటయి. అదే కిన్నెరసాని కుట్ర. ఈ ప్రాజెక్టును 1960 లో చేపట్టినరు. ఇదే సభలో నేనున్న. ఈ ప్రాజెక్టు ద్వారా తమకు 10-15వేల ఎకరాలకు సాగునీరు వస్తదని కిన్నెరసాని కింద ఉన్న ఆదివాసీలు ఆశపడినరు. కానీ అప్పటి మంత్రి విద్యాధర్‌రావు.. అది కేటీపీఎస్ కోసం ఉద్దేశించిన ప్రాజెక్టు తప్ప సాగునీరు ఇచ్చే ప్రసక్తే లేదన్నరు. ఎందుకు? ఇక్కడ పొంగిపొర్లే నీళ్లు ధవళేశ్వరం పోవాలని, కేటీపీఎస్ ఉత్పత్తి ద్వారా జనరేటెడ్ వాటర్ కిందకు పోవాలని. దానికోసం కిన్నెరసాని ప్రాజెక్టును మానవ సంచారంలేని జోన్‌లోకి పెట్టారు. 1996-99లో దీనిని వైల్డ్‌లైఫ్ సాంక్చురీ కింద గుర్తించాలని కేంద్రానికి ప్రతిపాదించారు. ఎక్కడన్నా వన్యప్రాణి కేంద్రం అంటే ఎకో జోన్ 100, 200 మీటర్లు లేకుంటే కిలోమీటర్ ఉంటది. కిన్నెరసాని ప్రాజెక్టు ప్రాంతాన్ని ఎకో జోన్ కింద 10 కిలోమీటర్లగా డిక్లేర్ చేసినరు.

అంటే ఆ పరిధిలో మానవ సంచారం ఉండొద్దు. రాజీవ్‌సాగర్-దుమ్ముగూడెం ప్రాజెక్టు కాలువను కూడా అక్కడినుంచి ప్రతిపాదించారు. అక్కడినుంచి కాలువ 40 కిలోమీటర్లు పోవాలె. అందులో వన్యప్రాణి సంరక్షణ కింద 28 కిలోమీటర్లు అడవుల్లో నుంచి, 18 కిలోమీటర్లు ఈ వన్యప్రాణి ప్రాంతంలో నుంచి ఉంటది. అంటే పర్మిషన్లు రావు. ఇట్ల సమైక్య పాలనలో తెలంగాణకు చేసిన ప్రాజెక్టులంటేనే అంతర్రాష్ట్ర వివాదాల్లోకి నెట్టడం.. లేకుంటే పర్యావరణ పంచాయితీ పెట్టడం. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కాంట్రాక్టరుకు రూ.1050 కోట్ల ఎస్కలేషన్ ఇచ్చింది. సివిల్ వర్క్స్ కాకుండానే పైపులు మాత్రం కొన్నారు. అంటే రిజర్వాయర్ పనులు, ఇన్‌టేక్ పనులు మొదలే కావు. ఎవరి కమీషన్ వాళ్లు తీసుకుని దాచుకున్నరు..ప్రాజెక్టు పక్కన పడింది.

పూర్ణా నదిపైనా అదే పరిస్థితి… మహారాష్ట్ర ఒక్క నదినీ వదల్లేదు. పూర్ణా నది(ఇదీ గోదావరికి ఉపనది.) మీద కూడా ఇదే పరిస్థితి. నల్ల నల్ల మార్కులున్నవి… మీడియం, మేజర్ ప్రాజెక్టులు. ఒక్కటికాదు…పూర్ణ, ప్రవర, ముంబ. కృష్ణా, భీమా, పంచగంగ… అన్నీ కలిసి… 450 వరకు బ్యారేజీలు నిర్మించినరు. ఇవన్నీ వివరాలు కేంద్ర జల సంఘంలో ఉండవు. సంవత్సరాల తరబడి కట్టుకుంటూ పోయినరు. ఇప్పుడు మనం అక్కడ పోయి పేచీలు పెడితే రక్తపాతాలు తప్ప పరిష్కారం కావు.

1300 టీఎంసీలు ట్యాప్ చేస్తున్న ఎగువ రాష్ట్రాలు .. ఇక నాసిక్.. దాని పక్కన త్రయంబకం. అక్కడే గోదావరి పుడుతుంది. పక్కన నది ప్రవర దాని ఉపనది. దాని ఉప నదులు.. ఎక్కడ చూసినా… ఎక్కడ తెరిచినా… సిరీస్ ఆఫ్ బ్యారేజీలు. ఒకటికొకటి షేక్‌హ్యాండ్ ఇచ్చుకునేటట్లు బ్యారేజీలు నిర్మించినరు. ఒక బ్యారేజీ నీళ్లు ఇంకో బ్యారేజీకి తగులుతయి. అట్ల నది ఎప్పుడూ లైవ్(ఎండిపోకుండా)గా ఉంటది. ఇవన్నీ వాస్తవాలు. గూగుల్ ద్వారా చూస్తే సభ్యులకు అవగాహన ఉంటదని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ కోసం అనుమతి కోరాం. విషయం అర్థం కావాలని ప్రజంటేషన్ తప్ప ఇందుల వేరే ఉద్దేశం కాదు. మహారాష్ట్రలో మన నాగార్జునసాగర్‌లాంటి ప్రాజెక్టు నార్త్‌సాగర్ అంటే మనం జైక్వాడ్ అంటం. దీని సామర్థ్యం 102 టీఎంసీలు.

అంటే నాసిక్‌నుంచి మొదలుకుని ఉపనదులనుంచి వచ్చే నీరు అక్కడ చెరువులు కుంటలు నిండి మైనర్, మీడియం, మేజర్ అన్నీ నిండి… ఆ తర్వాత నదీ మార్గంలోని బ్యారేజీలు నిండిన తర్వాత వచ్చే నీళ్లు జైక్వాడ్‌కు చేరుతయ్. అక్కడ 102 టీఎంసీలు నిండి.. అప్పటికీ వర్షం కురిస్తే తప్ప మనకు నీళ్లు రావు. అందుకే ఈ ఏడాది మంజీరా, ఎస్సారెస్పీ, శ్రీశైలంలకు చుక్కరాలేదు. ఇక బాబ్లీ.. ఇది గోదావరి మీద మహారాష్ట్ర కట్టిన ఆఖరి బ్యారేజీ. చూస్తే ఇక్కడ కూడా నది లైవ్‌గా ఉంటది. అంటే నాసిక్‌నుంచి మొదలు పెట్టి బాబ్లీ దాకా ఇదే స్థితి.

ఎస్సారెస్పీ నీళ్లు ఇక రావు.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు ఆశించిన తెలంగాణ ఇవ్వాలి. ఇక ముందు ఎస్సారెస్పీ నీళ్లు రావు. ఆశలు అడుగంటినవి. పైవన్నీ నిండి.. దేవుడు కరుణించి భారీ వర్షాలొస్తే మనకు నీళొస్తయి. సింగూరు ఎండిపోయినది ప్రత్యక్షంగా ఈ సంవత్సరం మనం చూస్తున్నం. గోదావరి నీళ్లు తెచ్చుకోకుంటే హైదరాబాద్ బతుకుతుండెనా? హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీర పూర్తిగ ఎండిపోయినయి. గోదావరి నీళ్లు వచ్చినవి కాబట్టి హైదరాబాద్‌ను కాపాడుకుంటున్నం. ఇలాంటి విపత్కర పరిస్థితి. ఈ సందర్భంలో తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోవాలంటే రీడిజైనింగ్ చేయాలా? వద్దా?

విజనరీలు ఏం చేశారు? పై రాష్ట్రాలు ఇట్లా ఏండ్ల నుంచి ఇన్ని బ్యారేజీలు కట్టుకుంటూ పోతుంటే ఆ నాటి సీఎం ఏం చేశారు? విజనరీ సీఎంలని చెప్పుకుంటరు. తెలంగాణ వాళ్లకు పరిపాలన రాదన్నరు. 450 బ్యారేజీలకు సరాసరి 3 టీఎంసీలు లెక్క వేసుకున్నా 1300 టీఎంసీలు పైన ఆపుకుంటున్నరు. మరి తెలంగాణను ఎవరు కాపాడాలి? సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం వస్తదా? కేంద్ర జల సంఘం వస్తదా? ఇప్పుడు ఎవరిని తిడితే ఏం లాభం? మంజీరాపైన మహారాష్ట్ర, కింద కర్ణాటక… బ్యారేజీలను ఎవరికివారు కట్టుకుంటే మరికొన్ని సంయుక్తంగా కూడా కట్టుకున్నరు. ఇలా ఇష్టమొచ్చిన రీతిలో కట్టుకున్నరు.

తెలంగాణ బార్డర్ ఆనుకుని బ్యారేజీలు… మహారాష్ట్ర, కర్ణాటకలు ఎంత భయంకరంగా బ్యారేజీలు కట్టుకున్నరంటే.. మనకు రెండు చిన్న ప్రాజెక్టులున్నయి. ఒకటి మెదక్ జిల్లాలోని నల్లవరం, రెండోది కౌలాస్ నాలా. ఇది నిజామాబాద్‌లో ఉంది. ఒక్క టీఎంసీ ప్రాజెక్టు. జుక్కల్ నియోజకవర్గంలో 6-7వేల ఎకరాలకు నీళ్లొస్తయి. ఈ ప్రాజెక్టు నెత్తిమీదనే. మహారాష్ట్ర రెండు బ్యారేజీలు కట్టుకుంది. మన తెలంగాణ బార్డర్‌కు ఆనించి కట్టుకున్నరు. అందుకే మనం ప్రమాదకర పరిస్థితుల్లోకి పోతున్నం.

లిఫ్టులతో తోడేస్తున్నరు.. కృష్ణా నదిపై మహారాష్ట్ర, కర్ణాటక ఇబ్బడిముబ్బడిగా బ్యారేజీలు కట్టుకున్నవి. బ్యారేజీ కట్టడం.. దాని పక్కన లిఫ్టులు పెట్టుకోవడం. అందుకే అక్కడ నది లైవ్‌గా ఉంటది. బ్యారేజీ టు బ్యారేజీ. వాళ్లు అదృష్టవంతులు. అందుకే అట్ల చేసుకున్నరు. లెక్క తీస్తే 450 బ్యారేజీలు. పరిశోధిస్తే ఇవి దొరికినవి. ఏ అధికారులు ఇచ్చినవి కావు. అడిగితే ఇయ్యను కూడా ఇవ్వరు. గూగుల్ మ్యాపులు పరిశోధించి పట్టుకున్నవి. ఈ విధంగా కృష్ణా, గోదావరి, వీటన్నింటిపైనా బ్యారేజీలు కట్టిన మూలంగా దుర్భర పరిస్థితి నెలకొంది.

ధవళేశ్వరం నీళ్ల కోసం సమైక్య కుట్రలు.. ఇక ఖమ్మం జిల్లా. ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ రెండు ప్రాజెక్టులు గత ప్రభుత్వం తీసుకున్నవి. ఏపీలో కలిసిన ఏడు మండలాలు గతంలో తెలంగాణలో ఉండేవి. అప్పట్లో రుద్రమకోట అనే ప్రాంతంలో ఇందిరాసాగర్ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్,ఇన్‌టేక్ లెవల్ పాయింట్ పెట్టారు. ఇపుడు అవి ఏపీలోకి పోయినయి. నీళ్లు కావాలంటే అక్కడ పంపుహౌజ్ పెట్టి నీళ్లు తెచ్చుకోవాలె. అదంతా ఆంధ్రప్రదేశ్‌లోకి పోయిన దరిమిలా నీళ్లు తెచ్చుకోలేం. అది మన చేతుల ఉండదు. మరి ఈ ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేయాలా? వద్దా? తెలంగాణకు నీళ్లు రావాలి… అది ఎట్ల?

పెనుగంగపైనే 80-100 టీఎంసీల స్టోరేజీ…

గూగుల్ మ్యాప్‌ను చూపిస్తూ..పచ్చ మార్కు తెలంగాణ రాష్ట్ర పరిధి. పక్కకు కనిపించే రెడ్‌మార్కులు ప్రమాదకరమైనవి. పెన్‌గంగ(గోదావరి ఉపనది)తో ప్రారంభిస్తున్న. 31బ్యారేజీలు కట్టారు.. మరో 9 నిర్మాణంలో ఉన్నవి. పెనుగంగపై ఉన్న ఈ బ్యారేజీల వివరాలు కేంద్ర జల సంఘంలో ఉండవు. మహారాష్ట్ర ఎప్పుడు ఎవరు అడిగినా, ఇతర రాష్ట్రాలు కేంద్ర జల సంఘం అడిగినా ఒకే సమాధానం చెప్తది. అదేందంటే… మాకు కేటాయించిన నీళ్ల పరిమితిలోనే ఉన్నం అంటరేగానీ ఈ వివరాలు సమర్పించరు. అసలు ఏంది కథ అని ఒక సందర్భంలో రాత్రి 2-3 గంటల వరకు నేను వ్యక్తిగతంగా, సహాయకులతో గూగుల్ మ్యాపులు అంగుళం అంగుళం పరిశోధన చేసి తీసిన సమాచారం ఇది. గూగుల్ మ్యాపుల ద్వారా వందల గంటలు శ్రమించి ఈ వివరాలు తెలుసుకున్నం.

ఈ కట్టిన బ్యారేజీలన్నీ షేక్ హ్యాండ్ బ్యారేజీలు(ఒక బ్యారేజీ నుంచి రెండో బ్యారేజీదాక నిండుగా నీళ్లు ఉంటాయి. కింది బ్యారేజీ నీరు పై బ్యారేజీని తాకుతూ ఉంటుంది.) మ్యాప్‌లో కనిపించే రెడ్ మార్కువన్నీ బ్యారేజీలే. వీటి ఫలితం ఏమిటి? పెన్‌గంగ నుంచి ప్రవాహం ద్వారా మనకు వస్తయనుకున్న నీళ్లు రావు. ఈ 40 బ్యారేజీలు ఒక్కోటి 1, 2, 3 టీఎంసీల సామర్థ్యం సరాసరి 2-2.5 టీఎంసీలు అనుకున్నా 80-100 టీఎంసీల నీళ్లు బ్యారేజీల దగ్గర ఆగుతయి. అంటే అక్కడ భారీ వర్షాలు పడి వారి చెరువులు నిండాలి. ఉపనదులు, వాగులు వంకలు దాటి మీడియం ప్రాజెక్టులు నిండాలి. అవన్నీ సర్‌ప్లస్ కావాలి. ఆతర్వాత ప్రవహించి మేజర్ ప్రాజెక్టులు నిండాలి. మళ్లీ వర్షాలు కురవాలి. బ్యారేజీలు నిండాలి. ఆతర్వాత మళ్లీ వర్షం కురిస్తే మనకు నీళ్లు. లేకుంటే రావు. అది ఈ బ్యారేజీల వల్ల పరిణామం. రెడ్ మార్కు ఉన్న చోట్ల బ్యారేజీలున్నాయి. దానికి ముందు లిప్టులు. ఇట్లా ప్రతిచోటా కట్టినరు. బ్యారేజీలు కట్టే అవకాశంలేని చోట కూడా డైరెక్ట్‌గా లిఫ్టు పెట్టుకున్నరు. ఇదీ పరిస్థితి.

దేవాదుల గాథ ఇది.. దేవాదుల ప్రాజెక్టు. రూ.8వేల కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. ఇది లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టు. 2001లో జై తెలంగాణ నినాదం ఎగిసిన తర్వాత వరంగల్‌లో బహిరంగ సభ పెట్టిన తర్వాత ఆనాటి సీఎం తాపీ మేస్త్రీని హెలికాప్టర్ల తీసుకొనిపోయి పునాది రాయి వేసి… 50 టీఎంసీల నీళ్లు కేటాయించినరు. 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తం. 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. అది 2001. ఇపుడు 2016. పది సంవత్సరాలు వరుసగా కాంగ్రెస్ ఉండె. ఇక్కడ 175 రోజులు పంప్‌హౌజ్ ద్వారా నీళ్లు తీసుకోవాలి. ఒక్క చెక్‌డ్యాం కూడా లేదు. గోదావరి అటు ఉంటే పంపుహౌస్ ఇటు ఉంటది. ఈ విధంగా ఎవరైనా ప్రాజెక్టులు కడతరా? చెక్‌డ్యాం కట్టాలని నేను అడిగితే.. చాలా రోజుల తర్వాత కంతనపల్లిలో పెట్టారు. 85-86 మీటర్ల లెవల్ పెట్టినారు. అక్కడ మళ్లీ చత్తీస్‌గఢ్ రాష్ట్రంతో ముంపు ప్రాబ్లం. 11,500 ఎకరాలు కంతనపల్లి దగ్గర గిరిజనుల భూమలు కూడామునుగుతాయి.

నేను స్వయంగా అక్కడికి పోయిన. అక్కడ ప్రజా సంఘాలతో, ఆదివాసి నాయకులతో మాట్లాడిన. మేమే మునగాల్నా అని వారంటారు. అక్కడా అంతర్రాష్ట్ర వివాదం. యథావిథిగా నీళ్లు ధవళేశ్వరం పోవాలి. ఏ ప్రాజెక్టు చూసిన ఇదే పద్ధతి. ఇపుడు దేవాదులను రక్షించుకోవాలి.. వరంగల్ జిల్లాకు నీళ్లు తెచ్చుకోవాలి. ఛత్తీస్‌గఢ్‌తో వివాదం లేకుండా ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లాల మధ్య తుపాకుల గూడెం వద్ద బ్యారేజీ నిర్మిస్తున్నాం. ఇక్కడ రెండువైపులా తెలంగాణ రాష్ట్రమే ఉంటుంది. 11,500 ఆదివాసీల భూముల ముంపు లేకుండా పొలాలకు నీళ్లు పారుతాయి. ఇది ప్రజలకు నష్టమా..? తెలంగాణకు ప్రమాదమా? సభ్యులు చెప్పాలి.

ఎందుకు పారిపోయారో జవాబు చెప్పాలి… దురదృష్టం.. ఒక జాతీయ పార్టీగా చెప్పుకునే ప్రధాన ప్రతిపక్షం సభ నుంచి ఎందుకు పారిపోయిందో అర్థం కాదు. ఏ బేషజాల కోసం, ఎవరి క్షేమం కోరి, ఏం ఆశించి… సభ నుంచి పారిపోయినరో జవాబు చెప్పాలి. సభ ద్వారా ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఏవిధంగా ముందుకుపోదామో చర్చిద్దామని చెప్తే.. అసెంబ్లీ నుంచి పారిపోయి.. బయట అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నరు. వాళ్లు అట్ల బతికారని, మమ్మల్ని అట్లనే బతకమంటే ఎట్లా? పాలమూరు నాయకులు వాళ్ల ప్రాజెక్టుకే అడ్డుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు రైతుల దగ్గరికిపోయి రూ.15 లక్షలిస్తే తప్ప భూములియ్యకండని చెప్తున్నరు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక నాయకుడు హైకోర్టుకు వెళ్తరు. మిషన్ భగీరధ మీద ఒక ఎంపీ కంప్లయింట్ చేస్తరు. ప్రాణహిత-చేవెళ్లపై పబ్లిక్ లిటిగేషన్ పిల్ వేసేందుకు సిద్ధమవుతున్నరని తెలిసింది.

చిల్లర పంచాయితీలా? నీళ్లా? రైతుల కన్నీళ్లు చూసి తెలంగాణలో శాశ్వత కరువు లేకుండా చేద్దామని అనుకుంటున్నామే తప్ప చిల్లర రాజకీయాల కోసం కాదు. మనకు కావాల్సింది.. మహారాష్ట్రతో పంచాయితీనా? మన పొలాల్లోకి నీళ్లా? ప్రభుత్వం పంచాయితీలకు పోదు. భేషజాలకు పోయి పిచ్చి పంచాయితీలు పెట్టుకోదలచుకోలేదు. మహారాష్ట్రతో సయోధ్య కొనసాగిస్తాం. ఆ రాష్ట్ర సీఎంను రప్పించి కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తం. ఆఘమేఘాల మీద పనులు చేపడతం. కలిసి వచ్చే వాళ్లు కలిసిరండి. మంచి సూచనలు చేయండి. కొందరు కుహనా మేధావులను తయారుచేసి జనాన్ని కన్ఫ్యూజన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నరు.

ఇదీ మన జలవనరుల చరిత్ర.. మన కాకతీయ, రెడ్డి రాజులు వాటర్‌షెడ్‌ను చేపట్టి ప్రపంచానికి చూపారు. 75 వేల పైచిలుకు గొలుసుకట్టు చెరువులు కట్టారు. కులీకుత్‌బ్‌షాహీ రాజులు వేటకు పోయి నౌబత్‌పహాడ్ ఎక్కినప్పుడు కనిపించిన సరస్సు హుస్సేన్‌సాగర్. ఇంతమంచి జలవనరును తటాకంగా ఎందుకు మార్చకూడదు.. అని హుస్సేనీశావలికి నిర్మాణ బాధ్యత అప్పగిస్తే దాన్ని పూర్తిచేశారు. అసఫ్‌జాహీలు ఇంకో అడుగు ముందుకేశారు. కాకతీయుల కాలంలో కట్టిన లక్నవరం, రామప్ప, పాకాల, గణపురం చెరువులు 50వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాయి. నిజాం ఫ్రాన్స్ టెక్నాలజీతో నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. ప్రపంచంలో తొలి అతిపెద్ద మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇది. 2.5లక్షల ఎకరాలకు నీరు అందించారు. ఇంకో 20-30వేల ఎకరాలకు అదనంగా నీరు వచ్చేది. ఒకప్పుడు తెలంగాణలో సంపన్నమైన జిల్లాగా నిజామాబాద్ ఉండేది. ఇవాళ అక్కడి నుంచే దుబాయి, బొంబాయి పోతున్నారు. సమైక్య రాష్ట్రంలో దుస్థితి ఇది. గణపురం, అప్పర్‌మానేరు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను అసఫ్‌జాహీలు కట్టించారు. ఇదంతా చరిత్ర. ఇవన్నీ వాస్తవాలు. ఎవర్నో విమర్శించడానికో, నిందించడానికో కాదు.

పొరుగు రాష్ట్రంగా ఇచ్చిపుచ్చుకోవాలని చంద్రబాబుకు చెప్పిన. కలహించుకోవడం మంచిది కాదు. కృష్ణా, గోదావరి నీటిని అందుబాటులో ఉన్నంత వరకు కలిసి వాడుకుందాం. చీటికిమాటికి చిల్లర పంచాయితీలు వద్దని ఈ సభ ద్వారా ఏపీ సీఎం చంద్రబాబుకు అప్పీల్ చేస్తున్న.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.