Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నాటికీ నేటికీ ఎంత తేడా!

ఒకప్పుడు హైదరాబాదులో భూమి కనిపిస్తే కబ్జా. ఒక సందర్భంలో ఒక ఎమ్మెల్యే అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. మా డాక్టర్‌ మిత్రుడి ప్లాట్‌ను ఒక కార్పొరేటర్‌ కబ్జా చేస్తే, ఆ ప్రాంత ఎమ్మెల్యేను సంప్రదించాం. ‘డాక్టర్‌ సాబ్‌, ఖాళీ ప్లాట్‌ అంటే… అందరికి ఆశ పుడ్తది. మీరు ఇల్లు కట్టుకోకుండా తప్పు చేశారు’ అని ఆ ఎమ్మెల్యే అన్నడు! ఇదీ ఉమ్మడి పాలనలో తెలంగాణ దుస్థితి. అన్నింటా దురాక్రమణే. ఇలాంటి దురాక్రమణ, వివక్షల్లోంచే తెలంగాణ ఆకాంక్ష పురుడుపోసుకున్నది. కేసీఆర్‌ దీక్షా దక్షతలతో తెలంగాణ రాష్ట్రం సాకారమైంది.

తెలంగాణ ప్రాంతంలో భూములు ఎంత అగ్గువ అంటే, అనేక సంస్థలు రైతులకు నామమాత్రపు ధరలిచ్చి వందల ఎకరాలు తీసుకొనేవి. స్మశానవాటికను తలపించేలా నాలుగు కడీలు, ఒక పాత ఐరన్‌ గేటు పెడితే… అది ప్లాటు. పాంచాలికి ఐదుగురు భర్తలు అన్నట్టు.. ఒక్క ప్లాట్‌ను ఐదుగురికి అమ్మేది. కొన్నవాళ్ళు తన్నుకు చచ్చేది. అది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం! ఇక శాంతి భద్రతల సంగతి సరేసరి. రోజూ ఎవరో ఒకరు చందాల కోసం వచ్చేది. పార్టీ చందాలు, గణేశ్‌ చందా దందాలు, పొలిటికల్‌, ప్రొటెక్షన్‌ దందాలు ఇలా కొన్ని వర్గాల సంపాదన చందాలతోనే సాగేది.

రైతుల కష్టాలు వర్ణనాతీతం. నీళ్ళు పడని బోర్లు. నకిలీ విత్తనాల దందా ఒక సమాంతర వ్యాపారం. ఎరువుల కొరకు నిలబడ్డ రైతుల కష్టాలను సిరీస్‌గా సినిమాలు తీయొచ్చు. పోలీస్‌ స్టేషన్లలో ఎరువులకు భద్రత.. అదేదో లంకె బిందెల లాగ! ఎండకాలం వస్తే అద్దె బావులు, ట్యాంకర్లు. స్థానిక నాయకులకు నిద్రలేని రాత్రులు. ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరిగేవారు. ఎందుకంటే మహిళలు ఖాళీ బిందెలతో ఎప్పుడు, ఏ సమయంలో ధర్నాకొస్తరోనన్న భయం. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే రైతులు చందా వేసుకొని, ఎలక్ట్రిసిటీ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేయవలసి వచ్చేది.

నేను కొత్తగా ఎంపీ అయిన తర్వాత వలిగొండ మండలంలో ఒక చెరువు దగ్గరికి వెళ్ళాను. దాంట్లో నీళ్లు ఎప్పుడు ఉండేవని అక్కడివారిని అడిగిన. ఆ ఊర్లో 30-40 ఏండ్ల వయస్సున్న వాళ్లు వారు పుట్టినాక ఆ చెర్లో నీళ్లు చూడలేదని చెప్తే ఆశ్చర్యపోయిన. అదీ పరిస్థితి. కులవృత్తులు ధ్వంసం. చేనేత కార్మికుల ఆర్తనాదాలు, గీత కార్మికుల దుకాణాలు బందు. మత్స్య కార్మికులకు సమస్య లేదు, ఎందుకంటే నీళ్లు లేవు, చేపలు లేవు. ఇలా అన్ని వృత్తులూ డీలా పడ్డాయి. ఇక రాజకీయాలు అని చెప్పటం కన్నా బానిసత్వ రాజకీయాలని చెప్పడం సబబు. నాకు తెలిసిన, 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఒక తెలంగాణ నాయకుడు, మళ్ళా ఎమ్మెల్యే సీటు కోసం సీమాంధ్ర నాయకుడి దగ్గర ఆత్మ చంపుకొని ప్రాధేయ పడటం చూశాను.

తెలంగాణ వచ్చింది, రోజులు మారాయి. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారంలోకి పోతదన్న నాటి ముఖ్యమంత్రి రాజకీయ జీవితం అంధకారంలోకి వెళ్లింది. 2014లో తలసరి విద్యుత్‌ 1,110 యూనిట్లు ఉంటే, ఇప్పుడు 2,012 యూనిట్లకు పెరిగింది. ఇది జాతీయ సగటు కంటే 73 శాతం అధికం. సీఎం కేసీఆర్‌ దృఢ సంకల్పంతో.. సముద్ర మట్టానికి 100 మీటర్ల ఎత్తులో ఉన్న నదీ జలాలను దాదాపు 600 మీటర్లకు లిఫ్ట్‌ చేసుకుంటున్నాం. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. దీంతో అన్ని రకాల పంటల ఉత్పత్తి 2013-14లో 205.33 లక్షల టన్నులుంటే, 2020-21 నాటికి 303.80 లక్షల టన్నులకు పెరిగింది. ఒకప్పుడు ఆంధ్రలో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు కొనగలిగేవారు. ప్రస్తు తం తెలంగాణలో ఒక ఎకరం భూమి అమ్మితే సీమాంధ్రలో 30 ఎకరాలు కొనే పరిస్థితి వచ్చింది.

విస్తీర్ణం పరంగా దేశంలో మనది 11వ స్థానం కాగా, జనాభాలో 12వ స్థానం. అయినా ఎగుమతులతో ఐదో స్థానంలో ఉన్నాం. 2014లో 5 లక్షల కోట్లు ఉన్న తెలంగాణ స్థూల ఆదాయం 2021లో 11 లక్షల కోట్లు దాటింది. 1.25 లక్షలు ఉన్న తలసరి ఆదాయం 2.5 లక్షలుగా పెరిగింది. గత ఎనిమిదేండ్లలో 17,234 పరిశ్రమల స్థాపన జరిగింది. 2,20,601 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దాదాపు 16 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పన జరిగింది. ఐటీరంగం ఎగుమతులు 2014లో 57,000 కోట్ల నుంచి నేడు 1,50,000 కోట్లకు పెరిగాయి. కేసీఆర్‌ పాలన తెలంగాణ సంక్షేమానికి ట్రేడ్‌మార్క్‌గా మారింది. ఆసరా పెన్షన్లు, రైతు బంధు, రైతు బీమా, వ్యవసాయానికి ఉచిత కరెంటు, కల్యాణ లక్ష్మి , గురుకుల పాఠశాలలు, విదేశీవిద్య వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా మారాయి. రాష్ట్ర బడ్జెట్లో 35శాతం సంక్షేమానికి కేటాయించడం గమనార్హం.

ఇప్పటికే కేసీఆర్‌ సింగపూర్‌ తరహాలో అభివృద్ధికి ప్రణాళికతో ఉన్నారు. కేటీఆర్‌ ముందుచూపు తో ఐటీ రంగాన్ని మరింత విస్తరి స్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలో ప్రగతి సాధించటానికి కేసీఆర్‌ రాజకీయ చతురత, పరిపాలనా దక్షతే కారణం. అలాగే కేసీఆర్‌ ఇచ్చిన ప్రతి పిలుపును అందుకొని అమలు చేస్తున్న ఉద్యమ స్ఫూర్తిగల టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు భవిష్యత్‌ వనరులు, బాటసారులు అనటంలో సందేహం లేదు.

(వ్యాసకర్త: డాక్టర్‌ బూర నర్సయ్య గౌడ్‌, మాజీ ఎంపీ,భువనగిరి)

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.