-మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం -కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితంచేసిన సీఎం కేసీఆర్ -విశిష్ట అతిథిగా గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ -ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర, ఏపీ సీఎంలు.. ఫడ్నవీస్, జగన్ -మేడిగడ్డ బరాజ్ నుంచి నీటిని విడుదలచేసిన సీఎం -కన్నెపల్లి పంప్‌హౌస్‌లో మోటర్ల వెట్న్‌క్రు శ్రీకారం -మేడిగడ్డ వద్ద జలాశయ ప్రతిష్ఠాంగ యాగం చేసిన సీఎం దంపతులు -కన్నెపల్లిలో జలసంకల్ప మహోత్సవ యాగ నిర్వహణ -డెలివరీ సిస్టర్న్ వద్ద పూజలు -నిర్మాణానికి రుణం ఇచ్చిన బ్యాంకర్లకు సన్మానం -గంగమ్మను తెచ్చిన తెలంగాణ శివుడు -మిగతా బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను ప్రారంభించిన మంత్రులు -పులకించిన తెలంగాణ సమాజం -రాష్ట్రమంతటా మిన్నంటిన సంబురాలు -ప్రతి హృదయ స్పందనలో గోదారి గలగలలు -కేకులు కట్‌చేసి, మిఠాయిలు పంచుకొని.. పటాకులు పేల్చి పండుగ చేసుకొన్న ప్రజలు -జనంతో మమేకమైన ప్రజాప్రతినిధులు ఇంజినీరింగ్ అద్భుతం కాళేశ్వరం -40 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయనున్న ప్రాజెక్టు -రెండు టీఎంసీలు.. రెండు పంటలకు నీళ్లు -రాష్ట్ర వ్యవసాయరంగంలో సువర్ణాధ్యాయం ప్రారంభం -తెలంగాణ జాతి గమనాన్ని మలుపు తిప్పనున్న కాళేశ్వరం

ఉరుకుల గోదావరి వెనుకకు నడక మొదలుపెట్టింది. గంగమ్మను ఒడుపుగా ఒడిసిపట్టుకొని తెలంగాణ భూములవైపు మళ్లించి.. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణకు మహాశివుడై నిలిచాడు. ప్రాణహితను జనహితంగా మలచిన ఘనుడు ఆయన. తెలంగాణ జాతి గమనాన్ని మలుపుతిప్పిన మనీషి. దశాబ్దాల తరబడి అనేక క్షోభలకు గురైన తెలంగాణలో దీపం వెలిగించాడు. తరతరాల తెలంగాణ స్వప్నాన్ని సాకారంచేశాడు. కాళేశ్వరాన్ని తెలంగాణ సాగునీటి కష్టాలకు ముక్తీశ్వరంగా మార్చాడు. ఇవాళ నిజంగా తెలంగాణకు పండుగ రోజు. తెలంగాణ నాగలికి, అదునుకు పదును అందిన సమయమిది. వానరాకడ కోసం ఇన్నేండ్లుగా మబ్బులవైపు ఎదురుచూసిన తెలంగాణ బీళ్లు ఇవాళ మనస్ఫూర్తిగా నవ్వుతున్నాయి. తెలంగాణలోని ప్రతి హృదయ స్పందనలోనూ వినిపిస్తున్నది గోదావరి గలగలలే.. ప్రతి గొంతు నినదిస్తున్నది జల జయహేనని.

తెలంగాణ చరిత్రలో శుక్రవారం మహోజ్వల ఘట్టం ఆవిష్కారమైంది. సువర్ణ జల అధ్యాయం మొదలయింది. ఇక నీళ్లు దుముకుతాయి. కొత్త నేలలు తడుస్తాయి. పొలాలు పులకరిస్తాయి. ఏడాది పొడవునా పచ్చదనం పరచుకొని పరవశించిపోతాయి. నలభై లక్షల ఎకరాల్లో సిరులు కురుస్తాయి. ఆర్థిక రంగం పరిపుష్టమవుతుంది. కాళేశ్వరం ప్రారంభం కోసమే ఎదురుచూస్తున్నట్టుగా ముఖ్యమంత్రి మహాజల సంకల్పయాగానికి మెచ్చిన వరుణుడు తెలంగాణను శుక్రవారమే తొలకరితో పులకింపజేశాడు. తెలంగాణలో గోదావరి నదికి నడక నేర్పిన ఇంజినీరింగ్ మహాద్భుతం కాళేశ్వరం. కాలంతో పోటీ పడి ఈ అద్భుతాన్ని పూర్తిచేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎత్తులో ఉన్నవాళ్లకు నీళ్లు రావన్న నీటి కథలను దశాబ్దాలపాటు విన్న తెలంగాణ.. ఇవాళ ఎత్తులోకి నీళ్లు ఎలా పారించాలో కాళేశ్వరం రూపంలో పాఠాలు చెప్తున్నది. విశిష్ట అతిథి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ సమక్షంలో.. పొరుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, జగన్మోహన్రెడ్డి సాక్షీభూతులుగా నిలువగా.. ప్రపంచంలోనే అతి పెద్ద.. బహుళ దశల ఎత్తిపోతల పథకం కాళేశ్వరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ జాతికి అంకితంచేశారు. వివిధ దశల్లోని పంప్‌హౌస్‌లు, బరాజ్‌లు, మోటర్లను రాష్ట్ర మం త్రులు ప్రారంభించారు. వాడవాడల్లో, గ్రామగ్రామాల్లో జల సంబురాలు మిన్నంటాయి. ప్రజాప్రతినిధులు ప్రజలతో మమేకమై పండుగ చేసుకొన్నారు.

తెలంగాణ ప్రజల కల సాకారమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు స్వప్నం నెరవేరిం ది. కోటి ఎకరాలకు సాగునీరు అందించే దిశ లో ముందుకువెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు గవర్నర్ నరసింహన్ విశిష్ట అతిథిగా.. ఏపీ, మహారాష్ట్ర సీఎంలు వైఎస్ జగన్మోహన్రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ వానకాలం నుంచే కాళేశ్వరంతో నీరిస్తామని కొద్ది నెలల క్రితం ప్రకటించిన సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రారంభించి మాట నిలబెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంపుహౌస్‌ను గవర్నర్ నరసింహన్, ఏపీ, మహారాష్ట్ర సీఎంలు జగన్మోహన్రెడ్డి, దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి సీఎం కేసీఆర్ ప్రారంభించారు.

జలాశయ ప్రతిష్ఠాంగ యాగంతో నాంది ముందుగా మేడిగడ్డకు చేరుకొన్న సీఎం కేసీఆర్, శోభ దంపతులు ఉదయం 9.12 నుంచి 10.57 గంటల వరకు జలాశయ ప్రతిష్ఠాంగ యాగం నిర్వహించారు. ఈ హోమంలో వరుణసంకల్పం, గణపతి, గంగాదేవి పూజతోపాటు అగ్నిపూజ కూడా జరిపారు. ఫణిచాణుక్యశర్మ ఆధ్వర్యంలోని వేదపండితులు హో మం నిర్వహించారు. బరాజ్ వ్యూ పాయింట్ వద్ద జరిగిన ఈ హోమం అనంతరం సీఎం కేసీఆర్ రిబ్బన్ కట్‌చేసి మేడిగడ్డ బరాజ్‌ను ప్రారంభించడంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మహాఘట్టం ఆవిష్కృతమైంది. తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మేడిగడ్డ బరాజ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అతిథులకు బహుమతులు అందించి పుష్పగుచ్ఛాలతో సత్కరించారు. తర్వాత మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటోఎగ్జిబిషన్‌ను ఏపీ, మహారాష్ట్ర సీఎంలు, గవర్నర్ తిలకించారు. సీఎం కేసీఆర్ భారీ స్క్రీన్ల ద్వారా వీరికి కాళేశ్వరం ప్రాజెక్టు పనితీరును వివరించారు. అనంతరం బరాజ్ వంతెన పైకి చేరుకొని పసుపు, కుంకుమతోపాటు నాణేలను ముగ్గు రు సీఎంలు గోదావరి నదికి సమర్పించారు. బరాజ్‌కు అనుబంధంగా గోదావరినదిపై తెలంగాణ, మహారాష్ట్రల మధ్య నిర్మించిన బ్రిడ్జిని కూడా ప్రారంభించారు. ముగ్గురు ముఖ్యమంత్రులు, గవర్నర్ ఒకే కారులో తెలంగాణ సరిహద్దు నుంచి బరాజ్ మీదుగా మహారాష్ట్ర సరిహద్దు వరకు ప్రయాణించారు.
కన్నెపల్లి మోటర్ల వెట్న్ ప్రారంభం మేడిగడ్డ బరాజ్ దగ్గర కార్యక్రమం ముగిసిన తర్వాత తెలంగాణ, ఏపీ సీఎంలు కేసీఆర్, జగన్, గవర్నర్ నరసింహన్ కన్నెపల్లి పంపుహౌస్ వద్దకు చేరుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ మేడిగడ్డ నుంచి నేరుగా కాళేశ్వరం దేవస్థానానికి వెళ్లి కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. మేడిగడ్డ నుంచి నేరుగా కన్నెపల్లి పంపుహౌస్‌వద్దకు వచ్చిన సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, గవర్నర్ నరసింహన్ అక్కడ జరుగుతున్న జల సంకల్ప మహోత్సవ యాగం పూర్ణాహుతి కా ర్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఉష దంపతుల ఆధ్వర్యం లో ఈ యాగం జరిగింది. అనంతరం పంపుహౌస్ వద్ద ఎత్తిపోత కోసం ఫోర్‌బేలో నిల్వఉన్న నీటిని చూశారు. పంప్‌హౌస్ అడుగుభాగంలో ఏర్పాటుచేసిన పంపుల వద్దకు వెళ్లి చూశారు. సీఎం కేసీఆర్.. పంపుల సామర్థ్యం, ఉపయోగంపై ఏపీ సీఎం జగన్‌కు విపులంగా చెప్పారు. మేఘా ఇంజినీరింగ్ కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి అతిథులకు నిర్మాణాల విశిష్టతలను వివరించారు. గవర్నర్ నరసింహన్ రిబ్బన్ కట్‌చేసి కన్నెపల్లి పంపుహౌస్‌ను ప్రారంభించారు. ఇద్దరు సీఎంలు కలిసి ఇక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తర్వాత లిఫ్ట్ ద్వారా పంపుహౌస్‌లోని రెండో అంతస్తుకు చేరుకొని స్విచ్ ఆన్‌చేసి ఆరోనంబర్ మోటర్ వెట్న్ ప్రా రంభించారు. దీంతో పవిత్ర గోదావరి జలాలను తెలంగాణ బీడు భూములకు మళ్లిం చే భగీరథ ప్రయత్నమైన బృహత్తర కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయింది. ఇక్కడినుంచి కిలోమీటర్ దూరంలో ఉన్న డెలివరీ సిస్టర్న్ వద్దకు చేరుకొన్నారు. ఎత్తిపోతతో డెలివరీ సిస్టర్న్ వద్ద గ్రావిటీ కెనాల్లో మోటర్లు పోసిన గోదావరి జలాలను చూసి ముఖ్యమంత్రులు, గవర్నర్, ఇతర ప్రముఖు లు ఆనందం వ్యక్తంచేశారు. గోదావరిలో పూలు చల్లి నదీమతల్లికి నమస్కరించారు.
బరాజ్‌లు, పంప్‌హౌస్‌లను ప్రారంభించిన మంత్రులు మేడిగడ్డ దగ్గర సీఎం నీటిని విడుదల చేసిన సమయంలోనే అన్నారం బరాజ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి, అన్నారం పంప్‌హౌస్‌ను మంత్రి మహమూద్ అలీ, సుందిల్ల బరాజ్‌ను మంత్రి కొప్పుల ఈశ్వర్, పంప్‌హౌస్‌ను మంత్రులు కొప్పుల, మహమూద్‌అలీ, మేడారం పంప్‌హౌస్‌ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. లక్ష్మీపూర్ పంప్‌హౌస్ వద్ద మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అతిథులు, బ్యాంకర్లకు సీఎం సన్మానం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చిన ముఖ్యఅతిథులు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర, ఏపీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, జగన్మోహన్రెడ్డిలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించిన వివిధ బ్యాంకుల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించి జ్ఞాపికలు అందించారు. సన్మానం పొందినవారిలో ఆంధ్రాబ్యాంకు ఎండీ, సీఈ వో జే పాక్రిసామి, ఇండియన్ బ్యాంక్ ఈడీ ఎంకే భట్టాచార్య, ఆర్ఈసీ లిమిటెడ్ డైరెక్టర్ (టెక్నికల్) ఎస్కే గుప్తా, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ (కమ్యూనికేషన్స్) పీకే సింగ్, అలహాబాద్ బ్యాంక్ ఈడీ కే రామచంద్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్‌కామర్స్ ఈడీ బాలకృష్ణ అల్సె, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈడీ హేమంత్ కుమార్ తమ్తా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జీఎం బినోద్‌కుమార్, నాబార్డ్ సీజీఎం విజయ్‌కుమార్, కార్పొరేషన్ బ్యాంక్ డీజీఎం అండ్ జోనల్ హెడ్ ఎంజే అశోక్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ హెడ్ హైదరాబాద్ ఎస్వీ రామకృష్ణ, ఆంధ్రాబ్యాంక్ జనరల్ మేనేజర్ శ్యామల్ గోష్ రె, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏజీఎం మొహమ్మద్ మఖ్సూద్ అలీ, ఇండియన్ బ్యాంక్ జోనల్ మేనేజర్ ఆర్ మనోహర్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ఎస్కేజోషి మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణంలో పాలు పంచుకున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పాల్గొన్న ప్రముఖులు ప్రారంభోత్సవ వేడుకల్లో రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, భూపాలపల్లి, మంథని ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, డీ శ్రీధర్‌బాబు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, పెద్దపల్లి, భూపాల్పల్లి, వరంగల్ రూరల్, కరీంనగర్ జెడ్పీ చైర్మన్లు పుట్ట మధుకర్, జక్కు శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, తుల ఉమ, టీఆర్ఎస్ నేతలు చల్లా నారాయణరెడ్డి, జీ కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, మహారాష్ట్ర డీజీపీ సుబోధ్‌కుమార్ జైశ్వాల్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ప్రాజెక్టు ఈఎన్సీలు ఎన్ వెంకటేశ్వర్లు, మురళీధర్‌రావు, హరిరామ్, ఎస్ఈ సుధాకర్‌రెడ్డి, ఈఈ రమణారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు, ట్రాన్స్‌కో డైరెక్టర్ సూర్యప్రకాశ్, ఎల్ అండ్ టీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్‌చంద్ నేతృత్వంలో జిల్లా ఎస్పీ ఆర్ భాస్కరన్తోపాటు పోలీసు అధికారులు భద్రతను పర్యవేక్షించారు.
ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసిన చారిత్రక సందర్భం నదీ జలాల వాటాలు, పంపకాల విషయంలో ఇటు రాష్ర్టాల మధ్య, అటు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తుతున్న పరిస్థితుల్లో గోదావరి పరీవాహక ప్రాంతానికి చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొనడం చరిత్రలో నిలిచిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర వివాదాల నేపథ్యంలో తెలంగాణ ప్రాజెక్టులు ముందుకుపడలేదు. నిన్న మొన్నటివరకు ఏపీతోనూ వివాదాలు ఉండేవి. ఏపీలో మొన్నటి వరకు ఉన్న ప్రభుత్వం నీటివాటాలు, పంపకాల విషయంలో పేచీలు పెట్టింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఏర్పడిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహపూర్వక దౌత్యసంబంధాలు నడిపారు. గోదావరి జలాలు ప్రతీ ఏటా వేల టీఎంసీల చొప్పున సముద్రంపాలు కావడం కన్నా సమర్థంగా వాడుకోవాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

అసాధారణ ఏర్పాట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ ఏర్పాట్లు అతిథులను అబ్బురపరిచాయి. దట్టమైన అటవీ ప్రాంతమైనప్పటికీ అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేయడంలో రాజీపడలేదు. ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను వివరించేందుకు ఏర్పాటుచేసిన ఎల్ఈడీ స్క్రీ న్లు, యాగశాల, భోజన వసతులు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రాజెక్టు వెళ్లేమార్గాల్లో కిలోమీటర్ల కొద్దీ బారికేడ్లు ఏర్పాటుచేశారు. ప్రాజెక్టు పరిసరాల్లో వీవీఐపీలను ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. వీవీఐపీల కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. బరాజ్‌ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. కన్నెపల్లి గ్రామస్థులందరికీ స్థానికంగా భోజనం ఏర్పాటుచేశారు.
అన్నింటికీ తానే మార్గదర్శి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అన్నీతానై వ్యవహరించారు. మేడిగడ్డ యాగం మీద కూర్చున్న సమయంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్రెడ్డి యాగశాల వద్దకు రాగానే తానే వెళ్లి వారిని సాదరంగా ఆహ్వానించారు. వేదపండితుల చేత యాగంలో వారిని భాగస్వామ్యం చేసేందుకు పురమాయించారు. యాగం అనంతరం మేడిగడ్డ ప్రాజెక్టు వద్ద ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్లో తానే గైడ్‌గా మారి కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో దశను పూసగుచ్చినట్టు వివరించారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మినీ థియేటర్లో ప్రాజెక్టు దశల్ని వివరించారు. అక్కడి నుంచి అతిథులను బరాజ్ వద్దకు తీసుకెళ్లిన సందర్భంలోనూ సీఎం ఒక ఇంజినీర్లా వ్యవహరించారు. గోదావరి నీటి వినియోగానికి ప్రాజెక్టుల ఆవశ్యకతను గుర్తించిన విధానాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులకు వివరించారు. మేడిగడ్డ బరాజ్ ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నీరు అందిస్తున్నది విడమరిచి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్రతో చేసుకున్న చారిత్రక ఒప్పందమే కీలకమని ముఖ్యమంత్రి అన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్ని రకాలుగా సహకరించారని కృతజ్ఞతలు తెలిపారు. కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలన సందర్భంలోనూ అదే ఒరవడిని కొనసాగించారు. తమ ఇంటికి వచ్చిన అతిథులకు ఎక్కడా ఏ చిన్నలోటు రాకుండా చూసుకున్నారు. భవిష్యత్ సంబంధ బాంధ్యవాల కొనసాగింపు విషయంలో అటు మహారాష్ట్ర, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మధ్య మైత్రిని మరింత బలోపేతం చేయాలన్న సంకల్పంతో కేసీఆర్ అతిథులను సత్కరించారు.
తెలంగాణ ముఖచిత్రం మారనుంది -కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు -సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్

కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్టు అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కొనియాడారు. తక్కువ సమయంలో ఇంతపెద్ద ప్రాజెక్టును పూర్తిచేసి పనులు ప్రారంభించుకోవడం శుభపరిణామమని, ఇందుకు సీఎం కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చనున్నదని పేర్కొన్నారు. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఆయన కాళేశ్వరాలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల మధ్య స్నేహపూర్వక వాతావరణం మరింత బలపడిందని, ఈ సంప్రదాయం భవిష్యత్‌లో కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

కాళేశ్వరం ద్వారా లక్షలమంది రైతులకు మేలు జరుగనున్నదని, రాష్ట్రంలో కరువనేది లేకుండాపోతుందన్నారు. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నందుకు సంతోషంగా ఉన్నదని చెప్పారు. మహారాష్ట్ర ప్రజలు.. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బహుమతి ఈ కాళేశ్వరం ప్రాజెక్టని పేర్కొన్నారు. చిన్నప్పుడు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోని కాళేశ్వరం దేవాలయానికి గోదావరి ఒడ్డునుంచి పడవలో వచ్చి దర్శించుకునేవాడినని ఫడ్నవీస్ గుర్తుచేసుకున్నారు. అప్పటినుంచే తనకు కాళేశ్వరం దేవాలయం అంటే ఎంతో భక్తి అని, ఇప్పుడు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావడం.. కాళేశ్వరంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం దృఢసంకల్పాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆలయంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అధికారులు పలికిన ఘనస్వాగతం ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ కాళేశ్వర ఆలయానికి ఇలానే వచ్చి దర్శించుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు, కాళేశ్వరం దేవాలయం చైర్మన్ వెంకటేశం, ఈవో మారుతి తదితరులు పాల్గొన్నారు.
ఫడ్నవీస్‌కు సాదర స్వాగతం కాళేశ్వరం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు నాందేడ్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఘనంగా స్వాగతం లభించింది. శుక్రవారం ఉదయం బేగంపేట విమానాశ్రయానికి వచ్చిన ఆయనను రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ సాదరంగా ఆహ్వానించారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువాకప్పి స్వాగతం పలికారు.
మహోజ్వల ఘట్టం కాలక్రమం -ఉ.9.12 గంటల నుంచి 10.57 గంటల వరకు మేడిగడ్డ వద్ద యాగం నిర్వహించిన సీఎం దంపతులు.. పాల్గొన్న అతిథులు -ఉ.11 గంటల నుంచి 11.20 గంటల వరకు మేడిగడ్డ బరాజ్ వద్ద గోదావరి మాత విగ్రహ ప్రతిష్ఠ -కాళేశ్వరంపై ఫొటో ఎగ్జిబిషన్ తిలకించిన అతిథులు -పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాజెక్టు విజయాల వివరణ -11.23 గంటలకు మేడిగడ్డ బరాజ్ వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించి కాళేశ్వరం ప్రాజెక్టును లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -11.26 గంటలకు రిబ్బన్ కట్ చేసి మేడిగడ్డ బరాజ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ -మేడిగడ్డ బరాజ్‌కు అనుబంధంగా నిర్మించిన బ్రిడ్జి గుండా మహారాష్ట్ర సరిహద్దుల వరకూ వెళ్లిన అతిథులు -మేడిగడ్డ నుండి కన్నెపల్లి బయలుదేరిన అతిథులు -మ1.07 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్ -మ.1.17 గంటలకు కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి ఉబికి వచ్చిన గోదావరి