Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నగరాలకు కొత్తదిశ

-ఘనంగా ప్రారంభమైన మెట్రోపొలిస్ సదస్సు -1309మంది దేశ, విదేశీ ప్రతినిధులు హాజరు -హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామన్న సీఎం కేసీఆర్ -నగరాల సవాళ్లకు పరిష్కారాలు చూపాలన్న వెంకయ్య నాయుడు -సోలార్ ప్యానెళ్లు, ఇంకుడు గుంతలు తప్పనిసరి చేయాలన్న గవర్నర్ -తొలిరోజే 12 అంశాలపై చర్చ.. పాల్గొన్న మాజీ రాష్ట్రపతి కలాం

KCR launching metropolis summit01 పదకొండో అంతర్జాతీయ మెట్రోపొలిస్ సదస్సు మంగళవారం మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్‌ఐసీసీ)లో ఘనంగా ప్రారంభమైంది. నగరాలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చలు జరిపి పరిష్కారాలు కనుగొనడమే ప్రధాన లక్ష్యంగా జరుగుతున్న ఈ సదస్సుకు 60 మంది విదేశీ మేయర్లు, 212మంది విదేశీ ప్రతినిధులు సహా మొత్తం 1309మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభ సదస్సును రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రసంగిస్తూ కీలకమైన ఈ సదస్సుకు నగరం వేదికకావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టేందుకు కృషిచేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో నగరీకరణ వేగంగా పెరుగుతున్నదని 40 శాతం జనాభా నగరాల్లోనే ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తమ రాజధానిలో ఈ సదస్సు నిర్వహించడం ముదావహమని పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నగరాల విస్తరణ, సమస్యలను సుదీర్ఘంగా విశ్లేషించారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అభినందించారు. కేంద్రం తరపున అన్నిరకాలుగా సహకారాన్ని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారతదేశంలో 31 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నదని, 2030 నాటికి అది 600 మిలియన్లకు చేరుకోనున్నందున నగరాలు ఎదుర్కోనున్న సవాళ్లకు ఈ సదస్సు పరిష్కారాలు సూచించాలని కోరారు.

గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ నగరాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారకుండా ఉండేందుకు సరియైన మౌలిక సదుపాయాలతోకూడిన శాటిలైట్ టౌన్‌షిప్‌లను అభివృద్ధిపరుచుకోవాల్సి ఉందన్నారు. పెరుగుతున్న అవసరాల మేరకు నీరు విద్యుత్ అందించడం తలకు మించిన భారంగా మారుతున్నందున గృహాలపై సోలార్ ప్యానళ్లు, ఇంకుడు గుంతలు తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆయా దేశాలకు చెందిన నగరాల ప్రముఖులు తమ ఆలోచనలు, అనుభవాలను పంచుకునేందుకు మెట్రోపొలిస్ ఓ మంచి అవకాశమన్నారు. ఈ సందర్భంగా సుస్థిరమైన హైదరాబాద్ పుస్తకాన్ని వెంకయ్యనాయుడు, ఆర్ట్ ఆఫ్ తెలంగాణ పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. మెట్రోపాలిస్ సదస్సు అధ్యక్షుడు జీవన్ పాల్, జీహెచ్‌ఎంసీ మేయర్ మాజిద్ హుస్సేన్, కమిషనర్ సోమేష్ కుమార్, తదితరులు ప్రసంగించిన వారిలో ఉన్నారు.

12 అంశాలపై చర్చ.. సదస్సు తొలిరోజే 12 వివిధ అంశాలపై కూలకశంగా చర్చలు జరిగాయి. సిటీస్ ఫర్ ఆల్, సస్టేయినబుల్ హైదరాబాద్, ఫైనాన్స్ అర్బన్ ఇండియా, గ్లోబల్ వాటర్ లీడర్‌షిప్, బిజినెస్ ఆఫ్ సిటీస్ ఎకానమీ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్, థింక్ గ్లోబల్-యాక్ట్ లోకల్, ఈ-అర్బన్ గవర్నెన్స్ వంటి పలు అంశాలపై నిపుణులు సలహాలిచ్చారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం ఈ చర్చల్లో పాల్గొని ప్రసంగించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.