Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నాయుడు ద్వయం కుట్ర.. పోలవరం

-వెంకయ్య, చంద్రబాబు ఒత్తిడితోనే ఏడు మండలాలు సీమాంధ్రకు -తెలంగాణ టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఎవరివైపో తేల్చుకోవాలి -ఎయిర్‌పోర్టు పేరును మార్చడాన్ని ఎంతమాత్రం సహించం: హరీశ్‌రావు

పోలవరం ముసుగులో తెలంగాణలోని ఖనిజ సంపదను దోచుకునేందుకు ఇద్దరు నాయుడులు కుట్రలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఇద్దరు కలిసి పోలవరం ప్రాజెక్టు అర్డినెన్స్‌పై అబద్ధాలు, అవాస్తవాలు ప్రచారం చేసి తెలంగాణ ప్రజల గొంతు కోయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Harish Raoగురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరంలో ఏడు మండలాలను కలుపాలని తీసుకున్న నిర్ణయానికి టీఆర్‌ఎస్ సంబురాలు చేసుకున్నదని వెంకయ్యనాయుడు మాట్లాడటం హాస్యాస్పదమని దుయ్యబట్టారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను వెంకయ్యనాయుడు, చంద్రబాబులిద్దరూ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఉన్న పేరును మార్చుతామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు భగ్గుమన్నారు. అలా అనుకుంటే తెలంగాణ ప్రభుత్వం చాలా పేర్లు మార్చాల్సి ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఏ నిర్ణయం తీసుకోవడానికి వీలులేదన్న విషయం కూడా తెలియదా..? అని ప్రశ్నించారు. ఓ వైపు తెలంగాణకు వ్యతిరేకం కాదు అంటూనే, కుట్రలు చేస్తున్న చంద్రబాబు తీరు.. నోటితో నవ్వి నొసలితో వెక్కిరించిట్లుగా ఉందన్నారు. బీజేపీ నేత వెంకయ్య ఒత్తిడితోనే పోలవరం ప్రాజెక్టులో ఏడు మండలాలను చేర్చారు. ప్రాజెక్టు వ్యతిరేకంగా ఆరోజు పోరాటం చేసింది మేమే. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 2న కేసీఆర్ ప్రకటన కూడా చేశారు. పోలవరం పేరుతో కుట్ర జరుగుతుందని అదేరోజు జైపాల్‌రెడ్డితోసహా ఇతర ముఖ్య నేతలను హెచ్చరించాం. సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్పాం.

అసెంబ్లీ సలహాలు, సూచనలు లేకుండా రాష్ట్ర సరిహద్దులపై కేంద్రం నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని మార్చి 4న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి కూడా లేఖ రాశాం. అందుకే నిర్ణయం వాయిదా పడింది అని హరీశ్‌రావు తెలిపారు. రెండు లక్షల మంది గిరిజనులకు మరణశాసనం రాస్తున్న వెంకయ్య, చంద్రబాబుకు గిరిజనుల గోస తగులుతుందని దుయ్యబట్టారు. చింతూరులోని లోయర్ సీలేరులోని 460 మెగవాట్ల విద్యుత్‌ను తెలంగాణకు అందకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారు. అన్ని జల విద్యుత్ కేంద్రాలకయ్యే ఖర్చు కంటే సీలేరులో చౌకగా ఉత్పత్తి అవుతుంది. పోలవరంతో సీలేరు ప్రాజెక్టు మునిగిపోతుంది. దీంతో ప్రతి ఏటా తెలంగాణకు రూ కోట్ల నష్టం జరుగుతుంది.

ఈ భారం తెలంగాణపై వేసినట్లు కాదా..? తెలంగాణ బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడే.. పోలవరంలోని ఏడు మండలాలను చేర్చాలని వెంకయ్యనాయుడు పట్టుబట్టారు. దీని వెనుక చంద్రబాబు ఉన్నాడు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. గోదావరి నదిపై 160 టీఎంసీల నీళ్లు, బొగ్గు, ఖనిజ సంపదను తరలించుకుపోవాలనే కుట్ర జరుగుతున్నదని.. తెలంగాణ మెడపై సీమాంధ్ర నేతలు కత్తి పెడుతుంటే తెలంగాణ టీడీపీ, బీజేపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడంలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీపై ఒంటికాలుపై లేచే టీడీపీ తెలంగాణ నేతలు ఎర్రబెల్లి, మోత్కుపల్లికి ప్రజాకాంక్షలు పట్టవా..? అని నిలదీశారు.

కాంగ్రెస్ నేతత్వంలోని యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన అర్డినెన్స్ విధానాన్నే బీజేపీ అమలు చేసిందని ఆ పార్టీ నేతలు పేర్కొనడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ఆర్డినెన్స్ తెచ్చింది కాంగ్రెస్ అయితే, బీజేపీ ఆపొచ్చు కదా..? అని ఆయన ప్రశ్నించారు. తొలి క్యాబినెట్ సమావేశంలోనే ఆగమేఘాల మీద ఎందుకు అర్డినెన్స్ తీసుకువచ్చారో ఆ పార్టీ నేత కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.