Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నకిలీవిత్తన దందాపై ఉక్కుపాదం

– కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీయాక్ట్ కింద కేసులు
– కల్తీ విత్తనాల విక్రయం.. హత్యానేరం కన్నా తీవ్రం
– అలాంటివారిని కఠినంగా శిక్షించాల్సిందే
– అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం!
– విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వ నిర్ణయం
– రాష్ట్రవ్యాప్తంగా 15 టాస్క్‌ఫోర్స్ బృందాల ఏర్పాటు
– జిల్లా, మండల స్థాయిల్లోనూ ప్రత్యేక బృందాలు

కల్తీ విత్తనాల సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్న కల్తీ విత్తన వ్యాపారుల ఆటలు కట్టించాలని, రాష్ట్రంలో కల్తీ అన్నమాటే వినిపించకూడదని వ్యవసాయశాఖ, ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులను పురమాయించినట్టు సమాచారం. రైతులు వ్యాపారులను నమ్మి విత్తనాలు కొనుగోలుచేసి, ఆరుగాలం కష్టపడి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఎరువులు, పురుగు మందులు ఉపయోగించి, తీరా పంట చేతికి రాకపోతే ఎంతగా కుంగిపోతారో నాకు తెలుసు. కల్తీ విత్తనాల కారణంగా రైతులు ఆత్మహత్యలపాలవుతున్నారు. కల్తీవిత్తనాలు అమ్మడం హత్యానేరానికంటే మించినది. కల్తీ విత్తన వ్యాపారుల నడ్డి విరవాలి అని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. రాష్ట్రంలో నకిలీ విత్తనాల విక్రయానికి ఎట్టి పరిస్థితుల్లో స్థానం ఉండకూడదని సంకల్పించిన సీఎం కేసీఆర్.. నకిలీ విత్తనాలు తయారుచేసే కంపెనీలు, సరఫరాదారులపై చాలా కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కల్తీ విత్తనాలను మార్కెట్‌లోకి అడ్డదారిన సరఫరాచేసేవారిని, నిల్వచేసేవారిని గుర్తించి, పీడీయాక్ట్ కింద కేసులు నమోదుచేయాలని చెప్పారు. ఒకవైపు వానకాలం పంటలకు రైతన్నలు సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో ఇదే అదనుగా నకిలీ, కల్తీ విత్తనాలను అంటగట్టేవారు వస్తారని, ఇలాం టి వారిని ఏరిపారేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డీజీపీని ఆదేశించినట్లు తెలిసింది. ఈ దందా వెనుక ఎలాంటి వారున్నా.. ఎంతటి పెద్ద వ్యక్తులున్నా వదిలేప్రసక్తే లేదని స్పష్టంచేసినట్టు సమాచారం. నకిలీ విత్తనాల విషయంలో రాష్ట్ర డీజీపీ, వ్యవసాయాధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం చర్చించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా మార్కెట్‌లలో విస్తృతంగా తనిఖీలుచేసి, నకిలీ విత్తనాలను విక్రయించే వ్యాపారులను, ఏజెంట్లను ఆరెస్టుచేసి, పీడీయాక్ట్ నమోదు చేయాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది. కల్తీ విత్తన తనిఖీలలో ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఎక్కడెక్కడ నకిలీ విత్తనాల కేంద్రాలను గుర్తించారు? ఎంతమందిని అరెస్టుచేశారు? ఎన్ని పీడీ కేసులు నమోదయ్యాయి? అనే వివరాలపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. ఎన్ని టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటుచేశారంటూ తనిఖీలు నిర్వహిస్తున్న అధికారుల వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. రైతులు నమ్మకంతో విత్తనాలు కొని పంటవేస్తే చివరకు నకిలీ విత్తనాలతో పంట చేతికి రాకపోవడంతో అఘాయిత్యాలకు పాల్పడటం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఉండరాదని, కఠిన చర్యలుండాలని అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది.

పత్తి పండించే జిల్లాల్లో నకిలీ విత్తనాలు!
రాష్ట్రంలో నకిలీ విత్తనాల తయారీకేంద్రాలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. పాత రైస్‌మిల్లులు, పాడుబడిన బంగళాలు, రహస్య ప్రాంతాల్లో నకిలీవిత్తనాల తయారీ, ప్యాకింగ్ చేస్తున్నట్లు తెలిసింది. విత్తనవ్యాపారులు, ఫర్టిలైజర్ యజమానులు కుమ్మకై వాటిని రైతులకు అంటకడుతున్నారు. పత్తి ఎక్కువగా సాగయ్యే వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, సూర్యాపేట, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కామారెడ్డి తదితర జిల్లాల్లో నకిలీ విత్తనాల తయారీ, మార్కెటింగ్ జరుగుతున్నదని విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రస్థాయిలో 15 టాస్క్‌ఫోర్స్ బృందాలతో తనిఖీలు
వానకాలం సీజన్ ప్రారంభానికి ముందే మార్కెట్‌లోకి పెద్ద ఎత్తున నకిలీ విత్తనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని భావించిన వ్యవసాయశాఖ.. రాష్ట్రస్థాయిలో 15 టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేసింది. వీటితోపాటు జిల్లా, మండల స్థాయిలో కూడా టాస్క్‌ఫోర్స్ టీంలను ఏర్పాటుచేసింది. ప్రతి బృందంలో ఒక వ్యవసాయాధికారి, విత్తన ధ్రువీకరణ అధికారి, పోలీస్ అధికారి, వ్యవసాయ అనుబంధ విభాగాల అధికారి ఉంటారు. ఈ టీంలు మార్కెట్‌లోని విత్తన దుకాణాలు, కంపెనీ గోదాముల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. శనివారం ఆరు బృందాలు తనిఖీలు నిర్వహించగా, సోమవారం ఒక బృందం ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పర్యటించింది. శనివారం మంచిర్యాల, సికింద్రాబాద్‌లో కేసులు నమోదయ్యాయని, సోమవారం ఆసిఫాబాద్‌లో ఒక కేసు నమోదైందని అధికారులు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.