Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నల్లగొండకు వరాలే వరాలు

-పట్టణ అభివృద్ధిపై సీఎం కేసీఆర్‌ సమీక్ష
-ఇప్పటికే ప్రారంభమైన పనులపై పరిశీలన
-నల్లగొండ కళాభారతి సాంస్కృతిక కేంద్రం,ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణాలపై ఆరా
-‘సాగర్‌’ పనుల పురోగతిపైనా సీఎం చర్చ

నల్లగొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరిన్ని వరాలు ప్రకటించారు. గత డిసెంబర్‌లో పర్యటించినపుడు పలు అభివృద్ధి పనులకు ఓకే చెప్పిన సీఎం.. తాజాగా, మరిన్ని అభివృద్ధి పనులను మంజూరు చేశారు.జిల్లాలోని నార్కట్‌పల్లిలో గురువారం ఎమ్మెల్యే చిరుమర్తి లిం గయ్య తండ్రి నర్సింహ దశదిన కర్మలో పాల్గొన్న సీఎం.. ఎమ్మెల్యే నివాసంలో సహపంక్తి భోజనం చేసిన అనంతరం అక్కడే, నల్లగొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌, జిల్లా అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా.. నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నుంచి నల్లగొండ పట్టణంలోకి ప్రవేశించే మర్రిగూడ బైపాస్‌ వద్ద ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. క్లాక్‌టవర్‌ సెంటర్‌లో ప్రస్తుతం ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌ స్థానంలో అధునాతన సౌకర్యాలతో నాలుగు అంతస్థుల అతిథి గృహాన్ని మంజూరు చేశారు. కలెక్టరేట్‌ ఆవరణలో ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి ఓకే చెప్పారు. వీటికి సంబంధించి వెంటనే జీవోలు జారీ చేయాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి సూచించారు. వీటి నిర్మాణాలు ఆరు నెలల్లోపు పూర్తి కావాలని ఆదేశించారు. ఎస్‌ఎల్‌బీసీలోని ఖాళీ స్థలంలో ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ ఇంజినీర్‌ కార్యాలయానికి నూతన భవనాన్ని మంజూరు చేస్తూ, నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని కార్యదర్శి స్మితాసబర్వాల్‌కు ఫోన్‌లో సూచించారు.

మిర్యాలగూడలో కోర్టు భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు విజ్ఞప్తి చేయగా, సీఎం కేసీఆర్‌ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల్లో జాప్యం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణాళికాబద్ధంగా నిర్దేశిత గడువులోగా పనులు పనులు పూర్తి కావాలని అన్నారు. గతంలో తాను ఆదేశించిన పనులు ఎంత వరకు వచ్చాయని ఆరా తీశారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను ఫొటోలతో సహా జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సీఎంకు వివరించారు. ఈ పనులపై సీఎం కేసీఆర్‌ సమీక్షిస్తూ నల్లగొండ పట్టణంలో అత్యాధునిక హంగులతో, ఆహ్లాదకరమైన రీతిలో కళాభారతి సాంస్కృతిక కేంద్రాన్ని 2 వేల మంది సామర్థ్యంతో తీర్చిదిద్దాలని సూచించారు.

పానగల్లు ఉదయ సముద్రం ట్యాంకుబండ్‌ను పచ్చదనంతో సుందరీకరించాలని చెప్పారు. పట్టణం చుట్టపక్కల గ్రామాల్లోని ప్రజలు సెలవుల్లో కుటుంబసభ్యులతో సహా వచ్చి ఆహ్లాదంగా గడిపేలా సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి ప్రముఖ ఆర్కిటెక్టుల నుంచి డిజైన్లు తెప్పించుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే ప్రారంభమైన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనులనూ సీఎం సమీక్షించారు. ఫొటోల నివేదికల ద్వారా పనుల పురోగతిని పరిశీలించారు. కుటుంబంతో కలిసి మార్కెట్‌కు వచ్చినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి, వారికి రక్షణతో కూడిన పచ్చని పార్కు, ఆట స్థలంతో కూడిన చిల్డ్రన్‌ కేజ్‌ను ఏర్పాటు చేయాలని చెప్పారు. పట్టణంలో వీలైన చోట్లలో అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేయాలని సూచించారు. పచ్చదనం, నర్సరీల గురించి సీఎం కేసీఆర్‌ ఆరా తీయగా.. విరివిగా మొక్కలు నాటుతున్నామని, రహదారుల విస్తరణలో అడ్డు వస్తున్న పెద్ద వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్‌ చేస్తున్నామని కలెక్టర్‌ పేర్కొన్నారు.

సాగర్‌ అభివృద్ధిపై సీఎం ఆరా
నాగార్జునసాగర్‌ నియోజకవర్గ అభివృద్ధిపైనా సీఎం కేసీఆర్‌ ఆరా తీశారు. హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులతోపాటు ఎత్తిపోతల పథకాల పనుల పురోగతిపై స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ను అడిగి తెలుసుకొన్నారు. వీటికి సంబంధించిన టెండర్లు ఇటీవలే పూర్తయ్యాయని అధికారులు సీఎం కేసీఆర్‌కు చెప్పగా.. నిధులు మంజూరై చాలా రోజులు అవుతున్నదని, పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. నిధులున్నా పనులు ఆలస్యం కావడం సరికాదంటూ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే భగత్‌కు సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.