
-టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్న -నాడు ఓడిన నేతలే.. నేడు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు -ట్రక్కు గుర్తు అయోమయం వల్లే ఎమ్మెల్యేగా ఉత్తమ్ గెలుపు -ఆయన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామాచేసి ఎంపీ బరిలో నిలువాలి -దేశానికి కావాల్సింది చౌకీదార్, టేకేదార్ కాదు.. కేసీఆర్ -తెలంగాణ ఇంటి పార్టీ.. టీఆర్ఎస్ l టీడీపీ దుకాణం తెలంగాణలో బంద్ -పరాయి పార్టీలకు ఓటెందుకేయాలి?: కే తారకరామారావు -గులాబీ పార్టీలో చేరిన నల్లగొండ కాంగ్రెస్ నేతలు
అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన తొమ్మిదిమంది కాంగ్రెస్ నేతలు తిరిగి బలవంతంగా లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులుగా నిలబడ్డారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ప్రజలను మోసగించి, చెల్లని రూపాయలను చలామణి చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని ఉద్దేశించి.. నల్లగొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా? అన్నారు. కొడంగల్‌లో పనికిరానివాళ్లు మల్కాజ్‌గిరిలో.. మహబూబాబాద్ ఎమ్మెల్యేగా ఓడినవాళ్లు మహబూబాబాద్ లోక్‌సభస్థానాల్లో విజయం సాధిస్తారా? అంటూ ప్రశ్నించారు. దేశానికి కావాల్సింది చౌకీదార్, టేకేదార్ కాదని, దిల్దార్.. అసద్దార్.. జమ్మేదార్.. ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ వంటి నాయకుడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మంగళవారం తెలంగాణభవన్‌లో నల్లగొండ ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్, ఏఐసీసీ మాజీ సభ్యుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, పెద్దసంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేస్తే రాహుల్‌గాంధీకి, బీజేపీ అభ్యర్థులకు ఓటేస్తే ప్రధాని మోదీకి లాభమని, అయితే.. టీఆర్ఎస్కు ఓటేస్తే తెలంగాణ ప్రయోజనాలకు లాభమని చెప్పారు. టీఆర్ఎస్ను తెలంగాణ ఇంటిపార్టీగా అభివర్ణించిన కేటీఆర్.. లోక్‌సభ ఎన్నికల్లో ఇంటిపార్టీ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్ నేతలు ఇంట్లో పిల్లిలా వీధిలో పులిలా ఉంటారని విమర్శించారు. ఢిల్లీలో వారి ఆటలు సాగవని చెప్పారు. టీడీపీ ఇప్పటికే తెలంగాణలో తన దుకాణం బంద్ చేసిందని అన్నారు. పరాయి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి ఓటు వేయాల్సిన అవసరం ఏమున్నదని ప్రశ్నించారు. పదహారు మంది ఎంపీలను గెలిపిస్తే మన డిమాండ్లు సాధించుకునేందుకు ఢిల్లీలో కేసీఆర్‌కు బలం ఉంటుందని చెప్తూ.. సారు.. కారు.. పదహారు.. ఢిల్లీలో సర్కారు అనే నినాదంతో ముందుకుపోవాలని పిలుపునిచ్చారు.
దేశానికే ఆదర్శంగా సీఎం కేసీఆర్ స్వాతంత్య్రం వచ్చిననాటి నుంచి దేశంలో ఏ ఒక్క ప్రధాని రైతుల సమస్యల గురించి పట్టించుకోలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. జైకిసాన్ అని నినాదాలు ఇచ్చినవారేకానీ రైతుల కోసం చేసిందేమీలేదన్నారు. సీఎం కేసీఆర్ మాత్రం దేశం మెచ్చేవిధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను రైతుల కోసం అమలుచేస్తున్నారని చెప్పారు. ఎకరాకు పదివేల పంట పెట్టుబడి ఇచ్చే నేత ప్రపంచంలోనే ఎక్కడా లేరన్నారు. జై కిసాన్ అనేది కాంగ్రెస్, బీజేపీకి నినాదం అయితే, టీఆర్ఎస్కు విధానమని చెప్పారు. ఏ కారణంతోనైనా రైతు మరణిస్తే ఆ కుటుంబం వీధినపడొద్దని పదిరోజుల్లోగా ఐదు లక్షల రూపాయల సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణే అన్నారు. రైతుబంధు పథకాన్ని స్వయంగా ప్రధాని కాపీ కొట్టారని, పేరు మార్చి పీఎం కిసాన్ సమ్మాన్ నిధిగా అమలుస్తున్నారని కేటీఆర్ చెప్పారు. తెల్లారిలేస్తే తెలంగాణపై మన్నుపోసే చంద్రబాబుకు సైతం కేసీఆర్ ఆలోచనే దిక్కయిందన్నారు.

మనం రైతుబంధు అని పేరు పెడితే.. దిగిపోయే ముందు ఒక మంచిపని చేయాలనుకున్నడో ఏమోగాని.. ఏపీలో రైతులకు అన్నదాత సుఖీభవ పేరుమీద అమలుచేస్తున్నడు. ఆంధ్రారైతులకు నాలుగుపైసలు వస్తున్నాయంటే అది కేసీఆర్ పుణ్యమే అని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం యావత్తు దేశం మనసు దోచుకున్నదన్నారు. అన్నిరంగాల్లో బలహీనవర్గాలకు టీఆర్ఎస్ పెద్దపీట వేసిందని చెప్పారు. డబుల్బెడ్రూం ఇండ్లు, కల్యాణలక్ష్మి పథకాలను ప్రస్తావిస్తూ.. ఇల్లు నేనే కట్టిస్తాను.. పెండ్లి నేనే చేయిస్తాను అన్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా బూర నర్సయ్యగౌడ్‌ను పెద్ద మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాలి పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కిస్మత్ల, అడ్డిమార్ గుడ్డిదెబ్బల గెలిచారని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ట్రక్కు గుర్తు చేసిన అయోమయం వల్లే విజయం సాధించారన్నారు. నల్లగొండ లోక్‌సభ స్థానానికి పోటీచేస్తున్న ఉత్తమ్‌కు నమ్మకం, విశ్వాసం ఉంటే హుజూర్నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా గెలిచి చూపాలని సవాల్ విసిరారు. ఒకవేళ అలాచేయకుంటే సేఫ్టీ కోసమే ఎమ్మెల్యే స్థానాన్ని అట్టిపెట్టుకున్నట్టు భావించాల్సి వస్తుందన్నారు.
రూ.2వేల కోట్లతో యాదగిరిగుట్ట అభివృద్ధి లక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టను రూ.2వేల కోట్ల పైచిలుకు నిధులతో సీఎం కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు. ఇది భవిష్యత్తులో తిరుమల తిరుపతి దేవస్థానంలా మారుతుందన్నారు. హిందూత్వం గురించి ఎప్పుడూ మాట్లాడే బీజేపీ ఏనాడైనా సీఎం కేసీఆర్‌లా ఆలోచన చేసిందా? అని ప్రశ్నించారు. యాదాద్రి పనులు పూర్తయితే దేశవిదేశాల నుంచి వచ్చి చూసిపోయేవాళ్లు లక్షల్లో ఉంటారని అన్నారు. ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా హైదరాబాద్ నుంచి రాయగిరి దాకా ఎంఎంటీఎస్ రైలును త్వరలో తీసుకురాబోతున్నట్టు చెప్పారు. గంధమల్ల- బస్వాపూర్ రిజర్వాయర్ దగ్గర మైసూర్‌లోని బృందావన్ గార్డెన్ తరహాలో ఒక పర్యాటకక్షేత్రం కట్టాలని సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని తెలిపారు. కేసీఆర్ వచ్చేదాకా నల్లగొండలో తాగునీరు ఇచ్చే దిక్కులేదని, రెండు లక్షలమంది జీవచ్ఛవాలుగా బతికారని కేటీఆర్ గుర్తుచేశారు. అందుకే కాంగ్రెస్ చిత్తుచిత్తుగా ఓటమి పాలైందన్నారు.

ఓటమిని ఒప్పుకొన్న కోమటిరెడ్డి: బూర నర్సయ్యగౌడ్ ఉత్తమ్‌రెడ్డి తనను బలవంతంగా భువనగిరి స్థానంలో పోటీచేయించి బలిచేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేయటం.. పరోక్షంగా ఓటమిని ఒప్పుకోవటమేనని భువనగిరి లోక్‌సభ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఎద్దేవాచేశారు. భువనగిరిలో గులాబీ జెండా ఎగురాలని, తెలంగాణలో 16 మంది టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరా. టీఆర్ఎస్లో చేరిన భిక్షమయ్యగౌడ్ మాట్లాడుతూ.. కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయ వ్యభిచారులుగా మారారంటూ నిప్పులు చెరిగారు.
గాంధీభవన్‌కూ ఎన్టీఆర్భవన్ గతే: మంత్రి జగదీశ్‌రెడ్డి ఎన్టీఆర్ భవన్‌కు పట్టిన గతే గాంధీభవన్‌కు పడుతుందని, ఖాళీచేసే కాలం త్వరలోనే వస్తుందని విద్యాశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తమ్‌కు కాంగ్రెస్ పిలిచి పదవి ఇస్తే.. ఆయన మాత్రం పార్టీ ఆఫీసుకు తాళంవేసేలా చేశాడని ఎద్దేవాచేశారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా ఉత్తమ్లాగే విర్రవీగాడని, ప్రస్తుతం ఆ పార్టీ తెలంగాణ నుంచి ఖాళీ చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. ఉత్తమ్‌వి ఉత్తరకుమార ప్రగల్భాలేనన్న జగదీశ్‌రెడ్డి.. సీనియర్ మంత్రులుగా చలామణి అయిన కాంగ్రెస్ నేతలు ఏనాడూ నల్లగొండ ప్రజల కష్టాలు తీర్చలేదని విమర్శించారు. ఒక్కనాడూ సీఎంలు రాలేదన్నారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం సొంత నియోజకవర్గం కంటే ఎక్కువసార్లు నల్లగొండ జిల్లాకు వచ్చారని, ఇక్కడి సమస్యల శాశ్వత పరిష్కారంకోసం కృషిచేశారని చెప్పారు. కాంగ్రెస్‌ను బండకేసి కొట్టినా బుద్ధిరాలేదని, వచ్చే ఎన్నికల్లో మరోసారి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అసమర్థత అందరికీ చెప్పాలి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే లోక్‌సభ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు ఘనవిజయం అందించాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తిచేశారు. మిగిలిన కొద్దిరోజులను సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని చెప్పారు. దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడంలో దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ విఫలమైందని విమర్శించారు. ఆ పార్టీ నేతల అవినీతిని ప్రతి ఒక్కరికీ వివరించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను అందరికీ తెలియజేసి టీఆర్ఎస్ విజయానికి కృషిచేయాలని చెప్పారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఆలేరు ఎమ్మెల్యే సునీత, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గులాబీ జోరు -నేటినుంచి కేటీఆర్ ప్రచార సభలు -వచ్చే నెల తొమ్మిదిన నల్లగొండలో ముగింపు -14 రోజులు.. 24 చోట్ల రోడ్‌షోలు.. 12 బహిరంగసభలు
పద్నాలుగు రోజులు.. 24చోట్ల లు.. 12 బహిరంగసభలు! బుధవారం మొదలుకుని.. ప్రచారం చివరిరోజైన ఏప్రిల్ 9వ తేదీవరకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇది! పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని పదహారు లోక్‌సభ స్థానాలను కైవసంచేసుకునేలా పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్న కేటీఆర్.. వరుస రోడ్‌షోలు, బహిరంగసభలతో ప్రచారాన్ని మరింత హోరెత్తించనున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించిన ఆయన.. బుధవారం నుంచి మళ్లీ విస్తృతస్థాయిలో పర్యటనకు సిద్ధమయ్యారు. వచ్చేనెల తొమ్మిదివరకు కేటీఆర్ బిజీబిజీగా ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు పకడ్బందీగా రూపొందించిన షెడ్యూల్‌ను పార్టీ కార్యదర్శి పీ శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం మీడియాకు విడుదలచేశారు. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్లగొండ, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాల్లో కేటీఆర్ ప్రచారానికి పార్టీవర్గాలు భారీ ఏర్పాట్లుచేస్తున్నాయి.
