Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నల్లగొండ గర్జన

బంగారు తెలంగాణ నిర్మాణం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాం ఫ్లోరైడ్ నివారణకు రూ.6 వేల కోట్లు నల్లగొండ బహిరంగసభలో గులాబీ దళపతి

KCR nalgonda

-టీడీపీ, కాంగ్రెస్ వల్లే తెలంగాణ విధ్వంసం -ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకూ బుద్ధి చెప్పాల్సిందే -టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావొద్దనే చేతులు కలిపిన చంద్రబాబు, వెంకయ్య.. – తెలంగాణ ఏర్పాటును వీరిద్దరూ వ్యతిరేకించారు బిల్లు రాకుండా బాబు చివరిదాకా ప్రయత్నించారు.. రాజ్యసభలో వెంకయ్య ఏం చేశారో చూశాం.. చంద్రబాబు సిగ్గులేకుండా తెలంగాణలో ఉంటున్నరు జీవన విధ్వంసం పొన్నాలకు అసలు అర్థం కాదు.. నల్లగొండ నో మ్యాన్ జోన్‌గా మారుతుంటే ఏం చేశారు?: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

తెలంగాణలో జీవన విధ్వంసానికి టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణమని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు నిప్పులు చెరిగారు. ఆ పార్టీలు ఇంకా ఏం ముఖం పెట్టుకుని ఓట్లడగటానికి వస్తున్నాయని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగినా ఆంధ్రావాళ్లతో పంచాయితీ అయిపోలేదన్న కేసీఆర్.. తెలంగాణ బిల్లు పెట్టిన తర్వాత భద్రాచలం డివిజన్‌లో ఏడు మండలాలు ఆంధ్రలో కలిపేసుకున్నారని చెప్పారు. ఈ మధ్యే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (నిడ్)ను హైదరాబాద్ నుంచి విజయవాడ తరలించేందుకు కుట్ర చేశారని అన్నారు. తెలంగాణ బిల్లును ఆఖరి నిమిషం వరకూ చంద్రబాబునాయుడు అడ్డుకున్నారని, రాజ్యసభలో బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఏం చేశారో అందరికీ తెలిసిందేనని చెప్పారు.

మెడపట్టి నెట్టినా తెలంగాణ నుంచి పోనంటున్న చంద్రబాబుకు సిగ్గు ఉందా? అని ప్రశ్నించారు. అలాంటివారికి ఎలాంటి శిక్ష వేయాలో ప్రజలే చెప్పాలని అన్నారు. పొన్నాల ఆంధ్ర నాయకుడు కేవీపీ రామచంద్రరావు రికమెండేషన్‌తో తెలంగాణ పీసీసీ చీఫ్ అయ్యారని ఆరోపించారు. వీళ్లు రేప్పొద్దున్న ఆంధ్ర తరఫునే మాట్లాడతారని అన్నారు. ఆంధ్రోళ్ల కుట్రలను ఎదుర్కొనాలంటే.. తెలంగాణను పునర్నిర్మించుకోవాలంటే రెండు ఓట్లూ కారుగుర్తుకే వేయాలని పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో సోమవారం టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. భారీ సంఖ్యలో ప్రజలు హాజరైన ఈ సభ వేదికపై పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. సభలో మాట్లాడిన కేసీఆర్.. తన విమర్శనాస్ర్తాలకు మరింత పదునుపెట్టారు, పత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వివిధ అంశాలపై ఆయన ఏమన్నారంటే..

చంద్రబాబు చేతులు కలిపారు తెలంగాణ బీజేపీ నాయకులు టీడీపీతో పొత్తు వద్దని అడ్డుకున్నా.. దుర్మార్గుడైన బాబుతో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబు, వెంకయ్య రూ కోట్లు ఖర్చు చేసి 20-25 సీట్లు గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా కుట్ర చేస్తున్నారు. చంద్రబాబు అవసరమైతే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

పొన్నాలను కేవీపీ రికమెండేషన్‌పై పీసీసీ చీఫ్‌ను చేశారు.తెలంగాణ ఉద్యోగులు, ఆంధ్ర ఉద్యోగులు ఎవరి రాష్ట్రంలో వారు పనిచేయాలి. ఆ విషయం కేసీఆర్‌ ఎలా మాట్లాడుతారని పొన్నాల, జానా, రాజనర్సింహ అంటారు. మీరు ఉద్యమం చేయలేదు. ఉద్యోగం గురించి తెలియదు. దీక్షలు చేయలేదు. డిన్నర్లు చేశారు. మేం సకల జనుల సమ్మె, ఉద్యమాలు చేస్తే.. మీరు మంత్రి పదవుల్లో ఊరేగారు. తెలంగాణ ఊరికినే రాలేదు.

తెలంగాణలో విధ్వంసం.. జన్మలో అర్థం కాదు.. తెలంగాణ పునర్నిర్మాణం అని నేనంటే.. అసలు ఏం విధ్వంసం జరిగిందని పొన్నాల అంటారు. అసలు ఆయనకు ఇదేం అర్థం కాదు. రావణుడికి రంగేస్తే రాముడు కాడు. పొన్నాల ఎన్ని జన్మలెత్తినా కేసీఆర్ కాలేడు. విధ్వంసం జరగలేదా? నాగార్జునసాగర్ ఎక్కడ కట్టారు? 132 టీఎంసీల చొప్పున ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఎప్పుడైనా నీరు వస్తున్నదా? జిల్లాలో 2 నుంచి 2.5 లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందటం లేదు. ఇక్కడి వారు పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఏం చేస్తున్నారు? సీఎం పదవిలో ఎగిరి దుంకాలని చూస్తున్నారు. తెలంగాణకు సాగర్‌లో వాటా రావాలి. ముక్కుమీద గుద్ది తీసుకోవాలి. ఇది కాంగ్రెస్ లీడర్లు చేయరు. టీఆర్‌ఎస్ మాత్రమే చేస్తుంది.

పోతిరెడ్డిపాడు పొన్నాల పాపమే.. పొన్నాల లక్ష్మయ్య వైఎస్ సంకలో చేరి పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టినప్పుడేం చేశారు? అనంతపురం జిల్లాలోని హంద్రీనీవాకు అనుమతులు లేకుండానే నీటి కోసం రఘువీరా పాదయాత్ర చేస్తే.. పొన్నాల జెండా ఊపారు. డీకే అరుణ హారతులిచ్చారు. ఆంధ్రాకు తెలంగాణ నీరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే హారతులిస్తారా? శ్రీకాంతాచారి కుటుంబానికి ఏం చేసినా తక్కువే. ఆమరవీరులపై గౌరవం ఉంటే హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ నుంచి తప్పుకోవాలి. వేరు పడిన సంసారం బాగు చేసుకోవాలంటే కేంద్రం మెడలు వంచే స్థాయికి చేరాలి. ఎస్‌ఎల్‌బీసీ నీరు రావాలంటే ఢిల్లీ మెడలు వంచాలి. 17 మంది ఎంపీలు గెలిస్తేనే ప్రాజెక్టులు పూర్తవుతాయి.

ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ తెలంగాణలోని ఉద్యోగులు ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్ర పోషించాలి. ఉద్యోగులతో ఈ ప్రభుత్వం స్నేహపూర్వకంగా ఉంటుంది. తెలంగాణ వచ్చిన సందర్భంగా ఉద్యోగులకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తాం. కేంద్ర ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలందిస్తాం. కేంద్ర పింఛనుదారులతో సమానంగా రాష్ట్రంలోని పింఛనుదారులకు ఇప్పిస్తాం. 14ఏళ్లక్రితం పార్టీ పెడితే అంతా నవ్వారు. మొక్కవోని ధైర్యంతో ఉద్యమించాం. చావు నోట్లో తలకాయ పెట్టా.

సకల జనుల సమ్మెతో సత్తా చాటాం. ఈ రాష్ట్రం బాగు కాంగ్రెస్, టీడీపీతో కాదు. కేవలం టీఆర్‌ఎస్ వస్తేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుంది. దేశంలో అంతా ఆశ్చర్యపోయేలా అభివృద్ధి చేసి చూపిస్తాం. రెండేళ్లలో కరెంటు కొరత తీర్చి, రెప్పపాటుకూడా కరెంటు పోకుండా చూస్తాం. 24 గంటలూ రైతులకు కరెంటు సరఫరా చేస్తాం.

ఫ్లోరైడ్ భూతం పని పడతాం నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతం భయంకరంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన చేయగా.. నీరు మాత్రమే కాదు.. అన్నం తిన్నా, కల్లు తాగినా వస్తుందని గుర్తించింది. ఇది మానవ రహిత జిల్లాగా మారుతోంది. తాగటానికి సురక్షిత నీరు, సాగుకు మిగులు సర్‌ప్లస్ నీరు ఇస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కాల్వలు తవ్వి నీరు పారించాలి.

పుట్టంగండి కాదు.. జూరాల-పాకాల కాల్వలను 390కి.మీ. తవ్వి మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలకు నీరందించే కార్యక్రమం రూపొందించాం. ఇంత పెద్ద మంత్రులున్నా.. ఎల్‌ఎస్‌బీసీని ఏం చేశారు? 40 ఏళ్లుగా సాగుతోంది. ఇది మీ నిర్వాకం కాదా? తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌ఎల్‌బీసీ కాల్వ కట్టమీద కుర్చీ వేసుకుని పూర్తి చేయిస్తా. నియోజకవర్గానికి లక్ష చొప్పున 12 లక్షల ఎకరాలకు నీరందిస్తాం. ఫ్లోరైడ్‌ను మొదటి ప్రాధాన్యంగా తీసుకుని.. జిల్లాలో ప్రతి గ్రామానికి సురక్షిత నీరందిస్తాం. రెండేళ్లు నేనే పర్యవేక్షించి నల్లగొండలో ఇంటింటికీ నీరువచ్చేలా చేస్తా. గతంలో ఎవరూ చేయలేని విధంగా ఫ్లోరైడ్ సమస్య తీర్చేందుకు ఐదారువేల కోట్లతో సురక్షిత జలాలు ఇప్పిస్తా.

గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి.. తండాల్లో గులాబీ జెండా ఎగురవేస్తాం. తెలంగాణను 24 జిల్లాలుగా మార్చి.. ప్రతి జిల్లా కేంద్రంలో 300-400 పడకలు, నియోజకవర్గంలో 100 పడకలు, మండలంలో 30 -40 పడకల ఆస్పత్రి, నలుగురు వైద్యులు ఏర్పాటు చేస్తాం.. అని కేసీఆర్ హామీలిచ్చారు. ఈ సభలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, నల్లగొండ, భువనగిరి లోక్‌సభ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, జిల్లాలోని అసెంబ్లీ అభ్యర్థులు దుబ్బాక నర్సింహారెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల నర్సింహయ్య, గాదరి కిషోర్, కాసోజు శంకరమ్మ, శశిధర్‌రెడ్డి, అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి, కేతేవత్ లాలు నాయక్, గొంగడి సునీతామహేందర్‌రెడ్డి, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, వేముల వీరేశం, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తాం కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థను చంద్రబాబు మొదలు పెడితే కాంగ్రెస్ కొనసాగించింది.అంగన్‌వాడీ,ఐకేపీ, ఆశా వర్కర్లు ఎంతో ఆశతో ఉన్నారు. అంగన్‌వాడీలు న్యాయమైన కోరికలు కోరితే చంద్రబాబు గుర్రాలతో తొక్కించారు. అప్పటి సీఎంపై లేబర్ కోర్టులో కేసు పెడతామంటే రూ.3 నుంచి 5 వేలు పెంచారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయిస్తాం.

ఇదంతా కాంగ్రెస్, టీడీపీ చేయవు. వారికి మానవత్వం లేదు. తెలంగాణ అభివృద్ధి, సమస్యల పరిష్కారం కావాలంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలి. తెలంగాణ రైతాంగం విత్తనాలు పండించాలి. ఏ భూముల్లో ఏ పంట సాగు చేయాలో జిల్లాల వారీగా విభజిస్తాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాం. రైతులను లక్షాధికారులుగా మార్చటం నా కల.

ముస్లింలకు 12% రిజర్వేషన్లు ముస్లిం సోదరుల సహకారంతోనే తెలంగాణ వచ్చింది. మేం భవిష్యత్తులో బీజేపీతో కలవం. టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ. సెక్యులర్ పార్టీలతోనే కలిసి పనిచేస్తాం. ముస్లింలకు 12% రిజర్వేషన్లు అమలు చేస్తాం. సచార్ కమిటీని నేను మంత్రిగా ఉన్నప్పుడే వేయించినా.. అమలు చేయకుండా ఉంచారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాగానే సచార్ కమిటీ నివేదికను అమలు చేస్తాం. ముస్లింలకు రూ కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం. వక్ఫ్ బోర్డుకు న్యాయాధికారాలు కల్పిస్తాం. తమిళనాడు, కర్ణాటకలో చేసినట్లు అసెంబ్లీలో ప్రత్యేక చట్టం చేసి ముస్లింలకు 12% రిజర్వేషన్లు ఇస్తాం. కాంగ్రెస్, టీడీపీ 60 ఏళ్లు అధికారం అనుభవించాయి. ఒక్క ఐదేళ్లు టీఆర్‌ఎస్‌కు ఇవ్వండి. దళితుల కోసం 50 వేల కోట్లు ఐదేళ్లలో ఖర్చు చేస్తాం. ప్రతి కుటుంబానికీ మూడెకరాలు పంచుతాం. మాకు చేయగలిగే శక్తి, నిబద్ధత ఉంది. అంతా ఉద్యమం చేసిన వారే. ఎర్రటెండలో ఆందోళనలు చేసి, లాఠీ దెబ్బలు తిన్నవారే.

నల్లగొండ నో మ్యాన్ జోన్‌గా మారుతుంటే ఏం చేశారు? నల్లగొండ జిల్లా నో మ్యాన్ జోన్‌గా మారుతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, 16 ఏళ్ల సీనియర్ మంత్రులు ఏం చేశారు? గాలి మాటలు కాదు.. ఏం చేశారో చెప్పండి! టీడీపీ, కాంగ్రెస్ కలిసి జీవన విధ్వంసం చేశాయి. 1.50 లక్షల మంది పిల్లలను నాశనం చేశారు. వాళ్లు సిగ్గు లేకుండా ఎట్ల వచ్చి ఓటు అడుగుతారు? వీరిని ఎలా నమ్మాలి? ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే పదవులు ఎవరి కోసం? ప్రజల కోసం కాదా?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.