గోదావరి నదీ జలాలలో తెలంగాణ రాష్ట్రానికున్న వాటాకు అనుగుణంగా నీటిని సంపూర్ణంగా, సమర్దవంతంగా వాడుకునేందుకు అవసరమైన విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు అన్నారు. గోదావరి బేసిన్లో దాదాపు 54 నియోజకవర్గాలున్నాయని, నాలుగు అర్బన్ నియోజకవర్గాలు పోగా, మిగతా 50 అసెంబ్లీ నియోజకవర్గాలకు సగటున లక్ష ఎకరాల చొప్పున 50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎస్ఆర్ఎస్పి, నిజాంసాగర్, కడెం లాంటి ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికే దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నదని, మిగతా 40 లక్షల ఎకరాలకు 400 టిఎంసీల నీటిని అందించే విధంగా ప్రాజెక్టుల రూపకల్పన జరగాలన్నారు. ప్రాణహిత – చేవేళ్ల, దేవాదుల, కంతనపల్లి, ఎల్లంపల్లి, దుమ్ముగూడెం తదితర ప్రాజెక్టుల కోసం ఇప్పటికే 400 టిఎంసీల నీరు కేటాయించారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. తెలంగాణకు ఉన్న నీటి కేటాయింపులు, అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, ప్రసుతమున్న ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు అనుగుణంగా డిజైన్లు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్విసెస్ (వ్యాప్కోస్)ను సిఎం కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రాజెక్టుల సమగ్ర నివేదికను రూపొందించాల్సిందిగా రాష్ట్ర నీటి పారుదల శాఖ వ్యాప్కోస్ను కోరింది. వీలైనంత త్వరగా డిజైన్లు ఇవ్వాల్సిందిగా సిఎం కోరారు.

గోదావరి నదీ జలాల వినియోగానికి నిర్మించాల్సిన ప్రాజెక్టులు, అనుసరించాల్సిన పద్దతులపై ముఖ్యమంత్రి కేసిఆర్ క్యాంపు కార్యాలయంలో ఆరు గంటలకు పైగా సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ప్రభుత్వ సలహాదారుడు ఆర్.విద్యాసాగర్‌రావు, నీటి పారుదల శాఖ ఇ అండ్ సి మురళీధర్, ఓఎస్డి శ్రీధర్ దేశ్‌పాండే, ఇఅండ్సి (అడ్మిన్) విజయప్రకాష్, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, సిఎం అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, వ్యాప్కోస్ జిఎం శంభు ఆజాద్, పిడి నాగేశ్వర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో గోదావరిపై ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయని, వాటి డిజైన్లు కూడా సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సగటున కనీసం లక్ష ఎకరాలకు సాగునీరందించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రాణహిత ప్రవేశించే తుమ్మిడిహట్టి నుంచి మొదలుకుని ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం వరకు ప్రతీ ప్రాజెక్టునూ రీ డిజైన్ చేయాలని ఆదేశించారు. గోదావరిపై ఎక్కడెక్కడ లిప్టులు పెట్టాలి? ఎక్కడ ఎన్ని టిఎంసిలు వాడాలి? ఎక్కడ ఎంత నీటి ప్రవాహ ఉధృతి ఉంటుంది? ఏ ప్రాంతానికి ఏ మార్గం ద్వారా నీరు తీసుకోవాలి? ఇప్పటికే తవ్విన కాల్వలు, తీసిన సొరంగాలు, వేసిన పైపులైన్లను ఎలా ఉపయోగించాలి? ఎక్కడ నుంచి ఎక్కడి దాకా లిప్టుద్వారా అందించాలి? ఎక్కడ గ్రావిటి ద్వారా ఇవ్వాలి? ఎక్కడ కాల్వలు తవ్వాలి? ఎక్కడ రిజర్వాయర్లు కట్టాలి? ఎక్కడ కాల్వల నీటి ప్రవాహ సామార్ద్యం పెంచాలి? తదితర అంశాలపై గూగుల్ ఎర్త్, మ్యాపులు, నివేదకల ఆధారంతో విస్త్రుతంగా చర్చించారు.
“తెలంగాణ గోదావరి జిల్లాల్లో 953 టిఎంసిలు వాడుకునే హక్కు వుంది. 433 టిఎంసిల కోసం ప్రాజెక్టులున్నాయి. ఇంకా 521 టిఎంసిలు వాడుకునే ప్రాజెక్టులు కట్టుకోవాలి. వీటిలో ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల ద్వారా 400 టిఎంసిలు వాడుకునే హక్కు, అనుమతులు వచ్చాయి. వీటికి అనుగుణంగా ఇప్పుడు ప్రాజెక్టులు నిర్మించాలి. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తయారు చేసిన ప్రాజెక్టులు తెలంగాణ సాగునీటి అవసరాలు తీర్చే విధంగా లేవు. అంతరాష్ట్ర వివాదాలు, భూసేకరణ కేసులు, అశాస్త్రీయ డిజైన్లు, అరకొర నిధులు తదితర అడ్డంకులు వుండే విధంగా ప్రాజెక్టులు రూపొందించారు. అసలు తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కావద్దనే దురుద్దేశ్యమే పాలకులకు వుండేది. అందుకే తెలంగాణలో గోదావరి ప్రాజెక్టులకు అతీ గతీ లేకుండా పోయింది. ఇప్పుడు మనం వాటిని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమర్దంగా నీటిని వినియోగించే విధంగా డిజైన్లు తయారు చేయాలి. ప్రాజెక్టుల రూపకల్పనలో విశేష అనుభవం ఉన్న వ్యాప్కోస్‌కే ఆ బాధ్యత అప్పగిస్తున్నాం” అని ముఖ్యమంత్రి చెప్పారు.
“ప్రాణహిత – చేవేళ్ల పేరు మీద కాలయాపన చేశారు. ఇప్పుడున్న డిజైన్ పనికొచ్చేది కాదు. దానిని రెండు భాగాలు చేయాలి. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు కట్టి ఆదిలాబాద్ జిల్లాకు నీరివ్వాలి. కాళేశ్వరం దిగువన మరో ప్రాజెక్టు కట్టి నిజామాబాద్, కరీంనగర్, మెదక్‌తో పాటు వరంగల్, నల్గొండ జిల్లాల్లోని కరువు పీడిత జనగామ, భువనగిరి డివిజన్లకు నీరివ్వాలి. అదే ప్రాజెక్టును నిజాంసాగర్‌కు, ఎస్‌ఆర్‌ఎస్‌పికి అనుసంధానం చేయాలి. దేవాదుల ప్రాజెక్టు కూడా నీరు అందించలేక పోతున్నది. 170 రోజులు లిప్టు చేయాల్సి వున్న 90 రోజులు కూడా నీటిని లిప్టు చేయలేకపోతున్నారు. దేవాదుల వద్ద నీటి నిల్వ ఉండడం లేదు. అందుకే కంతనపల్లి ప్రాజెక్టును దేవాదులకు ఉపయోగపడే విధంగా డిజైన్ చేయాలి. ఇప్పుడు కంతనపల్లి కోసం ప్రతిపాదించిన ప్రాంతం వద్ద కాకుండా కొంచెం ముందుకు ప్రాజెక్టు కడితే, దేవాదులకు ఉపయోగం. గోదావరి నుంచి నీటి ఎత్తిపోసే క్రమంలో దారి మధ్యలో ఎక్కువ రిజర్వాయర్లు ఉండాలి. గ్రావిటి కమ్ లిప్టు పద్దతిలో నీటి పారకం ఉండాలి. అవసరమైన చోట ఎస్ఆర్ఎస్పి క్యారీయింగ్ సామర్థ్యం పెంచాలి. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కట్టాలి. ఈ ప్రాధాన్యతలతో, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా, పొలాలకు నీరందించడమే లక్ష్యంగా డిజైన్లు రూపొందించాలి” అని ముఖ్యమంత్రి చెప్పారు.