Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నలువైపులా మహా విస్తరణ

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చైనాకు చెందిన మౌలికవసతుల కల్పన సంస్థలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆహ్వానించారు. విశ్వ నగరంగా రూపుదిద్దుకునే క్రమంలో హైదరాబాద్ మహా నగరం మరింతగా విస్తరిస్తున్నదని, నగరానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం వరకు ఉన్న పట్టణాలదాకా విస్తరించే అవకాశం ఉన్నదని తెలిపారు. దీనివల్ల మౌలికవసతుల రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఏర్పడుతాయని చెప్పారు.

CM KCR meet with China Representatives

-50 కిలోమీటర్లమేర పెరుగుతున్న హైదరాబాద్ – రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో భారీగా అభివృద్ధి పనులు – మౌలికవసతుల రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు -చైనా ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులతో సీఎం కేసీఆర్ – అభివృద్ధిలో పాలుపంచుకొనేందుకు కంపెనీల ఆసక్తి చైనా కంపెనీ అంజు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డైరెక్టర్లు యోగేశ్‌వా, మనోజ్ గాంధీ, రాడిక్ కన్సల్టెంట్స్ చైర్మన్ రాజ్‌కుమార్, బ్రిడ్జి డిజైనింగ్ విభాగాధిపతి బీపీ సింగ్ తదితరులు బుధవారం మధ్యాహ్నం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పాలుపంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

నలువైపులా నగరం విస్తరణ: హైదరాబాద్ నగరం నలువైపులా తూప్రాన్, గజ్వేల్, భువనగిరి, చౌటుప్పల్, షాద్‌నగర్, వికారాబాద్, నర్సాపూర్ తదితర పట్టణాల వరకు విస్తరిస్తున్నదని, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్‌తోపాటు రాష్ట్రంలో మొత్తం ఆరు కార్పొరేషన్లు, 67 మున్సిపాలిటీలున్నాయని, వీటన్నింటిలో ఫ్లైఓవర్లు, పెద్ద రహదారులు, స్కైవేలు, సీవరేజ్, తాగునీరు, గృహ నిర్మాణం తదితర రంగాల్లో శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళిక రూపొందించి, అభివృద్ధి సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్‌లో చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళికను సీఎం వివరించారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, రామగుండం-మంచిర్యాల కార్పొరేషన్లలో కూడా అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

హైదరాబాద్‌లో ప్రస్తుతమున్న రోడ్లను అభివృద్ధి చేయడంతోపాటు, శరవేగంగా విస్తరిస్తున్న నగరానికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసి రహదారులు, వంతెనలు నిర్మించాల్సి ఉందన్నారు. మూసీ నదిపై తూర్పు నుంచి పడమర వరకు 42 కిలోమీటర్లమేర ఆరులేన్ల రహదారిని నిర్మించే ప్రణాళికను కూడా సీఎం వివరించారు. వరంగల్, నల్లగొండ, కరీంనగర్ తదితర హైవేలకు అనుబంధంగా ఎక్స్‌ప్రెస్ ఎలివేటెడ్ హైవేలు నిర్మించాలని యోచిస్తున్నట్టు చెప్పారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, గోదావరిఖని కార్పొరేషన్ల పరిధిలో రింగురోడ్లు, అంతర్గత రోడ్లు, వంతెనలు నిర్మిస్తామన్నారు. గోదావరి నదిపై కూడా మూడు చోట్ల పెద్ద వంతెనలు నిర్మిస్తామని తెలిపారు.

అభివృద్ధిలో మేమూ భాగమవుతాం: కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్, ఇతర నగరాల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను చైనా ఇన్‌ఫ్రా కంపెనీల ప్రతినిధులు సీఎంను అడిగి తెలుసుకున్నారు. రహదారులు, బ్రిడ్జిలు, సస్పెన్షన్ బ్రిడ్జిల నిర్మాణంలో పాలుపంచుకోవడానికి సిద్ధంగా తాము ఉన్నామని తెలిపారు. తాను ఇటీవల చైనాలో పర్యటించిన సందర్భంలో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకుతోపాటు అనేక మంది పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని సీఎం చెప్పారు. చైనాలోని బీజింగ్, షాంఘై, డాలియన్, సుజో, గాజో తదితర నగరాల ప్లాన్లను రూపొందించిన కన్సల్టెన్సీల సహకారంతో తెలంగాణ నగరాల అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయిస్తామని తెలిపారు. ఈ ప్రణాళికకు అనుకూలంగా జరిగే అభివృద్ధి పనుల్లో భాగస్వామ్యం కావడానికి చైనా కంపెనీలు సంసిద్ధత వ్యక్తం చేశాయి. త్వరలోనే మరోసారి సమావేశమై ఏయే పనుల్లో ఏ విధంగా భాగస్వాములు కావాలనే విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశంలో ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు, పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు ముఖ్య కార్యదర్శి శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.