Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నాన్న.. నాఊరే నాకు ప్రేరణ

ఆయన తండ్రి ఒక అనాథలా పెరిగాడు… ఆ తండ్రి పట్టుదల, కసి వల్ల తన పిల్లలు ఉన్నత విద్యావంతులై ప్రయోజకులయ్యారు.. నాన్న అంటే ఆయనకు ఎనలేని ప్రేమ.. ఆ ప్రేమతోనే తన తండ్రిపై ఒక పుస్తకం రాస్తానని చెబుతున్నాడు.. ఆయన ఇంటికి పెద్దవాడే కాదు.. తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి కూడా! ఆయనే సిరికొండ మధుసూదనాచారి. ఆయన ఆరాధించే ఇద్దరువ్యక్తులు ఎన్టీఆర్.. కేసీఆర్ ఒకరు సమ్మోహనశక్తి అయితే మరొకరు మేధాసంపత్తి! ఆ ఇద్దరి అభిమానానికి పాత్రుడు కావడం..

Madhusudhana Chary 01

ఆయన నడిచివచ్చిన దారి, వారి నాన్న చూపిన మార్గం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ ఆచార్యదేవోభవ చదవాల్సిందే… మాది పరకాల మండలం నర్సక్కపల్లె. చారిత్రాత్మకమైన ఊరు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ముందున్న ఊరు. అట్లాగే తెలంగాణ ఉద్యమంలోనూ కీలకభూమిక పోషించిన ఊరు. మా ఊరే నాకు ప్రేరణ. అమ్మ వెంకటలక్ష్మీ. నాన్న వెంకటనర్సయ్య. మేం ఎనిమిది మందిమి. నలుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురం అన్నాదమ్ములం. ముగ్గురు అక్కల తర్వాత నేను పుట్టాను. నిజానికి మా నాన్న ఒక ఆర్ఫన్. దీనికో చరిత్ర ఉంది. మా నాన్న ఐదోయేట వాళ్ల నాన్న చనిపోయాడు. వాళ్ల అమ్మ మతిస్థితిమితం లేక ఎటో వెళ్లిపోయింది. దీంతో మా నాన్న ఖమ్మం జిల్లా ఇల్లందులో వాళ్ల మేనమామ ఇంటికి సాదుకం పోయిండు. వాళ్ల మేనమామకు మా నాన్న అంటే ప్రేమ. వాళ్ల అత్తకు కూడా ప్రేమే. కాకపోతే పేదరికం వల్ల కోపం. ఆయన ఐదోయేట నుంచి 18వ యేట వరకు అక్కడే ఉండి వత్తిపని(బంగారు పనులు) నేర్చుకున్నాడు.

ఆ తర్వాత అక్కడి నుంచి మళ్లీ తన సొంతూరైన నర్సక్కపల్లెకు వచ్చాడు. పట్టుదల మనిషి. కసి ఉన్న మనిషి కూడా ఆ కాలంలో ఔసల పని వచ్చిన వ్యక్తి ఆ చుట్టు పక్కన ఊళ్లలో మా నాన్న ఒక్కడే. ఆయన వ్యక్తిత్వం, మంచితనం, పనితనం వల్ల చుట్టూ ఉన్న ఊళ్లకు తొందర్లలోనే మంచి పనిమంతుడిగా గుర్తింపు పొందాడు. అప్పటి నుంచి ఆయన ఇక వెనుతిరిగి చూడలేదు. తాను ఏమి చదువుకోకపోయినా తన పిల్లలు ప్రయోజకులు కావాలని భావించాడు. అందుకే ఆయన సంతానమైన మేమంతా ఉన్నత విద్యావంతులమయ్యాం. మా నాన్న క్రమశిక్షణకు మారుపేరు. ఆయన ఎంత క్రమశిక్షణతో ఉండేవాడో ఒక ఉదాహరణ చెబుతాను. మేం సక్రమంగా చదవకపోతే అన్నం బంద్ అని మా అమ్మకు చెప్పేది. ఒకవేళ ఆమె పిల్లల మీద ప్రేమతో అన్నం పెట్టినట్లు అనుమానం వస్తే ఆ పూట అమ్మ చర్యకు నిరసనగా ఆయన తిండి మానేసేవారు. ఆ ప్రభావం మా మీద పడి మేం బాగా చదువుకునేవాళ్లం. మేం ఇవాళ ఇంతటి వాళ్లమయ్యామంటే అది మా నాన్న క్రమశిక్షణాయుతమైన పోషణే అని చెప్పాలి. ఆయన వ్యక్తిత్వం మీద పట్టుదల మీద ఇప్పుడు కాదుగానీ భవిష్యత్‌లో ఒక పుస్తకం రాయాలని ఉంది. రాస్తాను కూడా.. ఆయన ఎక్కడికి పోయినా.. ఎంత దూరం పోయినా ఊరు విడిచి నిద్ర చేసేవారు కాదు. ఎంత రాత్రయినా కాలినడకన అయినా సరే ఇల్లు చేరాల్సిందే.. అంతటి మహానీయుడు.. నేను నా ముగ్గురు కొడుకులు పుట్టేంత వరకు ఆయన మీదే ఆధారపడ్డాను. ఆయన కష్టబోతు.. రోజుకు 10 రూపాయలు సంపాదించాలనుకుంటే ఆ పనిని సగం రోజులో పూర్తిచేసి మరో సగం రోజులో అదనంగా సంపాదించేవారు.

ఊరికో తరగతి.. నా ప్రాథమిక విద్యాభ్యాసం నర్సక్కపల్లెలో జరిగింది. 6,7వ తరగతి నడికూడలో.. 8వ తరగతి హుస్నాబాద్‌లో.. 9వ తరగతి హుజురాబాద్‌లో.. 10వ తరగతి పరకాలలో. ఇలా ఎందుకు జరిగిందంటే మా చిన్నబావ హుస్నాబాద్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్‌గా పనిచేస్తుండేవాడు. వాళ్ల ఇంటికి నేను వెళ్లడం వల్ల ఆయన ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అయితే అక్కడికి వెళ్లి చదువుకునేవాడిని. నేను 9వ తరగతి మధ్యలో ఉన్నప్పుడు ఆయన నల్గొండ జిల్లాకు బదిలీ అయ్యారు. అక్కడి నుంచి అంత దూరం వెళ్లలేక పరకాలకు రావల్సి వచ్చింది. ఇంటర్ పరకాలలో. డిగ్రీ సీకేఎంలో. మాకు జయశంకర్ సార్ ప్రిన్సిపాల్. ఇంటర్మీడియెట్‌లో అనుముల కృష్ణమూర్తి.

హుస్నాబాద్‌లో ఉండగా డీవీఆర్ వీరి ప్రభావం నా మీద ఎంతో ఉంది. జయశంకర్ సార్‌తో నాది 35 ఏళ్ల అనుబంధం. 1976 నుంచి అంటే నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఆయన ఆఖరి నిమిషం వరకు ఆయనతో ఉన్నాను. ఆయన భావజాలంతో బతికాను. అది నాకు ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఇవాళ్ల ఆయన కలలుగన్న తెలంగాణ రాష్ర్టానికి తొలి సభాపతిగా ఉన్నాను. ఆయన ఉంటే ఎంతగానో గర్వించేవారు. ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. మా ముగ్గురు తమ్ముళ్లు, చెల్లె, నేను… హైదరాబాద్‌లో ఉండి చదువుకున్నాం. తమ్ముడు ఎమ్మెస్సీ, ఇంకో తమ్ముడు బీఎస్సీ, మరో తమ్ముడు బీఎస్సీ అగ్రికల్చర్, చెల్లె హోంసైన్స్, నేను పర్సనల్‌మేనేజ్‌మెంట్. నేను ఆనాడు ఉన్న పరిస్థితుల్లో విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడిని కాదు. కాకపోతే వామపక్ష భావజాలం మీద, ఉద్యమాల మీద అభిమానం ఉండటం వల్ల వాటికి కొంత ఆకర్షితుడినే అని చెప్పాలి. కాకపోతే సీరియస్ ఫైటర్‌ను కాదు. అందుకు కారణం మళ్లీ మానాన్నే! మా ఊర్లో ఇలాంటి పోరాట వారసత్వం వల్ల సర్వం పోగొట్టుకున్న వాళ్లను నాన్న చూశాడు. దాంతో మమ్మల్ని కొంత కట్టడి కూడా చేశాడు. ఆయన జీవితంలో చేయదగినవి.. చేయదగనివి.. అని గీతలు గీసుకున్నాడు. ఆయన రాజకీయాలు చేయొద్దని భావించాడు. అందుకే వాటికి దూరంగా ఉన్నాడు. అంత క్రమశిక్షణతో ఉన్నాడుగనుకే ఇవాళ్ల మాకు ఆయన దాదాపు రెండు, మూడు కోట్ల విలువ చేసే ఆస్తులను సంపాదించి పెట్టాడు. ఇప్పటికీ అవి మాకు ఉమ్మడి ఆస్తే. కానీ 1980 నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి పెరిగింది. నేను తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు మాత్రం మా నాన్న చాలా సంతోషించాడు. నాలాగే నా కొడుకులో కసి ఉంది. ఏదైనా అనుకుంటే సాధించగలడు అని ఆయన ఆ రోజు చాలా గర్వపడ్డాడు.

గొప్ప ఇల్లాలు.. మా అమ్మ నాన్నకు తగ్గ ఇల్లాలు. ఆయన ఆలోచనాసరళిని, పనివిధానాన్ని అన్నింటికి మించి కుటుంబాన్ని నెట్టుకురావడంలో ఆమెకు ఆమే సాటి. మేమందరం ఇంటి దగ్గర ఉంటే ఆమెకు పెద్దపని.. అంతకంటే పండుగ వాతావరణం. ఎంతమంది వచ్చినా ఆమె ఒంటి చేత్తో అన్నీ చూసుకునేది. మా ఊళ్లో అందరూ మా అమ్మానాన్నల క్రమశిక్షణ, ప్రవర్తన చూసి ముచ్చటపడేవారు. మాకు తెలిసి మా అమ్మానాన్నలు ఏనాడు ఘర్షణ పడిన దాఖలాలేదు. సర్దుబాటు సంసారమే సమున్నతమైందని నిరూపించారు. అయితే నేను మాత్రం నా కుటుంబాన్ని మా నాన్నలాగా చూసుకోలేదు. ఒక మాటలో చెప్పాలంటే తండ్రిగా నా బాధ్యతను నేను నిర్వర్తించలేకపోయాను. కుటుంబ భారమంతా ఆమె( భార్య ఉమాదేవి) చూసుకునేది. మాకు ముగ్గురు అబ్బాయిలు ప్రదీప్, ప్రశాంత్, క్రాంతి. ముగ్గురు సెటిలయ్యారు.

ఎన్టీఆర్‌ది సమ్మోహనశక్తి.. కేసీఆర్‌ది మేధాసంపత్తి ఎన్టీరామారావు.. నేను అత్యంత ఆరాధించే నటుడు. ఆయన సినిమాలే కాదు.. జీవితం కూడా ఆరాధరనాపూరితమైందే. ఆయన పార్టీ పెట్టినప్పుడు ఆయన విధానాలకు ఆకర్షితుడినై అందులో చేరాను. ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడింది టీడీపీ. ఆయన పిలుపు మేరకు అందులో చేరాను. ఆయన నన్ను చాలా అభిమానించేవారు. ఆయన చొరవతో నేను మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. ఈ రాష్ర్టాన్ని ప్రభావితం చేసిన ముగ్గురు అగ్రగణ్యుల్లో ఇద్దరితో అతి చనువుగా, ప్రేమతో అత్యద్భుతంగా పనిచేశానని, సన్నిహితంగా ఉన్నానని నేను భావిస్తున్నాను. అది నాకు చాలా తృప్తిగా కూడా ఉంటుంది. ఆ ముగ్గురు ఒకరు చెన్నారెడ్డి, రెండు ఎన్టీఆర్, మూడు కేసీఆర్. అటు ఎన్టీఆర్‌తో పనిచేశాను. ఇప్పుడు కేసీఆర్‌తో నడుస్తున్నాను. ఆ ఇద్దరు పట్టుదలకు, పౌరుషానికి, ఆత్మాభిమానానికి పెట్టింది పేరు. ఎన్టీఆర్‌ది సమ్మోహనశక్తి అయితే కేసీఆర్‌ది మేధాసంపత్తి. తెలంగాణ యుగపురుషుడు కేసీఆర్. ఆయన 2000 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని కలలుగన్నాడు. ఆనాటి ప్రభుత్వ దుర్నీనీతిని పసిగట్టి.. ఎండగట్టి ధిక్కారస్వరం వినిపించాడు. తన డిప్యూటీ స్పీకర్ పదవిని ఎడమచేత్తో, ఎమ్మెల్యే పదవిని కుడిచేత్తో పార్టీ పదవులను గడ్డిపోచల్లాగా విసిరి పారేశాడు. ఆ మొండిధైర్యం, దార్శనికత నన్ను కేసీఆర్‌కు దగ్గర చేసింది. 2001లో టీఆర్‌ఎస్ పార్టీ పెట్టకముందు నుంచే నేను ఆయన సైన్యంలో ఒకడిగా చేరాను. అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన మహోన్నత వ్యక్తి ఆయన.

కళ్లు చెమర్చాయి.. అన్ని పార్టీలను ఒప్పించి ఏకగ్రీవంగా ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి నన్ను తెలంగాణ తొలి శాసనసభకు సభాపతిగా ప్రతిపాదించినప్పుడు నా కళ్లు చెమ్మగిల్లాయి. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించాం. సాధించిన రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించాలి. ఆ కార్యాచరణలో ముందుకు సాగడానికి ఆ సభ వేదిక కావాలి. అందరి సహకారంతో ఆ బాధ్యతను నెరువేరుస్తాననే విశ్వాసం నాకు ఉంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.