Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నాణ్యత విషయంలో రాజీపడొద్దు

-మూడు టీంఎంసీలను తరలించడమంటే ఒక నది తరలి వస్తున్నట్లే
-కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేయడం ఎంత ముఖ్యమో.. నిర్వహణ కూడా అంతే ముఖ్యం
-అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జూలైలో రెండు టీఎంసీలు ఎత్తిపోతకు సిద్ధం
-మండుటెండలో సీఎం కాళేశ్వరం బాట
-44 డిగ్రీల ఎండను కూడా లెక్కచేయని వైనం
-కన్నెపల్లి, మేడిగడ్డ బరాజ్ సందర్శన
-గోదావరి మధ్యలో రెండున్నర గంటలపాటు..
-పొరుగున మావోయిస్టుల బంద్‌ను కూడా పట్టించుకోని సీఎం
-ముగిసిన ముఖ్యమంత్రి రెండురోజుల పర్యటన
-హైదరాబాద్‌కు తిరిగి రాక

కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత విషయంలో ఎంతమాత్రం రాజీపడొద్దని.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఇంత పెద్ద ప్రాజెక్టు కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తాయని, వాటిని పకడ్బందీగా పరిష్కరించి, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు, వర్కింగ్ ఏజెన్సీలకు సూచించారు. ప్రాజెక్టును పూర్తిచేయడం ఎంత ముఖ్యమో.. దాని ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ కూడా అంతే ముఖ్యమని సీఎం చెప్పారు. గోదావరి నది నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించడం అంటే తెలంగాణ ప్రాంతానికి ఒక నది తరలివస్తున్నట్లే అని పేర్కొన్నారు. 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును వేగవంతంగా పూర్తిచేస్తున్నందుకు సంతోషంగా ఉన్నదన్నారు. వచ్చే జూలైలోనే రెండు టీఎంసీల నీటిని తరలించి సాగునీరు అందివ్వడం అత్యంత శుభపరిణామం అని తెలిపారు. కొద్ది సమయం పట్టినా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా మోటర్ల బిగింపు సహా మొత్తం అన్ని విభాగాల్లో చెక్‌లిస్ట్ పూర్తయిన తర్వాత ట్రయల్ రన్ ప్రారంభానికి తాను, చీఫ్ సెక్రటరీ కలిసి వస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రక్రియ జూన్ చివరికల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకొన్న అనంతరం, ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బరాజ్, కన్నెపల్లి పంప్‌హౌస్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా గోదావరి ఇసుకతిన్నెల్లో నడుస్తూ ప్రాజెక్టు పనులను సునిశితంగా సమీక్షించారు.

రైతాంగానికి నా కానుక
ఆలయ సందర్శన అనంతరం కన్నెపల్లి పంప్‌హౌస్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ వ్యూపాయింట్ నుంచి పనులను పరిశీలించారు. అనంతరం లిఫ్ట్ ద్వారా పంప్‌హౌస్ లోపలికి వెళ్లారు. అక్కడ మోటర్ల బిగింపు పనులను చూశారు. మోటర్ల పంపింగ్ గురించి ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మూడోఫ్లోర్‌లో ఉన్న హెచ్‌టీసీడీ ప్యానల్, కంట్రోల్ రూం ప్యానల్ పనుల పురోగతి, తొమ్మిదో మోటరు వద్ద స్టార్టర్, రూటర్ బిగింపు పనులకు సంబంధించి ఇంజినీర్లతో చర్చించారు. ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తన స్వప్నమని, రాష్ట్ర రైతాంగానికి ఈ ప్రాజెక్టును కానుకగా ఇస్తానని అన్నారు. త్వరలోనే ప్రాజెక్టును పూర్తిచేసి ప్రభుత్వానికి అప్పగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

స్వతంత్ర వైర్‌లెస్ వ్యవస్థ ఏర్పాటు
కాళేశ్వరం నుంచి మిడ్ మానేరు వరకు ఫేస్-1గా, మిడ్ మానేరు నుంచి ఫేస్-2గా పరిగణించి ప్రాజెక్టు పూర్తికి సమయానుగుణంగా పనులు చేయాలని సీఎం కేసీఆర్ ఇంజినీరింగ్ నిపుణులకు సూచించారు. పంపుహౌస్‌లు సహా ఇతర ప్రాజెక్టు ఆపరేషన్ విషయంలో స్వతంత్ర వైర్‌లెస్ వ్యవస్థ ఏర్పాటుచేయాలని సీఎం సూచించారు. ప్రాజెక్టులో పెద్ద పెద్ద మోటర్లు పెడుతున్నందున, అన్ని పంపుహౌస్‌ల వద్ద మోటర్లకు అందే నీటిలోకి కలప, చెట్లు వంటివి వెళ్లకుండా ముందుగానే జాలి తరహాలో ఉండే ట్రాష్ ట్రాక్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ప్రాజెక్టు పనుల ప్రాథమ్యాలలో భాగంగా రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసే పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేస్తూనే మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోసే పనులను కొనసాగించాలని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయడానికి కృషిచేస్తున్న ఇంజినీరింగ్ అధికారులు, వర్క్ ఏజెన్సీతోపాటు ప్రతిఒక్క కార్మికుడికి తాను కృతజ్ఞత తెలుపుతున్నానని సీఎం చెప్పారు.

నిర్దిష్ట గడువులోగా మేడిగడ్డ పూర్తికావాలి
కన్నెపల్లి పంపుహౌజ్ నుంచి సీఎం కేసీఆర్ ఉదయం 10.43 గంటలకు అధికారులతో కలిసి హెలికాప్టర్‌లో మేడిగడ్డ బరాజ్‌కు బయల్దేరారు. సరిగ్గా 11 గంటలకు మేడిగడ్డకు చేరుకున్న ఆయన మొదట వ్యూపాయింట్ నుంచి బరాజ్ పనులను పరిశీలించారు. ఆ తర్వాత రోడ్డు మార్గాన సీఎం కేసీఆర్ పర్యటన పూర్తిగా గోదావరిలో సాగింది. తెలంగాణ, మహారాష్ట్ర మధ్యలో మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. ముఖ్యమంత్రి ఈ వంతెన మీదుగానే వాహనంలో గోదావరి మధ్యకు వెళ్లి మేడిగడ్డ బరాజ్ పనులను క్షుణ్ణంగా పరిశీలించారు. గేట్ల బిగింపు, రివిట్‌మెంట్, కరకట్టల నిర్మాణ పనులపై ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడి నుంచి సీఎం కేసీఆర్ మట్టిరోడ్డు మీదుగా గోదావరి నదిలోకి వెళ్లారు. బరాజ్ నిర్మాణం వల్ల నీరు నిలిచే ప్రదేశాన్ని పరిశీలించారు. చాలాసేపు గోదావరిలో కాలినడకన బరాజ్ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో చూశారు. మధ్యాహ్నం 12.20 గంటల వరకు ఆయన గోదావరి నది మార్గంలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని బరాజ్ వద్ద అధికారులు వ్యూ పాయింట్, వంతెనపై, గోదావరిలో టెంట్లు ఏర్పాటు చేశారు.

సీఎం కేసీఆర్ మాత్రం కాలినడకన ముందుకు సాగుతూ బరాజ్ పనులను పరిశీలించారు. మధ్యాహ్నం 12.20 గంటలకు మేడిగడ్డ బరాజ్ వద్ద గోదావరి ఒడ్డున సాగునీటిశాఖ ఇంజినీర్లు, కాంట్రాక్టు ఏజెన్సీ ప్రతినిధులతో సమావేశమై పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఇంజినీర్లతో కలిసి బరాజ్ గేట్ల బిగింపు పనుల పురోగతిపై అడిగి తెలుసుకున్నారు. రేకుల షెడ్డులో గంటకుపైగా సాగిన ఈ సమావేశంలో మేడిగడ్డ బరాజ్ నిర్మాణ పనుల పూర్తికి అధికారులకు గడువు విధించారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు మేడిగడ్డ నుంచి ముఖ్యమంత్రి హెలికాప్టర్ ద్వారా రామగుండంలోని ఎన్టీపీసీకి బయల్దేరారు. సీఎం వెంట రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సీఎస్ ఎస్కే జోషి, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, ఈఎన్సీలు మురళీధర్‌రావు, ఎన్ వెంకటేశ్వర్లు, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్, మెగా కంపెనీ డైరెక్టర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జయశంకర్ భూపాల్‌పల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, సాగునీటిశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మండుటెండలో.. గోదావరి ఇసుక తిన్నెల్లో..
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం. ఒకవైపు పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో కొనసాగుతున్న మావోయిస్టుల బంద్. భారీ భద్రత ఏర్పాట్లతో ఉద్రిక్తపరిస్థితి. మరోవైపు భానుడి భగభగ. 44 డిగ్రీల ఉష్ణోగ్రత. గోదావరి తీరం కావడం వల్ల భరించలేని ఉక్కపోత. వడగాలులతో కర్ఫ్యూ వాతావరణం. అపర భగీరథుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు ఇవేవీ పట్టలేదు. సుదీర్ఘకాలంగా తాను కంటున్న కలను సాకారం చేసుకోవాలన్న తపన ముందు ఇవన్నీ ఇబ్బందులుగా అనిపించలేదు. కాలి నడకన రెండున్నర గంటలకుపైగా గోదావరి నదీగర్భంలోనే ఆయన పర్యటించారు. రేకుల షెడ్డులోనే ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన ఆయన పర్యటన మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగింది. శనివారం రాత్రి రామగుండంలోని ఎన్టీపీసీ గెస్ట్ హౌస్‌లో బసచేసిన సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం కుటుంబసమేతంగా బయల్దేరి హెలికాప్టర్ ద్వారా 7.03 గంటలకు మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంపుహౌజ్ హెలిప్యాడ్ వద్ద దిగారు. మొదట కన్నెపల్లి సమీక్ష అనంతరం ఎర్రటెండలో మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. వ్యూ పాయింట్ నుంచి చూసి వెళ్లడం కాకుండా ఈసారి ఆయన రోడ్డు మార్గాన బరాజ్ పైకి వెళ్లారు. సరిగ్గా గోదావరి నది మధ్య వరకు చేరుకొని బరాజ్ పనులను పరిశీలించారు. అంతటితో ఆగకుండా నేరుగా గోదావరి నదిలోకి దిగారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సమావేశం ముగిసిన తర్వాత హెలికాప్టర్ ద్వారా పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి బయల్దేరారు.

ముగిసిన సీఎం పర్యటన
జ్యోతినగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండురోజులపాటు చేపట్టిన పర్యటన ఆదివారంతో ముగిసింది. పూర్తిగా స్వరాష్ట్ర అవసరాల కోసం ఎన్టీపీసీలో నిర్మిస్తున్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు (టీఎస్టీపీపీ) నిర్మాణపనుల పరిశీలన, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ సందర్శన, అధికారులతో సమీక్షా సమావేశాలతో కేసీఆర్ పర్యటన సాగింది. శనివారం టీఎస్టీపీపీ సందర్శన, ప్రాజెక్టు నిర్మాణంలో పనులపై ఎన్టీపీసీ అధికారులతో రివ్యూ నిర్వహించిన సీఎం రాత్రి గెస్ట్‌హౌస్‌లో బసచేశారు. రెండోరోజు ఆదివారం ఉదయం ఎన్టీపీసీ హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సతీసమేతంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం బయలుదేరిన ఆయన, ఆలయాన్ని సందర్శించుకొని కన్నెపల్లి పంప్‌హౌస్, మేడిగడ్డ బరాజ్‌లను పరిశీలించి మధ్యాహ్నం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌కు చేరుకున్నారు. వీఐపీ గెస్ట్‌హౌస్‌లో భోజనం అనంతరం 2.49 గంటలకు రోడ్డు మార్గాన కాన్వాయ్‌లో తిరిగి హైదరాబాద్ పయనమయ్యారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.