-ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడించండి -ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిపెడితే అభివృద్ధిలో పరుగులే -నాలుగేండ్లలో నారాయణఖేడ్‌ను సిద్దిపేటలా మార్చకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు అడగం: మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రంలోనే అతి పెద్ద మండలంగా ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మనూరు మండలం అభివృద్ధిలో మాత్రం అత్యంత వెనుకబడి ఉంది. ఇక్కడ పెద్ద నాయకులున్నా అభివృద్ధిని పట్టించుకోకపోవడం మూలంగానే ప్రజల సమస్యలు పరిష్కారం కావడం లేదు. వచ్చే ఉప ఎన్నికలో గులాబీ జెండాను రెపరెపలాడిస్తే నారాయణఖేడ్ దశదిశను పూర్తిగా మార్చేస్తాం అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తంచేశారు. సోమవారం మెదక్ జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్, కంగ్టి, మనూరు మండలాల్లో పర్యటించిన మంత్రి పుల్కుర్తిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు చెందిన నలుగురు సర్పంచులు, ఇద్దరు టీడీపీ ఎంపీటీసీలతోపాటు మాజీ ఎంపీపీ, మాజీ జెడ్పీటీసీ, తెలుగు యువత జిల్లా నాయకుల ఆధ్వర్యంలో వందలాది మంది హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 68 ఏండ్లు దాటినా దేశంలో ఖేడ్ వంటి వెనుకబడిన నియోజకర్గం కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతున్నదన్నారు. దున్నపోతుకు మేతేసి బర్రెకు పాలు పిండితే రావని, జోడెద్దుల బండి సజావుగా నడుస్తుందనే సత్యాన్ని గ్రహించి వచ్చే ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ను గెలిపిస్తేనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖేడ్పై దృష్టిపెడితే అభివృద్ధిలో ముందంజలో ఉంటుందని, నాలుగేండ్లలో నారాయణఖేడ్‌ను సిద్దిపేట తరహాలో అభివృద్ధి చేయకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లడగమని స్పష్టంచేశారు. నారాయణఖేడ్ ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు నీళ్లు, కరెంట్ దక్కకుండా కుట్రలు చేస్తున్న టీడీపీకి ఓటేస్తే మురిగిపోతుందని, ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని సూచించారు.
మాది చేతల్లో చూపే ప్రభుత్వం నారాయణఖేడ్ నియోజకవర్గంలో కేవలం 20 విద్యుత్ సబ్స్టేషన్లు మాత్రమే ఉన్నాయని, రాష్ట్రంలో మార్కెట్‌యార్డు లేని ఏకైక నియోజకవర్గం ఇదొక్కటేనని మంత్రి హరీశ్‌రావు గుర్తుచేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి ఒకేసారి పది 33/11కేవీ, ఒక 132 కేవీ సబ్స్టేషన్లను, మార్కెట్‌యార్డును, గోదాంలను మంజూరు చేయించామని చెప్పారు. మనూరులో మరో సబ్మార్కెట్తోపాటు నియోజకవర్గానికి మరో పది సబ్స్టేషన్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజల తాగునీటి గోస తీర్చేందుకు వాటర్‌గ్రిడ్ పథకంలో భాగంగా ప్రభుత్వం రూ.780 కోట్లు మంజూరుచేసిందని, పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వద్ద శరవేగంగా పనులు కొనసాగుతున్నాయన్నారు. తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని, చేతల్లో చూపే ప్రభుత్వమని స్పష్టంచేశారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మురళీయాదవ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి ఎం భూపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ సర్పంచ్ అప్పారావుశెట్కార్ తదితరులు పాల్గొన్నారు.
మనూరుపై మంత్రి వరాల జల్లు మనూరుపై మంత్రి హరీశ్‌రావు వరాల జల్లు కురిపించారు. మనూరులో సబ్మార్కెట్యార్డుతోపాటు జూనియర్ కళాశాల, 30 పడకల దవాఖాన, ఏడు కొత్త చెరువులు, రూ.10 లక్షల వ్యయంతో గ్రామ సమైక్య భవనం, నిరుపేద విద్యార్థుల కోసం ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాల, గ్రామాల్లో సీసీరోడ్లు, మురుగుకాల్వలు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటకు అవసరమైన నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని భరోసా కల్పించారు.