నారాయణఖేడ్ ఉప ఎన్నిక ప్రచారానికి అధికార టీఆర్‌ఎస్ సర్వం సిద్ధం చేసుకుంటున్నది. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గెలుపు వ్యూహాలను రచిస్తున్నది. పక్కా ప్రణాళికతో భారీ మెజార్టీయే లక్ష్యంగా పార్టీ శ్రేణులను ఎన్నికల రంగంలోకి దింపుతున్నది. ఖేడ్ ఉప ఎన్నిక ప్రచారం 21 నుంచి ప్రారంభం కానుండడంతో గులాబీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రి హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పర్యవేక్షణలో మండలానికి ఓ ఎమ్మెల్యేతో పాటు ఓ ముఖ్య నేత, గ్రామానికి ఐదుగురు నాయకులకు ప్రచార బాధ్యతలను అప్పగించనున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతిరోజు 15 గ్రామాల్లో ప్రచారం చేసేలా.. మంత్రి హరీశ్‌రావు కూడా హాజరయ్యేలా చూస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సైతం పలు సభల్లో పాల్గొననున్నారు. ఇప్పటికే ప్రచార సామగ్రి, రథాలను సిద్ధం చేశారు. ఖేడ్‌లో నివాసముంటున్న మరాఠి, కన్నడ, లంబాడావారి కోసం ఆయా భాషల్లో ప్రచార సీడీలను కూడా రూపొందించారు.

కాంగ్రెస్ నాయకులు ఓట్లెట్లా అడుగుతారు: హరీశ్ రావు 60ఏళ్లలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కనీస అభివృద్ధి చేయని కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ఓట్లెలా అడుగుతారని, ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా అన్ని రంగాల్లో వెనుకపడేసి ప్రజలకు వెనుకబాటుతనాన్ని బహుమానంగా ఇచ్చినందుకు ఓట్లడుగుతారా అని మంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. శనివారం సాయంత్రం మంత్రి నారాయణఖేడ్‌లోని టీఆర్‌ఎస్ నేత అశోక్‌శెట్కార్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే మాయమాటలను నియోజకవర్గ ప్రజలు నమ్మేస్థితిలో లేరని, ఈ ప్రాంతంలో కేసులు, వలసలు, అవినీతిలో అభివృద్ధి చేశారని గుర్తించి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. గతంలో పదేళ్లు అధికారంలో ఉండి ఎంపీ, ఎమ్యెల్యేలుగా ఉన్నప్పుడే ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకుండా ఎలా అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. పనులు చేయకుండానే బిల్లులు కాజేసిన చరిత్ర కాంగ్రెస్ నాయకులదని దుయ్యబట్టారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మ నారాయణఖేడ్‌ను అభివృద్ధి చేశామని చెబుతూ టీఆర్‌ఎస్ ఏమీ చేయలేదని చెబుతుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో మార్కెట్‌యార్డు లేని నియోజకవర్గంగా, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలోలేని విధంగా కేవలం 3శాతం రహదారులు మాత్రమే డబుల్‌లేన్ రోడ్లు నారాయణఖేడ్‌లో మాత్రమే ఉండడం ఇదేనా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి అని నిలదీశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 33శాతానికి డబుల్‌లేన్ రహదారులను ఏర్పాటు చేస్తుండడంతో పాటు దవాఖానలు, ఒకేసారి రెండు మార్కెట్‌యార్డులు, 12సబ్‌స్టేషన్లను మంజూరు చేయడమే కాకుండా ప్రారంభోత్సవం కూడా చేశామన్నారు. జిల్లాలోనే నారాయణఖేడ్ నియోజకవర్గం వెనుకబడడం దురదృష్టకరమని, ప్రజలకు తాగునీళ్లు తాపలేని దౌర్భాగ్యపరిస్థితిలో మహిళలు భుజాలు కాయలు కాశేలా నీళ్లు మోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కంగ్టి మండలంలోని కౌలాస్‌నాలా తాగునీటి పథకం దశాబ్దకాలంగా ప్రారంభానికి నోచుకోకుండా ఉంటే అక్కడి మహిళల బాధలు చూడలేక 10రోజుల్లో పనులు పూర్తి చేసి పథకాన్ని ప్రారంభించామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఆపార్టీ నాయకులను నమ్మలేక టీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సింగిల్‌డిజిట్ స్థానాలు రావడం ఖాయమని మంత్రి దీమా వ్యక్తం చేశారు. గతంలో కూడా ముఖ్యమంత్రులుగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డిలు నియోజకవర్గాలను పర్యటించిన సందర్భాల్లో ఒరిగిందేమి లేదని, అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ ఇటీవల దుబ్బాక పర్యటనలో నియోజకవర్గ అభివృద్ధికి వరాల జల్లు కురిపించారని మంత్రి గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలు, నారాయణఖేడ్ ప్రాంత అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరిస్తున్నారని, ఇక్కడి ప్రజలు ముమ్మాటికి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. టీడీపీ పూర్తిగా కనుమరుగవుతుందని, అది ఆంధ్రాపార్టీ అని ఆ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో డిపాజిట్టు కూడా దక్కే పరిస్థితి లేదన్నారు. టీడీపీ నాయకులు కనీసం వారి పిల్లల భవిష్యత్తు కోసమైనా ఆలోచించాలని, ఆపార్టీకి ఓటేస్తే మురుగుకాల్వలో కాలు వేసినట్టేనని ఎద్దెవా చేశారు. సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కైనా సరే నారాయణఖేడ్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని, నారాయణఖేడ్ ప్రజలు ఇప్పుడిప్పుడే అభివృద్ధి రుచి చూస్తున్నారని, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా నియోజకవర్గానికి సాగు,తాగునీరు తెచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.