Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేషనల్ హైవేల విస్తీర్ణం పెంచాలి

-ప్రతిపాదనలు పంపినా పట్టించుకోని కేంద్రం
-కేంద్రమంత్రి గడ్కరీకి ఎంపీ వినోద్‌కుమార్ లేఖ

తెలంగాణలో జాతీయ రహదారుల విస్తీర్ణం పెంచాలని, రాష్ట్ర విభజనచట్టం ప్రకారం ఇచ్చిన హామీల్లో రాష్ట్ర విస్తీర్ణానికి అనుగుణంగా జాతీయ రహదారుల విస్తరణపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఎంపీ బీ వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు. ప్రతిపాదనలు పంపినా కేంద్రం స్పందించడంలేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఏపీలో నేషనల్ హైవేల నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, పలు నేషనల్ హైవేలను ప్రకటించారని గుర్తుచేశారు. కానీ తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణానికి అనుగుణంగా అంతర్గత నేషనల్ హైవేల విస్తరణపై కేంద్రం గతంలో ఇచ్చిన హామీని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నెలాఖరుకల్లా తెలంగాణలో నేషనల్ హైవేల విస్తరణపై కేంద్రమంత్రి గడ్కరీ ప్రకటన చేసి, శంకుస్థాపనలు చేయాలని కోరారు. ఈమేరకు రాష్ట్రం తరఫున గడ్కరీకి లేఖ రాసినట్టు ఎంపీ వినోద్ తెలిపారు. కేంద్రం వెంటనే స్పందించకుంటే ఫిబ్రవరిలో జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో నిరసన తెలుపుతామని లేఖలో పేర్కొన్నట్టు వివరించారు. నేషనల్ హైవేలకు సగటున ఇవ్వాల్సిన గుర్తింపు కూడా తెలంగాణ రోడ్లకు ఇవ్వడం లేదన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ చొరవతో అనేక రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు చెప్పారు.

కేంద్రం తెలంగాణలో 1,380 కిలోమీటర్లను జాతీయ రహదారులుగా ప్రకటించిందన్నారు. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నవాటిని రీజినల్ రింగ్ రోడ్డు కింద ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని తెలిపా రు. ఈ మేరకు రాష్ట్రంలో నేషనల్ హైవేల విస్తరణపై సీఎం కే చంద్రశేఖర్‌రావు అనేకసార్లు కేంద్రమంత్రి గడ్కరీకి లేఖలు రాశారని గుర్తుచేశారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రహదారులను గుర్తించాలని లేఖలో కేంద్రాన్ని కోరామన్నారు. విభజనచట్టం ప్రకారం తెలంగాణలో జాతీయ రహదారులను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. రాష్ట్రంలో రహదారులు నిర్మించడంవల్ల వెనుకబాటుతనం పోతుందన్నారు.

తెలంగాణలో నేషనల్ హైవేల విస్తరణను కోరు తూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినవాటిలో ప్రధానంగా హైదరాబాద్ – వలిగొండ- తొర్రూరు- నెల్లికుదురు- మహబూబాబాద్- ఇల్లందు- కొత్తగూడెం (జంక్షన్ ఎన్‌హెచ్-30), మెదక్- ఎల్లారెడ్డి- రుద్రూర్, బోధన్- బాసర- భైంసా, మెదక్- సిద్దిపేట- ఎల్కతుర్తి ఉన్నాయన్నారు. చౌటుప్పల్- షాద్‌నగర్- కంది (రీజినల్ రింగ్‌రోడ్ హైదరాబాద్ సదరన్ పార్ట్) ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి చేసిన ప్రతిపాదనలో కేంద్రం సూచించిన విధంగా 50శాతం భూసేకరణ వ్యయాన్ని భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నదని సీఎం కేసీఆర్ గతేడాది ఆగస్టు 29న కేంద్రానికి లేఖ పంపారన్నారు. రూ.5,643 కోట్లతో రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపామన్నారు. విభజనచట్టం ప్రకారం తెలంగాణలో నేషనల్ హైవేలను నిర్మిస్తామని ప్రకటించిన కేంద్రం మాట తప్పిందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.