Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నవ భారతానికి నాంది..

టీ హబ్ నవభారతానికి నాంది అని విఖ్యాత పారిశ్రామికవేత్త రతన్‌టాటా ప్రశంసించారు. ఔత్సాహిక ఆవిష్కరణలకు ఇదొక గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ప్రపంచ యవనిక మీద భారత ఎంటర్‌ప్రెన్యూర్లు లీడర్లుగా ఎదిగేందుకు టీ హబ్ నాంది పలకాలని ఆయన ఆకాంక్షించారు. గురువారం గచ్చిబౌలిలోని టీ హబ్ భవనం కాటలిస్ట్‌ను రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి రతన్ టాటా ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

KTR in the Launch of T-Hub

-టీ హబ్ అద్భుత నిర్మాణం.. -పారిశ్రామిక దిగ్గజం రతన్‌టాటా ప్రశంస -ప్రపంచ లీడర్లు కావాలని ఆకాంక్ష -గవర్నర్ నరసింహన్‌తో కలిసి టీహబ్ ప్రారంభించిన టాటా -టీహబ్ గ్రేట్‌ఐడియా అన్న గవర్నర్ -ఐటీ విప్లవానికి హైదరాబాద్ వేదిక కావాలి -త్వరలోనే రెండో దశకూ కార్యరూపం: మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా రతన్‌టాటా ప్రధానోపన్యాసమిస్తూ టీ హబ్ అద్భుత నిర్మాణమని కొనియాడారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో యువతను ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్లతో భవనాన్ని తీర్చిదిద్దారని ప్రశంసించారు. కాటలిస్ట్ భవనాన్ని చూసిన తర్వాత దేశం కొత్త కోణం వైపు చొరవ తీసుకుంటున్నదనే భావన కలిగింది. ఎంటర్‌ప్రెన్యూర్లు, ఇన్నోవేటర్లు, పారిశ్రామికవేత్తలకు ఇదో గొప్ప అవకాశం. ఇప్పటిదాకా దేశంలో దుకాణదారులు, పరిశ్రమలవారు, వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకునేవారు వంటి సంప్రదాయ వ్యాపారవేత్తలు ఉన్నారు. ఇపుడు అందుకు భిన్నంగా, సాంకేతికత ఆలంబనగా చేసుకుని భవిష్యత్తులో కీలక భూమిక పోషించగల ఆవిష్కరణలు జరగాల్సిన అవసరం వచ్చింది.

అలాంటి ఆవిష్కరణలకు ఈ టీ హబ్ ఒక చక్కటి వేదిక. దీని ద్వారా కొత్త కొత్త ఆవిష్కరణలతో ఎంటర్‌ప్రెన్యూర్లు వస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచ యవనికపై భారత్‌కు చెందిన ఎంటర్‌ప్రెన్యూర్లు నిలబడాల్సిన తరుణమిది. అలాంటి నవశకానికి ఈ టీ హబ్ నాందిగా నిలుస్తుందనే విశ్వాసం నాకుంది. ఈ-కామర్స్, లైఫ్‌సైన్సెస్, మెడికల్, ఈ రీటైలింగ్ రంగాల్లో ఇపుడు మంచి అవకాశాలున్నాయి. వీటిని ఒడిసిపట్టుకోవాలి.. ప్రపంచ లీడర్లుగా ఎదగాలి అని టాటా అన్నారు. ప్రస్తుతం దేశంలో కొత్త ఆవిష్కరణలకు ఏర్పడుతున్న ప్రతిబంధకాలను ఆయన వివరించారు. కొత్త ఆలోచనతో ఓ ఉద్యోగి బాస్ వద్దకు వెళ్తాడు.

బాస్ ఏమంటాడంటే.. నువ్వు కాస్త అనుభవం సంపాదించిన తర్వాత నన్ను కలువు అంటాడు. లేదా ఇంకా చాలా తెలుసుకోవాలని సలహా ఇస్తాడు. దాంతో ఈ ఉద్యోగి ఆలోచన ఆగిపోతుంది. అడుగు ముందుకువేసేందుక ఆర్థిక స్తోమతా ఉండదు కాబట్టి ఆ ఆవిష్కరణ అక్కడితో ముగిసిపోతుంది. ఇవాళ టీ హబ్ ద్వారా అలాంటి ప్రతిబంధకాలకు పరిష్కారం దొరికింది. ఇక్కడ ఆలోచనలతో వచ్చిన వారికి మార్గదర్శనం చేసేందుకు మెంటార్లు ఉన్నారు. వెంచర్ కాపిటలిస్టులు సైతం రెడీగా ఉన్నారు. ఈ అవకాశాన్ని ఔత్సాహికులు వినియోగించుకుని దూసుకువెళ్లాలి అని సూచించారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ 17నెలల 4 రోజుల్లోనే స్టార్టప్‌ల కేంద్రాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమన్నారు. మంత్రి కేటీఆర్ మదిలో రూపుదిద్దుకున్న టీ హబ్ గ్రేట్ ఐడియా.

ఇలాగే మిగతా మంత్రులు కూడా వినూత్నంగా ఆలోచించాలి అన్నారు. తాను వివిధ అంశాలపై విద్యాసంస్థలను సందర్శించినపుడు విద్యార్థుల్లో ఎన్నో ఆలోచనలు ఉండటాన్ని చూసి అశ్చర్యపోయేవాడినని తెలిపారు. అలాంటి వారు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఇలాంటి టీ హబ్ గొప్ప వేదికగా ఉంటుందన్నారు. నిర్వాహకులు అన్ని వైస్‌చాన్స్‌ల ర్లు, కాలేజీ ప్రిన్సిపాల్స్‌ను ఇక్కడికి పిలిపించి టీ హబ్ విశిష్టత, ప్రత్యేకతలపై అవగాహన కలిగించాలని కోరారు.

గ్రామీణ ప్రాంతాల్లో గొప్పగొప్ప ఆలోచనలు ఉన్నాయని, వాటికి కార్యరూపం ఇచ్చేలా ప్రోత్సాహం అందించాలని కోరారు. విదేశాల్లో అద్భుతాలు సృష్టిస్తున్న వారు టీ హబ్‌కు వచ్చి ఇక్కడే ఆవిష్కరణలు చేసే స్థాయికి ఎదగాలని అన్నారు. నీరు, విద్యుత్తు, విద్యారంగాలమీద కొత్త స్టార్టప్‌లు దృష్టి పెడితే అవి బాగా విజయం సాధిస్తాయని భావిస్తున్నానని నరసింహన్ చెప్పారు. కొత్త రాష్ట్రమైనప్పటి 17 నెలల్లో టీ హబ్ వంటి అద్భుత వేదిక ఏర్పాటుచేసి రికార్డ్ సృష్టించిందన్నారు. మంత్రి కేటీఆర్‌ను డైనమైట్ మంత్రి అని గవర్నర్ సంబోధించడంతో సభలో కేరింతలు వినిపించాయి.

ఇది ప్రారంభమే.. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా సమయం కేటాయించి హాజరైన గవర్నర్ నరసింహన్, రతన్‌టాటాకు ముందుగా ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్‌ను భారతదేశపు స్టార్టప్‌ల రాజధానిగా రూపొందించాలనేదే తమ ప్రభుత్వ ధ్వేయమని అన్నారు. భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అన్నిదేశాల్లోనూ సాంకేతిక సేవలను అందిస్తున్నారు. ప్రపంచంలో ఎవరితోనైనా పోటీపడగలిగే సత్తా ఉన్నప్పటికీ మనవాళ్లు కేవలం ప్రోగ్రామర్లు లేదా బ్యాక్‌ఎండ్ సిబ్బందిగా మాత్రమే గుర్తింపు పొందుతున్నారు.

అంతే తప్ప గర్వించదగిన ఎంటర్‌ప్రెన్యూర్లుగా ఎదగలేకపోతున్నారు. అవకాశాలు లభిస్తే గూగుల్, వాట్సప్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిని కూడా మన భారతీయులు ఆవిష్కరించగలరు. ఇవాళ టీ హబ్ ద్వారా ఆ కల సాకారం కాబోతున్నది అని అన్నారు. భారతీయ యువత అలాంటి సాంకేతిక ఆవిష్కరణలు చేయగలదనే దృఢ విశ్వాసంతో టీ హబ్‌కు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. టీ హబ్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం తరఫున కావాల్సినవన్నీ చేస్తాం. హైదరాబాద్ భారతదేశపు స్టార్టప్‌ల రాజధానిగా తీర్చిదిద్దుతాం. టీ హబ్ ఒక్క తెలంగాణవారిది మాత్రమే కాదు. భారతీయులందరిదీ.. ఢిల్లీ, బెంగళూరు, మీరట్…ఇలా అందరిదీ. అద్భుతమైన ఆలోచనలు ఉన్న వారికి అపరిమితమైన అవకాశాలను టీ హబ్ అందిస్తుంది. వీటినీ సద్వినియోగం చేసుకొని రాబోయే ఐటీ విప్లవానికి హైదరాబాద్‌ను వేదిక చేయాలి.

ఆవిష్కరణలకు అండగా నిలిచేందుకు దేశంలో ప్రభుత్వపరంగా కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ చొరవ తీసుకొని టీ హబ్‌ను ఏర్పాటు చేసింది అని చెప్పారు. టీ హబ్‌లో భాగస్వామ్యం అయ్యేందుకు ఇప్పటికే అమెరికా, యూరప్‌ల నుంచి పలు కంపెనీలు ముందుకువచ్చాయి. నాస్కాం సైతం సంసిద్ధత వ్యక్తం చేసింది. స్టార్టప్‌లకు కొండంత అండగా నిలిచే రతన్ టాటా ఈ కార్యక్రమానికి విచ్చేయడం శుభపరిణామం. టెక్నాలజీ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ తమ స్టార్టప్‌ల కేంద్రాలను టీ హబ్‌లో ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల, మాస్టర్‌కార్డ్ సీఈవో అజయ్‌బంగా, అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌లు త్వరలోనే టీ హబ్‌ను సందర్శిస్తామని హామీ ఇచ్చారు.

ఇక్కడికి వచ్చి వారు స్టార్టప్‌లకు మార్గదర్శకం చేస్తారు. టీహబ్ రెండో దశ త్వరలో కార్యరూపం దాల్చుతుందని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఓ వైపు సంప్రదాయాలను పరిరక్షించుకుంటూనే మరోవైపు వినూత్నమైన టీ హబ్‌కు సైతం కేటాయింపులు చేయడం, ఆవిష్కరణలకు వేదికగా ఉపయోగించడం సంతోషకరమన్నారు. టీ హబ్ వల్ల స్టార్టప్‌లకు కొత్త ఉత్సాహం వచ్చి తద్వారా మంచి ఫలితాలు సాధించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు.

నవశకానికి ఈ టీ హబ్ నాందిగా నిలుస్తుందనే విశ్వాసం నాకుంది. ఈ-కామర్స్, లైఫ్‌సైన్సెస్, మెడికల్, ఈ రీటైలింగ్ రంగాల్లో ఇపుడు మంచి అవకాశాలున్నాయి. వీటిని ఒడిసిపట్టుకోవాలి.. ప్రపంచ లీడర్లుగా ఎదగాలి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.