Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నవరాష్ర్టానికి నయా రాస్తా

– దిశా నిర్దేశానికి మేధోమథనం – పేదల సంక్షేమమే లక్ష్యం – తెలంగాణ సమాజం ఎంతో కోరుకుంటున్నది – కలిసి పనిచేద్దాం.. ఒకే గొంతుకతో ముందుకెళ్దాం – జిల్లా కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్ – విద్యుత్ ప్రాజెక్టులకు భూసేకరణ – పరిశ్రమల స్థాపనకు ల్యాండ్ బ్యాంక్ స్థిరీకరణ – మిషన్ కాకతీయను విజయవంతం చేద్దాం – వాటర్‌గ్రిడ్‌ద్వారా ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు – రాష్ట్రమంతటా పారిశుద్ధ్యానికి పెద్ద పీట – హరితహారం విజయవంతం కావాలి – ప్రాథమ్యాలను కలెక్టర్ల ముందుంచిన సీఎం

KCR addressing in conference with Collectors

శాతాబ్దాలుగా దగాపడిన తెలంగాణకు కొత్త మార్గనిర్దేశనం చేస్తూ రెండు రోజల కలెక్టర్ల సమావేశం శుక్రవారం మొదలైంది. బంగారు తెలంగాణ నిర్మాణానికి సన్నాహక సమావేశంలా.. రాష్ర్టాన్ని పునర్నిర్మించేందుకు అవసరమైన మేధోమథనంలా సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధిపై తన విజన్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కలెక్టర్లు, ఇతర అధికారులకు వివరించారు. ప్రభుత్వ ప్రాథమ్యాలను అధికారుల ముందు పెట్టి.. వాటి విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేరుకు కలెక్టర్ల సమావేశమైనా.. అన్ని విభాగాలకు చెందిన కీలక అధికారులతోపాటు జిల్లా స్థాయి అధికారులు, పోలీసు అధికారులు కూడా పాల్గొనడంతో యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఒక్కచోట కూర్చొని చర్చించినట్లయింది. నగరంలోని మారియట్ హోటల్‌లో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశం తొలి రోజు కార్యక్రమం ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకూ సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో లోతుగా చర్చలు జరిగాయి. సమావేశాన్ని ప్రారంభిస్తూ మాట్లాడిన సీఎం కేసీఆర్.. పేదల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, అధికారులు కూడా అదే బాటలో ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ పథకాలు అట్టడుగుస్థాయివరకూ చేరాలని, పూర్తి పారదర్శకతతో, వేగవంతంగా పనులు జరగాలని కేసీఆర్ చెప్పారు. సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గతంలో వివిధ సంక్షేమ కార్యక్రమాలకోసం రూ.8700 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు తమ ప్రభుత్వం రూ.27వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని తెలిపారు. వీటి ఫలితాలు నూటికి నూరుశాతం అర్హులందరికీ అందాలని సీఎం స్పష్టంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో మనమున్నాం. ఈ వ్యవస్థలో ప్రజలే ముఖ్యం. ఈ ప్రభుత్వం ప్రజల కోసమే. కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటేనే దానిపైన పోరాటం చేయాలనే అభిప్రాయం ఉంది. మనం ప్రజల్లో మమేకం కావాలి, పాలు-నీళ్లలా కలిసిపోవాలి, ప్రజాశక్తి గొప్పదని చాటాలి. ప్రజల సంఘటిత శక్తిని బలపరిచి ప్రజారాజ్యం స్థాపించాలి అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రాథమ్యాలను, చేపట్టాల్సిన కార్యక్రమాలను ఆయన కలెక్టర్ల ముందు ఉంచారు. వీటిని పరిపూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ కార్యదర్శులు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, మేయర్లు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, జిల్లాస్థాయి అధికారులు కూడా పాల్గొన్నారు. వివిధ అంశాలపై సీఎం ఏమన్నారో ఆయన మాటల్లోనే..

పదవులు శాశ్వతం కాదు.. తెలంగాణ సమాజం గడిచిన దశాబ్దాల కాలంలో ఎన్నో ఒత్తిళ్లకు లోనైంది. రాష్ట్రం భూస్వాముల పీడనను భరించింది. ప్రజలు అనేక కష్టాలుపడ్డారు. ఆ తరువాత అనిశ్చితికి గురై కొంత కాలముంది. తరువాత సమైక్య రాష్ట్రంలో విలీనమైంది. ఈ కాలంలో తెలంగాణ ప్రాంతంలో అనేక ఉద్యమాలతోపాటు, నక్సలైట్ ఉద్యమాలు కొనసాగాయి. తెలంగాణ చాలా సమస్యలను ఎదుర్కొన్నది. ఎంతో పెనుగులాటలను ఎదుర్కొన్నది. ఎంతో ఒత్తిడికి లోనైంది. అంతటి ఒత్తిడిని ఎదుర్కొన్న తెలంగాణ సమాజం ఎంతో కోరుకుంటున్నది. అది మనం చేయాలి. తెలంగాణ రాష్ట్రం సాధించడానికి సాగిన ప్రయత్నాలన్నీ మీకు తెలుసు. తెలంగాణ ప్రజలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడానికి అవకాశం కల్పించారు. ఇది ఒక గొప్ప అదృష్టం. పదవులు శాశ్వతం కాదు. ప్రజలు మనకు అందించిన అవకాశాన్ని వినియోగించుకోవాలి. సీఎంలు, మంత్రులు, కలెక్టర్లు మనకంటే ముందు చాలా మంది పనిచేశారు. కొన్ని సందర్భాలలో మనం పనిచేసిన ప్రాంతాల్లో చేసిన పనులు ఆ ప్రాంత ప్రజలు తిరిగి జ్ఞాపకం చేయడం ఎంతో సంతృప్తినిస్తుంది. ప్రజలకు సేవ చేయడం ఎంతో గొప్పగా అనిపిస్తుంది. అన్నార్తులకు, దీనులకు సేవ చేయడం అమూల్యమైన అవకాశం. అది ఇచ్చే తృప్తికి వెలకట్టలేం. ప్రభుత్వం ప్రథమ కర్తవ్యంగా పేదల సంక్షేమాన్ని స్వీకరించింది. ఎన్నికల ప్రణాళికలో పేదల సంక్షేమాన్ని ప్రజలముందు పెట్టాం. దురదృష్టవశాత్తు 65 ఏండ్లు గడిచినా పేదరికం ఇంకా పట్టిపీడిస్తూనే ఉంది. పేదరికంనుంచి రాష్ర్టాన్ని బయటపడేయడం మా ఎజెండా. అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే శాంతిభద్రతలు ముఖ్యం. సంక్షేమం ఎంత ముఖ్యమో శాంతిభద్రతలు అంతే ముఖ్యం. వాటిని కాపాడడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.

కీలక నిర్ణయాలు – ప్రతినెలలో ఒక రోజు అర్బన్ డే, ఒక రోజు రూరల్ డే పాటించాలి. – వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లకు రూ.12వేలు, రూ.65వేల చొప్పున సహాయం. – పరిశుభ్రంగా ఉన్న గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంటు. – రియో డీ జెనీరో నగరం ఆదర్శంగా మౌలిక వసతుల కల్పన. – పట్టణాల్లోని ప్రతి ఇంటికీ తడి, పొడి చెత్తను సేకరించడానికి ప్లాస్టిక్ డస్ట్ బిన్లు. – ఆసరా పెన్షన్లు అర్హులందరికీ అందించాలి. అనర్హులను ఏరి పారేయాలి. – సంక్షేమానికి రూ.27వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం.. ప్రతిపైసా పేదలకు చేరాలి. – తక్షణ అవసరాలు తీర్చడంకోసం ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద రూ.10 కోట్ల నిధి. – జూలై రెండోవారంలో హరితహారం వారోత్సవం. – కమతాల ఏకీకరణకు కొత్త చట్టం. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం ప్రభుత్వ ప్రాధాన్యాలేంటో మీకు తెలుసు. మనమంతా విజ్ఞులం. విషయాలు తెలిసిన వాళ్లం. ఈ రోజు తాగునీటిద్వారానే అన్ని జబ్బులు వస్తున్నాయనేది మీకు తెలియనిది కాదు. మన ప్రభుత్వం ఇంటింటికీ నల్లా ద్వారా పరిశుభ్రమైన మంచినీరు ఇస్తామని మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడి ఉండకపోతే ఓటు అడుగనని చెప్పిన విషయంకూడా మీకు తెలుసు. పరిశుభ్రమైన మంచినీరు ప్రజల హక్కు. వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత. తెలివైన ప్రభుత్వాలు ప్రజా సంక్షేమానికి ప్రయత్నిస్తాయి. వాటర్‌గ్రిడ్‌ద్వారా ఎక్కడా సమస్యలున్నాయో అక్కడికి నీళ్లు అందించే పద్ధతికాదని, మొత్తం రాష్ర్టానికి నీరందించే బృహత్ కర్తవ్యాన్ని ప్రభుత్వం తీసుకున్నది. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఇతర శాఖలు, జిల్లా అధికారులు ఈ పథకం అమలు కోసం విశేషమైన ప్రయత్నాలు చేశారు.. చేస్తున్నారు.

మరింత వేగంగా మిషన్ కాకతీయ 1974లో బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా, గోదావరి నదులపై చర్చించింది. తెలంగాణలో కాకతీయుల కాలంలో నిర్మించిన చెరువుల మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఈ ప్రాంతాన్ని కాపాడింది. 1956నాటి లెక్కల ప్రకారం తెలంగాణలో 20 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందింది. ఆనాడు చెప్పుకోతగ్గ ఏకైక ప్రాజెక్టు నిజాం సాగర్. దాని ఆయకట్టు అధికారికంగా 2.75 లక్షల ఎకరాలు కాగా ప్రజలు మూడు లక్షల ఎకరాలు సాగు చేసేవారు. కోయిల్ సాగర్, లోయర్ మానేరు, పాకాల, కడెంవంటి మీడియం ఇరిగేషన్‌ద్వారా రెండు లక్షల ఎకరాలకు నీరు అందేది. మిగిలిన 15 లక్షల ఎకరాలకు తెలంగాణ మైనర్ ఇరిగేషన్ ఒకనాటి మేజర్ ఇరిగేషన్. ఇది చరిత్రలో ఉన్న సత్యం. అప్పటికే నిర్మితమైన కాకతీయ చక్రవర్తుల చెరువులను కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీలు కాపాడుకుంటూ వచ్చారు. దానిని పరిగణనలోకి తీసుకొని బచావత్ ట్రిబ్యునల్ గోదావరి జలాల్లో 175 టీఎంసీలు, కృష్ణా జలాల్లో 90 టీఎంసీల నీరు మొత్తం 265 టీఎంసీల నీరు మైనర్ ఇరిగేషన్‌గా నిర్ణయించారు. అంటే మన చెరువులను పూర్తిస్థాయిలో నింపితే మూడు సంవత్సరాల వరకు తెలంగాణలో ఎక్కడా కరువు ఛాయలు కనిపించవు. ఉద్దేశపూర్వకంగా, నేరపూర్వకంగా చేసిన పనులవల్ల చెరువులు కబ్జాలకు గురయ్యాయి. పూడికలతో చెరువుల తాంబాళాలవలే అయ్యాయి. నిధుల కొరత, రైతాంగం ఎరువులు వాడడంవల్ల, చెరువు మట్టిని తీసుకోకపోవడంవల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. కరువుకాటకాలనుంచి కాపాడేందుకు, గత చరిత్రను నిలబెట్టేందుకు సాగునీటిశాఖ చేపట్టిన గొప్ప కార్యక్రమం ఇది. అందుకే ప్రకృతి సంపదను ఒడిసిపట్టే కార్యక్రమంగా మిషన్ కాకతీయను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజల్లో జిజ్ఞాస మేల్కొన్నది. అందరూ పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం మరింత స్ఫూర్తితో వేగవంతంగా జరగాలి.

అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా మరొక కీలకమైన విషయం శక్తి వనరులు. ఈ రోజు విద్యుత్ లేని అభివృద్ధిని ఊహించలేం. గత 30ఏండ్లుగా విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. తెలంగాణ ఏర్పడితే అంధకారం అవుతుందని కొందరన్నారు. కానీ ఈ సంవత్సరం విశేషంగా కృషిచేసి, విద్యుత్ అధికారులు, ఆ శాఖ మంత్రి అందరి అంచనాలు తలకిందులు చేశారు. ఎక్కడా పంటలు ఎండలేదు. విద్యార్థులకు పరీక్షలకాలంలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా జరిగింది. పరిశ్రమలకు నిరంతర విద్యుత్ ఇస్తున్నాం. పారిశ్రామికవర్గాలు చాలామంది కలిసి ఆనందం వ్యక్తంచేస్తున్నారు. నిన్న నన్ను ఎమ్‌ఆర్‌ఎఫ్ కంపెనీ వాళ్లు కలిసి సంతోషం వ్యక్తంచేశారు. త్వరలో మరొక వేయి కోట్లతో ఇంకొక యూనిట్‌ను పెంచనున్నామని తెలిపారు. ఈ పద్ధతి కొనసాగించండి.. తెలంగాణలో పరిశ్రమలు పెట్టడానికి క్యూ కడతారు అని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.91,500 కోట్లతో భారీ ప్రణాళికను రచించడమేకాక, అవసరమైన సమీకరణకూడా పూర్తిచేసుకున్నది. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనటువంటి మెగా పవర్ ప్రాజెక్టును నల్లగొండ జిల్లా దామరచర్లలో 5 వేల ఎకరాలలో నిర్మిస్తున్నది. ఈ అల్ట్రామెగాపవర్ ప్రాజెక్టు కార్యక్రమం ప్రారంభించడానికి పర్యావరణశాఖ అనుమతులు లభించాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. త్వరలోనే కరెంటు కోతలు లేని రాష్ట్రం ఏర్పడుతుంది. ఇప్పటివరకు మన ఉత్పత్తి 4,320 మెగావాట్లు. దీనికి అనుబంధంగా ఈ ఏడాది 2వేల మెగావాట్లు అందుబాటులోకి రానున్నది. కృష్ణా థర్మోటెక్స్ కంపెనీనుంచి 770 మెగావాట్లు కొంటున్నాం. మొత్తం మీద 7వేల మెగావాట్లతో కరెంటు కోతలు లేని తెలంగాణ ఏర్పడబోతున్నది. ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎక్కడైనా అధికారుల చొరవ అవసరపడితే పూర్తి స్థాయి సహకారాలు అందించాలని కోరుతున్నాను.

ల్యాండ్ బ్యాంక్‌ను స్థిరీకరించాలి: పెట్టుబడులు భారీగా రావడానికి పారిశ్రామిక అవసరాలు మీకు తెలియనివి కావు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత భూమి ఇక్కడ ఉంది. కాబట్టి అధికారులు ల్యాండ్ బ్యాంకును స్థిరీకరించే దిశగా చర్యలు చేపట్టాలి, సమగ్రస్థాయిలో భూ ధ్రువీకరణ జరగాలి. ప్రభుత్వానికి ఇది చాలా ప్రధానమైన విషయంగా అధికారులు గుర్తించాలి. మేజర్ ఇరిగేషన్ ప్రాధాన్యం మీకు తెలుసు. అలాగే వాటిని ఈ మధ్యకాలంలో రీ ఇంజినీరింగ్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చొరవను ప్రదర్శించి భూ సేకరణ, ఇతరత్రా కార్యక్రమాల్లో అవసరమైతే తమ పరిధులకు మించి (ఔటాఫ్ ది బాక్స్) సహకారం అందించాలి. సత్వరం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి.

హరితహారం.. ప్రభుత్వం తీసుకున్న మరొక కార్యక్రమం. మీ జిల్లాల్లో నర్సరీలో పెరుగుతున్న మొక్కలు, వాటిని ఏ విధంగా గ్రామాలకు పంపాలో కార్యాచరణను సిద్ధం చేయండి. తెలంగాణను హరితవనంగా మార్చాలి. తెలంగాణను ప్రగతి పథంలో పయనింపజేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను. పరిపాలనా సౌలభ్యంకోసం వేర్వేరు శాఖలుగా ప్రభుత్వం ఉన్నప్పటికినీ అంతా ఒకే గొడుగు కింద పని చేయాలని కోరుతున్నాను. వేర్వేరు శాఖల వారిలో ఈ పని నాదికాదన్న భావం తొలిగిపోవాలి. అందరం కలిసి ఒక్కగొంతుతో ముందుకు వెళితేనే మంచిఫలితాలు వస్తాయి. మనం ప్రజాస్వామ్య సమాజంలో ఉన్నాం. ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా భావిస్తున్నారు. ప్రభుత్వంపైన పోరాడాలని అనుకుంటున్నారు. అలాంటి భావనలను మనం తొలగించాలి. మనం ప్రజల్లో మమేకం కావాలి. ప్రజల సంఘటిత శక్తి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో, వాళ్ల భాగస్వామ్యం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో అర్థమయ్యేలా చేద్దాం. ప్రజా ప్రభుత్వాన్ని తీర్చిదిద్దేందుకు బలాన్నివ్వాలని, అలాంటి భావాలు కల్పించాలని నేను దేవున్ని ప్రార్థిస్తున్నాను.

రాష్ట్ర పాలనాయంత్రాంగం ఒక్క చోట.. దాదాపు రాష్ట్ర పాలనాయంత్రాంగంలో అందరు కీలక అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ల సమావేశమంటే నివేదికలు.. తూతూ మంత్రంగా చర్చ అనే పద్ధతిని పక్కనపెట్టి.. అర్థవంతమైన, లోతైన చర్చ జరిగిందని ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు అధికారులు చెప్పారు. లెక్కలు, సమీక్షలు పెట్టుకుని యాంత్రికంగా చర్చలు చేయడం కాకుండా తెలంగాణ ఆత్మిక మథనం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అనేక మంది అధికారులు కూడా చర్చల్లో భాగస్వాములై మాట్లాడారు. చాలాకాలం కలెక్టర్‌గా పనిచేశాను. ఉన్నతాధికారిగా కూడా ఉన్నాను. కానీ ఇటువంటి అర్థవంతమైన సమావేశం మునుపెన్నడూ చూడలేదు అని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. మొదటి రోజు సమావేశంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వాటర్‌గ్రిడ్, ఆసరా పెన్షన్లు, స్వచ్ఛభారత్-స్వచ్ఛ తెలంగాణ అంశాలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ కార్యదర్శులు ఆయాశాఖలకు సంబంధించిన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితిని వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సహచర మంత్రులు, అధికారులతో మాట్లాడి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు, ప్రభుత్వం వేర్వేరు అనే భావన తొలగించాలని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పురపాలకశాఖపై చర్చ సందర్భంగా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచాలని సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

జూలై 2వ వారంలో హరితహారం వారోత్సవం – విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు – కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై సీఎం సమీక్ష ప్రజల భాగస్వామ్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు ముందుకు సాగితే అభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపు ఇచ్చారు. అద్భుతాలు సాధించిన దేశాలు, రాష్ర్టాల విజయ రహస్యం సమిష్టి కృషి మాత్రమేనని అన్నారు. కలెక్టర్ల సదస్సులో వివిధ అంశాలపై చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. – హరితహారం వారోత్సవాన్ని జూలై 2వవారంలో ప్రజలందరి భాగస్వామ్యంతో ఘనంగా నిర్వహించాలి. ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వపోటీలు పెట్టాలి. ఖాళీ ప్రదేశాలలో, విద్యాసంస్థలలో, రోడ్లకు ఇరువైపులా, ఠాణాల ఆవరణలో, జైళ్లలో మొక్కలు నాటాలి. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా నీటిని ఏర్పాటు చేయాలి. రోడ్ల పక్కన పండ్ల చెట్లు పెంచాలి. వాతావరణ సమతుల్యాన్ని కాపాడటానికి, విస్తారంగా వర్షాలు కురవడానికి, కోతుల బెడద నివారణకు చెట్ల పెంపకం పరిష్కారం. ఊరవతల అటవీ ప్రాంతంలో, కంచెల్లో, రహదారులవెంట కోతులు తినే పండ్ల చెట్లు పెంచాలి. దోమల నివారణకు ఔషధ మొక్కలు పెంచాలి. హరితహారంకోసం గ్రామ స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలి. – హరితహారంకోసం హైదరాబాద్‌ను 400 భాగాలుగా విభజిస్తున్నాం. గవర్నర్, సీఎంతోపాటు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఒక్కో విభాగంలో మొక్కల పెంపకాన్ని పర్యవేక్షిస్తారు. జిల్లాలోనూ ఇది పాటించాలి. – ఆటవీ అధికారులకు అవసరమైన చోట పోలీస్ భద్రత కల్పిస్తాం. – ఆటవీశాఖ భూములపై సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయిస్తాం. – హరితహారానికి ఎమ్మెల్యేలు రూ.10 లక్షలచొప్పున సీడీఎస్ కేటాయించాలి. చెరువుల కట్టలమీద ఈతచెట్లు,        కట్టకింద సిల్వర్‌ఓక్‌చెట్లు పెంచాలి. – గుడుంబా నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో రెవెన్యూ, ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలి. గుడుంబా, కల్తీకల్లు నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. – మహిళల రక్షణకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన షీ టీమ్స్ మంచి ఫలితాలిస్తున్నాయి. జిల్లాల్లో కూడా షీ టీమ్స్ ఎక్కువ సంఖ్యలో వేయాలి. – వర్సిటీలు, విద్యాలయాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయ్‌లెట్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలి. మహిళలను వేధిస్తున్న ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలి. ఫోన్లద్వారా ఇబ్బంది పెడుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. – ఆరోగ్యలక్ష్మిద్వారా గర్భిణీలు, బాలింతలకు గుడ్లు, పాలతో పోషక అహారం అందించాలి. అంగన్‌వాడీ కేంద్రాలు గ్రామం మధ్యలో ఉండేలా చూడాలి. అంగన్‌వాడీలకు వంటపాత్రలు కొనివ్వాలి.మహిళా శిశు సంక్షేమానికి కేంద్ర కోత పెట్టినప్పటికీ రాష్ట్రం ఉదారంగా వ్యవహరించింది. అంగన్‌వాడీలకు జీతాల పెంపుతోపాటు ఆరోగ్యలక్ష్మికి కేటాయింపులు పెంచడంవల్ల రూ.700 కోట్లు అదనపు భారం పడింది. – వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. రైతులకు గిట్టుబాటు ధర అందే విధంగా చూడాలి. ఇటీవల వర్షాలవల్ల నష్టపోయిన పంటల వివరాలను వెంటనే పంపించాలి. ప్రభుత్వం తగిన సహాయం అందిస్తుంది. 33% పంట నష్టాన్నీ పరిగణలోకి తీసుకోవాలి. – పారిశ్రామిక అభివృద్ధిద్వారా రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం నమ్ముతున్నది. – ప్రపంచంలో ఎక్కడా లేని గొప్ప పారిశ్రామిక విధానం తెస్తున్నాం. పారదర్శకంగా, అవినీతిరహితంగా, సత్వర అనుమతులు లభించే విధంగా ఉండే చట్టాన్ని కూడా తెచ్చాం. త్వరలోనే విధాన ప్రకటన చేస్తాం. – హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు భౌగోళికంగా అత్యంత సురక్షితమైన ప్రాంతం కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులు హైదరాబాద్‌వైపు చూస్తున్నారు. పరిశ్రమలకు అవసరమైన భూమి, విద్యుత్, నీరు అందించడానికి ఏర్పాట్లు చేయాలి. మెరుగైన శాంతిభద్రతలు కూడా పరిశ్రమల రాకకు ముఖ్యమైన కారణం. – ప్రస్తుతం 1.50 లక్షల ఎకరాల భూమి పరిశ్రమల స్థాపనకు సిద్ధంగా ఉంది. మరో 5 లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాల్లో పరిశ్రమలకు అనువుగా ఉన్న భూముల వివరాలు ప్రభుత్వానికి పంపాలి. – నీరు,విద్యుత్ సరఫరా అందుబాటులోకి తెచ్చి ప్లగ్ అండ్ ప్లే ఎస్టేట్స్‌ను కూడా సిద్ధం చేయాలి. – విద్యుత్ లోటు ఉన్న రాష్ర్టాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. దామరచర్లలో త్వరలోనే విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి మరో 2,700 మెగావాట్ల విద్యుత్ అదనంగా లభిస్తుంది. ఇకపై తెలంగాణలో విద్యుత్‌కోతలుండవు. రాబోయే మూడేండ్లలో 24 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా తెలంగాణ మారుతుంది. కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్ సూచనలు,

తీసుకున్న నిర్ణయాలు – ప్రతినెలలో ఒక రోజు అర్బన్ డేగా, ఒక రోజు రూరల్ డేగా పాటించాలి. ఒక రోజు పూర్తిగా పట్టణప్రాంత అంశాలపట్ల, ఒక రోజు గ్రామీణప్రాంత అంశాలపట్ల అధికారులు పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించుకోవాలి. – ప్రతి ఇంటిలో టాయ్‌లెట్ నిర్మాణం జరపాలి. బహిరంగ మల, మూత్ర విసర్జనకు స్వస్తిపలకాలి. కమ్యూనిటీ టాయ్‌లెట్లు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న టాయ్‌లెట్లను సరిగ్గా నిర్వహించాలి. వ్యక్తిగత మరుగుదొడ్డికి రూ.12 వేలవరకు, సామూహిక మరుగుదొడ్లకు రూ.65వేల వరకు ప్రభుత్వం సహాయం అందిస్తుంది. – పరిశుభ్ర గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంటు అందిస్తుంది. – రాష్ట్రంలో ప్రస్తుతం 41.6%మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. ఈ సంఖ్య త్వరలోనే 50 శాతానికి చేరుకుంటుంది. కాబట్టి పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి, మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రియో డీ జనీరో నగరాన్ని అదర్శంగా తీసుకోవాలి. – పట్టణాల్లో డంపింగ్ యార్డులు, శ్మశానవాటికలు, కూరగాయల మార్కెట్లు, మాంసాహార మార్కెట్లు, చేపల మార్కెట్లు నిర్మించాలి. పార్కులు ఏర్పాటు చేయాలి. స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం ఏర్పాటు చేసుకోవాలి. – పట్టణాల్లోని ప్రతి ఇంటికీ ప్రభుత్వం తరఫునే తడి, పొడి చెత్త సేకరించడానికి ప్లాస్టిక్ డస్ట్ బిన్ కొనివ్వాలి. ఇండ్లనుంచే చెత్తను సేకరించాలి. కామన్ డంపింగ్ యార్డ్స్ సంఖ్యను పెంచాలి. ప్రభుత్వ స్థలం దొరకని చోట ప్రైవేట్ స్థలాలను కొనాలి. రైతుబజార్లను ఏర్పాటు చేయాలి. – పట్టణాల్లోని ప్రభుత్వ భూములను సక్రమంగా, సమర్థవంతంగా వినియోగించాలి. ప్రభుత్వ భూముల్లోని ప్రతి అంగుళాన్ని ప్రజల అవసరాల కోసమే వాడుకోవాలి. – మురికి కాలువల నిర్వహణ, వీధిలైట్ల నిర్వహణ సరిగ్గా ఉండాలి. ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేసుకోవాలి. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచాలి. మంచినీటి సరఫరాపై ప్రత్యే దృష్టి పెట్టాలి.ఎక్కువ జనాభా కలిగిన పట్టణాలలో ప్రత్యేక తహాశీల్దారును నియమించాలి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, రామగుండం నగరాల్లో వేర్వేరుచోట్ల డంపింగ్ యార్డులను ఏర్పాటు చేయాలి. – వాటర్‌గ్రిడ్ పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలి. రైట్ ఆఫ్ వే చట్టం తెచ్చినందున పైపు లైన్ల నిర్మాణానికి ఎక్కడా ఆటంకాలు కలుగకుండా చూడాలి. నదులు, కాలువలు, రైల్వేలైన్లు, రహదారులు దాటాల్సిన చోట పైపులైను నిర్మాణం విషయంలో శాఖల మధ్య సమన్వయం కుదర్చాలి. వ్యవసాయ భూముల్లో ఆరు అడుగుల లోతు పైపులైన్‌ను నిర్మించాలి. – పెన్షన్లు అర్హులందరికీ అందించాలి. అనర్హులను, దొంగ కార్డులను ఏరిపారేయాలి. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి. – సంక్షేమ కార్యకలాపాలకోసం ప్రభుత్వం రూ.27వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నందున ప్రతిపైసా పేదలకు చేరేలా చూడాలి. – పట్టణాలకు తరలించిన గ్రామీణ బ్యాంకులను మళ్లీ గ్రామాలకు తీసుకుపోవాలి. – జిల్లాల్లో అప్పటికప్పుడు అవసరాలు తీర్చడంకోసం ప్రతి జిల్లా కలెక్టరువద్ద రూ.10 కోట్ల నిధి అందుబాటులో పెట్టాలి. జిల్లాల్లో అభివృద్ధి పనులు, సంక్షేమ చర్యలకోసం క్రూషియల్ బ్యాలెన్సింగ్ ఫండ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కార్యరూపం దాల్చింది. 2015-16 సంవత్సరానికిగాను ఈ నిధికి రూ.100 కోట్లను కేటాయిస్తూ ఆర్థికశాఖ శుక్రవారం ఉత్తర్వులు వెలువరించింది. రాష్ట్రంలో పది జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.10 కోట్ల చొప్పున కేటాయించారు. శుక్రవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే నిధుల కేటాయింపుపై ఉత్తర్వులు జారీ అవడం విశేషం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.