Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నవ శకానికి నక్షా

-గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా కొత్త ప్రణాళికలు -గ్రామ పంచాయతీలకే సర్వాధికారాలు -12నుంచి ప్రణాళికల రూపకల్పన -19నుంచి ప్రజాప్రతినిధులకు శిక్షణ -నవ తెలంగాణ సమాలోచన సదస్సు ముగింపులో ముఖ్యమంత్రి కేసీఆర్ -నెలాఖరులోపు మంత్రివర్గ విస్తరణ -రుణమాఫీపై వచ్చే క్యాబినెట్ భేటీలో తుది నిర్ణయం -త్వరలో సలహామండలి ఏర్పాటు: కేసీఆర్‌తెలంగాణ సోయితో సమగ్ర అభివృద్ది -అలాంటి సరైన ప్రణాళికతో ముందుకు పోదాం -ప్రజల్లో ఉండి రూపొందించండి -రీ ఇన్వెంటెడ్ తెలంగాణ సదస్సులో -అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం -వ్యవసాయానికి ప్రత్యేక ప్రాధాన్యం -ప్లాన్ యువర్ విలేజ్.. ప్లాన్ యువర్ మండల్.. -ప్లాన్ యువర్ టౌన్స్, ప్లాన్ యువర్ సిటీస్ -చెరువుల పునరుద్ధరణకు శ్రమదానం -రుణమాఫీపై వచ్చే క్యాబినెట్‌లో తుది నిర్ణయం -నెలాఖరులోపు క్యాబినెట్ విస్తరణ

సరైన ప్రణాళిక రూపొందిస్తే సగం పని పూర్తయినట్లే! సరిగ్గా ఇప్పుడు ఇదే ఆలోచనతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నది. నవ తెలంగాణ నిర్మాణానికి పకడ్బందీ పునాదులు వేస్తున్నది! గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ.. ఏ జిల్లాకు అవసరమైన ప్రణాళిక ఆ జిల్లాకు రూపొందించి.. అభివృద్ధి పథంలో ముందుకు దూకేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. ఇకపై రూపొందించే చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలు అన్నీ పూర్తిగా తెలంగాణ దృక్పథంతో, తెలంగాణ భౌగోళిక, ఆర్థిక పరిస్థితులకు అనుకూలంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రణాళికలన్నీ గ్రామస్థాయిలోనే తయారుకావాలని ఉద్బోధించారు. క్షేత్రస్థాయినుంచి పరిపాలన మొదలు కావాలని చెప్పారు. తద్వారా నవ తెలంగాణను నిర్మించుకుందామని పిలుపునిచ్చారు.

కొత్త రాష్ట్ర పాలనకు పునాదులేసేందుకు సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన సమాలోచన సదస్సులో అధికారులకు కార్యాచరణపై కేసీఆర్ నిర్దిష్ట సూచనలు, సలహాలు ఇచ్చారు. ఉత్తమమైన ప్రణాళిక రూపొందించడమంటే సగం విజయం సాధించినట్లేనని నొక్కిచెప్పారు. ఒకటి రెండు నెలలు జాప్యం జరిగినా.. ప్రణాళికాబద్ధంగానే సాగాలని పిలుపునిచ్చారు. ఈ మొత్తం ప్రక్రియలో దారిద్య్ర నిర్మూలన ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్పారు. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించొద్దని స్పష్టంచేశారు.

MCHRD తెలంగాణ దృక్పథంతో చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరముందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ ఆర్థిక, భౌగోళిక పరిస్థితులకు అనుకూలంగా గ్రామస్థాయి నుంచి ప్రణాళికలను తయారుచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలకు వెళ్లండి.. అక్కడనే ప్రణాళికలు తయారుచేయండి.. గ్రామ ప్రజలను అభివృద్ధిలో భాగస్వాములను చేయండి.. అక్కడి ప్రజలలో సామాజిక స్పృహను పెంచండి అని అధికారులకు సూచించారు. తమ ప్రభుత్వం తొందరపడి తప్పుడు విధానాలను రూపొందించదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు 60 నెలల కోసం అధికారమిచ్చారు. ఒక నెల, రెండు నెలలు ఆలస్యమైతే నష్టమేమీలేదు. కానీ ప్లానింగ్‌లో లోపం ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి అన్నారు. నేను తొందరపడటం లేదు. మంచి ప్రణాళిక ఉంటే సగం విజయం సాధించినట్లే. అందుకనే మనకు ఒక సమగ్ర ప్రణాళిక అవసరం అని చెప్పారు. ప్లాన్ యువర్ విలేజ్, ప్లాన్ యువర్ మండల్, ప్లాన్ యువర్ టౌన్ అనే సూత్రంతో పనిచేయాలని పేర్కొన్నారు. అవినీతిని ఏ స్థాయిలోనూ సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడితే తన కుటుంబసభ్యులనైనా జైలుకు పంపడానికి వెనుకాడేది లేదని అన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌తో పోటీలేదని, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలతోనే పోటీ అని ఆయన పేర్కొన్నారు. రీ ఇన్వెంటెడ్ తెలంగాణ అన్న అంశంపై సోమవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన అధికారుల అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. వివిధ రంగాల్లో చేయాల్సిన పనులు, అనుసరించాల్సిన దృక్పథం గురించి ఆయన ఆకట్టుకునేలా వివరించారు. వ్యవసాయం, నీటిపారుదల, పారిశ్రామిక అభివృద్ధి, అటవీ, పంచాయతీరాజ్ తన ప్రభుత్వ ప్రాథమ్యాలని చెప్పారు. అదే సమయంలో సంక్షేమం ప్రధానాంశంగా ఉంటుందని తెలిపారు. పేదరిక నిర్మూలన ప్రధాన సవాల్ అని పేర్కొన్నారు. ఆయా అంశాలపై అభిప్రాయాలు, సూచనలు ఆయన మాటల్లోనే..

తెలంగాణ సోయితో చట్టాలు ప్రస్తుతం ఉన్న చట్టాలు, మార్గదర్శకాలు, నిబంధనలు ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించినవి. అవి కొంతమేరకు మాత్రమే పనిచేస్తాయి. చాలావరకు పనిచేయవు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితిలో సమూల మార్పులు తేవాలి. తెలంగాణ కొత్త రాష్ర్టానికి అనుకూలంగా కొత్త మార్గాలను కనుగొనాలి. తెలంగాణ కండ్లతో అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలి. తెలంగాణ వనరులు, భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా మార్గదర్శకాలను తయారుచేయాలి. అదే దృక్పథంతో ముందుకు పోవాలి. గ్రామస్థాయిలో, మండలస్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించండి. వాటి అన్నింటికి సమాహారంగా రాష్ట్ర ప్రణాళిక ఉంటుంది. ఏదైనా ఉత్తర్వులు హైదరాబాద్ నుంచి కింది స్థాయికి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం కింది స్థాయి నుంచి ప్రజలకు అవసరమైన ప్రణాళికలను రూపొందించి ప్రజలకు ఉపయోగకరమైన పనులను చేపడుతాం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్పిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులను సంప్రదించి సూక్ష్మస్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాల్సి ఉంది. శాసనసభ్యులు, ఎంపీలు మొదలుకొని సర్పంచ్‌ల వరకు అన్ని స్థాయిలలో ప్రజాప్రతినిధులకు అపార్డ్, ఎన్‌ఐఆర్‌డీ, ఎంసీహెచ్‌ఆర్‌డీలలో శిక్షణ ఇప్పిస్తాం. రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలు ఉంటే 91 లక్షల తెల్ల రేషన్‌కార్డులున్నాయి. మొత్తంగా 22 లక్షల కార్డులు అదనంగా ఉన్నాయి. ఎంత దుర్వినియోగం అవుతుందనే అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాలి. గహనిర్మాణంలోనూ అదే పరిస్థితి నెలకొంది. 573 గ్రామాల్లో 235 కోట్ల రూపాయలు దుర్వినియోగమయ్యాయి. జిల్లా కలెక్టర్లు అక్రమాలపై దృష్టిసారించాలి. అక్రమాలకు పాల్పడిన ఎవరినైనా జైళ్లకు పంపాల్సిందే. బలహీనవర్గాలవారు ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం రెండు బెడ్‌రూంలతో ఇండ్ల నిర్మాణం చేపడుతుంది. రైతులకు అన్ని రకాల పంటరుణాలను మాఫీ చేయడానికి కట్టుబడి ఉన్నాం. త్వరలో జరిగే క్యాబినెట్‌లో తుది నిర్ణయం తీసుకుంటాం.

చెరువులు కుంటల కోసం శ్రమదానం తెలంగాణలో చెరువులు, కుంటల అభివృద్ధికి శ్రమదానం చేయాలి. ఆ శ్రమదానంలో నేను కూడా పాల్గొంటాను. వాస్తవానికి తెలంగాణ ప్రాంతం చెరువుల నిర్మాణంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. 11వ దశాబ్దంలో కాకతీయ రెడ్డి రాజులు అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను నిర్మించారు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో దురుద్దేశపూర్వకంగా, నేరపూరితంగా చెరువులను ధ్వంసం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులను అక్రమించారు. చెరువులను పునరుద్ధరించి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ప్రజలను భాగస్వాములను చేసి శ్రమదానం చేయాలి. శ్రమదానంలో అందరం పాల్గొందాం. ఉపాధి హామీ పథకం కింద వెయ్యి కోట్ల రూపాయలు వస్తాయి. అందులో జిల్లాకు వంద కోట్లను చెరువుల పునరుద్ధరణకు కేటాయిస్తాం. చెరువులు పునరుద్ధరిస్తే మత్స్య పరిశ్రమ కూడా బాగా లాభపడుతుంది.

అపార్డు పేరును మారుస్తాం రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ (అపార్డ్) పేరును మారుస్తాం. ప్రస్తుతం ఎలిమినేటి మాధవరెడ్డి ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ పేరిట రాజేంద్రనగర్‌లో ఉన్న సంస్థకు తెలంగాణ పేరు పెడుతాం. ఆ పేరు ఎలా ఉంటుందో త్వరలో ప్రకటిస్తాం. అపార్డ్‌ను మరింత పటిష్ఠపరుస్తాం.

ఎస్‌కే డే స్ఫూర్తితో గ్రామీణాభివృద్ధి: సీఎం కేసీఆర్ దేశంలో రోజురోజుకూ పంచాయతీరాజ్ వ్యవస్థ దిగజారుతున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ శాఖ మొదట్లో కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌గా ఉండేదని, అది ప్రజలకు ఎంతో మేలు చేసిందని తెలిపారు. దాని స్ఫూర్తిని పాలకులు దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో (ఎంసీహెచ్‌ఆర్డీ) సోమవారం జరిగిన రీ ఇన్వెంటెడ్ తెలంగాణ అవగాహన సదస్సులో ఆయన కమ్యూనిటీ డెవలప్‌మెంట్ స్ఫూర్తి ఎలా ఉండాలో వివరించారు. మొదట్లో సామాజిక స్పృహతో పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ రానురాను రాజకీయమయమై అవినీతితో భ్రష్టుపట్టిందన్నారు. అమెరికాలో గ్రామీణాభివృద్ధికి విశేషంగా కృషి చేసిన భారత సంతతి వ్యక్తి ఎస్‌కే డే ప్రభావంతో దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రు రెండో పంచవర్ష ప్రణాళికలో ఆహార కొరత తీర్చటానికి పెద్దపీట వేశారని, అందులో భాగంగానే బాక్రానంగల్, నాగార్జునసాగర్ లాంటి బహుళార్ధసాధక ప్రాజెక్ట్‌లు నిర్మించారని తెలిపారు. ఎస్‌కే డేను భారత్‌కు ఆహ్వానించి కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌శాఖను అప్పగించారని, ఆయనే తెలంగాణలోని రాజేంద్రనగర్‌లో ఎన్‌ఐఆర్‌డీని స్థాపించారని వివరించారు. డే వేసిన ప్రణాళికలు కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయని, తెలంగాణ అభివృద్ధికి అలాంటి వారే స్ఫూర్తి కావాలన్నారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.