Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నవీన భారతానికి శంఖారావం.. ఢిల్లీ గడ్డపై ఎగిరిన బీఆర్‌ఎస్‌ జెండా

-పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభం
-హాజరైన ఎస్పీ అధినేత మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌, జేడీఎస్‌ నేత కుమారస్వామి, రైతు సంఘాల నేతలు
-పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ పార్టీల నాయకులు
-ప్రారంభోత్సవం నాడే విస్పష్టమైన రైతు ఎజెండా
-బీఆర్‌ఎస్‌ కిసాన్‌ సెల్‌ సారథిగా గుర్నామ్‌సింగ్‌ చడూనీ
-పార్టీ జనరల్‌ సెక్రటరీగా తమిళనాడు ఎంపీ రవికుమార్‌

కిక్కిరిసిన జనం.. మోహరించిన నేతా గణం… స్వరబద్ధంగా వినిపిస్తున్న వేద మంత్ర ఘోష… పరిసరాలను పవిత్రం చేసిన హోమధూమం.. చండీ మాత, రాజశ్యామలఅమ్మవార్ల చల్లని చూపులు… చుట్టుచుట్టూతా గులాబీ కాంతులు… ‘దేశ్‌ కీ నేతా కేసీఆర్‌’ అని ప్రతిధ్వనిస్తున్న నినాదాలు.. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త నాందీ ప్రస్తావన జరిగింది. నవీన భారతం కోసం ‘దక్షిణా’వర్త శంఖారావం ఒకటి వినిపించింది.

రత్నగర్భ భారతానికి ఎన్నాళ్లీ యాతన? 130 కోట్ల జనానికి ఎన్నాళ్లీ వేదన? అని సూటి ప్రశ్నలు సంధిస్తూ… తెలంగాణ ప్రగతి పథంపై నుంచి భారత అభివృద్ధి యాత్రకు బయలుదేరిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చేతుల మీదుగా ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ గులాబీ జెండా సమున్నతంగా ఎగిరింది. పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభమైంది.

విజయ శిఖరాలు అధిరోహించడాన్ని అలవాటుగా మార్చుకుని, అసాధ్యాలను సుసాధ్యం చేసే శక్తిని నిండా నింపుకుని, పరివర్తన ప్రవక్తగా మార్పును ప్రవచించే కేసీఆర్‌ నవ భారత సంకల్పానికి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌, జేడీఎస్‌ నేత కుమారస్వామి సహా పలు పార్టీలకు చెందిన నేతలు, ఎంపీలు, రైతు సంఘాల నాయకులు స్వయంగా హాజరై సంఘీభావం ప్రకటించారు.

జాతీయ పార్టీ ఆవిర్భావం నాడే.. ‘అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌’ అని నినదించిన కేసీఆర్‌, ఆ ఎజెండాకు అనుగుణంగానే బీఆర్‌ఎస్‌ మొట్టమొదటి అనుబంధ విభాగంగా కిసాన్‌ సమితిని ప్రకటించారు. దానికి సారథిగా హర్యానాకు చెందిన రైతు నాయకుడు గుర్నామ్‌సింగ్‌ చడూనీని నియమించారు.

ఒక తెలంగాణ యోధుడు దేశ రాజధానిలో జాతీయ పార్టీ జెండా ఎగరేసిన అపురూపమిది.

ఒక తెలంగాణ నాయకుడు భారత దేశం కోసం నడుంకట్టిన అపూర్వమైన సందర్భమిది.

తన ప్రాంతానికి రాష్ట్రాన్ని సాధించి పెట్టి, దాన్ని అభివృద్ధి చేసి చూపించిన ఒక అరుదైన నాయకుడు, ఇప్పుడు యావద్భారతాన్నీ ఆ నమూనాలోనే ప్రగతి పథంలో నడుపుతానని ప్రతిజ్ఞ చేసిన సన్నివేశమిది.

తెలంగాణకు గర్వకారణమైన సమయమిది!! జై తెలంగాణ.. జై భారత్‌!!

దేశ రాజకీయాల్లో సరికొత్త మలుపునకు పునాది పడింది. ఓట్లు, సీట్లు అంటూ దశాబ్దాలుగా తిరోగమన రాజకీయాలు చేస్తున్న పార్టీలు అదిరి చూసేలా ప్రగతిపథ రాజకీయాలకు హస్తినలో నాంది ప్రస్తావన జరిగింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ప్రారంభమైన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) జాతీయ కార్యాలయం బుధవారం ఢిల్లీలోని అత్యంత కీలకమైన సర్దార్‌ పటేల్‌ రోడ్డులో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చేందుకు జాతీయ ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిన వారంలోపే పార్టీ జాతీయ కార్యాలయం దేశ రాజధానిలో ప్రారంభం కావటం విశేషం. సరిగ్గా మధ్యాహ్నం 12:37 నిమిషాలకు శుభ ముహూర్తాన పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జనవాహినితో హస్తిన వీధులన్నీ గులాబీ రంగేసుకొన్నాయి.

దేశ్‌ కీ నేత కేసీఆర్‌.. అన్న నినాదాలతో ఎర్రకోట బ్యాక్‌గ్రౌండ్‌తో కేసీఆర్‌ నిలువెత్తు చిత్రాలతో రూపొందించిన భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితోపాటు అనేకమంది ప్రముఖులు హాజరయ్యారు. కార్యాలయంలో నిర్వహించిన రాజశ్యామల యాగంలో సీఎం కేసీఆర్‌తోపాటు అఖిలేశ్‌, కుమారస్వామి కూడా పాల్గొన్నారు. కేసీఆర్‌-శోభమ్మ దంపతులు యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, గంగుల కమలాకర్‌, హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్‌, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కుమారుడు హిమాన్షు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

జెండా ఆవిష్కరణతో మొదలు..
పార్టీ కార్యాలయంలో పూర్ణాహుతి ముగిసిన వెంటనే సరిగ్గా 12.37 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. పార్టీ నేతల సమక్షంలో సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అఖిలేశ్‌యాదవ్‌, కుమారస్వామితో కలిసి పార్టీ భవనాన్ని ప్రారంభించారు. వేద మంత్రోచ్చారణల నడుమ తన చాంబర్‌లోని సీటులో కూర్చొని బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన పలు పత్రాలపై సంతకం చేశారు.

కిసాన్‌ సమితి అధ్యక్షునిగా గుర్నామ్‌సింగ్‌ చదూని
బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రారంభించిన తర్వాత బీఆర్‌ఎస్‌ పార్టీకి సంబంధించిన కొన్ని నియామకాలను పార్టీ అధినేత కేసీఆర్‌ చేపట్టారు. అందులో భాగంగా భారత రాష్ట్ర కిసాన్‌ సమితి అధ్యక్షుడిగా హర్యానాలోని కురుక్షేత్రకు చెందిన గుర్నామ్‌సింగ్‌ చదూనిని నియమించారు. నియామక పత్రాన్ని గుర్నామ్‌సింగ్‌కు కేసీఆర్‌ స్వయంగా అందజేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఢిల్లీ కార్యాలయ ఇన్‌చార్జిగా, పార్టీ జనరల్‌ సెక్రటరీగా తమిళనాడుకు చెందిన పార్లమెంటు సభ్యుడు రవి కుమార్‌ కోహడును నియమించారు. పార్టీకి సంబంధించిన మిగిలిన కమిటీలను కూడా త్వరలోనే వేయనున్నట్టు తెలిసింది.

కదిలివచ్చిన ఇతర రాష్ట్రాల నేతలు
బీఆర్‌ఎస్‌ జాతీయ కార్యాలయ ప్రారంభోత్సవానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి నేతలు కదిలివచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, జనతాదళ్‌ (ఎస్‌) నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన ప్రముఖ దళిత నేత, విడుదలై చిరుతయగళ్‌ కచ్చి (వీసీకే) పార్టీ వ్యవస్థాపకుడు తిరుమావలన్‌, అదే పార్టీకి చెందిన మరో ఎంపీ రవికుమార్‌, హర్యానాకు చెందిన రైతు నేత, బీఆర్‌ఎస్‌ రైతు విభాగం అధ్యక్షుడు గుర్నామ్‌సింగ్‌ చదూని, ఒడిశా రైతు నేత అక్షయ కుమార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సామాజికవేత్త డాక్టర్‌ రాకేశ్‌ రఫీక్‌, మహారాష్ట్ర నేత మాణిక్‌ కదం, ఉత్తరాఖండ్‌ నేత పీసీ తివారీ, బీహార్‌కు చెందిన రైతు నేత ప్రభాత్‌ కుమార్‌, ప్రముఖ జర్నలిస్టు వినీత్‌ నారాయణ్‌, పంజాబ్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, హర్యానా తదితర రాష్ట్రాలకు చెందిన రైతు నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఆర్జేడీ యువ నేత తేజస్విని కూడా ఆహ్వానించినప్పటికీ, ఆయన తండ్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ అనారోగ్యంతో ఉండటంతో హాజరు కాలేకపోయారు. రైతు సంఘాల నాయకులు, వివిధ రంగాల నిపుణులు, ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం కేసీఆర్‌.. పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నివాసంలో మధ్యాహ్నం భోజనం చేశారు.

హస్తినలోను జనహోరు..
బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, నాయకులు, దేశవ్యాప్తంగా ఉన్న కేసీఆర్‌ అభిమానులు పెద్ద ఎత్తున కదిలివచ్చారు. బుధవారం ఉదయానికే కార్యాలయం వద్ద మొత్తం ట్రాఫిక్‌ జాం అయ్యింది. పది గంటలకల్లా పార్టీ కార్యాలయం కిక్కిరిసింది. సరిగ్గా 12 గంటలకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌, ఎస్పీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌, జేడీఎస్‌ నేత కుమారస్వామితో కలిసి కార్యాలయానికి చేరుకొన్నారు. వీరు రావడానికి ముందే తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, పార్టీ నేతలు, కార్యకర్తలంతా చేరుకొన్నారు. సర్దార్‌పటేల్‌ మార్గ్‌లో అడుగుపెట్టడానికి కూడా సందులేనంత జనం వచ్చారు. ‘దేశ్‌ కి నేత కేసీఆర్‌’ అంటూ నినాదాలు చేశారు. అబ్‌ కీ బార్‌.. కిసాన్‌ సర్కార్‌, జై కేసీఆర్‌.. జై భారత్‌ అంటూ నినదించారు. పార్టీ కార్యాలయం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ హోర్డింగులు, ఫ్లెక్సీలతో నిండిపోయాయి. ప్రారంభోత్సవానికి వచ్చినవారికి అక్కడే ఉదయం అల్పాహార ఏర్పాట్లు చేశారు. విమానాశ్రయం, తెలంగాణ భవన్‌, హోటల్‌ అశోకా, హోటల్‌ రాయల్‌ ప్లాజా తదితర ప్రాంతాల నుంచి పార్టీ నాయకులను బీఆర్‌ఎస్‌ కార్యాలయం వరకు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా బస్సులను కూడా ఏర్పాటు చేశారు.

దేశ్‌ కే లియే ఆ రహా హై కేసీఆర్‌ పాటల సీడీ ఆవిష్కరించిన కేశవరావు
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌ ) ఆవష్యకతను వివరిస్తూ అలిశెట్టి అరవింద్‌ రూపొందించిన పాటల సీడీని బీఆర్‌ ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు బుధవారం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆవిష్కరించారు. ‘దేశ్‌ కే లియే ఆ రహా హై కేసీఆర్‌ ’ అంటూ హిందీలో ఒకటిన్నర నిమిషాల నిడివితో రూపొందించిన పాట ప్రజలను ఆలోచింపజేసేలా ఉన్నదని కేశవరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ.. దేశానికి కేసీఆర్‌ నాయకత్వం ఎందు కు అవసరమో వివరిస్తూ ఈ పాటసాగుతుందని అరవింద్‌ అలిశెట్టి చెప్పారు. దేశాన్ని కేసీఆర్‌ నాయకత్వంలో అద్భుతంగా తీర్చిదిద్దుకొందామని.. ప్రపంచపటంలో భారత్‌ను మొదటి స్థానంలో నిలిపేసత్తా ఒక్క కేసీఆర్‌కే ఉన్నదని పేర్కొన్నారు.

అలుపెరుగని రైతు నేత
గుర్నామ్‌ సింగ్‌ చదూని.. ఈ పేరు దక్షిణాదిలో పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. ఉత్తర భారతదేశంలో నిత్యం ప్రజల నోట్లో నానుతుంది. ఎక్కడ రైతులకు కష్టం వచ్చినా అక్కడ ఆయన ప్రత్యక్షమవుతారు. ముఖ్యంగా హర్యానా, పంజాబ్‌లో రైతులకు గుర్నామ్‌సింగ్‌ పెద్దదిక్కు. ఎంతలా అంటే.. గుర్నామ్‌సింగ్‌ అంటే రైతు ఉద్యమాలు.. రైతు ఉద్యమాలు అంటే గుర్నామ్‌సింగ్‌ అనేలా ఆ రాష్ట్రాల్లో ఆయన పేరు పెనవేసుకుపోయింది. 1959లో హర్యానాలోని కురుక్షేత జిల్లా చరూని జట్టన్‌ గ్రామంలో జన్మించిన గుర్నామ్‌సింగ్‌, మొదటి నుంచీ రైతు ఉద్యమాలే ఊపిరిగా జీవిస్తున్నారు. 2008లో వ్యవసాయ రుణాల మాఫీ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించి ప్రభుత్వ మెడలు వంచి మాఫీ చేయించారు. 2009లో పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వమే కొనాలని గుర్నామ్‌సింగ్‌ నేతృత్వంలో చేపట్టిన రైతు ఉద్యమం యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. నిరుడు కేంద్రం తెచ్చిన వివాదాస్పద సాగు చట్టాలను రద్దుచేయాలని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సుదీర్ఘకాలంపాటు ఉద్యమం చేయటం వెనుక గుర్నామ్‌సింగ్‌ కీలకపాత్ర పోషించారు. పంజాబ్‌, హర్యానాలో ప్రభుత్వాలను శాసించగల స్థితిలో ఉన్న సంయుక్త కిసాన్‌ మోర్చాలో గుర్నామ్‌సింగ్‌ కీలక నేత. ఆయన నాయకత్వంలో భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) రైతు పోరాటాలు నిర్వహించింది. 2021లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన సంయుక్త సంఘర్ష్‌ సమితి పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా రైతు రాజ్య స్థాపన కోసం కేసీఆర్‌ ప్రారంభించిన బీఆర్‌ఎస్‌లో చేరి, పార్టీ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.