-సన్సద్ గ్రామయోజన కింద వీర్నపల్లి ఎంపిక -ఎంపీ వినోద్‌కుమార్ అధికారిక ప్రకటన -కల్ల్లోలిత గ్రామంలో పర్యటన -అక్కడి పరిస్థితులపై అధ్యయనం -దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ -చెరువు మట్టి ఎత్తేందుకు ముఖ్యమంత్రిని తీసుకొస్తానని భరోసా -ప్రజల భాగస్వామ్యంతోనే ప్రణాళికలు -స్వాగతించిన గ్రామస్తులు

చుట్టూ ఎత్తయిన గుట్టలు.. దట్టమైన అడవులు.. ఓ వైపు నక్సలైట్ల కదలికలు.. మరోవైపు ఖాకీల బూట్ల చప్పుళ్లు.. తరుచూ ఎదురు కాల్పులు.. భయాందోళనలో గ్రామస్తులు.. విప్లవం పేరిట అడవిబాట పట్టిన బిడ్డలు.. ఉపాధి లేక గల్ఫ్ బాట పట్టిన యువకులు.. సమైక్య పాలనలో నిలిచిన అభివృద్ధి పనులు.. ఇది ఎల్లారెడ్డిపేట మండలం వీర్నపల్లి పరిస్థితి. సన్సద్ గ్రామ యోజన కింద ఎంపికైన ఈ కల్లోలిత గ్రామం, మున్ముందు సరికొత్త రూపు సంతరించుకోబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన ఎంపీ వినోద్ కుమార్, శుక్రవారం ఆ పల్లెను సందర్శించారు. రాబోయే ఐదేళ్లలో వీర్నపల్లి రూపురేఖలు మార్చి చూపిస్తాననీ, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని స్పష్టం చేశారు.
సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుంచి 16కిలో మీటర్ల దూరంలో ఉంటుంది వీర్నపల్లి. చుట్టూ గుట్టలు.. ఎటువైపు నుంచి ఈ గ్రామానికి వెళ్లినా.. నాటి నుంచి నేటి వరకు దట్టమైన అటవీప్రాంతమే మనకు కనిపిస్తుంది. వీర్నపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎనిమిది తండాలున్నాయి. గ్రామ జనాభా 3684మంది. కొన్ని దశాబ్దాల పాటు మావోయిస్టులు, జనశక్తి నక్సలైట్లకు ఈ గ్రామం నిలయంగా ఉండేది. నిత్యం పోలీసులు కూంబింగ్‌లు, నక్సలైట్ల దాడులతో ఈ గ్రామం భీతిల్లేది. ఇటు నక్సలైట్లు, అటు పోలీసుల ఇబ్బందులు తాళలేక గ్రామం వదిలి వెళ్లిన వారు కొందరైతే, ఉపాధి కరవై గల్ఫ్‌బాట పట్టిన యువకులు 400మంది వరకు ఉన్నారు. అప్పట్లో జరిగే నక్సలైట్ల సమావేశాలకు ఆకర్షితులై పలువురు అడవి బాటపట్టారు. ఈ గ్రామానికి చెందిన 17మంది యువకులు వివిధ ఎన్‌కౌంటర్లలో చనిపోయారంటే ఒకప్పుడు ఈ గ్రామం ఎంత కల్లోలిత ప్రాంతమో అర్థం చేసుకోవచ్చు.
ఇలా గ్రామంలో ఎప్పుడు చూసినా నెత్తుటి మరకలే మనకు కనిపించేవి. నాటి పీపుల్స్‌వార్(నేటి మావోయిస్టులు) ప్రభావం తగ్గిందని భావించిన తరుణంలో జనశక్తి నక్సలైట్లు రంగ ప్రవేశం చేసి, ఈ గ్రామం చుట్టుపక్కల నుంచే వారి కార్యకలాపాలు నడిపారు. ఫలితంగా కొన్నేళ్లపాటు ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోగా.. అన్నింటికీ దూరమైంది. కానీ, 2009లో సిరిసిల్ల నియోజకర్గ ఎమ్మెల్యేగా గెలిచిన కె. తారకరామారావు గ్రామాన్ని అభివృద్ధివైపు తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే పరిస్థితులు మెరుగుపడుతున్నా, సమైక్య రాష్ట్రంలో సరైన పాళ్లలో నిధులు ఇవ్వక, ఆశించిన అభివృద్ధి జరగలేదు.
-మారనున్న గ్రామ రూపురేఖలు కల్లోలిత గ్రామంగా ఇప్పటికే పోలీసుల రికార్డుల్లో ఉన్న ఈ గ్రామం రూపు రేఖలు ఇక ముందు మారనున్నాయి. గ్రామంతో పాటుగా రవాణ సౌకర్యానికి దూరమైన ఎనిమిది తండాల స్వరూపం మారనుంది. దేశంలోని ఒక్కో ఎంపీ ఒక్కో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యం తో ప్రధాని మోడీ గత ఆగస్టు 15న సన్సద్ గ్రామ యోజన(ఎస్‌ఏజీవై) పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోడీ కొన్ని షరతులు పెట్టారు. ఎంపీ ఎంపిక చేసుకునే గ్రామం తన సొంత గ్రామం అయి ఉండొద్దని, అలాగే అత్తింటి గ్రామం కూడా కాకూడదని సూచించారు. ఇందుకోసం కొన్ని నియమ నిబంధనలను రూపొందిస్తూ ఎంపీలకు అందించారు.
ఎంపిక చేసుకున్న గ్రామాన్ని సకల సౌకర్యాలతో పాటు ప్రజల జీవన చిత్రంలో సామాజిక, ఆర్థికపరంగా పలు మార్పులు తేలవాలని సూచించారు. సదరు గ్రామాల్లో 72 అంశాల్లో మార్పులు తేవాలంటూ సూచించారు. ఆ మేరకు కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ వీర్నపల్లి గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ఈ విషయాన్ని శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించారు. దీంతో అతి తక్కువ కాలంలోనే ఈ గ్రామ రూపురేఖలు పూర్తిగా మారేందుకు అవకాశముంది. వ్యక్తిగత పరిశుభ్రత, మానవవనరుల అభివృద్ధి, సామాజిక, ఆర్థిక అభివృద్ధి, అందరికి విద్య, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అవగాహన, సుపరిపాలన వంటి అనేక విప్లవాత్మక మార్పులు ఈ గ్రామం లో చోటు చేసుకోనున్నాయి.
-ఎంపికలోనే ఎంపీ ఆదర్శం.. సహజంగా ఇప్పటికే అభివృద్ధి జరిగిన గ్రామాలను ఎంపిక చేసుకొని, పనులు చేశామంటూ చూపించుకోవడానికి చాలా మంది నాయకులు ఆసక్తిచూపుతారు. అంతేకాదు, నక్సల్స్ ప్రాంతం అంటే చాలు అటువైపు వెళ్లరు. కానీ, ఎంపీ వినోద్‌కుమార్ దీనికి భిన్నంగా ఆలోచించారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన సహాసానికి ఒడిగట్టారు. అభివృద్ధికి ఆమడ దూరం ఉండడమే కాదు, కల్లోలిత గ్రామంగా పోలీసుల రికార్డుల్లో ఉన్న ఈ గ్రామాన్ని కళకళలాడే జిల్లాగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఈ గ్రామాన్ని ఎంపిక చేసుకున్నారు. ప్రధానంగా నక్సల్స్ ప్రభావిత గ్రామమే కాకుండా.. ఈ గ్రామంలో ఉన్న జనాభాలో 42శాతం గిరిజనులున్నారు. దళితులు 22 శాతం, వెనుకబడిన తరగతులు వారు 35మంది ఉన్నారు.
ఉన్నతవర్గాలు తక్కువ. గ్రామంలో పురుషులకన్నా. మహిళలే అధికం. అందులోనూ అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఈ గ్రామాన్ని అభివృద్ధిచేస్తే మరో మండల కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఆస్కారముంటుంది. తద్వారా మరో పది గ్రామాల అభివృద్ధికి బాటలు పడుతాయి. దీంతో పాటుగా 2007లో కేసీఆర్, ఈ గ్రామంలో సమవేశం నిర్వహించారు. ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆనాడే హామీ ఇచ్చారు. పై కారణాలన్నీ ఎంపీ ఎంపిక చేసుకోవడానికి దోహదపడ్డాయి. నక్సల్స్ ప్రభావిత గ్రామంతో పాటుగా ఓ మారుమూల ప్రాంతంలో ఉన్న పంచాయతీని సన్సద్ గ్రామ యోజన కింద ఎంపిక చేసుకున్న ఎంపీ తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.