-ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం -అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నముఖ్యమంత్రి కేసీఆర్ -మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి ఈటల రాజేందర్ -జీఎస్టీ సవరణల బిల్లుకు క్యాబినెట్ ఆమోదం -అభివృద్ధి.. సంక్షేమం లక్ష్యాలుగా రాష్ట్ర బడ్జెట్ -మూడురోజులపాటు అసెంబ్లీ సమావేశాలు -రేపు బడ్జెట్‌పై చర్చ -సోమవారం ద్రవ్య వినిమయ బిల్లు
ఎన్నికల్లో ఘన విజయాన్ని అందించి.. రెండోసారి పాలనా పగ్గాలు అప్పగించి.. బంగారు తెలంగాణను నిర్మించేందుకు అవకాశం ఇచ్చిన ప్రజలను సంపూర్ణంగా అభివృద్ధిపథంలో నడిపించే దిశగా రూపొందించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శుక్రవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టనున్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక బడ్జెట్‌కు రాష్ట్ర మంత్రిమండలి గురువారం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ విస్తరణ తర్వాత గురువారం తొలిసారిగా సీఎం అధ్యక్షతన ప్రగతిభవన్‌లో క్యాబినెట్ సమావేశమైంది. మంత్రులందరూ హాజరైన ఈ సమావేశం బడ్జెట్‌తోపాటు మరోరెండు అంశాలపైనా చర్చించి ఆమోదం తెలిపింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అనుబంధ పద్దుల (సప్లిమెంటరీ డిమాండ్) గ్రాంట్స్‌ను ఆమోదించారు. అలాగే జీఎస్టీ-2017 చట్టానికి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చిన సవరణల బిల్లును కూడా క్యాబినెట్ ఆమోదించింది. ఈ బిల్లును ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెడుతారు.
బడ్జెట్ ప్రసంగం చేయనున్న సీఎం శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఉభయసభలు సమావేశమవుతాయి. మూడురోజులపాటు సమావేశాలు కొనసాగుతాయి. సభ ప్రారంభం కాగానే పుల్వామా అమరులకు సం తాపం తెలియజేస్తూ సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెడతారు. సభ్యుల నివాళి అనంతరం జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదిస్తారు. అనంతరం 2018-19 వ్యయానికి సంబంధించి అనుబంధ పద్దులను, 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆంధ్రరాష్ట్ర మొదటి సీఎం బెజవాడ గోపాల్‌రెడ్డి, ఉమ్మడి ఏపీలో కాసు బ్రహ్మానందరెడ్డి, రోశయ్య ముఖ్యమంత్రులుగా ఉండి బడ్జెట్ ప్రవేశపెట్టారు. వారి తర్వాత ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నది సీఎం కేసీఆరే. స్వరాష్ట్రంలో బడ్జెట్ ప్రసంగం చేయనున్న తొలి ముఖ్యమంత్రిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. శాసనమండలిలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం ఉభయసభలు వాయిదాపడతాయి. శనివారం బడ్జెట్‌పై చర్చ జరుగుతుంది. చర్చ తర్వాత ప్రభుత్వ సమాధానం ఉంటుంది. ఆదివారం అసెంబ్లీకి సెలవుగా ప్రకటించారు. సోమవారం ద్రవ్యవినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలుపనుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణకోసం అసెంబ్లీ అధికారులు, పోలీసులు సిద్ధమయ్యారు. భద్రతాఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం సమీక్షించి, పోలీసులకు తగిన ఆదేశాలు జారీచేశారు.
భారీగా పెరుగనున్న బడ్జెట్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సైజు భారీగా ఉండనున్నట్టు తెలుస్తున్నది. గత నాలుగేండ్లలో రాష్ట్ర సొంత ఆదాయం గణనీయంగా వృద్ధిచెందడం.. పన్నేతర రాబడి కూడా పెరుగుతుండటంతో అందుకు అనుగుణంగానే బడ్జెట్ పరిమాణం పెరుగుతున్నది. రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు సగటున 19% చొప్పున ఏయేటికాయేడు పెరుగుతున్నది. దీని ప్రకారంగానే ఈసారి బడ్జెట్ మొత్తం పరిమాణం రూ.2 లక్షల కోట్లు దాటవచ్చని భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిననాటి నుంచే సీఎం కేసీఆర్ దీనిపై సుదీర్ఘ కసరత్తుచేశారు. అన్ని శాఖలకు సంబంధించి సమీక్షా సమావేశాలు నిర్వహించి వివిధ విభాగాల బడ్జెట్ ప్రతిపాదనలు ఎలా ఉండాలో ఆర్థికశాఖ అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆర్థికశాఖ అధికారులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించి అవసరమైన సూచనలుచేశారు. రానున్న ఐదేండ్లకు ఈ బడ్జెట్ మార్గదర్శకంగా ఉండాలని పేర్కొన్నారు. పేరుకు ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ పెద్ద పద్దులన్నింటినీ ఇందులో చేర్చినట్లు తెలుస్తున్నది.
ఎన్నికల హామీలకు పెద్దపీట అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి అవసరమయ్యే నిధులను ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయిస్తారని తెలుస్తున్నది. సామాజిక పింఛన్లను రెట్టింపుచేయడం, పింఛన్ అర్హత వయసును మూడేండ్లు తగ్గించడం వల్ల పింఛన్‌దారుల సంఖ్య దాదాపు 20 లక్షల మేర పెరిగే అవకాశం ఉన్నది. ఈ మేరకు ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ల వ్యయం కూడా రెట్టింపు కానుంది. పింఛన్లకోసం ప్రభుత్వం ఏటా రూ.5043కోట్లు ఖర్చుచేస్తున్నది. తాజాగా పెంచే పెన్షన్లకోసం మరో రూ.5వేల కోట్ల నిధులను అదనంగా బడ్జెట్లో కేటాయించనున్నారు. అదేవిధంగా రైతుబంధు పథకం కింద ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం ఒక ఎకరం భూమికి రెండు పంటలకు కలిపి ఏడాదికి రూ.8వేలు పెట్టుబడి సాయం ఇచ్చింది. ఈ ఏడాది నుంచి ఆ మొత్తాన్ని ఎకరానికి రూ.10వేలకు పెంచాలని నిర్ణయించింది.
ఈ మేరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తారని తెలుస్తున్నది. రైతుబంధు పథకం కింద రూ.15వేల కోట్లను కేటాయించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణమాఫీకి రూ. 20వేల కోట్లు కేటాయిస్తారని తెలుస్తున్నది. రైతుబీమాకు రూ.1500కోట్లు కేటాయించే అవకాశమున్నది. ఇక వైద్య ఆరోగ్యశాఖకు దాదాపు రూ.10వేల కోట్లు, బీసీలకు రూ. 5వేల కోట్ల నుంచి ఆరువేల కోట్ల వరకు, ఎస్సీలకు రూ.16వేల కోట్లు, ఎస్టీలకు రూ.9వేల కోట్ల పైచిలుకు నిధులను కేటాయించే అవకాశముందని సమాచారం. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులకు భారీగా కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నది. 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించేలా కాళేశ్వరం తదితర ప్రాజెక్టులను పూర్తిచేసి ఈ వానకాలం నుంచే గోదావరిలోని నీటిని ఎత్తిపోసుకొని తెలంగాణ భూముల్లో పారేలా చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ముందుకుపోతున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖను ఆయనే స్వయంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలోనూ, సంక్షేమంలోనూ సమగ్రంగా ముందుకువెళ్లేలా బడ్జెట్‌ను రూపొందించినట్టు సమాచారం.
లోక్‌సభ ఎన్నికలపైనా సమాలోచనలు.. గురువారం రాత్రి 9 గంటల వరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపైనా చర్చ జరిగినట్టు తెలుస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ దేశ రాజకీయా ల్లో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నదని, అందుకే హైదరాబాద్ మినహా.. మిగిలిన 16 స్థానాలను గెలుచుకుంటే కేంద్రంలో కీలక పా త్ర పోషించే అవకాశం ఉంటుందన్న సీఎం కేసీఆర్.. అందుకు పార్టీ శ్రేణులను, ప్రజలను నడిపించాల్సిన బాధ్యతను మంత్రివర్గ సహచరులకు గుర్తుచేసి.. మార్గనిర్దేశనం చేసినట్టు సమా చారం. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని 16 సీట్లలో గెలిపించడంలో మంత్రుల బాధ్యత ఎంత కీలకమో సీఎం వివరించినట్టు తెలిసింది.
ఆర్థికమంత్రిగా సీఎం -ఈ ఏడాదే నాలుగు రాష్ట్రాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రులు -ఆంధ్ర రాష్ట్ర మొదటి బడ్జెట్ సీఎం చేతులమీదుగానే.. -ఉమ్మడి ఏపీలో కాసు, రోశయ్య.. ఇతరరాష్ర్టాల్లోనూ ఎన్నో ఉదాహరణలు
ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆర్థికశాఖ బాధ్యతలను నిర్వర్తిస్తూ, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం కొత్తేం కాదు. ఉమ్మడి ఏపీతోసహా దేశంలోని అనేక రాష్ర్టాల్లో ఈ సంప్రదాయం ఉన్నది. ఈ ఏడాది ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ర్టాల్లో ముఖ్యమంత్రులే స్వయంగా 2019-20 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గోవా సీఎం మనోహర్ పారికర్ జనవరి 30న బడ్జెట్ పెట్టగా.. ఈ నెల 8వ తేదీన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్, 9వ తేదీన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జైరాం ఠాకూర్ ఆర్థికశాఖ మంత్రి హోదాలో ఆయా రాష్ర్టాల బడ్జెట్లను ప్రవేశపెట్టారు. చరిత్రను పరిశీలిస్తే.. ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి బెజవాడ గోపాల్‌రెడ్డి సీఎంగా ఉంటూనే 1955-56, 1957-58 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ 1968-69, 1969-70 బడ్జెట్లను ప్రవేశపెట్టారు. మాజీ సీఎం కొణిజేటి రోశయ్య 2010లో ముఖ్యమంత్రిగా, ఆర్థికశాఖ మంత్రిగా కొనసాగుతూ 2010-11 బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, పద్దులను సభ్యులకు వివరించారు. ఇతర రాష్ర్టాల్లోనూ గతంలో అనేకమంది ముఖ్యమంత్రులు అదనంగా ఆర్థికశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్‌లో 2015-16లో ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్, కేరళలో 2016-17లో సీఎం ఉమెన్‌చాందీ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్‌లో సీఎం వసుంధర రాజే, నాగాలాండ్‌లో సీఎం సీకే సంగ్మా స్వయంగా 2018-19 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.