Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేడే గులాబీజాతర

-బహిరంగసభకు ముస్తాబైన పరేడ్ మైదానం -ప్రాంగణానికి ప్రొ. జయశంకర్ పేరు -పది లక్షల మందికిపైగా తరలివచ్చే అవకాశం -నాలుగు వేలమంది పోలీసులతో బందోబస్తు -ఆదివారం రాత్రే హైదరాబాద్ చేరిన కార్యకర్తలు

TRS  Public meeting

సభ షెడ్యూలు వేదిక: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సభ ప్రారంభం: మధ్యాహ్నం 1 గంటకు సాంస్కృతిక కార్యక్రమాలు: మధ్యాహ్నం 3 గంటలకు మొదలు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ రాక: సాయంత్రం 5 గంటలకు సోమవారం జరుగనున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ సభకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ సర్వాంగసుందరంగా ముస్తాబైంది. తెలంగాణ రాష్ట్రసాధన అనంతరం పార్టీ జరుపుకుంటున్న తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో సభను నభూతో నభవిష్యతి అన్నరీతిలో నిర్వహించేందుకు శ్రేణులు ఉరకలేస్తున్నాయి. చరిత్రలో నిలిచిపోయేలా పది లక్షలమందిని తరలించి సభను సక్సెస్‌చేయాలన్న పార్టీ నిర్ణయం మేరకు వేల వాహనాల్లో ప్రజలు తరలివస్తున్నారు. పార్టీకి అందిన సమాచారం ప్రకారం సభకు వివిధ జిల్లాలనుంచి పదిలక్షలకు పైగా ప్రజలు హాజరుకానున్నారు.

సోమవారం మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ సభను రాత్రి ఎనిమిది గంటలకల్లా ముగించేలా వివిధ కార్యక్రమాలను రూపొందించారు. ధూంధాం ఆటపాటలతో మొదలయ్యే సభ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రసంగంతో ముగుస్తుంది. సభాస్థలికి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంగా నామకరణం చేశారు. పరేడ్ గ్రౌండ్‌లో ఇప్పటికే వేదిక సహా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మైదానంలో బారికేడ్లు, మహిళలకు ప్రత్యేకంగా గ్యాలరీ, చివరి వ్యక్తి వరకు అధినేత ప్రసంగం స్పష్టంగా వినిపించేలా సౌండ్ బాక్సులు, వేదికపై దృశ్యాలు కనిపించేందుకు ఆరు భారీఎల్‌సీడీ తెరలు ఏర్పాటు చేశారు.TRS Public meeting in Parade grounds

జిల్లాల నుంచి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి అడుగుపెట్టినప్పటి నుంచి సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. సభ ప్రాంగణంలోనూ నాలుగు వైపులా తాగునీటితో పాటు వైద్య సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభకు నాలుగువేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులే కాకుండా జిల్లాలనుంచి కూడా పోలీసులను రప్పించారు. అలాగే భారీగా తరలివచ్చే వాహనాల కోసం నగరంలో అనేక చోట్ల పార్కింగ్‌సౌకర్యం ఏర్పాటు చేశారు. పరేడ్ గ్రౌండ్ మైదానం చుట్టూ కూడా 33 చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో పార్కింగ్ కమిటీ వీటిని పర్యవేక్షిస్తున్నది. పోలీసులు, వలంటీర్లతో వాహనాల పార్కింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదివారం సాయంత్రం సీఎం కేసీఆర్ పలువురు మంత్రులు, ముఖ్య నాయకులతో క్యాంపు కార్యాలయంలో సభ ఏర్పాట్లపై సుదీర్ఘంగా సమీక్షించారు. ప్రతిసారీ కొత్త రికార్డే.. టీఆర్‌ఎస్ ఎప్పుడు బహిరంగ సభలు తలపెట్టినా లక్షల సంఖ్యలో ప్రజలు తరలిరావడం సాధారణం. అదే క్రమంలో సోమవారం సభ కొత్త రికార్డులు సృష్టిస్తుందని పార్టీ అధిష్ఠానం దృఢ విశ్వాసంతో ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు… కరీంనగర్ నుంచి 1.30 లక్షలు, మెదక్, నిజామాబాద్ జిల్లాల నుంచి లక్ష చొప్పున, ఆదిలాబాద్, ఖమ్మం నుంచి 75వేల చొప్పున, వరంగల్, నల్లగొండ జిల్లాల నుంచి 1.20 లక్షల మంది చొప్పున, మహబూబ్‌నగర్ 1.40 లక్షలు, హైదరాబాద్, రంగారెడ్డి నుంచి 1.50 లక్షల వరకు తరలివస్తున్నారని అధిష్ఠానానికి జిల్లాల నుంచి సమాచారం వచ్చినట్లు తెలిసింది.

అలరించనున్న ఆటాపాటా.. పెద్ద సంఖ్యలో తరలివచ్చే ప్రజలను అలరించేందుకు సభలో ధూంధాం కార్యక్రమం ఏర్పాటు చేశారు. తెలంగాణ సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో 200 మందికి కళాకారులు తమ ఆటాపాటలతో అలరించనున్నారు. ఇందుకోసం వారం రోజులుగా వీరు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. మధ్యాహ్నం 3గంటలకు మొదలయ్యే ధూంధాం… సాయంత్రం 5-5:30 గంటల వరకు కొనసాగుతుంది. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ధూంధాంలో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. మిషన్ కాకతీయ, ఆసరా,వాటర్‌గ్రిడ్‌తో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెంచేలా ఈ ఆటాపాటా సాగనుంది. హైలెట్‌గా కేసీఆర్ ప్రసంగం.. సభలో సాయంత్రం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రసంగం కీలకం కానుంది. పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రసంగాలు కూడా ఉంటాయి. సీఎం ప్రసంగం గంటకు పైగా ఉండే అవకాశముందని పార్టీ నాయకుడొకరు చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరుపుతున్న సమావేశం కావడం వల్ల పార్టీ ఆవిర్భావం మొదలు, ఉద్యమ ప్రస్థానంలోని ఆటుపోట్లు, ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ప్రజలు, వివిధ వర్గాల త్యాగాలు, రాష్ట్ర ఏర్పాటు, ఆపై పది నెలల ప్రభుత్వ సంక్షేమ పాలన… ఇలా అన్ని కోణాలను స్పృశిస్తూ కేసీఆర్ ప్రసంగం సాగనుంది. ప్రభుత్వం చేపట్టబోయే నూతన కార్యక్రమాల ప్రకటన కూడా ఉండే అవకాశం ఉంది.

14 ఏండ్ల పయనం.. పదిలక్షల మందితో భారీగా ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైన టీఆర్‌ఎస్ పార్టీ పయనం ఓ చరిత్ర. తెలంగాణ రాష్ట్ర సాధన అనే మహాకార్యాన్ని భుజాన వేసుకున్న టీఆర్‌ఎస్ ఆ లక్ష్య సాధనకు 14సంవత్సరాల సుదీర్ఘ పయనం సాగించింది. అనేక అవాంతరాలు, కుట్రలు, కుతంత్రాలు ఎదుర్కుంటూ ఎత్తిన జెండా దింపకుండా పోరాటాలు జరిపింది. నమ్మిన మార్గంలోనే చివరిదాకా నడిచి సుందర స్వప్నాన్ని సాకారం చేసుకుంది.

ఒకనాడు గుప్పెడు మందితో జలదృశ్యంలో పురుడుపోసుకున్న పార్టీ ఇవాళ 50 లక్షల సభ్యత్వ మార్కుదాటేసి రాష్ట్ర రాజకీయాల్లో మేరునగంలా సగర్వంగా నిలబడింది. ప్రభుత్వ పగ్గాలు చేపట్టి ఇంతవరకు ఎవరూ కనివిని ఎరుగని రీతిలో పథకాలు చేపట్టి ఆదర్శపాలన సాగిస్తున్నది. తెలంగాణ సమాజం ఎదుర్కుంటున్న కష్టాలకు చలించి స్వరాష్ట్రమే విముక్తి మార్గంగా భావించి 2001, ఏప్రిల్ 27లో కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీని స్థాపించారు. ఎన్నో ఎన్నికలు, ఎత్తుగడలతో సుదీర్ఘ ప్రయాణం సాగి చివరకు కేసీఆర్ ఆమరణదీక్షతో పార్టీ ప్రతిష్ట పతాకస్థాయికి చేరుకుంది. 11 రోజుల దీక్షతో తెలంగాణ సాధించిన కేసీఆర్ పార్టీని తెలంగాణ ప్రజల ఇంటిపార్టీగా మార్చేశారు.

కేసీఆర్ ఆమరణ దీక్ష తెలంగాణ ప్రకటన సాధించింది. సీమాంధ్ర నాయకుల రాజీనామాలతో తాత్కాలిక ఇబ్బంది ఏర్పడినా వ్యూహాత్మక ఎత్తుగడలతో 2014లో పార్లమెంటు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆమోద ముద్ర పడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 63స్థానాలలో పార్టీని గెలిపించి అధికారాన్ని అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయాలు అందించిన ప్రజలు పార్టీ సభ్యత్వ నమోదులో కూడా అదే మద్దతు ఇచ్చారు. ఫలితంగా పార్టీ అరకోటికి పైగా సభ్యత్వ నమోదు పూర్తి చేసుకొంది. అనంతరం క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర అధ్యక్షుడి వరకు ఎన్నికలను ఏకగ్రీవంగా ముగించుకుని ఈనెల 24న ఎల్బీ స్టేడియంలో పార్టీ పీనరీ దిగ్విజయంగా జరుపుకుంది.

ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు.. ఆదివారం హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, గాధారి కిషోర్, గ్రేటర్ హైదరాబాద్ అధ్య క్షుడు మైనంపల్లి హన్మంత్‌రావు పరేడ్ గ్రౌండ్స్‌లో పర్యటించి ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా డిఫ్యూటి సీఎం మహమూద్‌అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్లీనరీ నిర్వహించుకున్నామని, అదే ఉత్సాహంతో బహిరంగ సభ విజయవంతం చేసుకుంటామని చెప్పారు. నగరంలో నియోజకవర్గానికి 10 వేల మంది తగ్గకుండా బహిరంగ సభకు తరలిరానున్నారని చెప్పారు.

సభకు లక్షలాదిగా తరలిరండి టీఆర్‌ఎస్ బహిరంగ సభను లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, రాములు నాయక్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ సభలో పాల్గొనే ఏఒక్కరికీ చిన్న అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్‌కు వచ్చే దారుల్లో కూడా మంచినీటి సౌకర్యాన్ని కల్పించినట్లు పేర్కొన్నారు.

గ్రౌండ్‌లో వైద్య సిబ్బందితో పాటు మంచినీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. ఇదిలాఉంటే ప్లీనరీలో అమరుల ఫొటోలు ఉంచలేదని టీడీపీ నేతలు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని కర్నె దుయ్యబట్టారు. అమరులకు నివాళులు అర్పించిన తర్వాతే ప్లీనరీ కార్యక్రమాన్ని ప్రారంభించామని కర్నె గుర్తు చేశారు. ఉద్యమ సమయంలో యువకులు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకోని టీడీపీ నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు.

సమ్మక్క సారక్క జాతరలెక్క .. టీఆర్‌ఎస్ ఆవిర్భావ సభలో ధూంధాం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, బంగారు తెలంగాణ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ముందుకు వెళుతున్నారనే వాటిపై కొత్త పాటలతో ధూంధాం ఉంటుందన్నారు. పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగేది సభ కాదని, సమ్మక్క సారక్క జాతరను తలపించేరీతిలో జరిగే పండుగ అని అభివర్ణించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.