Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేడే గులాబీ పండుగ

-మరికొన్ని గంటల్లోనే ప్రతిష్ఠాత్మక ఘట్టం.. -టీఆర్‌ఎస్ ప్లీనరీకి సర్వం సిద్ధం -వర్ణ శోభితంగా హైదరాబాద్ నగరం -ఎల్బీ స్టేడియంలో ఆత్మీయ కలయిక -హాజరు కానున్న 36 వేలమంది ప్రతినిధులు -12 తీర్మానాలు ఆమోదించనున్న సదస్సు -పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న పల్లా, కర్నె

TRS Plenary

తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పార్టీ ప్లీనరీ సమావేశం శుక్రవారం జరుగనుంది. ఇందుకోసం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11 గంటలనుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు జరగనున్న ఈ ప్లీనరీకి 36వేల మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటలకల్లా ప్రతినిధులు తమ తమ స్థానాల్లో ఉండాలని ఇప్పటికే పార్టీ తరుపున ఆదేశాలు వెళ్లాయి. ఆయా ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలకు పార్కింగ్‌ను కూడా నిర్దేశించారు. ఈ సదస్సులో 12 తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పతాకావిష్కరణ జరిపి సదస్సును ప్రారంభిస్తారు. 14 ఏండ్ల అలుపెరుగని స్వరాష్ట్ర సాధన పోరాటంలో విజయం సాధించి, రాష్ట్రంలో అధికారం కూడా చేపట్టిన అనంతరం పార్టీ మొదటిసారి ఈ భారీ సదస్సు నిర్వహిస్తున్నది. ఆవిర్భావం నుంచి అనేక ఉత్సవాలను జరుపుకొన్న గులాబీ పార్టీకి ఇది అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్లీనరీగా భావిస్తున్నారు. ఈ వేదిక పైనుంచి బంగారు తెలంగాణ నిర్మాణ కర్తవ్యాన్ని నెరవేర్చే దిశగా పార్టీ శ్రేణులకు కేసీఆర్ మార్గనిర్దేశం చేస్తారని సమాచారం. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వంతో పాటు పార్టీకి ఎనలేని ప్రాధాన్యముందని అధినేత విశ్వసిస్తున్నారు.

TRS Plenary01

ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల వద్దకు చేర్చడంతో పాటు వాటి అమలులో లోటుపాట్లను ప్రజలతో మమేకమయ్యే పార్టీ శ్రేణులే ప్రభుత్వానికి వివరించగలవని ఆయన అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ సదస్సులో ప్రతినిధులతో కేసీఆర్ నేరుగా ముఖాముఖి చర్చలు జరుపుతారని తెలిసింది. గత పదినెలలుగా ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను ప్రతినిధుల ముందు పెట్టి ఒక్కోదానిపై అభిప్రాయాన్ని తీసుకోవాలనే యోచనలో ఆయన ఉన్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో సదస్సులో చర్చలకు ఎనలేని ప్రాముఖ్యం ఉందంటున్నారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలు చేయడంతో పార్టీ శ్రేణులు ముందుండాలని ఆయన అభిలషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం, పార్టీ శ్రేణులు జోడుగుర్రాల్లా పరుగులు తీయించాల్సిన అవసరాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గుర్తించారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్లీనరీలో పార్టీ ప్రతినిధులకు ఈ కోణంలోనే ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.

TRS Plenary03

ఇదీ కార్యక్రమం.. ఉదయం 11 గంటలకు పార్టీ అధినేత కేసీఆర్ పతాకావిష్కరణ జరుపుతారు. పార్టీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం ఇస్తారు. అనంతరం పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత పార్టీ నూతన అధ్యక్షుని ఎన్నికను ఎన్నికల అధికారిగా వ్యవహరించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటిస్తారు. ఆ వెంటనే పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తారు. భోజనానంతరం పార్టీ తీర్మానాలు ప్రవేశపెడుతారు. వాటిపై చర్చ అనంతరం కేసీఆర్ ముగింపు ఉపన్యాసం ఉంటుంది. చివరగా అరగంట పాటు పటాకులు కాల్చి పార్టీ సంబరాలు జరుపుతారు.

ఏర్పాట్లు పూర్తి… ప్లీనరీ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎల్బీ స్టేడియం, నగర అలంకరణ, ముసాయిదా తీర్మానాలు సిద్ధం కాగా నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ రుచులతో అందరికీ పసందైన మధ్యాహ్న భోజనం అందించేందుకు బుధవారం సాయంత్రం నుంచే వంటకాలు మొదలయ్యాయి. ప్లీనరీకి హాజరయ్యే 36వేల మంది ప్రతినిధులకు నియోజకవర్గాల వారీగా బ్యాగుల్లో తీర్మానాల పుస్తకంతో సహా మెటీరియల్‌ను ఇప్పటికే తెలంగాణభవన్ నుంచి పంపిణీ చేశారు. బుధవారం రాత్రి పలువురు మంత్రులు, స్టీరింగ్ కమిటీ, ఇతర పార్టీ ప్రముఖులతో భేటీ అయిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించినట్లు తెలిసింది.

220 నిర్ణయాల చుట్టూ అధినేత ప్రసంగం.. పధ్నాలుగేండ్ల ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన, పార్టీ అధికారాన్ని చేపట్టడం, పది నెలల పాలన, మరో నాలుగు సంవత్సరాల్లో ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలతో పాటు రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు టీఆర్‌ఎస్ అధినేత ప్రసంగంలో చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగారు తెలంగాణకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసింది, ప్రభుత్వం వాటిని ఎలా అమలు చేయనుందనే వివరాలను ఆయన వివరించనున్నారు. గత 10 నెలల్లో ప్రభుత్వం తీసుకున్న సుమారు 220కిపైగా నిర్ణయాలను పార్టీ ప్రతినిధులకు వివరించే అవకాశం ఉంది. ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళేందుకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయనున్నారు.

రైతుల పంట రుణాల మాఫీ నుంచి మెట్రో రైలు ప్రాజెక్టు వరకు.. మిషన్ కాకతీయ నుంచి షాదీ ముబారక్ .. వాటర్ గ్రిడ్ నుంచి తెలంగాణ హరిత హారం .. సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వే నుంచి హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన .. ఆసరా పింఛన్ల నుంచి హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యం వరకు అన్ని పథకాలను సీఎం ఈ సందర్భంగా ఉదహరిస్తూ వాటి ప్రాధాన్యతలను పార్టీ ప్రతినిధులకు వివరిస్తారు. రాబోయే ఐదేళ్ళలో ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలు.. ఒక్కో సమస్యను ఎలా పరిష్కరిస్తుందీ విపులంగా వివరించనున్నారు. అంతిమంగా ప్రభుత్వం, పార్టీ కలిసికట్టుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో జోడు గుర్రాల్లా పరిగెత్తించాలని, ఇందుకు పార్టీ పరంగా అందించాల్సిన సహకారాన్ని, ప్రభుత్వంతో సాధించాల్సిన సమన్వయాన్ని సాధించేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ప్రతినిధులతో కలిసి సీఎం భోజనం: కర్నె ప్రభాకర్ 36వేల మంది ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. 50వేల మందికి భోజన ఏర్పాట్లు చేశాం. ప్లీనరీ ప్రాంగణంలో నాలుగు వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. 300 కూలర్లు, ఆరు ఎల్‌సీడీ తెరలు, ఆరు భారీ బెలూన్లతో పాటు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వచ్చే 11 రహదార్లలో స్వాగత తోరణాలు ఏర్పాటు చేశాం. 150 కమాన్లు, 25 చోట్ల సీఎం కేసీఆర్ భారీ కటౌట్లు, 175 ఐలాండ్‌ల అలంకరణతో హైదరాబాద్‌ను గులాబీమయం చేశాం. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రతినిధులతో కలిసి భోజనం చేస్తారు.

ప్లీనరీ సాగుతుందిలా… ఉదయం సెషన్ 11.00 గం.: కేసీఆర్ చేతుల మీదుగా పార్టీ పతాకావిష్కరణ. అమరులకు శ్రద్ధాంజలి 11.10 గం.: పార్టీ స్టీరింగ్ కమిటీ కన్వీనర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్వాగతోపన్యాసం 11.20 గం.: పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు తొలి పలుకులు 11.30 గం.: పార్టీ నూతన అధ్యక్షుడిగా కేసీఆర్ పేరును అధికారికంగా ప్రకటించనున్న టీఆర్‌ఎస్ రాష్ట్ర ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి

మధ్యాహ్నం సెషన్ -11.35 గంటలకు టీఆర్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షోపన్యాసం ప్రారంభం -ఒంటి గంట నుంచి 2 వరకు భోజన విరామం రెండు గంటల నుంచి తీర్మానాలు.. చర్చ అనంతరం కేసీఆర్ ముగింపు ఉపన్యాసం.

ప్లీనరీలో ప్రవేశపెట్టనున్న తీర్మానాలు.. 1. తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాగత నిర్మాణం – బంగారు తెలంగాణ సాధనకు పునరంకితం కావాలనే తీర్మానం 2. పట్టణాభివృద్ధి-విశ్వ నగరంగా హైదరాబాద్ – విశ్వనగరంగా హైదరాబాద్‌కు ప్రఖ్యాతి తీసుకురావాలని సభ సూచిస్తూ తీర్మానం 3. తెలంగాణ ప్రజా సంక్షేమం – ఆసరా పింఛన్లు, అమరవీరుల కుటుంబాల సంక్షేమం, దళితుల సంక్షేమం, కల్యాణలక్ష్మి, గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమం, మైనార్టీలు, మహిళా, శిశు సంక్షేమం, ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించడంతో పాటు ఇకముందు చేయాల్సిన ప్రక్రియను పూర్తి చేయాలని సూచిస్తూ తీర్మానం 4. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను అభినందించడం, ఇంకా చేపట్టాల్సినవి సూచిస్తూ తీర్మానం. 5.వ్యవసాయం-నీటిపారుదల-మిషన్ కాకతీయ – ప్రభుత్వం చేపట్టిన చర్యలను అభినందిస్తూ తీర్మానం 6.తెలంగాణ విద్యుత్ రంగం – విద్యుత్ సరఫరాలో విజయాన్ని సాధించిన ప్రభుత్వాన్ని అభినందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై డిమాండు చేస్తూ తీర్మానం 7. తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పన – రోడ్లు, రహదారులు, వంతెనలకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూ బంగారు తెలంగాణకు బాటలు వేయాలని తీర్మానం 8. తెలంగాణ తాగునీటి వ్యవస్థ, పారిశ్రామిక రంగం, ఇన్షర్మేషన్ టెక్నాలజీ – ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకోవాలని సభ సూచిస్తూ తీర్మానం 9. వర్తమాన రాజకీయాలు-టీఆర్‌ఎస్ – బంగారు తెలంగాణకు పాటుపడాలని పిలుపునిస్తూ తీర్మానం 10. తెలంగాణకు హరితహారం – తెలంగాణకు వానలు వాపస్‌రావాలి, కోతులు అడవికి వాపస్ పోవాలె అనే సీఎం పిలుపును సాకారం చేయాలని తీర్మానం 11. కేంద్రం విభజన హామీలు నెరవేర్చాలి – విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన పలు హామీలను నెరవేర్చాలని డిమాండు చేస్తూ తీర్మానం 12. బలహీనవర్గాల గృహ నిర్మాణం, గోదావరి పుష్కరాలు – వీలైనంత త్వరగా గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించడం, చరిత్రలో నిలిచిపోయేలా గోదావరి పుష్కరాలు నిర్వహించాలని తీర్మానం -ఇందుకు అదనంగా టీఆర్‌ఎస్ పార్టీ నిబంధనావళిలో పలు సవరణలు సూచిస్తూ మహా సభ తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.