Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేడే ఇందూరు సమరభేరి

-సీఎం సభకు సబ్బండవర్ణాలు తరలిరావాలి.. మంత్రి పోచారం, ఎంపీ కవిత పిలుపు
-సీఎం కేసీఆర్ సభకోసం పూర్తయిన ఏర్పాట్లు
-గులాబీమయంగా మారిన నిజామాబాద్
-సభకు రెండు లక్షలమంది హాజరయ్యే అవకాశం
-వారంరోజులుగా ఏర్పాట్లు పర్యవేక్షించిన ఎంపీ కవిత
-ఆర్యవైశ్యులకు రాజకీయ అండ..
-ముస్లింల బాగోగులు పట్టించుకున్న నేత కేసీఆర్
-ఎంపీ కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్యవైశ్యులు, ఖురేషీ ముస్లింలు

ఇప్పటికే జోరుగా సాగుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారానికి మరింత జోష్ రానున్నది. ప్రతిపక్ష పార్టీలు సీట్ల పంపకంపై కుస్తీపడుతూ, ఇంకా కూటమి కూడా ఏర్పాటుచేసుకోలేని స్థితిలో ఉంటే.. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్.. తన ప్రచారానికి మరింత ఊపునివ్వనుంది. సెప్టెంబర్ ఏడో తేదీన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తొలి ప్రజా ఆశీర్వాద బహిరంగసభతో ఎన్నికల ప్రచారానికి నాంది పలికిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగే బహిరంగసభలో సమరభేరి మోగించనున్నారు. ఈ సభకోసం ఇందూరు సర్వాంగసుందరంగా ముస్తాబైంది. ఎక్కడచూసినా గులాబీ తోరణాలు, స్వాగతద్వారాలు, ఫ్లెక్సీలు, కేసీఆర్ కటౌట్లతో గులాబీమయమైంది. గిరిరాజ్ కాలేజీ మైదానంలో నిర్వహించే సభకు పార్టీ శ్రేణులు ముమ్మర ఏర్పాట్లుచేశాయి. ప్రజలు స్వచ్ఛందంగా సభకు తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందూ రు సభ తర్వాత.. నాలుగో తేదీన నల్లగొండలో, ఐదున వనపర్తిలో, ఏడు, ఎనిమిది తేదీల్లో వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ప్రజాఆశీర్వాద సభల్లో సీఎం పాల్గొంటారు. నిజామాబాద్ సభ ఏర్పాట్లను స్థానిక ఎంపీ కవిత వారం రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

మరోవైపు వివిధ వర్గాల ప్రజలు కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. మంగళవారం పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్యులు, ముస్లింలలోని ఖురేషీ వర్గీయులు ఎంపీ కవిత, మంత్రి పోచారం ఆధ్వర్యంలో పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల కవిత మాట్లాడుతూ శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గొప్పనేత మహాత్మాగాంధీ ఆర్యవైశ్యుడు కావడం గర్వకారణమన్నారు. నిజామాబాద్ జిల్లా టీఆర్‌ఎస్ యావత్తూ ఖురేషీ కమ్యూనిటీ పక్షాన నిలబడిందని, వారి అకాంక్షలను నెరవేరుస్తున్నదని చెప్పారు. మైనార్టీలను గౌరవించే ఏకైక ఇందూరు సభకు టీఆర్‌ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. ఈ ఏర్పాట్లను ఎంపీ కవిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టీఆర్‌ఎస్వీ నాయకులను వలంటీర్లుగా నియమించి, సభకు తరలివచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూస్తున్నారు. తాగునీటి వసతితోపాటు టాయిలెట్లు, పార్కింగ్ స్థలాలు, ఇతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించిన కవిత.. నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు ఇచ్చారు. మంత్రి పోచారం, నిజామాబాద్ అర్బన్ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా.. ఎంపీ కవితతో సమన్వయం చేసుకుంటూ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బుధవారం మధ్యాహ్నం రెండుగంటల సమయంలో ప్రారంభమయ్యే ప్రజాఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా నేరుగా సభాస్థలికి చేరుకునేందుకు వీలుగా హెలిప్యాడ్ నిర్మించారు. సీఎం సభ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా నుంచి భారీగా ప్రజలను సమీకరించేందుకు తాజా మాజీ ఎమ్మెల్యేలు దృష్టి కేంద్రీకరించారు. రెండు లక్షలకుపైగా ప్రజలు ఈ సభకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పెద్దఎత్తున తరలిరండి: ఎంపీ కవిత పిలుపు
సీఎం కేసీఆర్ పాల్గొనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భారీ బహిరంగసభకు పెద్ద ఎత్తున సబ్బండవర్ణాలూ తరలిరావాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. మంగళవారం నిజామాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి కవిత మాట్లాడుతూ.. ముఖ్యం గా ఆడబిడ్డలు, రైతన్నలు కదలాలని అన్నారు. మన ప్రభుత్వ హయాంలో, మన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా వివరించడానికి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇంతవరకు ఏం చేశామో.. భవిష్యత్తులో ఏం చేయబోతున్నామో చెప్పేందుకు ముఖ్యమంత్రి వస్తున్నారని ఆమె తెలిపారు.

యావత్ దేశం కేసీఆర్ పాలనను మెచ్చుకున్నది: మంత్రి పోచారం
తెలంగాణ ఏర్పడిన తర్వాత నాలుగున్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని యావత్‌దేశం మెచ్చుకున్నదని మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ కూడా కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా ఉన్నదన్నారని గుర్తుచేశారు. మాజీ ఎంపీ మధుయాష్కీ నోటికొచ్చింది మాట్లాడితే ప్రజలు విశ్వసించరన్నారు. ఇంతటి అభివృద్ధిని చూసి ఓర్వలేక కడుపు మండి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. రేవంత్‌రెడ్డి, జగ్గారెడ్డిపై కేసులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధంలేదని ఆయన స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రగతిని కాంగ్రెస్ అడుగడుగునా అడ్డుకుంటున్నందుకే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్టు చెప్పారు. కేసులతో రాష్ట్ర ప్రగతిని ఆపాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. విలేకరుల సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, రాజేశ్వర్‌రావు, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి దాదాన్నగారి విఠల్, టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల్లో గులాబీ గుబాళింపు
ఎవ్వరూ ఊహించని విధంగా ఏకంగా 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. ప్రతిపక్ష పార్టీలకు పెద్ద షాక్ ఇచ్చారు. ఒకవైపు ప్రతిపక్షాల కూటమి ప్రయత్నాలే ఇంకా కొలిక్కిరాని పరిస్థితిలో టీఆర్‌ఎస్ అభ్యర్థులు ఊరూరా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి.. ఓట్లను అభ్యర్థిస్తూ ఈపాటికే ఒక దఫా ప్రచారం పూర్తిచేసుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను, వాటి ద్వారా ప్రజలకు అందిన ఫలితాలను వివరించి చెప్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా పేరుప్రఖ్యాతులు సంపాదించాయి. ఈ క్రమంలో ప్రజా సంక్షేమ పథకాలే ప్రధానాస్ర్తాలుగా టీఆర్‌ఎస్ ముమ్మర ప్రచారం చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా అనేక పల్లెలు గులాబీ జెండా నీడకు వస్తున్నాయి. గ్రామాలన్నీ ఏకమై టీఆర్‌ఎస్‌కు జై కొడుతున్నాయి. కొన్నిచోట్ల తమ ఓట్లు టీఆర్‌ఎస్ అభ్యర్థులకేనని ఇంటిగోడలపైనా రాసుకుంటున్నారు. ఇంతటి ఉత్సాహభరిత వాతావరణంలో ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతుండటంతో ఎన్నికల వాతావరణ మరింత వేడెక్కనుంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.