-మధ్యాహ్నం రెండు గంటలకు.. -సభకోసం సర్వం సిద్ధంచేసిన టీఆర్ఎస్ శ్రేణులు -ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు, ఉప ఎన్నిక ఇంచార్జి
ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్‌కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు హుజూర్నగర్ పట్టణంలోని సాయిబాబా థియేటర్ రోడ్లో నిర్వహించే ఉప ఎన్నికల బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం టీఆర్ఎస్ శ్రేణు లు భారీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రచారానికి మరో మూడ్రోజులు మాత్రమే ఉండటం, బహిరంగసభకు సీఎం కేసీఆర్ వస్తుండటంతో ప్రచారం మరింత జోరందుకోనున్నది.
ఇప్పటికే నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నది. మిగతా పార్టీల కంటే కూడా దూసుకుపోతున్నది. అభ్యర్థి సైదిరెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు చుట్టిరాగా, మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ హుజూర్నగర్ ఉప ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నాయకులు రోడ్‌షోలు, సభలు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. కాగా, సీఎం బహిరంగసభ ఏర్పాట్లను బుధవారం సాయంత్రం మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, టీఆర్ఎస్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్ పరిశీలించారు.