– అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం – సమస్యల పరిష్కారంపై సమీక్ష.. రోజంతా జిల్లాలోనే – బుల్లెట్ ప్రూఫ్ బస్సు ఏర్పాటుచేసిన పోలీసులు – 6,7 తేదీల్లో నిజామాబాద్, ఆదిలాబాద్‌లో పర్యటన
ఊపిరి సలపని బిజీ షెడ్యూళ్లతో రెండు నెలల పాటు హైదరాబాద్‌లోని సచివాలయం నుంచి పాలనను గాడిలో పెట్టిన సీఎం కేసీఆర్ జిల్లాల పై దృష్టిసారించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఒకసారి మాత్రం సొంత నియోజకవర్గమైన గజ్వేల్‌లో పర్యటించారు.
మంగళవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం టూర్‌ను ఖరారైంది. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పర్యటనలపై సచివాలయంలో మంత్రులు ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌లతో సోమవారం సీఎం సమీక్ష సమావేశం ఏర్పాటుచేశారు. జిల్లాల్లో ప్రాథమిక సమస్యలపై రాష్ట్రస్థాయి అధికారులతోపాటు జిల్లా స్థాయి అధికారులతో ఒక రోజు పర్యటనలో చర్చిస్తారు. మొదట కరీంనగర్ జిల్లా, అనంతరం నిజామాబాద్ జిల్లా, శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు.
ఇదీ పర్యటన షెడ్యూల్: సిద్దిపేట మీదుగా రోడ్డుమార్గంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు కరీంనగర్‌కు సీఎం చేరుకుంటారు. అక్కడ స్థానిక నేతలు ఘన స్వాగతం పలుకనున్నారు. అక్కడి నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఓపెన్‌టాప్ జీపులో సీఎం ర్యాలీలో పాల్గొడానికి పోలీసులు నిరాకరించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా బుల్లెట్‌ప్రూఫ్ బస్సులో ప్రయాణించాలని పోలీసులు పదేపదే విజ్ఞప్తిచేశారు. దీంతో సీఎం అంగీకరించారని తెలుస్తున్నది. ఎన్టీఆర్ విగ్రహాం నుంచి కలెక్టరేటు వరకు ర్యాలీలో సీఎం బుల్లెట్‌ప్రూఫ్ బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగుతారు. 1.15 గంటలకు సిక్కువాడీ వద్ద స్థానికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
నగరపాలక సంస్థ వరకు ర్యాలీ కొనసాగుతుంది. 1:30 గంటలకు హరితహారంలో పాల్గొని మొక్కలు నాటుతారు. ర్యాలీలో మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, మేయర్ రవీందర్‌సింగ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొనున్నారు. 2 గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని భోజనాలు చేస్తారు. 3 గంటల నుంచి వివిధ శాఖలపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటారు. పర్యటన ఏర్పాట్లపై సీఎం అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్ జిల్లా అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ జిల్లాలో తాగునీటి పథకానికి శంకుస్థాపన: నిజామాబాద్ జిల్లాలో గురువారం పర్యటించనున్న సీఎం కేసీఆర్ రోజంతా జిల్లాలోనే గడుపుతారు. రూ.164 కోట్లతో మంచినీటి పథకానికి శంకుస్థాపన చేస్తారు. అంకాపూర్‌లో రైతులతో సీఎం ముఖాముఖిలో పాల్గొని వారు సాగుచేస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకుంటారు. ఇక్కడ కూడా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం సమావేశమై సమస్యలను చర్చిస్తారు. వాటికి పరిష్కార మార్గాలను కూడా అధికారుల నుంచే సూచనలు ఇవ్వమని సీఎం అడుగుతారు. సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తారు. శుక్రవారం ఆదిలాబాద్‌లోనూ ఇదే తరహాలో పర్యటన కొనసాగనుంది.